
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు మే 15 కల్లా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విద్యా శాఖ ఉన్నతాధికారుల కసరత్తు తుది దశకు చేరుకుంటోంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది, టెన్త్ పరీక్షలకు 4.90 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ మూల్యాంకన ఇప్పటికే ముగిసింది.
మార్కులను మరోసారి పరిశీలించి, కంప్యూటర్ ద్వారా ఇంటర్ బోర్డ్‌కు పంపారు. డీకోడింగ్ ప్రక్రియ కూడా ముగిసినట్టు అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ జరుగుతోందని, సాంకేతిక పరమైన లోపాలు పరిశీలించిన తర్వాత ఫలితాల విడుదల తేదీ ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. మే రెండోవారం అంటే.. 15వ తేదీలోగా ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఇక పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం దాదాపు ముగిసింది. కొన్ని పెద్ద కేంద్రాల్లో అక్కడక్కడా కొనసాగుతోంది. మూల్యాంకనం పూర్తికాగానే డీ కోడింగ్ చేసి, మార్కులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా బోర్డుకు పంపుతున్నారు. కాగా, టెన్త్ ఫలితాలను వచ్చే నెల 10లోగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment