రామభద్రపురం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. అప్పుడే పరీక్షలు రాసే పిల్లలు... వారికోసం తపించే తల్లిదండ్రులు... ఫలితాలకోసం ఉపాధ్యాయుల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది. సాధారణంగా పదిగంటలకు తెరవాల్సిన పాఠశాలలు వారికోసం ఉదయం ఎనిమిదికే తెరుస్తున్నారు. సాయంత్రం ఐదు నుంచి ఆరుగంటలవరకూ ఉంచుతున్నారు. ప్రత్యేక రివిజన్లతో సిలబస్‌పై పట్టుకోసం పట్టుబిగిస్తున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిఉంది.
రామభద్రపురం(బొబ్బిలి): జిల్లాను టెన్త్ ఫలితాల్లో ప్రధమ స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి పాఠ్యాంశాలు బోధనలో నిమగ్నమయ్యారు. గతేడాది 93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లా 8వ స్థానంలో నిలవగా అత్యధిక శాతం మంది సి, డి గ్రేడ్‌లే సాధించారు. ఈ ఏడాది ఆ ఒడిదుడుకులను అధిగమించి శతశాతం ఫలితాలు సాధించడమే గాకుండా ఎక్కువ మంది ఏ గ్రేడ్ సాధించేలా పిల్లలను సాన బెడుతున్నారు. జిల్లాలో 350 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలుండగా వాటిలో గతేడాది 22,560 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు.
వారిలో 20,762 మంది వివిధ గ్రేడ్‌లలో ఉత్తీర్ణులయ్యారు. 70 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, 55 మంది విద్యార్థులు మాత్రమే పదికి పది పాయింట్లు సాధించినట్లు విద్యాగణాంకాలు చెప్పుతున్నాయి. ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు 157 ఉండగా వాటిలో 6,896 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. వీరిలో 6,737 మంది ఉత్తీర్ణత సాదించారు. 92 ప్రైవేట్ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, 470 మంది విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించారు. ఈసారి ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ కసరత్తు చేపడుతోంది. ఇప్పటికే వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నారు.
ఫలితాలే ప్రధాన లక్ష్యం
ఈ ఏడాది జిల్లాలో సుమారు 28,400 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సారి అత్యధికంగా పదికి పది పాయింట్లు సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9.30 గంటలకు తెరవాల్సి ఉండగా.. పదో తరగతి మాత్రం ఉదయం 8 గంటలకే ప్రారంభిస్తున్నారు. ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.45 గంటలకు పాఠశాల విడిచి పెట్టాల్సి ఉన్నా 5.30 గంటల వరకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా పబ్లిక్ పరీక్షలు ఎదుర్కొనే విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడం, వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేకంగా తీర్చిదిద్దడం వంటివి చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment