marks memos
-
‘డిజి లాకర్’లో ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ పాసైన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను సులభంగా పొందే వెసులుబాటును ఇంటర్మిడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వలెన్సీ, జెన్యూన్‌నెస్ సర్టిఫికెట్లు ఎప్పుడు, ఎక్కడ కావాలన్నా తీసుకునేలా ‘డిజి లాకర్’ (https://digilocker.gov.in)లో ఉంచింది. అందుకోసం రాష్ట్ర విద్యా సంబంధ ఆన్లైన్ ఫ్లాట్ఫారమైన జ్ఞానభూమిని డిజిలాకర్‌కు అనుసంధానించింది. ఇప్పటికే 1.14 కోట్ల మంది టెన్త్ సర్టిఫికెట్లను ప్రభుత్వం డిజి లాకర్లో ఉంచింది. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఇంటర్మిడియట్ పూర్తిచేసిన 45.53 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచింది. ఉమ్మడి రాష్ట్రంలో పాసైన (2014కు ముందు) ఏపీ విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం మరికొద్ది రోజుల్లో డిజి లాకర్లో ఉంచనుంది. కేవలం రెండు నెలల్లోనే లక్షలమంది సర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేసి, డిజి లాకర్లో ఉంచడం దేశ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. అంతే కాకుండా సర్టిఫికెట్లలో తప్పు పడిన పేరు సరిదిద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు. ఐఐటీ, నీట్‌తో పాటు అనేక జాతీయ స్థాయి ఎంట్రన్స్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే చాలా మంది విద్యార్థులు డిజి లాకర్లో ధ్రువపత్రాలు పొందుతున్నారు. ఇకపై ఇంటర్మిడియట్ (+2) పూర్తి చేసిన వారి సర్టిఫికెట్లను బోర్డుకు చెందిన జ్ఞానభూమి ద్వారా డిజి లాకర్లో పొందవచ్చు. డిజిటల్ సర్టిఫికెట్లను దేశ, విదేశాల్లోని యూనివర్సిటీలు, జేఈఈ, నీట్ కాలేజీలు కూడా అంగీకరించడంతో ఇకపై విద్యార్థులకు డూప్లికేట్ సర్టిఫికెట్ల అవసరం ఉండదు. ఎప్పుడైనా సర్టిఫికెట్లు పొందే అవకాశం ఇప్పటిదాకా ఏ కారణం చేతనైనా సర్టిఫికెట్లు పోగొట్టుకుని నకళ్లు (డూప్లికేట్) పొందడం పెద్ద ప్రహసనం. ముందుగా సర్టిఫికెట్ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేసి, అది దొరకలేదని ఎన్వోసీ ఇస్తారు. ఇందుకు కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాత నోటరీ చేసిన అఫిడవిట్‌తో సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకుంటే మరో నెల, రెండు నెలల తర్వాత డూప్లికేట్ సర్టిఫికెట్ వస్తుంది. ఇంత సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ డిజి లాకర్‌తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు వెంటనే సర్టిఫికెట్ పొందవచ్చు. టెన్త్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఇలా.. 2004 నుంచి 2023 వరకు పదో తరగతి పాసైన విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం పాఠశాల విద్యాశాఖ డిజి లాకర్లో ఉంచింది. ఇందులో 2008, 2009, 2010, 2011 విద్యా సంవత్సరాల సర్టిఫికెట్లను మరో పది రోజుల్లో డిజి లాకర్లో ఉంచనుంది. విద్యార్థులు తమ పాస్ మెమోల కోసం డిజి లాకర్ యాప్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వాలి. అనంతరం ‘క్లాస్ గీ మార్క్‌షీట్’ ఓపెన్ చేస్తే, వివిధ రాష్ట్రాల ఎస్సెస్సీ బోర్డుల ఐకాన్స్ కనిపిస్తాయి. వీటిలో ‘సూ్కల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్’పై క్లిక్ చేసి, రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ అయ్యి సర్టిఫికెట్‌ను పొందవచ్చు. సర్టిఫికెట్ ఇలా పొందవచ్చు మొబైల్ ఫోన్లోని డిజి లాకర్ యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా మార్క్స్ మెమో, మైగ్రేషన్ సర్టిఫికెట్, ఈక్వెలెన్స్ సర్టిఫికెట్, అర్హత సర్టిఫికెట్ పొందవచ్చు. అభ్యర్థులు వారి మొబైల్ ఫోన్లో డిజి లాకర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి. అనంతరం ఫోన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌తో https://digilocker.gov.in లో లాగిన్ చేయాలి. వారి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నిర్ణీత బాక్స్‌లో నింపి సబ్మిట్ చేస్తే లాకర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వివిధ రాష్ట్రాల ఐకాన్స్ ఉంటాయి, వాటిలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేస్తే అందులో ‘క్లాస్ గీఐఐ’ ఓపెన్ చేస్తే ‘బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యుకేషన్’ బ్యానర్ కనిపిస్తుంది. ఇందులోకి ఎంటర్ అయ్యి ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలంటే దానిపై ‘క్లిక్’ చేయాలి. రోల్ నంబర్/ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తయిన సంవత్సరం వంటి వివరాలు నమోదు చేసి వారి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి
పరీక్షల్లో మంచి మార్కులు రావాలని విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు. పాస్ అయితే చాలురా బాబు అని కొందరనుకుంటే.. ఇక టాపర్స్ బ్యాచ్ ఏమో వందకు 99 మార్కులు తెచ్చుకోవాలని రోజుకీ గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. అయితే ఎంత చదివినా, ఎంత రాసినా మహా అయితే 99, లేదా వంద మార్కులు సాధించవచ్చు. అంతకుమించి అయితే రావు కదా. కానీ బిహార్‌కు చెందిన ఓ డిగ్రీ విద్యార్థికి 100కు 151 మార్కులు వచ్చాయి. హా అదేంటి అని ఆశ్యర్చపోతున్నారా.. నిజమేనండి.. ముందుగా తన మార్కులను చూసుకున్న విద్యార్థి కూడా మీలాగే బిత్తరపోయాడు. చివరికి అసలు తెలిసి ఖంగుతిన్నాడు. అసలేం జరిగిందంటే.. దర్బంగా జిల్లాకు చెందిన లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం (బీఏ ఆనర్స్) చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో 100కు 151 మార్కులు వచ్చాయి. రిజల్ట్స్‌ను చూసి షాక్ అయినట్లు విద్యార్థి తెలిపారు. తను మాట్లాడుతూ.. మార్కులు చూసి ఆశ్చర్యపోయానని ఇది తాత్కాలిక మార్కు షీట్ అయినప్పటికీ, ఫలితాలు విడుదల చేయడానికి ముందు అధికారులు దానిని తనిఖీ చేయాలి కదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదవండి: కర్ణాటక: తేనె రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు ఇదిలా ఉండగా బీకామ్ చదవుతున్న మరో విద్యార్థికి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ పేపర్లో సున్నా మార్కులు వచ్చాయి. అయినా అతన్ని తదుపరి క్లాస్‌కు ప్రమోట్ చేశారు. కాగా మార్కుల విషయంపై యూనివర్సిటీ స్పందించింది. టైపింగ్ మిస్టేక్ కారణంగా ఇద్దరికి మార్కులు తప్పుగా పడ్డాయని పొరపాటు జరిగినట్లు తెలిపింది. రెండు మార్క్ షీట్లలో పొరపాట్లు జరిగాయని, వాటిని సరిచేసి మళ్లీ కొత్త ప్రొవిజినల్ సర్టిఫికెట్లుజారీ చేసినట్లు చేసినట్లు వివరణ ఇచ్చింది. -
ఏపీ: టెన్త్ మార్కుల మెమోలు విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం పదో తరగతి ఫలితాలు, మార్కుల మెమోలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేడ్లు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారని, హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా.. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు కేటాయించామని తెలిపారు. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి గ్రేడ్లు ప్రకటించామన్నారు. ఏ విద్యార్థికీ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని, భవిష్యత్‌లో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 2020-21 ఫలితాలు, గ్రేడ్లతో పాటు 2019-20 గ్రేడ్లు కూడా ప్రకటించారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి : https://www.sakshieducation.com/Results2021/Andhra-Pradesh/SSC/2021/ap-ssc-10th-class-results-2021.html కాగా, గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇచ్చారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరించారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇచ్చారు. -
రేపు సాయంత్రం ఏపీ పదో తరగతి ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదల కానున్నాయి. ఎస్సెస్సి బోర్డు మార్క్స్ మెమోలను కూడా రేపే విడుదల చేయనుంది. 2020–21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్లతోపాటు 2019–20 టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు కూడా ప్రకటించనుంది. కోవిడ్ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే జీవో 46ను విడుదల చేసింది. ఫలితాలను గణించడానికి అనుసరించనున్న విధివిధానాలను అందులో వివరించింది. గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించనున్నారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరిస్తారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇస్తారు. -
టెన్త్ విద్యార్థులకు నేరుగా మెమోలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నేరుగా మెమోలను పంపించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఇటీవల ఆ పరీక్షలను రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థులందరినీ పాస్ చేసింది కూడా. అయితే ఇక విద్యార్థులకు వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే మిగిలింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరీక్షల విభాగం విద్యార్థుల ఇంటర్నల్ మార్కులు, వారికి సంబంధించిన వివరాల క్రోడీకరణ పనిని చేపట్టింది. ఇపుడు ఎంతమంది పాస్ అయ్యారు?, ఎంతమంది ఫెయిల్ అయ్యారనేది లేదు. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులంతా పాస్ కాబట్టి వారికి మెమోలు జారీచేసే ప్రక్రియపైనే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫలితాల ప్రకటన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. లక్షన్నర మందికి 10/10 జీపీఏ! రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో జరగాల్సిన పరీక్షలకు 5,34,903 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇపుడు వారంతా పాస్ కాబట్టి వారికి ఇంటర్నల్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే మిగిలింది. ప్రతి సబ్జెక్టులో 20 ఇంటర్నల్ మార్కులకు ఎన్ని వచ్చాయో వాటిని ఐదింతలుచేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్, మొత్తంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఇవ్వడమే ప్రధానం. అందుకోసం పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. అవసరమైతే జీపీఏ వారీగా వివరాలను పది రోజుల్లోగా వెబ్సైట్లో పొందుపరిచేందుకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. దాంతోపాటే విద్యార్థులకు నేరుగా మెమోలు పంపించేలా చర్యలు చేపట్టింది. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం పది పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో దాదాపు లక్షన్నర మందికి 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన వారిలో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులే దాదాపు 3.75 లక్షల మంది వరకు ఉన్నారు. వారిలో లక్షన్నర మంది విద్యార్థులకు యాజమాన్యాలు ఇంటర్నల్ మా ర్కులను 20కి 20 వేసినట్లు సమాచారం. వారందరికీ 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ లేదు.. ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ లేదు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్‌చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఫెయిలయ్యే విద్యార్థులు లేనట్లే. అందుకే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహణ ఉండదని విద్యాశాఖ చెబుతోంది. -
నవ్యకు తెలుగులో 99 మార్కులు
జన్నారం (ఖానాపూర్): తెలుగులో సున్నా మార్కులు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన విద్యార్థిని జి. నవ్యకు న్యాయం జరిగింది. ఈ నెల 21న ‘సాక్షి’మెయిన్‌లో ‘ఫస్ట్ ఇయర్లో టాప్–సెకం డియర్‌లో ఫెయిల్ ’శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పేపర్ రీవాల్యుయేషన్ చేయగా నవ్యకు తెలుగులో 99 మార్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కుల మెమోను వాట్సాప్ ద్వారా కరిమల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌కు పంపారు. ఈ విషయంపై డీఐఈవో ఇంద్రాణిని ఫోన్లో సంప్రదించగా, దీనిపై ఏవో రమేశ్‌ను విషయం కనుక్కోవాలని నేరుగా ఇంటర్ బోర్డుకు పంపినట్లు తెలిపారు. పేపర్ రీవాల్యుయేషన్ చేయించగా నవ్యకు తెలుగులో 99 మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీంతో నవ్యకు మొత్తం సబ్జెక్టుల్లో కలిపి 924 మార్కులు వచ్చాయి. విషయం తెలుసుకున్న నవ్య సంతోషం వ్యక్తం చేసింది. -
ఒకేదాంట్లో సీబీఎస్ఈ టెన్త్ సర్టిఫికెట్, మార్క్స్
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి పాసైన విద్యార్థులకు సర్టి ఫికెట్, మార్కుల మెమో ఇకపై వేర్వేరుగా ఉండవు. ఈ ఏడాది నుంచి ఈ రెంటింటిని కలిపి ఒక్కటిగానే ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్ఈ పరీక్షల కమిటీ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ‘2019 సంవత్సరం నుంచి సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్‌కు ఒక్కటే సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో ధ్రువీకరణ పత్రంతోపాటు మార్కుల వివరాలుంటాయి’ అని ఓ అధికారి చెప్పారు. 12వ తరగతికి మాత్రం పరీక్ష ధ్రువీకరణ, మార్కుల షీట్లు వేరుగా ఉంటాయి. ఒక వేళ విద్యార్ధి ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాస్తే..అందులో సంపాదించిన మార్కుల వివరాలతో ప్రత్యేక ధ్రువీకరణ ఉంటుంది. -
35 కి 38 మార్కులు.. ఎలా వచ్చాయంటే...
పాట్నా : బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు మరోసారి వివాదంలో పడింది. టాపర్స్ స్కాం చోటు చేసుకున్న రెండేళ్ల అనంతరం, మరో స్కాం వెలుగులోకి వచ్చింది. కొంతమంది క్లాస్ 12 విద్యార్థులకు మొత్తం(టోటల్) మార్కుల కంటే అత్యధికంగా వేసినట్టు తెలిసింది. కొంతమంది విద్యార్థులకైతే, ఏకంగా ఎగ్జామ్‌కు హాజరు కాకపోయినా.. మార్కులు వేశారు. అర్వాల్ జిల్లాకు చెందిన భీమ్ కుమార్ అనే విద్యార్థి... మ్యాథమేటిక్స్ థియరీలో మొత్తం(టోటల్) 35 మార్కులకు 38 మార్కులు పొందాడు. అదేవిధంగా అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లో కూడా తనకు 35కు 37 మార్కులు వచ్చినట్టు ఆ విద్యార్థి చెప్పాడు. మార్కులు చూసుకుని తాను చాలా ఆశ్చర్యానికి గురయ్యాయనని, ఇలాంటి ఘటనలు కేవలం స్టేట్ బోర్డు ఎగ్జామ్స్‌లో మాత్రమే జరుగుతాయని పేర్కొన్నాడు. భీమ్ కుమార్‌తో పాటు సందీప్ రాజ్‌కు కూడా ఇదే విధంగా ఆశ్చర్యకరమైన మార్కులు వచ్చినట్టు తెలిసింది. ఫిజిక్స్ థియరీ పేపర్లో తనకు 35 మార్కులు గాను, 38 మార్కులు వేసినట్టు చెప్పాడు. ‘ఇది ఎలా సాధ్యమవుతుంది. ఇంగ్లీష్, రాష్ట్ర భాషలో అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లో నాకు జీరో మార్కులు వచ్చాయి’ అని అన్నాడు. రాహుల్ అనే మరో విద్యార్థికి కూడా మ్యాథమేటిక్స్‌లో అబ్జెక్టివ్ పేపర్లో 35 మార్కులకు 40 మార్కులు వేశారని తెలిసింది. మరికొంత మంది విద్యార్థులు తాము కనీసం పరీక్షకు హాజరుకాకపోయినా.. ఆ సబ్జెట్లలో మార్కులు వచ్చినట్టు చెబుతున్నారు. ఇలా తప్పులుతడకలుగా మార్కులు వేసి, బిహార్ ఎగ్జామినేషన్ బోర్డు మరోసారి బజారు పాలైంది. -
నకిలీ మార్కుల మెమోల సూత్రధారులెవరు?
రంగారెడ్డి : నకిలీ మార్కులతో ఉద్యోగాలు పొందిన విషయాన్ని నిగ్గు తేల్చి.. వారికిని శాశ్వతంగా విధులనుంచి తొలగించిన యంత్రాంగం తాజాగా మార్కుల మెమోలు ఎలా వచ్చాయనే కోణంపై దృష్టి సారించింది. ఏడాదిన్నర క్రితం వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపట్టిన బ్యాక్లాగ్ పోస్టులను కొందరు అక్రమార్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన జిల్లా యంత్రాంగం.. ఏకంగా 13 మందిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. అనంతరం వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేసింది. తాజాగా వారికి నకిలీ మార్కుల సర్టిఫికెట్లు ఎవరు జారీ చేశారు... అవి ఎక్కడ్నుంచి వచ్చాయి.. ఈ భాగోతంలో ప్రధాన సూత్రదారులు ఎవరనే కోణంలో జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది. నలుగురు టీచర్లపై అనుమానాలు.. నకిలీ సర్టిఫికెట్లు వచ్చిన తీరుపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నలుగురు అధికారులతో విచారణ ప్రక్రియకు ఆదేశించింది. ఈ క్రమంలో సర్టిఫికెట్లు జారీ అయిన పాఠశాలలపై నిఘా పెట్టారు. మరోవైపు అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం విచారణను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా అధికారులకు కీలక ఆధారాలు దొరికినట్లు తెలిసింది. నకిలీ మార్కుల సర్టిఫికెట్ల విషయంలో నలుగురు టీచర్ల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో ముగ్గురు హయత్‌నగర్ మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తుండగా.. మరో టీచరు ఇబ్రహీంపట్నంలోని ఓ జెడ్పీ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇప్పటికే వీరిపై నిఘా పెట్టిన అధికారులు.. వారి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఈ సర్టిఫికెట్ల తయారీలో ఇతర శాఖలకు చెందిన ఇద్దరు ఉద్యోగులు సైతం ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా విచారణ ప్రక్రియను లోతుగా చేపట్టిన అధికారులు త్వరలో సూత్రదారులను తేల్చనున్నారు. ఇదిలావుండగా.. అక్రమంగా ఉద్యోగాలు పొందిన 13 మందిని ఇప్పటికే టర్మినేట్ చేసిన యంత్రాంగం.. తాజాగా వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేసింది. ఈ కేసుల విచారణ ఉన్నతస్థాయిలో సాగుతోంది. రెండ్రోజుల క్రితం వీరిని పోలిస్ కంట్రోల్ రూమ్‌కు పిలిపించి విచారణ చేపట్టిన అధికారులు.. కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. మొత్తంగా ఉద్యోగాలనుంచి టర్మినేట్ చేసినప్పటికీ వారిపై ఉచ్చుమాత్రం మరింత బిగుస్తోంది.