పుస్తకాలొచ్చేదెప్పుడు? పాఠాలు చెప్పేదెప్పుడు?  | Textbook Shortage Hits Telangana Govt Schools | Sakshi
Sakshi News home page

పుస్తకాలొచ్చేదెప్పుడు? పాఠాలు చెప్పేదెప్పుడు? 

Published Thu, Jul 21 2022 2:11 AM | Last Updated on Thu, Jul 21 2022 9:55 AM

Textbook Shortage Hits Telangana Govt Schools - Sakshi

రాష్ట్రంలో బడులు తెరిచి ఐదు వారాలు దాటింది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతవరకు విద్యార్థులు పుస్తకం తెరవలేదు. ఉపాధ్యాయులు ఒక్క పాఠం చెప్పలేదు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందకపోవడమే ఇందుకు కారణం.  

విద్యాశాఖ క్యాలండర్‌ ప్రకారం ఆగస్టు మొదలయ్యే నాటికి అంటే ఇంకో పదిరోజుల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ కనీసం రెండు చాప్టర్లు పూర్తవ్వాలి. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి మరో రెండు వారాల వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.  

మరోవైపు ప్రైవేటు స్కూళ్ళల్లో ఇప్పటికే కొన్ని చాప్టర్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో..ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడంతో సర్కారీ స్కూళ్ళపై ఆసక్తి చూపిన తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంగ్లిష్‌ మీడియం నేపథ్యంలో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు 2.5 లక్షల వరకు పెరిగాయి. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 24,852 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు ఇస్తుంది. కాగా ఈ ఏడాది నుంచి 1–8 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టారు. ఇంగ్లిష్‌ మీడియం విద్యకు సన్నాహాలు చేస్తున్నప్పుడే పుస్తకాల ముద్రణపై దృష్టి పెట్టాల్సి ఉండగా.. విద్యాశాఖ విఫలమైందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.

ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో పుస్తకాల ముద్రణ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైందని అంటున్నాయి. పుస్తకాలకు అవసరమైన పేపర్‌ సకాలంలో సరఫరా కాకపోవడం, మిల్లర్లు పేర్కొన్న ధర చెల్లించేందుకు నిధుల కొరత.. వెరసి పుస్తకాల ముద్రణ ఆలస్యంగా ప్రారంభం కావడానికి కారణమని తెలుస్తోంది. మొత్తం మీద ఇంగ్లిష్‌ మీడియం నేపథ్యంలో పుస్తకంలో ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్‌ భాషలో పాఠాలు ముద్రిస్తున్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,64,28,320 పుస్తకాలు ముద్రించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1.33 కోట్ల పుస్తకాలు ముద్రించారు. అయితే ముద్రించిన పుస్తకాలు కూడా మండల కేంద్రాల్లోనే ఉన్నాయి. ఇటీవల వర్షాలు రావడంతో వాటిని పాఠశాలలకు చేర్చలేకపోయారు. మరోవైపు పూర్తిస్థాయిలో పుస్తకాలు రాకపోవడంతో వచ్చిన వాటిని ఎవరికివ్వాలనే సంశయంతో చాలాచోట్ల పంపిణీ చేయకుండా అలాగే ఉంచారు.

దీంతో ఆంగ్ల మాధ్యమం బోధన కోసం లక్ష మందికిపైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినా, వారు బోధనలోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. మరో రెండు నెలల వరకూ ఇదే పరిస్థితి కొనసాగితే ఆంగ్ల బోధనపై తీసుకున్న శిక్షణ మరిచిపోయే అవకాశముందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు తగిన సంఖ్యలో టీచర్లు లేకపోవడం, ముఖ్యంగా సబ్జెక్టు టీచర్ల కొరతపై తల్లిదండ్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

16 వేల ఉపాధ్యాయుల కొరత!  
గత ఏడాది 317 జీవో అమలు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంకా 16 వేల ఉపాధ్యాయుల కొరత ఉందని తేల్చారు. దాదాపు 52 శాతం స్కూళ్ళల్లో ఏదో ఒక సబ్జెక్టు టీచర్‌ లేరు. దీంతో ఇతర సబ్జెక్టులకు చెందిన టీచర్‌తోనే బోధన కొనసాగించాలనే ఆదేశాలిచ్చారు. ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తే తప్ప టీచర్ల నియామకం చేపట్టేందుకు వీల్లేదు. దీనికన్నా ముందు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, అప్పుడే ఖాళీల సంఖ్యపై మరింత స్పష్టత వస్తుందని అంటున్నారు.

అందువల్ల ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఆస్కారం లేదని విద్యాశాఖ అధికారులే అంటున్నారు. తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించాలనే ప్రయత్నం కూడా ముందుకెళ్ళలేదు. మరోవైపు 500కు పైగా మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా ప్రమాణాలపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకుండా పోయిందని అంటున్నారు.  

వేధిస్తున్న నిధుల సమస్య 
ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణకు అందే నిధులూ ఆలస్యమవుతున్నాయి. గత రెండేళ్ళుగా ఈ నిధుల్లో కోత పడింది. రాష్ట్రంలో 467 మండల రిసోర్స్‌ సెంటర్లు (ఎంఆర్‌సీలు) ఉన్నాయి. ఒక్కో ఎంఆర్‌సీకి ఏడాదికి రూ.90 వేల చొప్పున ఇస్తారు. అలాగే ఒక్కో పాఠశాల ఆవరణ నిర్వహణకు రూ.33 వేలు ఇస్తారు. ఇప్పటివరకు ఈ నిధులు అందకపోవడంతో కనీసం చాక్‌పీస్‌లు కొనే అవకాశం కూడా ఉండటం లేదని హెచ్‌ఎంలు అంటున్నారు. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ సమస్యలన్నీ పరిష్కారమైతేనే బోధన సక్రమంగా సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఇప్పటివరకు ఒక్క పాఠం చెప్పలేదు 
బడి తెరిచి నెలన్నర అయినా ఇప్పటికీ పుస్తకాలు ఇవ్వలేదు. ఒక్క పాఠం చెప్పలేదు. మేథ్స్‌ టీచర్‌ సెలవులో ఉన్నారంట. సైన్స్‌ టీచర్‌ చేత మేథ్స్‌ చెప్పిస్తారని అంటున్నారు. ఇంగ్లిష్‌ మీడియం కావడంతో కొంత కంగారుగా ఉంది. త్వరగా పాఠాలు చెబితే బాగుంటుంది.      
– పి నాగబాబు (8వ తరగతి, మూసారాంబాగ్‌ ప్రభుత్వ పాఠశాల) 

ఆగస్టు మొదటి వారంలో అందరికీ పుస్తకాలు 
ఇప్పటివరకు 80 శాతం పుస్తకాల ముద్రణ పూర్తయింది. మిగిలిన 20 శాతం పుస్తకాల ముద్రణను ఆగస్టు మొదటి వారంలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ద్విభాషలో పుస్తకాల ముద్రణ చేపట్టడం వల్ల ఈసారి పేపర్‌ ఎక్కువ అవసరమైంది. పేపర్‌ సకాలంలో అందకపోవడం వల్లే ముద్రణ ఆలస్యమైంది. పుస్తకాల పంపిణీ చేపట్టి విద్యార్థులకు అందజేయమనే ఆదేశాలు ఇచ్చాం. ఆగస్టు మొదటి వారంలోనే అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటాం.     
– శ్రీనివాసాచారి (డైరెక్టర్, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణ విభాగం)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement