inam lands
-
సర్వీస్ ఈనాం భూములపై మరింత స్పష్టత
సాక్షి, అమరావతి: సర్వీస్ ఈనాం భూములపై హక్కులు కల్పించే క్రమంలో అనుసరించాల్సిన విధానాలపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. నిషేధిత జాబితా 22 (ఎ)లో ఉన్న వివిధ కేటగిరీ భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వివరణ ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ తాజాగా మెమో జారీ చేశారు. 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలో దేవాలయాల ఈనాం భూములతోపాటు సర్వీస్ ఈనాం భూములు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి. వాటిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించి లక్షలాది మంది సర్వీస్ ఈనాం రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం మేలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లాల్లో జరుగుతున్న వెరిఫికేషన్‌లో అధికారులు పలు అంశాలు లేవనెత్తారు. ఈ భూములు 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22(ఎ)లోని 1(ఎ) అసైన్డ్ భూములు, 1(బి)– ప్రభుత్వ పోరంబోకు భూములు, 1(సి)–దేవదాయ, వక్ఫ్ భూములు.. 1(డి)–మిగులు భూములు, సీలింగ్ భూములు, 1(ఈ)– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసక్తి ఉన్న భూములు, చుక్కల భూములు, అనాధీన భూముల కేటగిరీల్లో ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో ఉన్న సర్వీస్ ఈనాం భూముల విషయంలో ఏం చేయాలని పలువురు కలెక్టర్లు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఎ)ను స్పష్టత కోరగా.. వీటిన్నింటిపైనా సీసీఎల్ఏ ఈ మెమోలో వివరణ ఇచ్చారు. వెరిఫికేషన్‌లో తొలగించడానికి ఎంపికైన నిషేధిత జాబితాలోని 22(ఎ)1(ఎ), (బి), (డి) కేటగిరీ భూముల వివరాలను కలెక్టర్లు నేరుగా జిల్లా రిజిస్ట్రార్లకు పంపి తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 22(ఎ)1 (ఈ) కేటగిరీ భూముల వివరాలను ప్రభుత్వానికి పంపాలని, సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 22 (ఎ)1(సి) కేటగిరీలోని భూముల దేవదాయ శాఖ కమిషనర్ లేదా వక్ఫ్ బోర్డు సీఈఓకు తగిన నిర్ణయం తీసుకునేందుకు పంపాలని స్పష్టం చేశారు. 22ఎ జాబితాలో చేర్చని ఈ తరహా భూముల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, వాటిని అలాగే ఉంచాలని సూచించారు. -
రెవె'న్యూ' విధానాలతో భూ హక్కు
సాహసోపేత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవిన్యూ సంస్కరణలు, కొత్త కార్యక్రమాలతో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా భూముల విలువ అనూహ్యంగా పెరిగిపోవడంతో పేద రైతుల తల రాత మారిపోతోంది. ఎందుకూ పనికి రావనుకున్న భూములకు సైతం మంచి ధరలు కళ్లెదుటే కనిపిస్తుండటంతో అసైన్డ్ రైతుల పంట పండింది. ‘కొనుగోళ్లు – అమ్మకాలు – రిజిస్ట్రేషన్లు’ చక్రం ద్వారా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ఇకపై మరింతగా ఊపందుకోనున్నాయి. తద్వారా రాష్ట్రంలో సంపద సృష్టి ఏమేరకు జరిగిందన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీటన్నింటికీ తోడు ఇన్నాళ్లూ అనుభవంలో ఉన్నప్పటికీ రికార్డు పరంగా హక్కు లేని భూమికి ఇప్పుడు ‘ఇది నా భూమి’ అని సంతృప్తిగా చెప్పుకునే పరిస్థితిని రైతులకు కలిగించింది. సాక్షి, అమరావతి : వివాదాలు, సమస్యలు, ఎడతెగని జాప్యంతో కునారిల్లిన రెవెన్యూ శాఖను వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో సమూలంగా మార్చేసింది. ఆ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూపింది. సర్టిఫికెట్లు పొందడాన్ని సులభతరం చేయడం దగ్గర నుంచి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన నిషేధిత భూముల చిక్కు ముడులు విప్పడం, సాహసోపేతమైన రీతిలో అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా లక్షలాది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తొలిసారి భూముల రీ సర్వేను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని ప్రాంతాల అభిప్రాయాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఒక కొత్త స్వరూపాన్ని ఇచ్చింది. మొత్తంగా నాలుగేళ్లలో రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న మార్పులు ఇలా ఉన్నాయి. మహా యజ్ఞంలా భూముల రీ సర్వే ► అస్తవ్యస్థంగా మారిన భూముల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సాహసోపేతంగా భూముల రీ సర్వే చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. బ్రిటీష్ కాలం నాటి భూముల రికార్డుల స్థానంలో ఆధునిక డిజిటల్ భూ రికార్డులను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు జరగని విధంగా మొత్తం భూ విస్తీర్ణాన్ని కొలిచే బృహత్తర కార్యక్రమం ఇది. ఇందుకోసం ఏకంగా 14,630 మంది సర్వేయర్లను నియమించడం ఒక రికార్డు. ► రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భూ యజమానులకు స్పష్టమైన హక్కు కల్పించడం, అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా భూముల హద్దులను గుర్తించి.. ఆ భూమికి రక్షణ కల్పించడమే ధ్యేయంగా రీ సర్వే అత్యంత ఆధునిక రీతిలో సాగుతోంది. అత్యంత సంక్లిష్టమైన ఈ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాల్లో అన్ని దశల్లోనూ పూర్తి కాగా, మరో 2 వేల గ్రామాల్లో త్వరలో పూర్తవనుంది. ప్రతి మూడు నెలలకు 2 వేల గ్రామాల చొప్పున సర్వే పూర్తికానుంది. ► సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటి వరకు 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 16.55 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 8.70 లక్షల భూ కమతాలకు సంబంధించి ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు తయారయ్యాయి. రైతులకు శ్రమ లేకుండా, వారి డబ్బు ఖర్చు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎంతో క్లిష్టమైన ఈ పనుల్ని పూర్తి చేసింది. ► ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. తొలిసారి భూముల హద్దులను నిర్ధారించి, భూ రక్ష సర్వే రాళ్లను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి, ఇళ్ల యజమానులకు ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక రాష్ట్రంలోని దళిత వాడలకు శ్మశాన వాటిక సమస్య లేకుండా చేసేందుకు ఆ దిశగా నడుం బిగించింది. శ్మశాన వాటికలు లేని దళిత వాడలను గుర్తించి, వెంటనే ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని 1,700 గ్రామాల్లో 1050.08 ఎకరాల భూమిని శ్మశాన వాటికలకు కేటాయించింది. సుదీర్ఘకాలం తర్వాత భూ పంపిణీ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 23 జిల్లాల్లో 50 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచనున్నారు. 46 వేల మందికి భూములివ్వడానికి ఎంపిక చేయగా, అందులో ఎక్కువ మంది దళితులే. వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులు చేసుకుంటూ జీవించే వారిని ప్రభుత్వం రైతులుగా మార్చనుంది. రాష్ట్రంలో 2013 తర్వాత మళ్లీ భూ పంపిణీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ► అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంతో లక్షలాది మంది దళిత, పేద రైతుల ఆర్థిక స్థితి ఒక్కసారిగా పెరిగిపోయింది. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అసైన్దారులు లేకపోతే వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ► తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని అసైన్డ్ రైతులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత హక్కుదారులు వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించింది. దీనివల్ల తమ భూములపై హక్కులు లేని 15,21,160 మంది పేద దళిత, ఇతర పేద వర్గాల రైతులకు సంబంధించిన 27,41,698 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. ‘ఇక ఇది నా భూమి’ అని ఆ రైతులు గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించింది. ► ఇన్ని లక్షల ఎకరాల లావాదేవీలు మార్కెట్లోకి రావడంతో ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విలువ లేని పేద రైతుల భూమికి విలువ పెంచడంతోపాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. కొత్త జిల్లాల కల సాకారం ► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా, 51 రెవెన్యూ డివిజన్లను 77 డివిజన్లుగా పునర్వ్యవస్థీకరించింది. జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విభజన పూర్తి చేసింది. ► పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్‌ను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసింది. పరిపాలనా వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలతలతోపాటు ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ► ప్రతి జిల్లాకు అక్కడి పరిస్థితులను బట్టి పేరు పెట్టి, ఆయా ప్రాంతాల ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ను విస్మరిస్తే.. ఆయన జన్మించిన కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని నిలబెట్టింది. 1.68 లక్షల సర్వీసు ఈనాం భూములకు విముక్తి గ్రామాల్లో కుల వృత్తుల వారికి ఇచ్చిన ఈనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. 1,68,604 ఎకరాల ఈనాం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నారు. లంక భూములకు డి పట్టాలు అనేక సంవత్సరాలుగా అపరిష్కృత సమస్యగా ఉన్న లంక భూములకు డీకేటీ పట్టాలిస్తున్నారు. 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19,176 మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి. మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతుండడంతో వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్ల లీజుకు ఇవ్వనుంది. చుక్కల భూముల సమస్యకు పరిష్కారం ► అత్యంత వివాదాస్పదమై ఏళ్ల తరబడి లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన చుక్కల భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22 ఏ (1) ఇ) నుంచి ఒకేసారి తొలగించి చరిత్ర సృష్టించింది. ► చుక్కల భూములుగా ఆర్‌ఎస్‌ఆర్‌లో రికార్డు చేసిన భూములు ప్రభుత్వానికి చెందినవా, ప్రైవేటు పట్టాదారులవా అనే అంశాన్ని గత ప్రభుత్వం ఖరారు చేయకుండా నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. ఆ రికార్డులన్నింటినీ పరిశీలించి చుక్కల భూములకు విముక్తి కల్పించింది. ఈ నిర్ణయం వల్ల 1,07,134 మంది రైతులకు వారి భూములపై శాశ్వత హక్కులు లభించాయి. షరతులు గల పట్టా భూములపై తొలగిన ఆంక్షలు ► చుక్కల భూముల తరహాలోనే సమస్యాత్మకంగా తయారైన షరతులు గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ఆ రైతులకు మేలు చేకూర్చింది. ► బ్రిటీష్ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22ఏ కేటగిరీలో పెట్టగా, అలా పెట్టడం అన్యాయమని భావించి నిబంధనల ప్రకారమే వాటిని ఆ జాబితా నుంచి ఈ ప్రభుత్వం తీసివేసింది. ► ఇలా ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. అనాదీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యకు చెక్ అనాదీనం, ఖాళీ కాలమ్ భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చి, వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించిన 35 నుంచి 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారు. సాదాబైనామా కేసుల పరిష్కారం గతంలో భూముల లావాదేవీలను తెల్ల కాగితాల మీద రాసుకోవడం, నోటి మాటగా జరిగిన భూముల లావాదేవీల (సాదాబైనామా విధానం) సమస్యకు పరిష్కారం చూపింది. ఒక నిర్ధిష్ట విధానాన్ని రూపొందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించింది. మ్యుటేషన్లలో పారదర్శకత ► మ్యుటేషన్ల పేరుతో జరిగే అక్రమాలకు ముగింపు పలికేలా ప్రభుత్వం అనేక మార్పులు చేపట్టింది. ఇష్టానుసారం మ్యుటేషన్లు చేయడాన్ని నిలిపివేసి, పట్టాదారుకు నోటీసు ఇచ్చి, విచారణ జరిగిన తర్వాతే రెవెన్యూ రికార్డులో మార్పు జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను మార్చారు. దీంతో కరెక్షన్ పేరుతో జరిగే మ్యుటేషన్లు నిలిచిపోయాయి. ► మ్యుటేషన్లు తిరస్కరించే అధికారాన్ని తహశీల్దార్లకు తీసివేసి ఆర్డీఓలకు అప్పగించడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్‌కు ముందే సర్వే నంబర్ సబ్ డివిజన్ చేసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టడంతో డబుల్ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. సర్టిఫికెట్ల జారీ సులభతరం ► ప్రజలకు అవసరమైన ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వైఎస్ జగన్ ప్రభుత్వం సులభతరం చేసింది. సర్టిఫికెట్లు జారీ చేయడానికి దరఖాస్తులు తీసుకునే గ్రామ, వార్డు సచివాలయం, మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్, కాల్ సెంటర్ వంటి వ్యవస్థలన్నింటికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి వాటి ప్రకారమే పని చేయిస్తోంది. ► హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలి మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ గతంలో జారీ అయి ఉంటే ప్రస్తుత తహశీల్దార్ డిజిటల్ సంతకం, ప్రస్తుత తేదీతో మళ్లీ వెంటనే ఇవ్వడం లాంటి అనేక మార్పులు తీసుకువచ్చి అమలు చేస్తోంది. ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియ ముమ్మరం భూములకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు ఏదైతే జరగాలని చెబుతున్నారో.. అలాంటి మార్పులన్నీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి. ఎక్కడైనా సరే ఆస్తిని సంపదగా మార్చుకున్న దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఆస్తి సంపదగా మారాలంటే అడ్డంకులను ప్రభుత్వమే తొలగించాలి. ఆ పని ఏపీ ప్రభుత్వం చేస్తోంది. భూ హక్కులకు భద్రత కల్పించడం, సరిహద్దుల స్పష్టత, అమ్మకాలు–కొనుగోళ్లను సులభం చేయడం, ఆంక్షలను తొలగించడం, మంచి భూ పరిపాలన యంత్రాంగాన్ని తయారు చేయడం ప్రధానమైనవి. ఏపీ ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తోంది. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తేయడం, చుక్కల భూములు, అనా«దీనం భూములపైనా ఆంక్షలు తొలగించడం ఇందులో భాగమే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామ స్థాయికి రావడం పెద్ద మార్పు. ఇలా ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియలో ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది. తద్వారా వేల కోట్ల సంపద ఆవిష్కృతమైంది. – ఎం.సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ -
పెద్ద కష్టం తీరింది.. సర్వీస్ ఈనాం భూములపై సర్వ హక్కులు
సర్వీసు ఈనాం అంటే? శతాబ్దాలు.. దశాబ్దాల క్రితం కుల వృత్తులు చేసే వారికి గ్రామాల్లో భూములను ఈనాంగా ఇచ్చారు. వారి వారి వృత్తుల పరంగా ఆల యాల నిర్వహణలో, ప్రజావసరాల్లో వారి భాగస్వామ్యం ఉండేది. ఈ క్రమంలో రజక, కుమ్మరి, కమ్మరి, మాదిగ, మాల, షరబి, భజంత్రి, పూజారి, వడ్రంగి తదితరుల భుక్తి కోసం అప్పట్లో భూములు ఇచ్చారు. వాటిని అనుభవిస్తూ సేవలు అందించేవారు. సాక్షి, అమరావతి: సర్వీసు ఈనాం భూమి రైతుల కష్టాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చరమగీతం పాడింది. భూముల సమస్యలన్నింటినీ సానుకూలంగా కొలిక్కి తెచ్చే క్రమంలో సర్వీసు ఈనాం భూముల సమస్యను పరిష్కరించింది. నిషేధిత ఆస్తుల జాబితా 22(ఎ) నుంచి 1.68 లక్షల ఎకరాలను తొలగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో 25 జిల్లాల్లో 1.13 లక్షల మంది కుల వృత్తులు చేసుకునే రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే 2.08 లక్షల ఎకరాల చుక్కల భూములు, 33 వేల ఎకరాల షరతుల గల పట్టా భూములు, ఇవే తరహాలోని మరో 60 వేల ఎకరాలకుపైగా భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించింది. మొత్తం 3 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. తాజాగా 1.68 లక్షల సర్వీస్ ఈనాం భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించడం ద్వారా తాను పేద రైతుల పక్షపాతినని వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించారు. 2013లో పొరపాటున 22(ఎ)లోకి 1956లో ఈనాం చట్టం రావడంతో ఈనాం భూములను రద్దు చేసి, వారికి రైత్వారీ పట్టాలు ఇచ్చారు. దాని ప్రకారం చాలా మంది రైతులు పట్టాలు పొందారు. కొందరు రైతులు తమ అవసరాల కోసం అమ్ముకోగా, మరికొందరు వారసులకు ఇచ్చారు. 2013 వరకు ఈ రైత్వారీ పట్టాలను పట్టా భూములుగానే పరిగణించడంతో పట్టాదారులు సకల హక్కులు అనుభవించేవారు. 2013లో ఈ చట్టానికి సవరణ చేశారు. దేవాలయాలు, ధార్మిక సంస్థలకు ఇచ్చిన సర్వీసు ఇనాం భూములను ఉద్ధేశించి ఈ సవరణ జరిగింది. ఆ సంస్థల్లో పని చేసే వారు ఆ సర్వీసును అందించినంత కాలం ఆ భూమిపైన వచ్చే ఫలసాయాన్ని అనుభవించడమే తప్ప అమ్ముకునేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఇందుకు అనుగణంగా దేవాదాయ, ధార్మిక సంస్థలకు సంబంధించిన ఈనాం భూములను 22(ఎ)లో పెట్టారు. ఆ సమయంలో వాటితోపాటు గ్రామాల్లో చేతి వృత్తుల వారు అనుభవిస్తున్న ఈనాం భూములను కూడా 22(ఎ)లో చేర్చారు. ఒడ్డున పడేసిన జగన్ ప్రభుత్వం 2013 వరకు ఆ భూములపై సర్వ హక్కులు అనుభవించిన రైతులు ఒక్కసారిగా తమ హక్కులను కోల్పోయినట్లయింది. ఈ తప్పును సరిచేసే అవకాశం ఉన్నా, గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. లక్షలాది మంది రైతులతో ముడిపడి ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన గత ప్రభుత్వం చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ సమస్య రావడంతో పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే సర్వీసు ఈనాం భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించి 2013కు ముందున్న సర్వ హక్కులు కల్పించడానికి మంత్రివర్గం ఆమోదించింది. దీనివల్ల వివిధ కుల వృత్తుల్లోని 1,13,610 మందికి చెందిన 1,68,604 ఎకరాల భూములకు విముక్తి లభించింది. తద్వారా ఆ రైతుల కుటుంబాలకు మేలు జరగనుంది. -
చుక్కల భూములపై.. రైతులకు పూర్తి హక్కులు
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న చుక్కల భూములపై సంబంధిత రైతులకు పూర్తిస్థాయి హక్కులు కల్పించేందుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కనీసం 12 ఏళ్లపాటు ఇనాం భూముల్ని అనుభవిస్తున్న వారికి ఆయా భూములపై సర్వహక్కులు లభించనున్నాయి. కాగా, అద్దె లేదా లీజుదారులు క్లెయిమ్ చేయని ఇనాం భూములు ప్రభుత్వ పరం కానున్నాయి. గ్రామీణ ప్రాంత భూములకు జారీచేసే పట్టాదార్ పాస్ పుస్తకాలను ఇకనుంచి పట్టణ ప్రాంత భూములకు జారీ చేయనున్నారు. ఈ మేరకు ఉద్దేశించిన ఏపీ చుక్కల భూములు (పునఃపరిష్కార రిజిస్టర్ ఆధునికీకరణ) సవరణ బిల్లు, ఆంధ్ర ప్రాంత ఇనామ్‌ల (రద్దు, రైత్వారీలోనికి మార్పిడి) సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఈ మూడు బిల్లులను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా.. వీటిపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. వక్ఫ్ భూముల్ని లీజుకిస్తే ముస్లింలకు మేలు గుంటూరు నగరంలోని వక్ఫ్ బోర్డు భూములను నామమాత్రపు ధరలకు లీజుకిస్తే నిరుపేద ముస్లింలకు మేలు కలుగుతుందని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అధికారులు ఆ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో సర్టిఫై చేస్తున్నారని, ఈ విధానంలో మార్పు రావాలని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. తిరుపతిలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న 60వేల మందికి హక్కులు కల్పించాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కోరారు. పలు మఠాలకు చెందిన భూముల్లో ఏళ్ల తరబడి వేలాది మంది ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారని వారికి కూడా హక్కులు కల్పించాలన్నారు. రాయలసీమలో ఎంతో మందికి లబ్ధి వ్యక్తిగత ఇనామ్ భూములను రెగ్యులరైజ్ చేయడంతో రాయలసీమలో వేలాది మందికి లబ్ధి చేకూరుతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేవదాయ, సర్వీస్ ఈనామ్ భూముల రెగ్యులరైజేషన్‌లో తగిన జాగ్రత్తలు పాటించాలని, దేవాలయాలకే తగిన హక్కులు కల్పించాలని సూచించారు. డీకేటీ భూముల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక రకమైన విధానం, ఇక్కడ మరో విధానం అమలులో ఉందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అనివార్య, అత్యవసర పరిస్థితుల్లో ఆ భూములు అమ్ముకోవడానికి వీలుందన్నారు. మన దగ్గర కూడా అదే రీతిలో ఆలోచన చేస్తే వేలాది మందికి మేలు జరుగుతుందన్నారు. నాలుగేళ్లలో రెవెన్యూలో ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సమగ్ర భూసర్వే గ్రామీణ ప్రాంతాల్లో నిజమైన యజమానులకు, పత్రాలు లేని వారికి పూర్తి హక్కులు కల్పిస్తోందన్నారు. చుక్కుల భూములపై చేసే చట్టం వేలాది మందికి గొప్ప వరమన్నారు. ఏళ్ల తరబడి స్వాధీనంలో ఈ చుక్కల భూములను అమ్ముకోవడానికి వీల్లేకుండా ఉందని, 12 ఏళ్లు పూర్తి స్థాయిలో రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉంటే క్షేత్ర స్థాయిలో విచారణ చేసి పూర్తిస్థాయి హక్కులు కల్పించే ఈ చట్టం చాలా గొప్పదని, వీటిపై అధికారులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు: మంత్రి ధర్మాన అవినీతికి ఆస్కారం లేని రీతిలో గ్రామస్థాయిలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. మ్యుటేషన్ కోసం కూడా గ్రామం విడిచి వెళ్లనవసరం లేకుండా చేస్తామన్నారు. కొత్తగా తీసుకొచ్చిన మూడు బిల్లులపై రెవెన్యూ యంత్రాంగానికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు మూడు ప్రాంతీయ సదస్సులు నిర్వహించామన్నారు. చదవండి: ఉచితంగా ఆధార్ అప్డేట్.. వారికి మాత్రమే ఛాన్స్..! -
ఇనాం భూములకు ఎసరు!
సాక్షి, అమరావతి: అత్యంత విలువైన ఇనాం భూములకు రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టింది. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇనాం భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్న నేపథ్యంలో విక్రయ హక్కులు కల్పించడం ద్వారా వాటి విలువను భారీగా పెంచేందుకు ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇనామ్స్ రద్దు, రైత్వారీ చట్టం–1956కు సవరణ ఆర్డినెన్స్ జారీ చేసింది. తద్వారా ఆలయాలు, ధార్మిక సంస్థల సేవకులకు పూర్వం కేవలం అనుభవించడానికే కేటాయించిన భూములు, స్థలాలకు విక్రయ హక్కులు కల్పించినట్లయింది. పూర్వం రాజులు, సేవా సంస్థలు, సేవ, ఆధ్యాత్మిక భావం గల సంపన్నులు ఆలయాలు, ధార్మిక సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కోసం భూములు లాంటి స్థిరాస్తులు రాసి ఇచ్చారు. ఈ ఆలయాల్లో పూజలు చేసే పూజారులు, మేళం వాయించే వాయిద్యకారులు, స్వామివారికి నైవేద్యం కోసం పాలు సమర్పించే ఆవులు మేపేవారు తదితర సేవకులకు ఈ సేవలు చేస్తున్నంతకాలం జీవనాధారం కోసం ఇనాం కింద భూములు ఇచ్చారు. ఈ సేవలు చేస్తున్నంత కాలం మాత్రమే ఈ భూములను అనుభవిస్తూ ఫల, ఇతర ఉత్పత్తులు పొందే హక్కు వీరికి ఉంటుంది. ఇనాం చట్టం రద్దుతో.. 1956లో ప్రభుత్వం ఇనామ్స్ చట్టాన్ని రద్దుచేసింది. దీంతో అప్పట్లో ఇలాంటి భూములను అనుభవిస్తున్న ఇనామీలతోపాటు ఇతరులు కూడా రైత్వారీ పట్టాలు పొందారు. చాలావరకూ ఇవి పట్టణాలు, నగరాల్లో ఉండటంతో వీటి విలువ భారీగా పెరిగింది. రాష్ట్రంలో ఇలా ఆలయ సేవకుల ఇనాం భూములు 24,614 ఎకరాలకు పైగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు లాంటి పట్టణాలు, నగరాల్లో ఈ భూములు ఇళ్లస్థలాలుగా మారాయి. అనధికారిక క్రయ విక్రయాలు కూడా జరిగాయి.దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని, రైత్వారీ పట్టాలు ప్రభుత్వమే ఇవ్వడమంటే దేవాలయ భూములను ధారాదత్తం చేయడమేనని, ఇది అన్యాయమంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఆలయాల్లో సేవ చేసినంత కాలం అనుభవించడానికి మాత్రమే హక్కు ఉన్న ఇనాం భూములను అమ్ముకోవడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధప్రదేశ్ ఇనామ్స్ రద్దు, రైత్వారీ పట్టాలుగా మార్పిడి చట్టం–1956కు సవరణ చేసింది. దీన్ని గవర్నర్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ఈ చట్టం 1956 నవంబరు 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లుగా (రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టు) 2013 సెప్టెంబరు 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 1956 నుంచి ఈ భూములకు సంబంధించిన క్రయవిక్రయ లావాదేవీలు ఏమీ చెల్లవు. జరిగిన లావాదేవీలన్నీ అనధికారికమే. వీటికి చట్టబద్ధత లేదు. అనగా ఇవి ఇనాం భూముల కిందే ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వం ఈ భూములను బదలాయింపు నిషేధ(పీఓటీ) జాబితాలో 22 ఎ–1 కింద పెట్టింది. హఠాత్తుగా.. పట్టణాలు, నగరాల్లో ఇనాం భూములు ఇళ్ల స్థలాలుగా మారడంతో చాలామంది అధికార పార్టీ నాయకులు వాటిని తక్కువ ధరకే కొనుగోలు చేశారు. నిషేధిత జాబితా నుంచి తొలగించి, క్రయవిక్రయాలకు అనుమతి ఇస్తే వీటి ధర 10 నుంచి 20 రెట్లు వరకూ పెరుగుతుంది. అందుకే ఈ చట్టాన్ని సవరించాలని వారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. చట్ట సవరణ చేస్తే తమ అధీనంలోని ఆస్తుల విలువ పెరగడంతోపాటు లక్షలాది మంది అనుభవంలో ఉన్న స్థలాలనూ అమ్ముకునే వెసులుబాటు వస్తుందని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం 2013 సెప్టెంబరు 26న గెజిట్ జారీ చేసినప్పటి నుంచే ఈ చట్టం వర్తించేలా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. దీన్ని కేబినెట్లో పెట్టి ఆమోదముద్ర వేసి, గవర్నర్ అనుమతితో ఆర్డినెన్సు జారీచేశారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి శనివారం జీవో జారీ చేశారు. నిబంధనలతో కూడిన గెజిట్‌ను కూడా శనివారం జారీ చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ ఇనాం భూములు 1956కు పూర్వస్థితి ప్రకారం ఆలయాలు/ధార్మిక సంస్థల పేరుతో ఉన్నట్లే. తాజాగా ఆర్డినెన్సు జారీతో 2013 సెప్టెంబరు 26వ తేదీ వరకూ జరిగిన క్రయవిక్రయాలు, లావాదేవీలకు చట్టబద్ధత లభిస్తుంది. అప్పటివరకూ కొనుగోలు చేసిన/ అనుభవిస్తున్న వారు ఇక వీటిని అమ్ముకోవచ్చు. అనగా 24,614 ఎకరాలు ఇక ఇనాం భూముల జాబితాలో ఉండవు. ఇందులో 70 శాతం అధికార టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. -
వక్ఫ్ జాగా.. ముఫ్త్ మజా!
అక్రమార్కుల చెరలో ఇనాం భూములు - వక్ఫ్ ఖజానాకు కోట్లాది రూపాయల గండి - యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు - నోటీసులతో సరిపెడుతున్న అధికారులు - వంత పాడుతున్న రెవెన్యూ శాఖ - క్షేత్రస్థాయిలో వీఆర్ఓల ఇష్టారాజ్యం మసీదు ఇనాం భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ భూముల్లో కొందరు రాజకీయ పార్టీల నేతలు పాగా వేశారు. రియల్టర్లు కొందరు ఈ భూముల్లో ప్లాట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చేతనైనంత సాయం చేసి ప్రోత్సహిస్తున్నారు. సాగుదారులుగా హక్కు కల్పిస్తూ మీ-భూమిలో నమోదు చేస్తూ అక్రమార్కులకు వంత పాడుతున్నారు. కోడుమూరు: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందలాది ఎకరాల వక్ఫ్ భూమి అక్రమార్కుల సొంతమవుతోంది. అధికార పార్టీ నేతల అండదండలు.. రెవెన్యూ అధికారుల లీలలు.. వెరసి ఇనాం భూములు కాస్తా ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఈ భూములకు రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు జారీ చేస్తుండటంతో.. బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి రుణాలు కూడా తీసుకుంటున్నారు. నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో వక్ఫ్ అధికారులు సైతం చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 22,600 ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా.. దాదాపు 3,809.95 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు అధికారుల సర్వేలో వెల్లడయింది. ఇందులో ఇప్పటి వరకు 265.35 ఎకరాలను మాత్రమే అక్రమార్కుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకోగలిగారు. ఆక్రమణల నేపథ్యంలో గ్రామాల్లో మసీదులు ఆలనాపాలన కరువై శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వీటి పర్యవేక్షణను చూసుకునే ముక్తావలిలు(మసీదు పెద్దలు) వక్ఫ్ భూముల నుంచి ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ఇక్కట్లతో సతమతం అవుతున్నారు. కోడుమూరులోని పడమటి మసీదుకు చెందిన 60.48 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇటీవల ఆ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తానని ఓ టీడీపీ నేత రూ.6లక్షలు చొప్పున వసూలు చేయడం వివాదాస్పదమైంది. విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ భూములను వక్ఫ్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వందలాది ఎకరాల వక్ఫ్ భూమి అన్యాక్రాంతం అవుతున్నా.. బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో 65/8, 65/9 సర్వే నెంబర్లోని 8.6 ఎకరాల వక్ఫ్ భూమిని కుందం ప్రతాప్‌రెడ్డి తన చిన్నాన్న కొడుకులు శ్యాంసుందర్‌రెడ్డి, సోమేంద్రప్రసాద్రెడ్డిల పేరిట కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో(డాక్యుమెంట్ నెం.4026/2008) రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ ఆస్తి విలువ దాదాపు రూ.50లక్షలు. ఇదే గ్రామంలో దాదాపు 30 మంది రైతులు 120.80 ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. పాణ్యం మండలంలోని తొగర్చేడులో అక్రమార్కులు 75 ఎకరాల వక్ఫ్ భూమిని ఆక్రమించుకున్నారు. విషయం తెలిసిన వక్ఫ్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేసి మిన్నకుండిపోయారు. అక్రమార్కులు రాజకీయ పలుకుబడితో చక్రం తిప్పుతున్నారు. కల్లూరు మండలం పందిపాడు గ్రామంలోని 5, 7/ఎ, 22, 94 సర్వే నెంబర్లలో ఉన్న 21.58 ఎకరాల మసీద్ ఇనాం భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. ఎకరా రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్ల విలువ చేసే ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు యథేచ్ఛగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇదే గ్రామంలోని 7/ఎ సర్వే నెంబర్లో ఉన్న 12.12 ఎకరాల భూమి(ఇండస్ స్కూల్ ఎదురుగా)ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు సెంటు రూ.3లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. కల్లూరు, కర్నూలు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. సర్వే నెం.7/ఏలో 1297 చదరపు అడుగుల భూమిని సకారం మల్లికార్జునరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.సుందర్రావు అనే వ్యక్తికి(డాక్యుమెంట్ నెం.1384/2006) విక్రయించి కర్నూలు రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాడు. ముత్యాల స్వయం ప్రభాదేవి అనే మహిళ యు.మల్లికార్జున అనే వ్యక్తికి(డాక్యుమెంట్ నెం.6348/2014) 194.64 చదరపు అడుగుల భూమిని కల్లూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. పెద్దపాడు గ్రామంలోని 525 ఎకరాల భూమి 350 మంది రైతుల ఆధీనంలో ఉన్నట్లు వక్ఫ్‌బోర్డు అధికారులు గుర్తించారు. ఫలితంగా వక్ఫ్ బోర్డు ఈ భూముల నుంచి వచ్చే కౌలు ఆదాయం కోల్పోతుంది. వీఆర్వోల పొరపాటు చనుగోండ్లలోని మసీద్ ఇనాం భూములను మసీద్ ఇనాం పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశాం. వీఆర్వోలు పంట నమోదు సర్వే ఆధారంగా అప్పట్లో సాగులో ఉన్న రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేశారు. - శివశంకర్‌నాయక్, తహసీల్దార్ గూడూరు -
ఇనాం భూములన్నీ దేవునివే!
సింగరాయకొండ : ఏళ్ల నుంచి రైతుల సాగుబడిలో ఉన్న ఇనాం భూములు దేవునియంటూ దేవాదాయశాఖ అధికారులు ప్రకటించడం సింగరాయకొండ మండలంలో కలకలం సృష్టిస్తోంది. దేవాదాయ, ధర్మాదాయశాఖకు చెందిన భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని ఆ శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ కేబీ శ్రీనివాసరావు ఆదేశాలతో రైతులు ఉలిక్కిపడ్డారు. మరోపక్క ఉన్నతాధికారి ఆదేశాలు అమలు చేసే పనిలో కిందిస్థాయి అధికారులు బిజీగా ఉన్నారు. వివరాలు.. సింగరాయకొండ మండలంలోని పది గ్రామాల్లో 2,132 ఎకరాలు దేవాదాయశాఖకు చెందినవని, వాటికి రిజిస్ట్రేషన్లు ఆపాలంటూ ఆ భూముల వివరాలకు సంబంధించి సర్వే నంబర్లతో సహా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఓ ఫైల్ అందింది. ఆ భూములను తాము 100 ఏళ్లుగా అనుభవిస్తున్నామని, ఇప్పటికిప్పుడు అవి దేవాదాయశాఖవనడం అన్యాయమని హక్కుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ గ్రామ రెవెన్యూ అధికారులు ఈ విషయంలో ప్రజల పక్షాన నిలిచారు. 1956లో ఇనాం రద్దు చట్టం, 1946 ఎస్టేట్ చట్టం వచ్చాయని, ఈ రెండింటి ప్రకారం రెవెన్యూ రికార్డులు పరిశీలించి సంబంధిత స్థలాలకు రైతువారి పట్టాలతో పాటు, పట్టాదారు పాసుపుస్తకాలు కూడా అప్పట్లోనే ఇచ్చామని చెబుతున్నారు. దేవాదాయశాఖ అధికారులు ఇప్పటికిప్పుడు ఆ స్థలాలు ప్రభుత్వానివని ఏ విధంగా అంటారని, రిజిస్ట్రేషన్లు ఎలా ఆపుతారని ప్రశ్నిస్తున్నారు. స్థానిక నాయకులు మాత్రం సమస్యను కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరంజనేయస్వామి దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయశాఖ మంత్రి విదేశాలకు వెళ్లారని, ఆయన రాగానే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. దేవాదాయశాఖ ఆదేశాలపై ఉద్యమించేందుకు భూముల పరిరక్షణ కమిటీ ఏర్పడింది. దేవాదాయశాఖ అధికారులు మాత్రం తాము చట్ట ప్రకారం నడుచుకుంటున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వ పుణ్యమేనా? గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి రె వెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అధ్యక్షతన ఇనాం భూములపై కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2013లో యాక్ట్ నంబర్ 16 ఆఫ్ 2013 ప్రకారం 1956 ఇనాం రద్దు చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ఇనాం భూములను దేవాదాయశాఖ పరిధిలోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చట్టం ప్రకారమే తాము రెవెన్యూ శాఖకు సంబంధించి ఆర్ఎస్ఆర్ ప్రకారం ఏడాది కాలంగా రికార్డులు వెతికి ఇనాం భూముల జాబితా రూపొందించామని అధికారులు వివరించారు. భూములు అనుభవిస్తున్న వారికి త్వరలో నోటీసులు జారీ చేసి వాటిని స్వాధీనం చేసుకుంటామని పేర్కొంటున్నారు. అవన్నీ ఇనాం భూములే: కేబీ శ్రీనివాసరావు, ఏసీ, దేవాదాయశాఖ సింగరాయకొండలో ఇనాం భూములు ఉన్నాయని గతంలోనే చెప్పా. అప్పుడు ఎవరూ నా మాట పట్టించుకోలేదు. అయితా రామయ్యశ్రేష్టి సత్రం కమిటీ సభ్యులు మాపై వివిధ రకాల కేసులు బనాయించారు. అందులో భాగంగా అసలు సింగరాయకొండ మండలంలో దేవాదాయశాఖకు చెందిన భూముల వివరాల సమగ్ర సమాచారాన్ని సేకరించాం. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం ఇనాం చట్టం స్థానంలో కొత్త చట్టం రూపొందించింది. ఆ చట్టం ప్రకారమే ఇనాం భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి సమాచారం పంపాం.