పిల్లలను బడికి తీసుకెళ్తున్న తల్లిదండ్రులు
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): జిల్లాలో బడి గంటలు మోగాయి. తొలిరోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు తరలి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 1608 పాఠశాలలు తెరుచుకున్నాయి. అందులో 454 ప్రైవేటు పాఠశాలలు కాగా, 766 ప్రైమరీ, 136 అప్పర్ ప్రైమరీ, 252 హైస్కూల్ ఉన్నాయి. ఇవే కాకుండా కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, బీసీ, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో గత నాలుగైదు రోజులుగా పుస్తకాలు, బట్టలు, బ్యాగులు, స్టీల్, ఇతరాత్ర దుకాణాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. కొత్త దుస్తులు, బ్యాగులు, లంచ్ బాక్సులతో న్యూలుక్‌లో విద్యార్థులు పాఠశాలలకు ఉత్సాహంగా వెళ్లారు.
పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు..
జిల్లాలోని 766 ప్రైమరీ, 136 అప్పర్ ప్రైమరీ, 252 హైస్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. ఆ పుస్తకాలు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు చేరుకున్నాయి. ఒకటి నుంచి పదోతరగతి 6,90,600 పుస్తకాలు అవసరమని ప్రతిపాదనలు పంపించగా, 6,89,350 పుస్తకాలను ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేసింది. అందులో 27 మండలాల్లోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు 6,67,695 పుస్తకాలను తరలించారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించి 1250 పుస్తకాలు రావాల్సి ఉంది. మొదటిరోజు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment