issuance of certificates
-
‘డిజి లాకర్’లో ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ పాసైన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను సులభంగా పొందే వెసులుబాటును ఇంటర్మిడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల పాస్ సర్టిఫికెట్, మైగ్రేషన్, ఈక్వలెన్సీ, జెన్యూన్‌నెస్ సర్టిఫికెట్లు ఎప్పుడు, ఎక్కడ కావాలన్నా తీసుకునేలా ‘డిజి లాకర్’ (https://digilocker.gov.in)లో ఉంచింది. అందుకోసం రాష్ట్ర విద్యా సంబంధ ఆన్లైన్ ఫ్లాట్ఫారమైన జ్ఞానభూమిని డిజిలాకర్‌కు అనుసంధానించింది. ఇప్పటికే 1.14 కోట్ల మంది టెన్త్ సర్టిఫికెట్లను ప్రభుత్వం డిజి లాకర్లో ఉంచింది. ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు ఇంటర్మిడియట్ పూర్తిచేసిన 45.53 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచింది. ఉమ్మడి రాష్ట్రంలో పాసైన (2014కు ముందు) ఏపీ విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం మరికొద్ది రోజుల్లో డిజి లాకర్లో ఉంచనుంది. కేవలం రెండు నెలల్లోనే లక్షలమంది సర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేసి, డిజి లాకర్లో ఉంచడం దేశ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. అంతే కాకుండా సర్టిఫికెట్లలో తప్పు పడిన పేరు సరిదిద్దేందుకు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీలను సవరించడం వంటి ఇతర సేవలను కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు. ఐఐటీ, నీట్‌తో పాటు అనేక జాతీయ స్థాయి ఎంట్రన్స్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే చాలా మంది విద్యార్థులు డిజి లాకర్లో ధ్రువపత్రాలు పొందుతున్నారు. ఇకపై ఇంటర్మిడియట్ (+2) పూర్తి చేసిన వారి సర్టిఫికెట్లను బోర్డుకు చెందిన జ్ఞానభూమి ద్వారా డిజి లాకర్లో పొందవచ్చు. డిజిటల్ సర్టిఫికెట్లను దేశ, విదేశాల్లోని యూనివర్సిటీలు, జేఈఈ, నీట్ కాలేజీలు కూడా అంగీకరించడంతో ఇకపై విద్యార్థులకు డూప్లికేట్ సర్టిఫికెట్ల అవసరం ఉండదు. ఎప్పుడైనా సర్టిఫికెట్లు పొందే అవకాశం ఇప్పటిదాకా ఏ కారణం చేతనైనా సర్టిఫికెట్లు పోగొట్టుకుని నకళ్లు (డూప్లికేట్) పొందడం పెద్ద ప్రహసనం. ముందుగా సర్టిఫికెట్ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేసి, అది దొరకలేదని ఎన్వోసీ ఇస్తారు. ఇందుకు కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాత నోటరీ చేసిన అఫిడవిట్‌తో సంబంధిత కళాశాలలో దరఖాస్తు చేసుకుంటే మరో నెల, రెండు నెలల తర్వాత డూప్లికేట్ సర్టిఫికెట్ వస్తుంది. ఇంత సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ డిజి లాకర్‌తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు వెంటనే సర్టిఫికెట్ పొందవచ్చు. టెన్త్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఇలా.. 2004 నుంచి 2023 వరకు పదో తరగతి పాసైన విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం పాఠశాల విద్యాశాఖ డిజి లాకర్లో ఉంచింది. ఇందులో 2008, 2009, 2010, 2011 విద్యా సంవత్సరాల సర్టిఫికెట్లను మరో పది రోజుల్లో డిజి లాకర్లో ఉంచనుంది. విద్యార్థులు తమ పాస్ మెమోల కోసం డిజి లాకర్ యాప్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వాలి. అనంతరం ‘క్లాస్ గీ మార్క్‌షీట్’ ఓపెన్ చేస్తే, వివిధ రాష్ట్రాల ఎస్సెస్సీ బోర్డుల ఐకాన్స్ కనిపిస్తాయి. వీటిలో ‘సూ్కల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్’పై క్లిక్ చేసి, రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ అయ్యి సర్టిఫికెట్‌ను పొందవచ్చు. సర్టిఫికెట్ ఇలా పొందవచ్చు మొబైల్ ఫోన్లోని డిజి లాకర్ యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా మార్క్స్ మెమో, మైగ్రేషన్ సర్టిఫికెట్, ఈక్వెలెన్స్ సర్టిఫికెట్, అర్హత సర్టిఫికెట్ పొందవచ్చు. అభ్యర్థులు వారి మొబైల్ ఫోన్లో డిజి లాకర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి. అనంతరం ఫోన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌తో https://digilocker.gov.in లో లాగిన్ చేయాలి. వారి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నిర్ణీత బాక్స్‌లో నింపి సబ్మిట్ చేస్తే లాకర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వివిధ రాష్ట్రాల ఐకాన్స్ ఉంటాయి, వాటిలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేస్తే అందులో ‘క్లాస్ గీఐఐ’ ఓపెన్ చేస్తే ‘బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఎడ్యుకేషన్’ బ్యానర్ కనిపిస్తుంది. ఇందులోకి ఎంటర్ అయ్యి ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలంటే దానిపై ‘క్లిక్’ చేయాలి. రోల్ నంబర్/ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తయిన సంవత్సరం వంటి వివరాలు నమోదు చేసి వారి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఇన్వెస్ట్మెంట్ సలహాదారులకు సెబీ చెక్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్లు(ఐఏలు), రీసెర్చ్ ఎనలిస్టు(ఆర్ఏ)లకు ప్రకటనల కోడ్ ను జారీ చేసింది. దీంతో ఇకపై తమ ప్రకటనల్లో.. నంబర్ వన్, టాప్ సలహాదారులు, టాప్ రీసెర్చ్ విశ్లేషకులు, లీడింగ్ సంస్థ వంటి అత్యుక్తులను వినియోగించేందుకు వీలుండదు. తమ ప్రకటనల్లో ఇకపై ఇలాంటి పదాలను నిషేధిస్తూ సెబీ అడ్వర్టయిజ్మెంట్ కోడ్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా క్లిష్టమైన భాషను సైతం వాడేందుకు అనుమతించరు. అయితే ఏదైనా అవార్డులవంటివి పొంది తే వీటి వివరాలు పొందుపరచేందుకు అవకాశముంటుంది. ఇందుకు సర్క్యులర్‌ను జారీ చేసింది. మే 1నుంచి అమలుకానున్న తాజా నిబంధనల ద్వారా ఐఏ, ఆర్ఏల నిబంధనలు మరింత పటిష్టంకానున్నాయి. అనుభవం, అవగాహనలేని ఇన్వెస్టర్ల ను తప్పుదారి పట్టించే అంచనాలు, స్టేట్మెంట్లు వంటివి ప్రకటనల్లో వినియోగించకూడదు. ఇదేవిధంగా రాబడి(రిటర్న్) హామీలను ఇవ్వడానికి వీ లుండదు. ఐఏలు, ఆర్ఏల గత పనితీరును సైతం ప్రస్తావించేందుకు అనుమతించరు. సెబీ లోగోను వినియోగించరాదు. ఐఏ లేదా ఆర్ఏ జారీ చేసే ప్రకటనల్లో వాళ్ల పేర్లు, లోగో, కార్యాలయ చిరునామా, రిజిస్ట్రేషన్ సంఖ్యలు వెల్లడించవలసి ఉంటుంది. సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. పెట్టుబడులు చేపట్టే ముందు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి అంటూ ప్రా మాణిక హెచ్చరికను జారీ చేయవలసి ఉంటుంది. -
పాట్లు లేకుండా సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ప్రజలకు అవసరమైన కీలక సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. సర్టిఫికెట్ల కోసం ఎవరూ రెవెన్యూ కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా జారీ చేసేలా చర్యలు చేపట్టింది. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండేందుకు ప్రధాన కారణాలను గుర్తించి వేగంగా సర్టిఫికెట్లు జారీ చేసేలా కొత్త మార్గదర్శకాలు వెలువరించింది. సరైన కారణాలు లేకుండా ఏ దరఖాస్తునూ తిరస్కరించరాదని స్పష్టం చేసింది. ధృవపత్రాలు సులభంగా ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించింది. సర్టిఫికెట్ల జారీ రెవెన్యూ శాఖ ముఖ్య విధుల్లో ఒకటని పేర్కొంటూ గ్రామ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ఈ మార్గదర్శకాలను పాటించాలని నిర్దేశించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. దరఖాస్తు సమయంలోనే అన్నీ.. సర్టిఫికెట్ల జారీకి దరఖాస్తులను స్వీకరించే గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రం, ఆన్లైన్ వెబ్అప్లికేషన్, కాల్ సెంటర్ లాంటి వ్యవస్థలన్నీ ఈ మార్గదర్శకాల ప్రకారమే పని చేయాలి. దరఖాస్తు స్వీకరించే సమయంలోనే అర్జీదారుడికి సంబంధించిన బయోమెట్రిక్ గుర్తింపు సహా అన్ని వివరాలను తప్పనిసరిగా తీసుకుని అనుమతి ప్రక్రియ పూర్తి కాగానే అందులో ఇచ్చిన చిరునామాకు సర్టిఫికెట్ పంపాలి. ర్యాండమ్‌గా తనిఖీలు... తిరస్కరించిన అర్జీల్లో 25 శాతం, అనుమతి ఇచ్చిన వాటిల్లో 5 శాతం అర్జీలను తహశీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లు తనిఖీ చేయాలి. ప్రతి వారం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కొన్ని తిరస్కరించిన అర్జీలను పరిశీలించి కారణాలను సమీక్షించాలి. తిరస్కరణకు సరైన కారణాలు ఉన్నాయా? నిర్దేశించిన ప్రకారమే తిరస్కరించారా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించాలి. సులభంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ కుటుంబ పెద్ద గతంలోనే సర్టిఫికెట్ పొంది ఉంటే అప్పటికప్పుడు జారీ చేయాలి. హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు తీసుకుంటారు కాబట్టి వారందరి స్టేట్మెంట్లు రికార్డు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒక కుటుంబ సభ్యుడు అందుబాటులో లేరనే కారణంతో దరఖాస్తును తిరస్కరించకూడదు. ఒక ఫ్యామిలీ కింద మరొకరు ఎవరైనా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన సందర్భాల్లో ఆ యజమాని చుట్టుపక్కల వారు, గ్రామ పెద్దల స్టేట్మెంట్లను రికార్డు చేయడం తప్పనిసరి. టెన్త్ సర్టిఫికెట్‌ను బట్టి... ఆలస్యంగా పుట్టిన తేదీ కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లో పదో తరగతి సర్టిఫికెట్ ఆధారంగా జన్మదిన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. పాస్‌పోర్ట్ కోసం దర ఖాస్తు చేసుకున్నప్పుడు అనుమతించే 13 గుర్తింపు పత్రాల్లో ఏది చూపినా ఎలాంటి తదుపరి విచారణ లేకుండా ఈ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఆలస్యంగా మరణ ధ్రువీకరణకు నమోదు చేసుకున్నప్పుడు అంత్యక్రియల సర్టిఫికెట్తో పాటు గ్రామ పెద్దలు, సంబంధిత ఇంటి యజమాని చుట్టుపక్కల వారిని విచారించాలి. ఐదేళ్ల తర్వాత జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను కోరే ప్రతి కేసులోనూ ఈ విధానం పాటించాలి. గతంలో తీసుకుంటే వెంటనే.. ఇంటిగ్రేటేడ్ సర్టిఫికెట్ (కమ్యూనిటీ, నేటివిటీ, పుట్టిన తేదీ) గతంలో జారీ అయి ఉంటే ప్రస్తుత తహశీల్దార్ డిజిటల్ సంతకం, ప్రస్తుత తేదీతో మళ్లీ వెంటనే జారీ చేయాలి. హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో ఉన్న ఏ వ్యక్తికైనా గ్రామ సచివాలయాల స్థాయిలో వీఆర్వో గుర్తింపుతో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్‌ను కేటగిరీ ‘ఏ’ సర్వీసు కింద (అక్కడికక్కడే) జారీ చేయవచ్చు. దరఖాస్తుదారుడి తండ్రి గతంలోధ్రువీకరణ పత్రం పొంది ఉంటే వెంటనే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. పుట్టిన తేదీ సర్టిఫికెట్ జారీలోనూ ఇదే విధానం పాటించాలి. దరఖాస్తు చేసిన 8 రోజుల్లోగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ జారీ చేయాలి. తెల్లకార్డుదారులకు.. ఐదేళ్ల క్రితం ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ పొందినవారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అప్పటికప్పుడే ఇవ్వాలి. గడువు సమయం దాటితే కొత్త సర్టిఫికెట్ జారీ చేయాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న సంవత్సరానికి రూ.లక్ష ఆదాయం ఉన్న తెల్లకార్డుదారులంతా ఆటోమేటిక్‌గా ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు పొందవచ్చు. కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి 10 రోజుల్లో ఇవ్వాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను తిరస్కరించకూడదు. -
సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేస్తే చర్యలు: వీసీ
ఎస్కేయూ : విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని ఎస్కేయూ వీసీ కె.రాజగోపాల్ పరీక్షల విభాగం ఉద్యోగులను హెచ్చరించారు. ప్రొవిజినల్ సర్టిఫికెట్ అందజేసేందుకు ఆ విభాగం ఉద్యోగి డబ్బు డిమాండ్ చేశారని ఓ విద్యార్థిని వర్సిటీ అధి కారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన వీసీ, రెక్టార్ హెచ్.లజిపతిరాయ్ ఆకస్మిక తనిఖీ చేశారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యమెందుకని ప్రశ్నించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష¯Œన్ సూర్యనారాయణ, డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రకాష్ పాల్గొన్నారు.