నాణ్యమైన బోధన.. ఉత్తమ ఫలితాలు | DEO Tenth Class Percentage Telangana Government | Sakshi
Sakshi News home page

నాణ్యమైన బోధన.. ఉత్తమ ఫలితాలు

Published Wed, Jun 12 2019 2:27 PM | Last Updated on Wed, Jun 12 2019 2:27 PM

DEO Tenth Class Percentage Telangana Government - Sakshi

‘ప్రభుత్వ బడులను పునఃప్రారంభానికి సిద్ధం చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని  ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశాం. ప్రభుత్వ బడుల్లో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన బోధన అందించడంతోపాటు ఉత్తమ ఫలితాలు రాబట్టడమే 2019–20 విద్యా సంవత్సరం లక్ష్యం’ అని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాణరెడ్డి చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభం రోజునే ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేస్తామని, పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరాయన్నారు. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరంలో చేపట్టే కార్యాచరణను వివరించారు.

సాక్షి, రంగారెడ్డి: జిల్లాప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాం. గతేడాది కంటే ఈసారి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంపై దృష్టిసారించాం. తాజాగా పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడుల్లో చదువుకున్న విద్యార్థులు రాణించారు. ఈ ఫలితాలను రుజువుగా చూపిస్తూ ప్రభుత్వ బడులకు తమ పిల్లలను పంపించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తాం. బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండేలా చూస్తాం. సర్కారు బడుల్లో నాణ్యమైన బోధన అందిస్తున్నాం. అనుభవం, నైపుణ్యం గల టీచర్లు ఉన్నారు. ఫీజు లేదు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేస్తాం. అలాగే మధ్యాహ్న భోజనం వడ్డిస్తాం. ఈ సానుకూలతలు.. ప్రైవేటు బడుల పిల్లలను కూడా ఆకర్షిస్తుండటం విశేషం. ప్రైవేటు ఫీజులు భరించలేని తల్లిదండ్రులు కొందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే తిరిగి పంపించారు. ఇలాంటి పరిస్థితులు ఈ ఏడాది కూడా ఉంటాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో 585 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో రెండు వందలకు పైగా టీచర్లు అవసరం. అయితే, ఈ ఖాళీల్లో శాశ్వత టీచర్లు వచ్చేవరకు గతేడాది పనిచేసిన విద్యావలంటీర్లనే విధుల్లోకి తీసుకోవాలి ఆదేశాలు అందాయి. ఫలితంగా బోధనకు ఆటంకం కలి గే పరిస్థితి లేకపోవడం సంతోషకరం. రె గ్యులర్‌ టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చేవరకు వలంటీర్లే కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది.

సరిపడా పుస్తకాలు.. 
జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,304 ప్రభుత్వ బడుల్లో నమోదైన విద్యార్థులకు దాదాపుగా సరిపడ పాఠ్యపుస్తకాలు వచ్చాయి. కేవలం 15వేల పుస్తకాలు రావాల్సి ఉంది. వారం రోజుల్లో ఇవి కూడా జిల్లాకు చేరుతాయి. వచ్చిన పుస్తకాలను అన్ని పాఠశాలలకు అందజేశాం. బుధవారం (12న) పిల్లలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. యూనిఫాం అందజేతకు మరికొంత సమయం పడుతుంది. జిల్లాకు ఇంకా వస్త్రం రాలేదు. పది రోజుల్లో జిల్లాకు చేరే వీలుంది. ఆ వెంటనే కుట్టించి విద్యార్థులకు అందజేస్తాం. మరుగుదొడ్లు, మూత్రశాలలను వినియోగంలోకి తీసుకరావాలని హెచ్‌ఎంలకు సూచించాం. వీటి నిర్వహణలో కీలకమైన నీటి వసతి ఉండేలా చూడాలని చెప్పాం. దాదాపు అన్ని స్కూళ్లలో తాగునీటి సౌకర్యం ఉంది.
 
ఇంగ్లిష్‌ మీడియంలో బోధన
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. ప్రస్తుతం 258 ప్రాథమిక, 95 ప్రాథమికోన్నత, 123 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సా గుతోంది. దీంతో చాలా మంది విద్యార్థులు స ర్కారు బడుల వైపు మళ్లుతున్నారు. ఈ ఏడాది విద్యార్థుల డిమాండ్‌ని బట్టి ఈ స్కూళ్ల సం ఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తాం. దీనికి 
అనుగుణంగా ప్రతిపాదనలు పంపించాలని ఎంఈఓలకు సూచించాం.

ప్రైవేటుపై నిక్కచ్చిగా.. 
ప్రతి స్కూల్‌ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే పనిచేయాలి. ప్రై వేటు స్కూళ్ల నిర్వహణపై నిక్కచ్చిగా వ్యవహరిస్తాం. అనుమతులు లేని పాఠశాలల జాబితా రూపొందించి ఇప్పటికే వాటి యాజమాన్యాలకు నోటీసులు జారీచేశాం. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందకుండా బడులు తెరిస్తే సీజ్‌ చేస్తాం. 25 స్కూళ్లు తమ గుర్తింపును రె న్యూవల్‌ చేసుకోవాల్సి ఉంది. అలాగే ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్‌ అందజేయాల్సి ఉంది. దీనికితోడు ఇ ప్పటివరకు అసలు గుర్తింపు లేకుండా 12 స్కూ ళ్లు నిర్వహిస్తున్నట్లు మా పరిశీలనలో తేలింది. అలాగే కొన్ని పాఠశాలలు పరిమిత స్థాయి తరగతుల వరకే అనుమతులు పొందాయి. కానీ, వాస్తవంగా అంతకుమించి తరగుతులు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.  వీటన్నింటినీ ఆకస్మికంగా తనిఖీలు చేస్తాం. తమ పిల్లలను చేర్పించే ముందు సదరు స్కూళ్లకు గుర్తింపు ఉందో.. లేదో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. దీనికితోడు గుర్తింపు లేని స్కూళ్ల జాబితాను ఆయా మండల విద్యాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతాం. నిర్ధిష్ట అర్హతలు ఉన్న టీచర్లే ప్రైవేటు స్కూళ్లలో బోధించాలి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు డీఎడ్‌ చేసి, హైస్కూల్‌ స్థాయి పిల్లలకు బీఎడ్‌ చేసిన టీచర్లే బోధించాలి.
 
డొనేషన్లు లేవు.. 
విద్యార్థుల చేరిక సమయంలో ప్రైవేటు పాఠశాలలు డొనేషన్లు, క్యాపిటేషన్‌ ఫీజును తీసుకోవద్దు. ఒకవేళ వసూలు చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువస్తే సదరు స్కూల్‌పై చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో యూనిఫాంలు, నోట్‌బుక్స్, షూ, టై, బెల్టులు అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వ నిర్దేశించిన పని వేళలను తప్పనిసరిగా ప్రైవేటు స్కూళ్లు పాటించాలి. స్టేట్‌ సిలబస్‌ బోధించే బడుల్లో ఐదు నుంచి పదో తరగతుల వరకు విద్యాశాఖ రూపొందించిన పాఠ్య పుస్తకాలనే వినియోగించాలి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వం ఆమోదించిన పాఠ్య పుస్తకాలనే బోధించాలి. ప్రైవేటు బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల కొరత లేదు. వీరికోసం జిల్లావ్యాప్తంగా విద్యాశాఖ గుర్తించిన 23 బుక్స్‌ స్టోర్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. అంతేగాక హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రచురణ కేంద్రంలోనూ అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి వెళ్లి కొనుగోలు చేయవచ్చు. బుక్స్‌ స్టోర్లలో పుస్తకాలను ఎమ్మార్పీకే విక్రయించాలి. ఆ ధరకు మించి అమ్మితే మాకు ఫిర్యాదు చేస్తే.. సదరు స్టోర్‌పై చర్యలు తీసుకుంటాం.
 
వచ్చేనెల ఒకటి నుంచి ప్రత్యేక తరగతులు 
పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు, ప్రతి విద్యార్థిలో విషయ పరిజ్ఙానం పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. జూలై ఒకటో తేదీ నుంచే టెన్త్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించాం. వార్షిక పరీక్షలు వచ్చే వరకు విద్యార్థులను అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా చేయడంతోపాటు పరీక్షల పట్ల భయం తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తాం. తద్వారా చదువులో వెనుకడిన విద్యార్థి కూడా కనీసం ఉత్తీర్ణత సాధించేలా సంసిద్ధత చేస్తాం. మొన్నటి కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతోపాటు వంద శాతం ఉత్తీర్ణత స్కూళ్ల సంఖ్యను పెంచుతాం. 

14 నుంచి బడిబాట 
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం, బడిఈడు పిల్లలకు ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా మార్చడం కోసం ఈనెల 14 నుంచి 19 వరకు బడిబాట నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా.. మధ్యలో బడిమానేసిన, బడి ఈడు వయసున్న విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యం. విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలను ఇందులో భాగస్వామ్యం చేస్తాం. ఆరు రోజుల పాటు నిత్యం ఏడు నుంచి 11 గంటల వరకు అన్ని గ్రామాల్లో బడిబాట నిర్వహిస్తాం. చదువు ప్రాముఖ్యత తెలియజేయడంతోపాటు ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేర్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదై ఐదేళ్లు నిండిన 13వేలకుపైగా పిల్లలను బడిబాట ద్వారా స్కూళ్లలో చేర్పిస్తాం. అలాగే సీఆర్‌పీలు గుర్తించిన 448 బాల కార్మికులను స్కూళ్లలో చేర్చుతాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement