అన్నవరం : సత్యదేవుని సాక్షిగా వధూవరులు ఒక్కటైతే వారి కాపురం కలకాలం చల్లగా ఉంటుందన్న నమ్మకంతో రత్నగిరిపై వందేళ్లుగా వివాహాలు జరుపుకుంటున్నారు. ఆడంబరాలకు పోతున్న కొంత మంది ధనవంతులు వివాహాల్లో తమ స్టేటస్‌ను ప్రదర్శించుకొనేందుకు స్వామివారి సన్నిధిలోనే అపచారాలకు పాల్పడుతున్నారు. దానికి శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై జరిగిన వివాహ వేడుకల్లో ప్రదర్శించిన అశ్లీల నృత్యాలే సాక్ష్యం.
రత్నగిరిపై ఏటా ఐదు వేల వివాహాలు
అన్నవరం దేవస్థానంలో ఏటా ఐదువేల వివాహాలు జరుగుతున్నాయి. వీటిలో నాలుగు వేల వరకూ పేదలు, మధ్యతరగతికి చెందిన వారివే. మిగిలిన వేయి వివాహాలలో మహా అయితే 50 వరకూ ధనవంతులు, రాజకీయ, ఇతర ప్రముఖులవి ఉంటాయి. ప్రముఖమైన వివాహ ముహూర్తంలోనే వీరు ఎమ్మెల్యేలు, ఎంపీల లెటర్‌హెడ్స్‌పై గదుల కోసం దేవస్థానం అధికారులకు సిఫార్స్ చేయిస్తారు. వీఐపీ సత్రంలో సగానికి పైగా గదులు వీరే ఆక్రమిస్తుంటారు.
సత్యగిరి ఖాళీ స్థలంలో ఖరీదైన వివాహాలు
మూడేళ్ల క్రితం సత్యగిరిపై హరిహరసదన్ సత్రం ప్రారంభం కావడంతో ఆ సత్రం ఎదురుగా గల ఎకరం విస్తీర్ణంలోని స్థలంలో ధనవంతులు వివాహాలను నిర్వహించుకుంటున్నారు. 125 గదులున్న హరిహరసదన్ సత్రంలో 50 గదులు రిజర్వ్ చేసుకుని ఆ స్థలంలో వివాహం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ స్థలానికి అద్దె రూ.20 వేలు, సత్రం గదులకు మరో రూ.50 వేలు దేవస్థానానికి చెల్లిస్తున్నారు. రూ. పది లక్షల నుంచి 30 లక్షల వరకూ వివాహానికి ఖర్చు చేస్తున్నారు. సినిమా సెట్టింగ్స్‌ను తలపించే సెట్టింగ్స్, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, హోరెత్తించే మ్యూజిక్, ఆర్కెస్ట్రా సంగీతానికి డ్యాన్స్‌లు చేసే డ్యాన్సర్‌లను కూడా తీసుకువచ్చి ఆశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. భారీఎత్తున బాణసంచా కాల్చి భక్తులకు నిద్ర కరువు చేస్తున్నారు. ఈ వేడుకల్లో మద్యం సేవించి ఖాళీ సీసాలను సత్యగిరి ఆవరణలోనే పారేస్తున్నారు.
సెక్యూరిటీ తక్కువ
దేవస్థానంలో సుమారు 150 మంది వరకూ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ సత్యగిరిపై ఉండేది కేవలం ఇద్దరే. ఈ వివాహాలకు ప్రముఖులు హాజరవుతుండడంతో నిర్వాహకులను ఎవరూ ఏమనలేని పరిస్థితి నెలకొంది.
శనివారం జరిగిన వివాహ వేడుకల్లో..
శనివారం తెల్లవారుజామున జరిగిన వివాహ వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేసి అపచారం చేశారని మాత్రమే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రదేశానికి కొంత దూరంలో ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి.
ఖాళీ ప్రదేశాలలో వివాహాలకు అనుమతించం : ఈఓ
సత్యగిరిపై ఖాళీ స్థలాలలో వివాహాలు చేసుకోవడానికి ఇకపై అనుమతించబోమని ఈఓ కె. నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 25న ఒక వివాహానికి ఆ స్ధలం రిజర్వ్ చేశారని. దాన్ని మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. శనివారం రాత్రి జరిగి వివాహ వేడుకలో అశ్లీల నృత్యాలు చేయకుండా ఎందుకు నిరోధించలేదని సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా తమ మాట నిర్వాహకులు వినిపించుకోలేదని చెబుతున్నారన్నారు. అయినప్పటికీ వారి నిర్లక్ష్యం కారణమని భావించి హరిహరసదన్ గుమస్తా ఎన్. గోవింద్, సెక్యూరిటీ గార్డు బహుదూర్‌ను సస్పెండ్ చేశామన్నారు.