ఎందుకీ ప్రహసనం
Published Fri, Jul 14 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM
- బదిలీ చేసేటపుడు ఎన్నో నీతి కబుర్లు
- ఏడాది తిరక్కుండానే మాతృ దేవస్థానాలకు బదిలీలు
- క్యాడర్‌ను బట్టి బదిలీకి రేటు...రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ
- దేవాదాయ శాఖలో లీలలు...
.
అన్నవరం:
దేవాదాయశాఖలో ఉద్యోగుల బదిలీలు పెద్ద ప్రహసనంగా మారాయి. బదిలీలు చేసేటపుడు ఎంత పెద్ద హంగామా ఉంటుందో, అంతా పారదర్శకత, సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు చేస్తామని చెబుతుంటారు. భార్యా భర్త ఒకేచోట పని చేస్తున్నామన్నా వినిపించుకోరు. అనారోగ్యకారణాలన్నా కుదరదంటారు. కానీ సిఫార్స్‌లు, ముడుపులు ముడితే మాత్రం ఏడాది కూడా కాకుండానే అందరినీ ఎవరి దేవస్థానానికి వారిని భద్రంగా బదిలీ చేసేస్తుంటారు. ఈ మాత్రం దానికి బదిలీలు ఎందుకో అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతేడాది ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన ఏడుగురు అన్నవరం దేవస్థానం సిబ్బందిని తిరిగి అన్నవరం దేవస్థానానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇతర దేవస్థానాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిని కూడా వారి దేవస్థానాలకు బదిలీ చేశారు. అంటే మొత్తం 14 మందిని ఏకకాలంలో బదిలీ చేశారు. ప్రభుత్వ పెద్దల రికమెండేషన్లతోపాటు ఓ మంత్రి పీఏ నిర్ణయించిన ‘ముడుపు’ చెల్లించడంతోటే ఈ బదిలీలు జరిగాయన్న ప్రచారం జరుగుతోంది.
గత ఏడాది జూన్ నెలలో అన్నవరం దేవస్థానానికి చెందిన 17 మందిని ఇతర దేవస్థానాలకు బదిలీ చేశారు. బదిలీ అయిన మూడో నెలలోనే ఓ మంత్రి సిఫార్స్‌తో ఓ ఉద్యోగి తిరిగి దేవస్థానానికి బదిలీ అయ్యారు. ఐదో నెలలో మరో మంత్రి సిఫార్స్‌తో మరొకరు బదిలీ చేయించుకున్నారు. ఇప్పుడు ఏడుగురు ఉద్యోగులకు బదిలీ అయింది. మరో నలుగురు కూడా బదిలీ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. వారికి కూడా వచ్చే వారంలో బదిలీ జరిగే అవకాశం ఉందంటున్నారు.
.
రూ.25 వేలు నుంచి రూ.50 వేల వరకూ చెల్లిస్తే బదిలీ ఖాయం...
బదిలీ అయిన దేవస్థానం ఉద్యోగులు వారి దేవస్థానానికి బదిలీ కావాలంటే క్యాడర్‌ను బట్టి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ ఓ మంత్రి పీఏకు ముడుపులు చెల్లించుకోవల్సిందే. ఎవరి రికమెండేషన్ ఉన్నా ఈ మొత్తం చెల్లింపు తప్పనిసరని అంటున్నారు. ఈ విధంగా చెల్లించినవారికే బదిలీలు అనే ప్రచారం జరుగుతోంది.
.
బదిలీ అయిన ఏడుగురు ఉద్యోగులు రిలీవ్...
అన్నవరం దేవస్థానంలో పనిచేస్తూ ఇతర దేవస్థానాలకు బదిలీ అయిన ఏడుగురు ఉద్యోగులను గురువారం రిలీవ్ చేసినట్లు అన్నవరం దేవస్థానం ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు తెలిపారు. అన్నవరం దేవస్థానానికి బదిలీ అయిన ఉద్యోగులు ఇంకా జాయిన్ కాలేదని ఆయన ‘సాక్షి’కి తెలిపారు.
Advertisement
Advertisement