ప్రాథమిక ‘మిథ్య’! | Government primary education | Sakshi
Sakshi News home page

ప్రాథమిక ‘మిథ్య’!

Published Thu, Jul 24 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

ప్రాథమిక ‘మిథ్య’!

ప్రాథమిక ‘మిథ్య’!

చాపాడు: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధిపై ఎప్పటికప్పుడు సత్వర చర్యలు తీసుకొంటూ ముందుకెళ్లాల్సిన సర్వశిక్షాఅభియాన్(ఎస్‌ఎస్‌ఏ) నత్తనడకే నయమన్నట్లుగా ముందుకెళుతోంది. ప్రాథమిక విద్యాశాఖను పర్యవేక్షిస్తూ విద్యాప్రమాణాల మెరుగుకు ఉపాధ్యాయులకు వృత్త్యంతర( రీ ఓరియంటేషన్) శిక్షణలను ఇస్తూ ప్రాథమిక విద్యను ముందుకు తీసుకుపోవాల్సిన ఎస్‌ఎస్‌ఏ వేగం పుంజుకోలేకపోతోంది. ఫలితంగా అనుకున్న స్థాయిలో లక్ష్యాన్ని సాధించటంలో విఫలమవుతోంది.
 
 చతికలబడిన బడిబాట:
 ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ఆరంభంలో బడిబాట అంటూ ఆర్భాటంగా ప్రకటించిన  ఎస్‌ఎస్‌ఏ ఈ కార్యక్రమాన్ని అమలు పరచటంలో క్షేత్రస్థాయిలో విఫలమైంది. ఎన్‌రోల్‌మెంటు స్పెషల్ డ్రైవ్, సంసిద్ధతా కార్యక్రమాలు అమలు పరచాలని విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులున్నా ఉపాధ్యాయులకు చేరవేయటంలో ఎస్‌ఎస్‌ఏ వెనుకబడినట్లు కన్పిస్తోంది. వీటిపై ప్రాధానోపాధ్యాయుల సమావేశాలు నిర్వహించని మండలాలు జిల్లాలో అనేకం ఉన్నాయి.
 
 ఖరారు కాని శిక్షణ  తరగతులు:
 విద్యా సంవత్సర ప్రారంభంలోనే తెలుగు, గణితం, ఇంగ్లీషులపై ప్రాథమికస్థాయి ఉపాధ్యాయులకు వృత్తంతర శిక్షణలను జూలై ఒకటవ తేదీ నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్దేశించింది. పొరుగు జిల్లాలలో శిక్షణ  తరగతులు ప్రారంభమైనా మన జిల్లాలో మాత్రం వీటిని నిర్వహించటంలో వెనకబడింది. ఇప్పటికీ తేదీలను ఖరారు చేయటంలో తలమునకలవుతుందే తప్ప వేగం పుంజుకోలేదు. మారుతున్న బోధనా మెలకువలను సకాలంలో ఉపాధ్యాయులకు అందించటంలో ఎస్‌ఎస్‌ఏ వేగం పెంచాల్సి ఉంది. వేసవి సెలవుల్లో శిక్షణ  తరగతులు నిర్వహిస్తే ప్రయోజనం ఉండేది. ఈ విద్యా సంవత్సరంలో ఎస్‌ఎస్‌ఏ వేగవంత చర్యలు చేపట్టలేదనేది దీన్నిబట్టి తేటతెల్లమవుతోంది.
 
 కన్పించని స్కూల్ కాంప్లెక్స్‌లు:
 నెల వారీగా విద్యా ప్రగతి చర్చించుకుని లోపాలను సరిదిద్దుకొంటూ విద్యా ప్రమాణాల మెరుగుకోసం కృషి చేసే వేదిక స్కూల్ కాంప్లెక్స్‌లు. వీటిని నిర్వహించడంలో ఎస్‌ఎస్‌ఏ వెనకబడింది. గత సంవత్సరం స్కూల్ కాంప్లెక్స్‌లకు నిధులు మంజూరైనా సమావేశాలు నిర్వహించలేదు. 279 స్కూలు కాంప్లెక్స్ కేంద్రాలు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. దీని కోసం ఏర్పాటైన సీఆర్పీ వ్యవస్థ అమలులో ఉన్నా కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణలో సత్వర చర్యలు కన్పించటం లేదు. వీటిపై ఎస్‌ఎస్‌ఏ తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
 
 అందని నిధులు:
 పాఠశాలలు ప్రారంభమై నెలన్నర రోజులవుతున్నా పాఠశాలల అభివృద్ధి నిధులను ఎస్‌ఎంసీ ఖాతాలలో జమచేయటంలో నిర్లక్ష్యం కన్పిస్తోంది. పాఠశాలల వైపు విద్యార్థులను ఆకర్షించటం కోసం భవనాల మెరుగుకు నిధులను ఇప్పటికీ వెచ్చించకపోవటం అధికారుల అలసత్వాన్ని ఎత్తి చూపుతోంది. డ్రాపౌట్ల శాతాన్ని తగ్గించాలని పదేపదే చెప్పే ఎస్‌ఎస్‌ఏ ఇలాంటి కీలక నిర్ణయాలు సకాలంలో ఎందుకు తీసుకోలేకపోతోందనే విమర్శలు ఉన్నాయి. నిధులను వెంటనే విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను పటిష్టపరిచే దిశగా చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
 
 బాలకార్మిక వ్యవస్థపై చర్యలేవి:
 బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. బడిఈడు పిల్లలు బాలకార్మికులుగా అనేక చోట్ల దర్శనమిస్తున్నారు. గతంలో మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలాన్ని బాలకార్మిక రహిత మండలంగా ప్రకటించినప్పటికీ ఇక్కడ అనేక మంది బాలకార్మికులు ఉన్నారు. తగినన్ని నిధులున్నా బాలకార్మిక వ్యవస్థను రూపుమాపటంలో ఎస్‌ఎస్‌ఏ ఏ మాత్రం శ్రద్ధ కన బరచటం లేదనే విమర్శలు అధికంగా ఉన్నాయి.
 
 ఎస్‌ఎస్‌ఏ విధానాల్లో మార్పులు రావాలి
 ప్రాథమిక విద్యా కార్యకలాపాల్లో ఎస్‌ఎస్‌ఏ వేగం పెంచాలి. వెంటనే పర్యవేక్షణా విభాగాన్ని సంస్కరించాలి. సీఆర్పీ వ్యవస్థను ప్రక్షాళన చేసి, పాఠశాలల గ్రాంటును వెంటనే విడుదల చేయాలి. పాఠశాలల్లో కనీస వసతులైన భవన, మరుగుదొడ్లు, వంటగదులు, నీటి వసతిని మెరుగుపరిచే చర్యలు తక్షణం చేపట్టాలి. యూనిఫారాలను విద్యార్థులకు సరఫరా చేయాలి.
 - సీవీ. ప్రసాద్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement