![English Medium From Class 1 8 Recommended In Telangana Govt Schools - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/3/ktr-thr.jpg.webp?itok=pPdcc8EJ)
సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి, కేటీఆర్, సబిత, హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: 2022–23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలంటూ కేబినెట్‌కు సిఫార్సు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇందుకు సంబం ధించిన విధి విధానాలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బుధవారం సమావేశమైంది. మంత్రులు కేటీఆర్, టి.హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఈ భేటీలో పాల్గొన్నా రు.
ఇంగ్లిష్ మీడియం అమలుపై సీఎంతో చర్చించాక విధివిధానాలు రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. ఈలోగా ఆంగ్ల మాధ్యమానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించింది. విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేలా ద్విభాషా విధానంలో పాఠ్య పుస్తకాలను ముద్రించాలని కోరింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని, విద్యార్థుల్లో ఆంగ్లంలో ప్రత్యేక మెళకువలు నేర్పేందుకు అవసరమైతే టీ–శాట్ ద్వారా కోర్సులను అందుబాటులోకి తేవాలని సూచించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ఉపసంఘం చర్చించింది. దీని పై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, అధికారులు సయ్యద్ ఒమర్ జలీల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment