ఆదిలాబాద్‌టౌన్: బడిగంట మోగింది. ఆట పాటలకు చిన్నారులు బైబై చెప్పారు. దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవుల్లో ఉల్లాసంగా గడిపిన చిన్నారులు బుధవారం బడిబాట పట్టారు. ఇన్ని రోజులు బోసిపోయిన పాఠశాలలు విద్యార్థుల రాకతో కళకళలాడాయి. ఉదయాన్నే తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిద్రలేపి.. యూనిఫాం, బ్యాగు, పుస్తకాలు వాటర్‌బాటిళ్లు, టిఫిన్ బాక్సులు సిద్ధం చేసి పాఠశాలల వరకు తీసుకెళ్లారు. కొందరు నవ్వుతూ వెళ్లగా.. నర్సరీ, ఎల్‌కేజీ చిన్నారులు ఏడుస్తూ.. మారం చేస్తూ కనిపించారు. స్కూల్ బస్సులు, ఆటోల్లో విద్యార్థుల రాకపోకలు మొదలయ్యాయి. బుక్ సెంటర్లు, షూ, దుస్తులు, షాపులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కిక్కిరిసాయి. జిల్లా వ్యాప్తంగా బడి మొదలైన సందడి కనిపించింది.
సర్కారు వెలవెల.. ప్రైవేటు కళకళ
జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. 45 డిగ్రీలకు పైగా ఉండడంతో పాఠశాలలకు హాజరైన విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. తొలిరోజు తక్కువ సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా సమయానికి హాజరు కాలేదు. పాఠాలు బోధించలేదు. వచ్చిన విద్యార్థులు స్కూల్ ఆవరణలో ఆడుతూ పాడుతూ కనిపించారు. సర్కారు పాఠశాలలకు భిన్నంగా ప్రైవేటు పాఠశాలలు కళకళలాడాయి. అధిక శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలకు రెండు పూటల బడి నిర్వహించారు. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలను ప్రైవేటు పాఠశాల్లో చేర్పించడంతో తల్లిదండ్రులు పాఠశాలలకు చేరుకుని విద్యార్థులను బుజ్జగించి తరగతి గదుల్లోకి తీసుకెళ్లి కూర్చొబెట్టారు. కొంత మంది చిన్నారులు కంటతడి పెట్టగా, వారిని సముదాయించి చాక్టెట్లు, బిస్కెట్లతో నచ్చజెప్పి మరీ పాఠశాలలకు పంపించారు.
సమస్యలతో స్వాగతం..
ఏటా మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాల్లో సమస్యలు స్వాగతం పలికాయి. చాలా చోట్ల తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలు యథావిధిగా దర్శనమిచ్చాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కొన్ని పాఠశాలల్లో కిటికీలు సరిగా లేక, ఫ్యాన్లు తిరగక చిన్నారుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. పాఠశాలలను శుభ్రపర్చకపోవడంతో పలు చోట్ల విద్యార్థులే తరగతి గదులను ఊడ్చుకోవడం, కడగడం చేశారు. సర్కారు పాఠశాలల్లో హాజరు శాతం అంతంత మాత్రంగానే కనిపించింది. చాలా స్కూళ్లల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలో రెగ్యూలర్ ఉపాధ్యాయులు లేక పాఠశాలలు కొన్ని తెరుచుకోలేదు. కొన్ని చోట్ల మండల విద్యాధికారులు పక్కనున్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి పాఠశాలలను తెరిపించినా పాఠ్యాంశాల బోధన జరగలేదు.
ఎండ తీవ్రతతో ఇబ్బందులు..
జిల్లాలో భానుడు ప్రతాం చూపుతున్నాడు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపలేదు. గత ఏడాది జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాగా అయితే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో 11 రోజులు అదనంగా ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలు బుధవారం ఒంటి పూట బడి నిర్వహించగా, ప్రభుత్వ పాఠశాలలు రెండు పూటలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అదే విధంగా జైనథ్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు.
మోగిన బడిగంట
Published Thu, Jun 13 2019 8:27 AM | Last Updated on Thu, Jun 13 2019 8:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment