సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదల కానున్నాయి. ఎస్సెస్సి బోర్డు మార్క్స్ మెమోలను కూడా రేపే విడుదల చేయనుంది. 2020–21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్‌లతోపాటు 2019–20 టెన్త్ విద్యార్థులకు గ్రేడ్‌లు కూడా ప్రకటించనుంది. కోవిడ్ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే జీవో 46ను విడుదల చేసింది. ఫలితాలను గణించడానికి అనుసరించనున్న విధివిధానాలను అందులో వివరించింది.
గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించనున్నారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరిస్తారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment