telangana private schools
-
మోగిన బడిగంట
జనగామ: నూతన విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. బుధవారం బడిగంట మోగడంతో పుస్తకాల బ్యాగులు వీపున వేసుకుని హడావిడిగా స్కూళ్లకు బయలు దేరారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. సెలవుల్లో తాము చేసిన అల్లరిని స్నేహితులతో పంచుకుంటూ తొలిరోజు పాఠశాలలో అడుగుపెట్టారు. ఉపాధ్యాయులకు గుడ్ మార్నింగ్ చెబుతూ సరదాగా గడిపారు. పలువురు విద్యార్థులు కొత్తగా కొనుగోలు చేసిన సైకిళ్లపై పాఠశాలకు చేరుకోగా.. మరికొందరు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల వద్ద విద్యార్థులు శ్రమదానం చేపట్టి పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదులను శుభ్రం చేసుకున్నారు. తరగతి గదుల్లోకి వస్తున్న స్నేహితులను విష్ చేస్తూ తొలిరోజు సరలదాగా గడిపారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో ప్రభుత్వ ప్రైమరీ, ప్రాథమికోన్నత, ఉన్నత, ట్రైబల్, సాంఘిక, బీసీ సంక్షేమ, ఎయిడెడ్ పాఠశాలలు 571 ఉన్నాయి. వీటిలో ప్రైమరీ 349, ప్రాథమికోన్నత 71, ఉన్నత పాఠశాలలు 151 ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి 54 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అనేక సమస్యలతో నూతన విద్యా సంవత్సరం స్వాగతం పలికింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో తాగునీరు, వంటగదుల నిర్మాణం, టాయిలెట్స్ సమస్య విద్యార్థులను వెంటాడుతోంది. అయితే జిల్లాలోని ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ ఉన్నప్పటికీ నిర్వహణ లేక సగం స్కూళ్లలో వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయుల ఇంటిబాట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ఆదేశాల మేరకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కలిగిస్తూ.. ప్రైవేటు కాదని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరుతున్నారు. కాగా జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు ప్రైవేటు స్కూళ్లకు పంపించబోమని పలువురు తల్లిదండ్రులు సర్కారు స్కూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రేపటి నుంచి బడిబాట ఈ నెల14 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రైవేటుకు వెళ్లే విద్యార్థులతో పాటు బడిబయట ఉన్న వారిని గుర్తిస్తారు. మన ఊరు–మనబడిబాట ద్వారా స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటికి వెళ్లడం జరుగుంది. ఇంటింటికీ ప్రణాళిక రూపొందించుకుని, పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పిల్లల ప్రవేశాలు, ఆధార్ కార్డుల సేకరణపై దృష్టి సారించనున్నారు. బడిమధ్యలో మానేసిన పిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి అవగాహన కలిగిస్తారు. బాలికలను కేజీవీబీలో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): జిల్లాలో బడి గంటలు మోగాయి. తొలిరోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు తరలి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 1608 పాఠశాలలు తెరుచుకున్నాయి. అందులో 454 ప్రైవేటు పాఠశాలలు కాగా, 766 ప్రైమరీ, 136 అప్పర్ ప్రైమరీ, 252 హైస్కూల్ ఉన్నాయి. ఇవే కాకుండా కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, బీసీ, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో గత నాలుగైదు రోజులుగా పుస్తకాలు, బట్టలు, బ్యాగులు, స్టీల్, ఇతరాత్ర దుకాణాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. కొత్త దుస్తులు, బ్యాగులు, లంచ్ బాక్సులతో న్యూలుక్లో విద్యార్థులు పాఠశాలలకు ఉత్సాహంగా వెళ్లారు. పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు.. జిల్లాలోని 766 ప్రైమరీ, 136 అప్పర్ ప్రైమరీ, 252 హైస్కూల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. ఆ పుస్తకాలు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు చేరుకున్నాయి. ఒకటి నుంచి పదోతరగతి 6,90,600 పుస్తకాలు అవసరమని ప్రతిపాదనలు పంపించగా, 6,89,350 పుస్తకాలను ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేసింది. అందులో 27 మండలాల్లోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు 6,67,695 పుస్తకాలను తరలించారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించి 1250 పుస్తకాలు రావాల్సి ఉంది. మొదటిరోజు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. -
బడికి వేళాయె!
పాలమూరు: బడిగంటలు మోగాయి.. వేసవి సెలవుల్లో అమ్మమ్మ, నానమ్మ ఊర్లకు వెళ్లి సరదాగా గడిపిన విద్యార్థులు నేటినుంచి పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు ఈనెల 1వ తేదీనే తెరుచుకోవాల్సిన పాఠశాలలు ఎండలు మండుతుండడంతో ప్రభుత్వం 12వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేటినుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ పాఠశాలలను మొదటిరోజు అట్టహాసంగా ప్రారంభించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయగా ఉపాధ్యాయులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా గ్రామాలు, పట్టణాల్లో తమదైన శైలిలో ప్రచారాలు చేసి నేడు ఆర్భాటంగా పాఠశాలలను ప్రారంభించనున్నారు. ముందేచేరిన పుస్తకాలు పాఠశాలల ప్రారంభం రోజునే తరగతులు కూడా ప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకు తగ్గట్టు ముందుగానే అవసరమైన పాఠ్యపుస్తకాలను అందజేశారు. నేటినుంచి పాఠశాలలు తెరుచుకోనున్నడంతో పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు, స్కూల్ యూనిఫాం ఇతర వస్తువులను కొనుగోలు చేస్తూ తల్లిదండ్రులు బిజీగా కనిపించారు. జిల్లా కేంద్రంలో ఉన్న బుక్సెంటర్లు, షూ సెంటర్లు, బట్టల దుకాణాల్లో సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 2601 ప్రాథమిక పాఠశాలలు, 567 ప్రాథమిక కొన్నత పాఠశాలలు, 575 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా 1750 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా దాదాపు 10లక్షల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో చదువుకుంటున్నారు. ఇదిలాఉండగా మహబూబ్‌నగర్ జిల్లాలో 212 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 1,167 ప్రాథమికొన్నత ప్రాథమిక పాఠశాలలు, 383 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నూతనంగా వచ్చిన పాఠశాలలు కాకుండా 150 ప్రాథమిక పాఠశాలలు, 213 ఉన్నత పాఠశాలలుండగా 85,511 మంది విద్యార్థులు చదువుతున్నారు. సామాన్యులకు ఆర్థికభారం జూన్ మాసం వచ్చిందంటే సామాన్యులకు ఆర్థిక, అప్పుల భారం పెరుగుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల సంగతి చెప్పనక్కరలేదు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు రూ.12వేల నుంచి రూ.18వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.22వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు ప్యాకేజీ కింద రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దాంతోపాటు సాధారణ స్కూల్ ఫీజులే కాకుండా డోనేషన్లు, అడ్మిషన్ ఫీజులు, స్పెషల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ల్యాబ్ ఫీజులు, రికార్డులు, బస్సు ఫీజులు, టైలు, బెల్టులు, ఐడెంటీ కార్డులు, పుస్తకాలు, వంటివి బయట కొనుగోలు చేయకుండా నిబంధనలు ఏర్పాటు చేసి వారి పాఠశాలల్లోనే కొనాల్సిన పరిస్థితి తీసుకొస్తారు. దీంతో విద్యార్థులు ఎక్కడ కూడా చెప్పలేక యాజమాన్యాలు చెప్పనదానికి తల ఊపాల్సి వస్తోంది. దానికితోడు పెరిగిన ధరలు కూడా తల్లిదండ్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారికి పెన్సిల్ దగ్గరి నుంచి స్కూల్ ఫీజుల వరకు వేలల్లో ఖర్చు అవుతుంది. ఒక మధ్యతరగతి కుటుంబం ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కష్టంగా మారుతోంది. -
‘ప్రైవేట్ స్కూళ్లపై ఆంక్షలొద్దు’
కరీంనగర్: ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ వైఖరి మారాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ధర్నాకు దిగింది. శనివారం (ట్రస్మా) ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలపై ప్రభుత్వం అసత్య ప్రచారానికి, వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ధర్నాలో పాఠశాలల యజమానులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.