పదిలో పల్టీ | district last in tenth results | Sakshi
Sakshi News home page

పదిలో పల్టీ

Published Sun, May 7 2017 12:22 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

పదిలో పల్టీ - Sakshi

పదిలో పల్టీ

- టెన్త్‌ ఫలితాల్లో జిల్లాకు 11వ స్థానం
- గత ఏడాది కంటే 6.09 శాతం తగ్గిన ఉత్తీర్ణత
- 1,070 మంది విద్యార్థులకు 10/10 గ్రేడ్‌ పాయింట్లు
- కలిసొచ్చిన ఇంటర్నల్‌ మార్కులు
- ఉత్తీర్ణతలో బాలురు, బాలికల మధ్య పోటాపోటీ


అనంతపురం ఎడ్యుకేషన్‌ : పదో తరగతి ఫలితాల్లో ‘అనంత’ పల్టీ కొట్టింది. గత ఏడాది రాష్ట్రంలో ఏడోస్థానంలో నిలవగా..ఈసారి 11వ స్థానానికి దిగజారింది. గత ఏడాది కంటే 6.09 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఇక  10/10 గ్రేడ్‌ పాయింట్ల సాధనలో మాత్రం జిల్లా విద్యార్థులు మెరుగుపడ్డారు. గత ఏడాది 468 మంది ఈ పాయింట్లు సాధించగా..ఈసారి ఆ సంఖ్య 1,070కు చేరింది. ఇంటర్నల్‌ మార్కులు వేయడంతో ఈ సంఖ్య పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఫలితాలు శనివారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. జిల్లాలో మొత్తం 48,698 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 43,086 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తమ్మీద 88.48 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. గత ఏడాది 94.57 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి 6.09 శాతం తగ్గింది. వీరిలో 25,037 మంది బాలురకు గాను 22,080 మంది (88.19 శాతం), 23,661 మంది బాలికలకు గాను 21,006 మంది (88.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలురు, బాలికలు నువ్వానేనా అన్నట్లు పోటాపోటీ పడ్డారు. అయితే.. బాలికలు అతి స్వల్ప ఆధిక్యతతో పైచేయి సాధించారు.  

3 గంటలకు ఫలితాలు
ఫలితాలు ఉదయం 12 గంటలకు ప్రకటిస్తారనే సమాచారాన్ని  రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు ఉదయం నుంచే ఆత్రుతగా ఎదురు చూశారు. తీరా 11 గంటల సమయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రకటిస్తామంటూ వాయిదా వేశారు. ఫలితాలు ప్రకటించగానే విద్యార్థులు నెట్‌సెంటర్ల వద్ద, మొబైళ్లలో రిజల్ట్‌ చూసుకునేందుకు హడావుడి చేశారు. అనంతపురం నగరంతో పాటు హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, ఉరవకొండ, గుత్తి తదితర పట్టణాల్లోని ఇంటర్నెట్‌ కేంద్రాలు విద్యార్థులు, వారి బంధువులతో కిటకిటలాడాయి.

కలిసొచ్చిన ఇంటర్నల్‌ మార్కులు
నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం తొలిసారి అమలు కావడంతో విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 80 మార్కులకు మాత్రమే పరీక్ష రాశారు. తక్కిన 20 ఇంటర్నల్‌ మార్కులు. అంటే ఫార్మాటివ్, సమ్మేటివ్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులు, నోట్స్, ›ప్రాజెక్ట్‌ వర్క్, పుస్తక సమీక్ష ఆధారంగా ఆయా పాఠశాలల నిర్వాహకులే ఈ 20 మార్కులు వేస్తారు. ఈ విధానం విద్యార్థులకు కలిసొచ్చిందనే చెప్పాలి.  విద్యార్థులందరికీ 18–20 మార్కులు వేశారు. 10/10 పాయింట్లు సాధించేందుకు ఇంటర్నల్‌ మార్కులు దోహదపడ్డాయి.  

ప్రశ్నపత్రం లీకుతో మేల్కొన్న అధికారులు
పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే మడకశిరలో పేపరు లీక్‌ కావడం, ఆ తర్వాత రోజు కదిరి పట్టణంలోని నారాయణ  పాఠశాలలో జవాబులు తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోవడం లాంటి ఘటనలతో అధికారులు మేల్కొన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరీక్షలను పర్యవేక్షించారు. దీనికితోడు ఎప్పుడూ లేని విధంగా  గత కలెక్టర్‌ కోన శశిధర్‌.. చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియోజకవర్గాల వారీగా మార్పులు చేశారు. ఈ ప్రభావం కూడా ఫలితాలపై పడిందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.

గత ఫలితాలు ఇలా..
సంవత్సరం            ఉత్తీర్ణత శాతం            రాష్ట్రంలో జిల్లా స్థానం
2007            53.46                23
2008            70.33                18
2009            71.70                19
2010            73.94                20
2011            74.86                22
2012            81.71                22
2013            83.16                21
2014            87.62                17
2015            93.11                05
2016            94.57                07
2017            88.48                11

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement