నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఎండలు తగ్గకపోవడంతో మొదటిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే నమోదైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2 నుంచే పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం మొదట భావించింది. 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కానీ ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. బుధవారం నల్లగొండలో41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మిర్యాలగూడలో 41, సాగర్‌లో 40, దేవరకొండ లో కూడా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
ఎండల తీవ్రతతో అంతంతమాత్రంగానే విద్యార్థులు
ఎండాకాలం మాదిరిగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో బుధవారం పాఠశాలలు తెరిచినా ఎక్కడా పెద్దగా విద్యార్థులు హాజరుకాలేదు. 100 ఉన్న చోట 20 మందికి మించి హాజరు కాలేదు. దీంతో పాఠశాలలన్నీ విద్యార్థులు లేక వెలవెలబోయాయి. నల్లగొండ పట్టణంలోని మాన్కంచెల్క ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ముగ్గురువిద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.
పాఠశాలకు పంపేందుకు సుముఖత చూపని తల్లిదండ్రులు
ఎండతీవ్రతతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు కూడా సుముఖత చూపలేదు. సాధారణంగా మొదటి రోజు మంచి రోజు లేకుంటే పంపరు. కానీ బుధవారం మంచిరోజు ఉన్నప్పటికీ పిల్లలను కేవలం ఎండల కారణంగానే బడికి పంపలేదు. ఇదంతా ప్రభుత్వ పాఠశాలల్లో కనిపించిన పరిస్థితి. హాస్టల్‌లో ఉండే విద్యార్థులు కూడా ఎవరూ రాని పరిస్థితి. గతంలో పాఠశాల పునఃప్రారంభానికి ముందు రోజే సరంజామా అంతా సిద్ధం చేసుకొని హాస్టల్‌కు చేరుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించ లేదు.
ప్రైవేట్ పాఠశాలల వద్దే సందడి
ప్రైవేట్ పాఠశాలల వద్ద సందడి నెలకొంది. పుస్తకాలు, డ్రెస్సులు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఆయా పాఠశాలల వద్ద పెద్ద ఎత్తున కనిపించారు. వారు కూడా ఒక్కపూట మాత్రమే పాఠశాల నడిపారు. మధ్యాహ్నం తర్వాత పిల్లలను ఇంటికి పంపారు.
మొదటి రోజు హాజరు నామమాత్రమే
Published Thu, Jun 13 2019 10:36 AM | Last Updated on Thu, Jun 13 2019 10:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment