సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు కొత్త పోస్టుల మంజూరుతో వీఆర్‌ఏల నుంచి తహశీల్దార్ల వరకు పదోన్నతులు దక్కుతున్నాయి. తాజాగా రెవెన్యూ శాఖలో కొత్తగా 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 973 జారీ చేసింది. దీంతో అతి త్వరలో రాష్ట్రంలో 44 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించనుంది.
ఆరు నెలల క్రితం కూడా 63 డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు 63 మంది తహశీల్దార్లు పదోన్నతి పొందారు. వీరంతా ఆయా శాఖల్లో పనిచేస్తున్నారు. అంటే.. 6 నెలల కాలంలోనే ప్రభుత్వం 107 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని మంజూరు చేసింది. పోస్టులను మంజూరు చేయడంతోపాటు పదోన్నతుల అంశంలో ఇదొక రికార్డుని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారుల అవసరం ఎక్కువ ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ల అవసరం ఉందని, వారిని తమకు డిప్యుటేషన్‌పై పంపించాలని వివిధ శాఖలు గత ప్రభుత్వాన్ని కోరాయి. అదే సమయంలో చాలామంది అధికారులు పదవీ విరమణ చేయడంతో డిప్యూటీ కలెక్టర్ల కొరత ఇంకా ఎక్కువైంది. దీంతో రెవెన్యూ శాఖ గత ప్రభుత్వాన్ని పదే పదే కోరడంతో నామమాత్రంగా కొన్ని పోస్టులు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. దీంతో ఆయా శాఖల్లో అవసరాల మేరకు అధికారులు లేక ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఇప్పటివరకు మూడు విడతల్లో మంజూరు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివిధ ప్రభుత్వ శాఖల వినతులను పరిగణనలోకి తీసుకుని ఇప్పటివరకు మూడు విడతల్లో కొత్తగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే మొదట 20, ఈ ఏడాది రెండు విడతలుగా 107 పోస్టుల్ని మంజూరు చేసింది. తాజాగా మంజూరైన 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సంబంధించి సీనియారిటీ జాబితా కూడా సిద్ధమైంది.
త్వరలో దాన్ని విడుదల చేయనున్నారు. ఈసారి 44 మంది (మంజూరైన పోస్టులకి 10 శాతం అదనంగా నియమిస్తారు) తహశీల్దార్లు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందనున్నారు. ఉద్యోగుల సర్వీస్ అంశాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనంత మేలును ఈ ప్రభుత్వం చేసిందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కొనియాడారు.
వేలాది పోస్టుల మంజూరుతోపాటు పదోన్నతులు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విడతల వారీగా 370 తహశీల్దార్ పోస్టులు కొత్తగా మంజూరయ్యాయి. దీంతో అంతే సంఖ్యలో డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. అలాగే వెయ్యి మందికిపైగా సీనియర్ అసిసెంట్లు.. డిప్యూటీ తహశీల్దార్లు అయ్యారు. అదేవిధంగా 670 మంది కంప్యూటర్ అసిస్టెంట్లను రెవెన్యూ శాఖలో కొత్తగా నియమించారు.
సీనియర్ అసిస్టెంట్ల కోసం నిర్వహించిన పదోన్నతుల్లో వీఆర్‌వోలకు 40 శాతం కేటాయించడంతో వేలాది మంది వీఆర్‌వోలకు లబ్ధి చేకూరింది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో 3,600 మంది వీఆర్‌ఏలు వీఆర్‌వోలు అయ్యారు. సర్వే సెటిల్‌మెంట్, భూరికార్డుల శాఖలోనూ 30 ఏళ్ల తర్వాత అవకాశం కల్పించడంతో వందలాది మందికి లబ్ధి కలిగింది. కొత్త పోస్టుల మంజూరు, పదోన్నతుల విషయంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా రెవెన్యూ శాఖను ప్రభుత్వం బలోపేతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment