ప్యాలకుర్తిలోని మసీదు
అక్రమార్కుల చెరలో ఇనాం భూములు
- వక్ఫ్ ఖజానాకు కోట్లాది రూపాయల గండి
- యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు
- నోటీసులతో సరిపెడుతున్న అధికారులు
- వంత పాడుతున్న రెవెన్యూ శాఖ
- క్షేత్రస్థాయిలో వీఆర్‌ఓల ఇష్టారాజ్యం
మసీదు ఇనాం భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ భూముల్లో కొందరు రాజకీయ పార్టీల నేతలు పాగా వేశారు. రియల్టర్లు కొందరు ఈ భూముల్లో ప్లాట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చేతనైనంత సాయం చేసి ప్రోత్సహిస్తున్నారు. సాగుదారులుగా హక్కు కల్పిస్తూ మీ-భూమిలో నమోదు చేస్తూ అక్రమార్కులకు వంత పాడుతున్నారు.
కోడుమూరు: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందలాది ఎకరాల వక్ఫ్ భూమి అక్రమార్కుల సొంతమవుతోంది. అధికార పార్టీ నేతల అండదండలు.. రెవెన్యూ అధికారుల లీలలు.. వెరసి ఇనాం భూములు కాస్తా ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఈ భూములకు రెవెన్యూ అధికారులు ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు జారీ చేస్తుండటంతో.. బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసి రుణాలు కూడా తీసుకుంటున్నారు. నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో వక్ఫ్ అధికారులు సైతం చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 22,600 ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా.. దాదాపు 3,809.95 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు అధికారుల సర్వేలో వెల్లడయింది. ఇందులో ఇప్పటి వరకు 265.35 ఎకరాలను మాత్రమే అక్రమార్కుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకోగలిగారు.
ఆక్రమణల నేపథ్యంలో గ్రామాల్లో మసీదులు ఆలనాపాలన కరువై శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వీటి పర్యవేక్షణను చూసుకునే ముక్తావలిలు(మసీదు పెద్దలు) వక్ఫ్ భూముల నుంచి ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ఇక్కట్లతో సతమతం అవుతున్నారు. కోడుమూరులోని పడమటి మసీదుకు చెందిన 60.48 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇటీవల ఆ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తానని ఓ టీడీపీ నేత రూ.6లక్షలు చొప్పున వసూలు చేయడం వివాదాస్పదమైంది. విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ భూములను వక్ఫ్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వందలాది ఎకరాల వక్ఫ్ భూమి అన్యాక్రాంతం అవుతున్నా.. బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు
గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో 65/8, 65/9 సర్వే నెంబర్‌లోని 8.6 ఎకరాల వక్ఫ్ భూమిని కుందం ప్రతాప్‌రెడ్డి తన చిన్నాన్న కొడుకులు శ్యాంసుందర్‌రెడ్డి, సోమేంద్రప్రసాద్‌రెడ్డిల పేరిట కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో(డాక్యుమెంట్ నెం.4026/2008) రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ ఆస్తి విలువ దాదాపు రూ.50లక్షలు. ఇదే గ్రామంలో దాదాపు 30 మంది రైతులు 120.80 ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు.
-
పాణ్యం మండలంలోని తొగర్చేడులో అక్రమార్కులు 75 ఎకరాల వక్ఫ్ భూమిని ఆక్రమించుకున్నారు. విషయం తెలిసిన వక్ఫ్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేసి మిన్నకుండిపోయారు. అక్రమార్కులు రాజకీయ పలుకుబడితో చక్రం తిప్పుతున్నారు.
-
కల్లూరు మండలం పందిపాడు గ్రామంలోని 5, 7/ఎ, 22, 94 సర్వే నెంబర్లలో ఉన్న 21.58 ఎకరాల మసీద్ ఇనాం భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. ఎకరా రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్ల విలువ చేసే ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు యథేచ్ఛగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇదే గ్రామంలోని 7/ఎ సర్వే నెంబర్‌లో ఉన్న 12.12 ఎకరాల భూమి(ఇండస్ స్కూల్ ఎదురుగా)ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు సెంటు రూ.3లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. కల్లూరు, కర్నూలు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. సర్వే నెం.7/ఏలో 1297 చదరపు అడుగుల భూమిని సకారం మల్లికార్జునరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.సుందర్‌రావు అనే వ్యక్తికి(డాక్యుమెంట్ నెం.1384/2006) విక్రయించి కర్నూలు రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాడు. ముత్యాల స్వయం ప్రభాదేవి అనే మహిళ యు.మల్లికార్జున అనే వ్యక్తికి(డాక్యుమెంట్ నెం.6348/2014) 194.64 చదరపు అడుగుల భూమిని కల్లూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు.
-
పెద్దపాడు గ్రామంలోని 525 ఎకరాల భూమి 350 మంది రైతుల ఆధీనంలో ఉన్నట్లు వక్ఫ్‌బోర్డు అధికారులు గుర్తించారు. ఫలితంగా వక్ఫ్ బోర్డు ఈ భూముల నుంచి వచ్చే కౌలు ఆదాయం కోల్పోతుంది.
వీఆర్వోల పొరపాటు
చనుగోండ్లలోని మసీద్ ఇనాం భూములను మసీద్ ఇనాం పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశాం. వీఆర్వోలు పంట నమోదు సర్వే ఆధారంగా అప్పట్లో సాగులో ఉన్న రైతుల పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
- శివశంకర్‌నాయక్, తహసీల్దార్ గూడూరు