పాపన్నపేట(మెదక్): ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇక ఆటపాటల్లో మునిగి తేలేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ శనివారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. పదోతరగతి పరీక్షలు ఈనెల 3న ముగియగా, ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల పరీక్షలు ఈనెల 9వ తేదీతో పూర్తయ్యాయి. 10,11 తేదీల్లో లోక్‌సభ ఎన్నికల సెలవులు ఉండగా, 12న (శుక్రవారం) ఎన్నికల విధుల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు మధ్యాహ్నం వరకు పాఠశాలలు కొనసాగించి, ఫలితాలు వెల్లడించి సెలవులు ప్రకటించారు. జిల్లాలో వారం రోజుల నుంచి ఎండలు మండుతున్న నేపథ్యంలో చిన్నారులు పాఠశాలలకు రావాలంటే విలవిల్లాడిపోయారు.
శుక్రవారం జిల్లాలో 40 çడిగ్రీల సెంటీగ్రేడ్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 31 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 1న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు.. సెలవులను కచ్చి తంగా పాటించాలని, ఎవరైనా బడులు నడిపితే చర్యలు తప్పవని ఇన్‌చార్జి డీఈఓ రవికాంత్‌రావు హెచ్చరించారు. కేజీబీవీ పాఠశాలల్లో చదువుకుంటున్న తల్లిదండ్రులు లేని పిల్లలకు సిద్దిపేట జిల్లా చేర్యాలలో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నారు.
బిజీబిజీగా ఉపాధ్యాయులు..
జిల్లాలో 632 ప్రాథమిక, 131 ప్రాథమికోన్నత, 143 ఉన్నత పాఠశాలలుండగా ఇందులో సుమారు 1.27 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. 2017–18 ఎన్నికల సంవత్సరంగానే గడిచింది. 2018 జూలైలో టీచర్ల బదిలీలు జరిగాయి. డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, జనవరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈనెల 11న జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మార్చిలో శిక్షణ, పదో తరగతి పరీక్షలతో బిజీబిజీగా గడిచిపోయంది.
పక్కా ప్రణాళికతో పది పరీక్షలు
విద్యా సంవత్సరంలో కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ పదో తరగతి పరీక్షలకు పక్కా ప్రణాళికతో విద్యార్థులను సన్నద్ధం చేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి, ఇన్‌చార్జి డీఈఓ రవికాంత్‌రావు ఆధ్వర్యంలో ఆగస్టు నుంచే ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ‘లిటిల్ టీచర్–లిటిల్ లీడర్’ ప్రోగ్రాంతో విద్యార్థుల్లో పది పరీక్షలపై ఆత్మ విశ్వాసం పెంపొందించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నడిపించారు. సాయంత్రం ప్రత్యేక తరగతుల వేళ స్నాక్స్ అందించారు. మొత్తం మీద పది పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ధీమాను విద్యాశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
కేజీబీవీ విద్యార్థినులకు వేసవి శిబిరం
తల్లిదండ్రులు లేని కేజీబీవీ విద్యార్థినులకు చేర్యాలలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుంచి మే 25 వరకు ఈ క్యాంపు కొనసాగుతుంది. మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని కేజీబీవీ పాఠశాలల్లో చదువుతూ తల్లిగాని, తండ్రి గాని, ఇద్దరూ లేని విద్యార్థులను శిబిరానికి పంపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, నైపుణ్యాలు పెంపొందించేలా అక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. వీటితో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment