‘డిజి లాకర్‌’లో ఇంటర్‌ సర్టిఫికెట్లు | andhra pradesh :Intermediate Digi Locker marks memos will be issued by October 10 | Sakshi
Sakshi News home page

‘డిజి లాకర్‌’లో ఇంటర్‌ సర్టిఫికెట్లు

Published Sun, Oct 8 2023 5:56 AM | Last Updated on Sun, Oct 8 2023 5:56 AM

andhra pradesh :Intermediate Digi Locker marks memos will be issued by October 10 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్‌ పాసైన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను సులభంగా పొందే వెసులుబాటును ఇంటర్మిడియట్‌ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల పాస్‌ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వలెన్సీ, జెన్యూన్‌నెస్‌ సర్టిఫికెట్లు ఎప్పుడు, ఎక్కడ కావాలన్నా తీసుకునేలా ‘డిజి లాకర్‌’ (https://digilocker.gov.in)లో ఉంచింది. అందుకోసం రాష్ట్ర విద్యా సంబంధ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫారమైన జ్ఞానభూమిని డిజిలాకర్‌కు అనుసంధానించింది. ఇప్పటికే 1.14 కోట్ల మంది టెన్త్‌ సర్టిఫికెట్లను ప్రభుత్వం డిజి లాకర్‌లో ఉంచింది. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఇంటర్మిడియట్‌ పూర్తిచేసిన 45.53 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచింది.

ఉమ్మడి రాష్ట్రంలో పాసైన (2014కు ముందు) ఏపీ విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం మరికొద్ది రోజుల్లో డిజి లాకర్‌లో ఉంచనుంది. కేవలం రెండు నెలల్లోనే లక్షలమంది సర్టిఫికెట్లను డిజిటలైజేషన్‌ చేసి, డిజి లాకర్‌లో ఉంచడం దేశ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. అంతే కాకుండా సర్టిఫికెట్లలో తప్పు పడిన పేరు సరిదిద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విద్యార్థులు పొందవచ్చు.

ఐఐటీ, నీట్‌తో పాటు అనేక జాతీయ స్థాయి ఎంట్రన్స్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే చాలా మంది విద్యార్థులు డిజి లాకర్‌లో ధ్రువపత్రాలు పొందుతున్నారు. ఇకపై ఇంటర్మిడియట్‌ (+2) పూర్తి చేసిన వారి సర్టిఫికెట్లను బోర్డుకు చెందిన జ్ఞానభూమి ద్వారా డిజి లాకర్‌లో పొందవచ్చు. డిజిటల్‌ సర్టిఫికెట్లను దేశ, విదేశాల్లోని యూనివర్సిటీలు, జేఈఈ, నీట్‌ కాలేజీలు కూడా అంగీకరించడంతో ఇకపై విద్యార్థులకు డూప్లికేట్‌ సర్టిఫికెట్ల అవసరం ఉండదు. 

ఎప్పుడైనా సర్టిఫికెట్లు పొందే అవకాశం
ఇప్పటిదాకా ఏ కారణం చేతనైనా సర్టిఫికెట్లు పోగొ­ట్టుకుని నకళ్లు (డూప్లికేట్‌) పొందడం పెద్ద ప్రహసనం. ముందుగా సర్టిఫికెట్‌ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమో­దు చేసి, దర్యాప్తు చేసి, అది దొరకలేదని ఎన్‌వోసీ ఇస్తారు. ఇందుకు కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాత నోటరీ చేసిన అఫిడవిట్‌తో సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకుంటే మరో నెల, రెండు నెలల తర్వాత డూప్లికేట్‌ సర్టిఫికెట్‌ వస్తుంది. ఇంత సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ డిజి లాకర్‌తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు వెంటనే సర్టిఫికెట్‌ పొందవచ్చు. 

టెన్త్‌ సర్టిఫికెట్‌ తీసుకోవచ్చు ఇలా..
2004 నుంచి 2023 వరకు పదో తరగతి పాసైన విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం పాఠశాల విద్యాశాఖ డిజి లాకర్‌లో ఉంచింది. ఇందులో 2008, 2009, 2010, 2011 విద్యా సంవత్సరాల సర్టిఫికెట్లను మరో పది రోజుల్లో డిజి లాకర్‌లో ఉంచనుంది.  విద్యార్థులు తమ పాస్‌ మెమోల కోసం డిజి లాకర్‌ యాప్‌లో మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ అవ్వాలి. అనంతరం ‘క్లాస్‌  గీ మార్క్‌షీట్‌’ ఓపెన్‌ చేస్తే, వివిధ రాష్ట్రాల ఎస్సెస్సీ బోర్డుల ఐకాన్స్‌ కనిపిస్తాయి. వీటిలో ‘సూ్కల్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఆంధ్రప్రదేశ్‌’పై క్లిక్‌ చేసి, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌తో సైన్‌ ఇన్‌ అయ్యి సర్టిఫికెట్‌ను పొందవచ్చు.

సర్టిఫికెట్‌ ఇలా పొందవచ్చు
మొబైల్‌ ఫోన్‌లోని డిజి లాకర్‌ యాప్‌ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా మార్క్స్‌ మెమో, మైగ్రేషన్‌ సర్టిఫికెట్, ఈక్వెలెన్స్‌ సర్టిఫికెట్, అర్హత సర్టిఫికెట్‌ పొందవచ్చు. అభ్యర్థులు వారి మొబైల్‌ ఫోన్‌లో డిజి లాకర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ అవ్వాలి. అనంతరం ఫోన్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌తో  https://digilocker.gov.in లో లాగిన్‌ చేయాలి. వారి రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని నిర్ణీత బాక్స్‌లో నింపి సబ్‌మిట్‌ చేస్తే లాకర్‌ ఓపెన్‌ అవుతుంది.

ఇక్కడ వివిధ రాష్ట్రాల ఐకాన్స్‌ ఉంటాయి, వాటిలో ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ చేస్తే అందులో ‘క్లాస్‌  గీఐఐ’ ఓపెన్‌ చేస్తే ‘బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మిడియట్‌ ఎడ్యుకేషన్‌’ బ్యానర్‌ కనిపిస్తుంది. ఇందులోకి ఎంటర్‌ అయ్యి ఎవరికి ఏ సర్టిఫికెట్‌ కావాలంటే దానిపై ‘క్లిక్‌’ చేయాలి. రోల్‌ నంబర్‌/ రిజిస్ట్రేషన్‌ నంబర్, పూర్తయిన సంవత్సరం వంటి వివరాలు నమోదు చేసి వారి సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement