సాక్షి, అమరావతి: ప్రజలకు అవసరమైన కీలక సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. సర్టిఫికెట్ల కోసం ఎవరూ రెవెన్యూ కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా జారీ చేసేలా చర్యలు చేపట్టింది. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండేందుకు ప్రధాన కారణాలను గుర్తించి వేగంగా సర్టిఫికెట్లు జారీ చేసేలా కొత్త మార్గదర్శకాలు వెలువరించింది. సరైన కారణాలు లేకుండా ఏ దరఖాస్తునూ తిరస్కరించరాదని స్పష్టం చేసింది. ధృవపత్రాలు సులభంగా ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించింది. సర్టిఫికెట్ల జారీ రెవెన్యూ శాఖ ముఖ్య విధుల్లో ఒకటని పేర్కొంటూ గ్రామ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ఈ మార్గదర్శకాలను పాటించాలని నిర్దేశించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు.
దరఖాస్తు సమయంలోనే అన్నీ..
సర్టిఫికెట్ల జారీకి దరఖాస్తులను స్వీకరించే గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రం, ఆన్‌లైన్ వెబ్‌అప్లికేషన్, కాల్ సెంటర్ లాంటి వ్యవస్థలన్నీ ఈ మార్గదర్శకాల ప్రకారమే పని చేయాలి. దరఖాస్తు స్వీకరించే సమయంలోనే అర్జీదారుడికి సంబంధించిన బయోమెట్రిక్ గుర్తింపు సహా అన్ని వివరాలను తప్పనిసరిగా తీసుకుని అనుమతి ప్రక్రియ పూర్తి కాగానే అందులో ఇచ్చిన చిరునామాకు సర్టిఫికెట్ పంపాలి.
ర్యాండమ్‌గా తనిఖీలు...
తిరస్కరించిన అర్జీల్లో 25 శాతం, అనుమతి ఇచ్చిన వాటిల్లో 5 శాతం అర్జీలను తహశీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లు తనిఖీ చేయాలి. ప్రతి వారం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కొన్ని తిరస్కరించిన అర్జీలను పరిశీలించి కారణాలను సమీక్షించాలి. తిరస్కరణకు సరైన కారణాలు ఉన్నాయా? నిర్దేశించిన ప్రకారమే తిరస్కరించారా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించాలి.
సులభంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ కుటుంబ పెద్ద గతంలోనే సర్టిఫికెట్ పొంది ఉంటే అప్పటికప్పుడు జారీ చేయాలి. హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు తీసుకుంటారు కాబట్టి వారందరి స్టేట్‌మెంట్లు రికార్డు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒక కుటుంబ సభ్యుడు అందుబాటులో లేరనే కారణంతో దరఖాస్తును తిరస్కరించకూడదు. ఒక ఫ్యామిలీ కింద మరొకరు ఎవరైనా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన సందర్భాల్లో ఆ యజమాని చుట్టుపక్కల వారు, గ్రామ పెద్దల స్టేట్‌మెంట్లను రికార్డు చేయడం తప్పనిసరి.
టెన్త్ సర్టిఫికెట్‌ను బట్టి...
ఆలస్యంగా పుట్టిన తేదీ కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లో పదో తరగతి సర్టిఫికెట్ ఆధారంగా జన్మదిన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. పాస్‌పోర్ట్ కోసం దర ఖాస్తు చేసుకున్నప్పుడు అనుమతించే 13 గుర్తింపు పత్రాల్లో ఏది చూపినా ఎలాంటి తదుపరి విచారణ లేకుండా ఈ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఆలస్యంగా మరణ ధ్రువీకరణకు నమోదు చేసుకున్నప్పుడు అంత్యక్రియల సర్టిఫికెట్‌తో పాటు గ్రామ పెద్దలు, సంబంధిత ఇంటి యజమాని చుట్టుపక్కల వారిని విచారించాలి. ఐదేళ్ల తర్వాత జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను కోరే ప్రతి కేసులోనూ ఈ విధానం పాటించాలి.
గతంలో తీసుకుంటే వెంటనే..
ఇంటిగ్రేటేడ్ సర్టిఫికెట్ (కమ్యూనిటీ, నేటివిటీ, పుట్టిన తేదీ) గతంలో జారీ అయి ఉంటే ప్రస్తుత తహశీల్దార్ డిజిటల్ సంతకం, ప్రస్తుత తేదీతో మళ్లీ వెంటనే జారీ చేయాలి. హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో ఉన్న ఏ వ్యక్తికైనా గ్రామ సచివాలయాల స్థాయిలో వీఆర్‌వో గుర్తింపుతో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్‌ను కేటగిరీ ‘ఏ’ సర్వీసు కింద (అక్కడికక్కడే) జారీ చేయవచ్చు. దరఖాస్తుదారుడి తండ్రి గతంలోధ్రువీకరణ పత్రం పొంది ఉంటే వెంటనే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. పుట్టిన తేదీ సర్టిఫికెట్ జారీలోనూ ఇదే విధానం పాటించాలి. దరఖాస్తు చేసిన 8 రోజుల్లోగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ జారీ చేయాలి.
తెల్లకార్డుదారులకు..
ఐదేళ్ల క్రితం ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ పొందినవారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అప్పటికప్పుడే ఇవ్వాలి. గడువు సమయం దాటితే కొత్త సర్టిఫికెట్ జారీ చేయాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న సంవత్సరానికి రూ.లక్ష ఆదాయం ఉన్న తెల్లకార్డుదారులంతా ఆటోమేటిక్‌గా ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు పొందవచ్చు. కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి 10 రోజుల్లో ఇవ్వాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను తిరస్కరించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment