సాక్షి, అమరావతి: సర్వీస్ ఈనాం భూములపై హక్కులు కల్పించే క్రమంలో అనుసరించాల్సిన విధానాలపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. నిషేధిత జాబితా 22 (ఎ)లో ఉన్న వివిధ కేటగిరీ భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వివరణ ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ తాజాగా మెమో జారీ చేశారు. 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలో దేవాలయాల ఈనాం భూములతోపాటు సర్వీస్ ఈనాం భూములు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి. వాటిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించి లక్షలాది మంది సర్వీస్ ఈనాం రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం మేలు చేయాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో జిల్లాల్లో జరుగుతున్న వెరిఫికేషన్‌లో అధికారులు పలు అంశాలు లేవనెత్తారు. ఈ భూములు 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22(ఎ)లోని 1(ఎ) అసైన్డ్ భూములు, 1(బి)– ప్రభుత్వ పోరంబోకు భూములు, 1(సి)–దేవదాయ, వక్ఫ్ భూములు.. 1(డి)–మిగులు భూములు, సీలింగ్ భూములు, 1(ఈ)– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసక్తి ఉన్న భూములు, చుక్కల భూములు, అనాధీన భూముల కేటగిరీల్లో ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో ఉన్న సర్వీస్ ఈనాం భూముల విషయంలో ఏం చేయాలని పలువురు కలెక్టర్లు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఎ)ను స్పష్టత కోరగా.. వీటిన్నింటిపైనా సీసీఎల్‌ఏ ఈ మెమోలో వివరణ ఇచ్చారు.
వెరిఫికేషన్‌లో తొలగించడానికి ఎంపికైన నిషేధిత జాబితాలోని 22(ఎ)1(ఎ), (బి), (డి) కేటగిరీ భూముల వివరాలను కలెక్టర్లు నేరుగా జిల్లా రిజిస్ట్రార్లకు పంపి తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 22(ఎ)1 (ఈ) కేటగిరీ భూముల వివరాలను ప్రభుత్వానికి పంపాలని, సీసీఎల్‌ఏ ద్వారా ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 22 (ఎ)1(సి) కేటగిరీలోని భూముల దేవదాయ శాఖ కమిషనర్ లేదా వక్ఫ్ బోర్డు సీఈఓకు తగిన నిర్ణయం తీసుకునేందుకు పంపాలని స్పష్టం చేశారు. 22ఎ జాబితాలో చేర్చని ఈ తరహా భూముల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, వాటిని అలాగే ఉంచాలని సూచించారు.
సర్వీస్ ఈనాం భూములపై మరింత స్పష్టత
Published Wed, Oct 11 2023 6:01 AM | Last Updated on Wed, Oct 11 2023 6:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment