సాక్షి, అమరావతి: అత్యంత విలువైన ఇనాం భూములకు రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టింది. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇనాం భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్న నేపథ్యంలో విక్రయ హక్కులు కల్పించడం ద్వారా వాటి విలువను భారీగా పెంచేందుకు ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగానే 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇనామ్స్ రద్దు, రైత్వారీ చట్టం–1956కు సవరణ ఆర్డినెన్స్ జారీ చేసింది. తద్వారా ఆలయాలు, ధార్మిక సంస్థల సేవకులకు పూర్వం కేవలం అనుభవించడానికే కేటాయించిన భూములు, స్థలాలకు విక్రయ హక్కులు కల్పించినట్లయింది. పూర్వం రాజులు, సేవా సంస్థలు, సేవ, ఆధ్యాత్మిక భావం గల సంపన్నులు ఆలయాలు, ధార్మిక సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కోసం భూములు లాంటి స్థిరాస్తులు రాసి ఇచ్చారు. ఈ ఆలయాల్లో పూజలు చేసే పూజారులు, మేళం వాయించే వాయిద్యకారులు, స్వామివారికి నైవేద్యం కోసం పాలు సమర్పించే ఆవులు మేపేవారు తదితర సేవకులకు ఈ సేవలు చేస్తున్నంతకాలం జీవనాధారం కోసం ఇనాం కింద భూములు ఇచ్చారు. ఈ సేవలు చేస్తున్నంత కాలం మాత్రమే ఈ భూములను అనుభవిస్తూ ఫల, ఇతర ఉత్పత్తులు పొందే హక్కు వీరికి ఉంటుంది.
ఇనాం చట్టం రద్దుతో..
1956లో ప్రభుత్వం ఇనామ్స్ చట్టాన్ని రద్దుచేసింది. దీంతో అప్పట్లో ఇలాంటి భూములను అనుభవిస్తున్న ఇనామీలతోపాటు ఇతరులు కూడా రైత్వారీ పట్టాలు పొందారు. చాలావరకూ ఇవి పట్టణాలు, నగరాల్లో ఉండటంతో వీటి విలువ భారీగా పెరిగింది. రాష్ట్రంలో ఇలా ఆలయ సేవకుల ఇనాం భూములు 24,614 ఎకరాలకు పైగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు లాంటి పట్టణాలు, నగరాల్లో ఈ భూములు ఇళ్లస్థలాలుగా మారాయి. అనధికారిక క్రయ విక్రయాలు కూడా జరిగాయి.దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని, రైత్వారీ పట్టాలు ప్రభుత్వమే ఇవ్వడమంటే దేవాలయ భూములను ధారాదత్తం చేయడమేనని, ఇది అన్యాయమంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఆలయాల్లో సేవ చేసినంత కాలం అనుభవించడానికి మాత్రమే హక్కు ఉన్న ఇనాం భూములను అమ్ముకోవడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధప్రదేశ్ ఇనామ్స్ రద్దు, రైత్వారీ పట్టాలుగా మార్పిడి చట్టం–1956కు సవరణ చేసింది. దీన్ని గవర్నర్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ఈ చట్టం 1956 నవంబరు 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లుగా (రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టు) 2013 సెప్టెంబరు 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 1956 నుంచి ఈ భూములకు సంబంధించిన క్రయవిక్రయ లావాదేవీలు ఏమీ చెల్లవు. జరిగిన లావాదేవీలన్నీ అనధికారికమే. వీటికి చట్టబద్ధత లేదు. అనగా ఇవి ఇనాం భూముల కిందే ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వం ఈ భూములను బదలాయింపు నిషేధ(పీఓటీ) జాబితాలో 22 ఎ–1 కింద పెట్టింది.
హఠాత్తుగా..
పట్టణాలు, నగరాల్లో ఇనాం భూములు ఇళ్ల స్థలాలుగా మారడంతో చాలామంది అధికార పార్టీ నాయకులు వాటిని తక్కువ ధరకే కొనుగోలు చేశారు. నిషేధిత జాబితా నుంచి తొలగించి, క్రయవిక్రయాలకు అనుమతి ఇస్తే వీటి ధర 10 నుంచి 20 రెట్లు వరకూ పెరుగుతుంది. అందుకే ఈ చట్టాన్ని సవరించాలని వారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. చట్ట సవరణ చేస్తే తమ అధీనంలోని ఆస్తుల విలువ పెరగడంతోపాటు లక్షలాది మంది అనుభవంలో ఉన్న స్థలాలనూ అమ్ముకునే వెసులుబాటు వస్తుందని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం 2013 సెప్టెంబరు 26న గెజిట్ జారీ చేసినప్పటి నుంచే ఈ చట్టం వర్తించేలా ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది. దీన్ని కేబినెట్‌లో పెట్టి ఆమోదముద్ర వేసి, గవర్నర్ అనుమతితో ఆర్డినెన్సు జారీచేశారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి శనివారం జీవో జారీ చేశారు. నిబంధనలతో కూడిన గెజిట్‌ను కూడా శనివారం జారీ చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ ఇనాం భూములు 1956కు పూర్వస్థితి ప్రకారం ఆలయాలు/ధార్మిక సంస్థల పేరుతో ఉన్నట్లే. తాజాగా ఆర్డినెన్సు జారీతో 2013 సెప్టెంబరు 26వ తేదీ వరకూ జరిగిన క్రయవిక్రయాలు, లావాదేవీలకు చట్టబద్ధత లభిస్తుంది. అప్పటివరకూ కొనుగోలు చేసిన/ అనుభవిస్తున్న వారు ఇక వీటిని అమ్ముకోవచ్చు. అనగా 24,614 ఎకరాలు ఇక ఇనాం భూముల జాబితాలో ఉండవు. ఇందులో 70 శాతం అధికార టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment