ఆదిలాబాద్‌టౌన్/ఆదిలాబాద్‌కల్చరల్: బడికి వేళయింది.. బుధవారం నుంచి బడిగంట మోగనుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఆడిపాడిన విద్యార్థులు ఇక ఆటాపాటలకు టాటా చెప్పి బడిబాట పట్టనున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. ప్రహరీలు, తాగునీరు.. మొండి గోడలు, అసంపూర్తి గదులు ఆహ్వానిస్తున్నాయి. ఉపాధ్యాయుల ఖాళీలు, శిథిల భవనాలు, చెట్ల కింద చదువులు కొనసాగేలా ఉన్నాయి. మరుగుదొడ్డి ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వాటి నుంచి దుర్గం ధం వ్యాపిస్తోంది. ఉపాధ్యాయ పోస్టులు ఇంకా భర్తీ కాకపోవడంతో విద్యావాలంటీర్లతోనే విద్యాబోధన కొనసాగనుంది. జిల్లాలో దాదాపు 400 పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉంది. 241 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. విద్యాశాఖాధికారులు సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యబోధన అందించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అందరూ ఇన్‌చార్జీలే..
జిల్లాలోని 18 మండలాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఆయా మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులే మండల విద్యాధికారులుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాఠశాలపై పర్యవేక్షణ కొరవడి అస్తవ్యస్తంగా తయారవుతుంది. ప్రధానోపాధ్యాయులకు రెండు బాధ్యతలు ఉండడంతో అటు ఎంఈఓ విధులకు.. ఇటు పాఠశాలకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారు. కొత్తగా ఏర్పడిన మావల, సిరికొండ, భీంపూర్, ఆదిలాబాద్‌అర్బన్, గాదిగూడ మండలాలకు ఇంకా ఎంఈఓలను నియమించలేదు. పాత మండలాల ఎంఈఓలే ఇన్‌చార్జీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు భర్తీ చేస్తేగానీ ప్రాథమిక విద్యావ్యవస్థ గాడిలో పడేలా కనిపించడం లేదు.
ఉపాధ్యాయుల ఖాళీలు..
జిల్లాలో మొత్తం 1,420 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,288 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. 970 ప్రాథమిక పాఠశాలలు, 122 ప్రాథమికోన్నత పాఠశాలలు, 195 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,28,354 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యా హక్కుచట్టం ప్రకారం ప్రతీ తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. దాదాపు 500లకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలున్నాయి. ఉపాధ్యాయుల నియామకం కోసం టీఆర్‌టీ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేసినా నియామకాలు చేపట్టకపోవడంతో వీవీలతోనే విద్యాబోధన కొనసాగుతోంది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదని తెలుస్తుంది. దాదాపు 50 పాఠశాలల వరకు జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, 20 వరకు ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సమీపంలోని పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసి విద్యబోధన చేయిస్తున్నారు. వీరు పాఠశాలకు సెలవు పెడితే విద్యార్థులకు కూడా సెలవే అన్న విధంగా పాఠశాలలు కొనసాగుతున్నాయి.
తాగునీటి సమస్య..
జిల్లాలో దాదాపు 430 పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులు కొంతమంది ఇంటి నుంచే నీటిని తీసుకొస్తుండగా, ఇంకొందరు ఇంటికి వెళ్తున్నారు. సమీపంలోని బోరుబావుల వద్ద నీరు తాగుతున్నారు. నీటి సమస్యతో మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండకపోవడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడటం లేదు. మహిళ ఉపాధ్యాయుల సైతం మరుగుదొడ్లు లేనిచోట అవస్థలు పడుతున్నారు.
అందని కంప్యూటర్ విద్య..
విద్యార్థులకు గత కొన్నేళ్లుగా కంప్యూటర్ విద్య అందకుండా పోయింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య బోధించాలనే ఉద్దేశంతో అప్పట్లో ఎడ్‌కం సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించారు. ఐదు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ ఒప్పందం ఉండగా, వారి గడువు ముగియడంతో ఇన్‌స్ట్రక్టర్లను తొలగించారు. ప్రస్తుతం పాఠశాలల్లో కంప్యూటర్లు మూలన పడ్డాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అందకుండా పోయింది.
విద్యార్థులతోనే సిబ్బంది పనులు..
బోధనేతర సిబ్బందిలో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక స్వీపర్, ఒక అటెండర్, రాత్రి కాపలదారి ఉండాలి. ఉన్నత పాఠశాలల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఉండాలి. కొన్ని పాఠశాలల్లో మాత్రమే జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. స్వీపర్లు లేకపోవడంతో విద్యార్థులే పాఠశాలలను శుభ్రపర్చుకుంటున్నారు. స్కావెంజర్ ఉన్నచోట పాఠశాలలను శుభ్రపర్చుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మొదటి గంట కొట్టడం నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు విద్యార్థులే పనులు కొనసాగిస్తున్నారు.
ఇబ్బందులు లేకుండా చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పటికీ అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరాయి. ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు కూడా విద్యార్థులకు అందిస్తాం. బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించేందుకు ఈ నెల 14 నుంచి బడిబాట చేపడుతున్నాం. ఇటీవల విడుదలైన పదో ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. ఈ విద్యాసంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపడతాం. – ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment