సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెద్దఎత్తున డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేచోట మూడేళ్లకు పైగా ఉంటున్న, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు ఎవరినీ సొంత జిల్లాల్లో ఉంచరాదని.. మూడేళ్లకుపైగా ఒకే స్థానంలోనూ, గత ఎన్నికల్లో పనిచేసిన ప్రాంతంలోనూ ఉంచరాదని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) స్పష్టంచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టింది. మొత్తం 101 మంది డిప్యూటీ కలెక్టర్లకు బదిలీ, పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తూ సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీల్లో పైరవీలకు పెద్దపీట వేసింది. అనుకూలురైన అధికారులు కావాలంటూ కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన సిఫార్సులకు ఆమోద ముద్ర వేసింది. తమకు నచ్చని అధికారులను ఏడాది కూడా పూర్తికాకపోయినా అప్రధాన పోస్టులకు బదిలీ చేశారు.
డిప్యూటీ కలెక్టరు పోస్టులు స్టేట్ కేడర్‌కు చెందినవైనందున రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు. దీనిని అవకాశంగా చేసుకున్న టీడీపీ నేతలు తమకు అనుకూలురును కేటాయించాలని సిఫార్సులు చేశారు. ‘ఫలానా అధికారి మనకు అనుకూలంగా వ్యవహరిస్తాడు. మా జిల్లాలో ఉండటానికి వీల్లేనందున మీ జిల్లాకు వేయించుకో బాగా ఉపయోగపడతాడు’ అని కోస్తాంధ్రకు చెందిన ఒక మంత్రి మరో మంత్రికి సూచించారు. దీంతో ఆ మంత్రి వెంటనే ముఖ్యనేత పేషీలో మాట్లాడి తన జిల్లాకు పోస్టింగ్ వేయించుకున్నారు. ముఖ్యనేత పేషీ ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించిందనే అంశం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బదిలీ ఉత్తర్వులను కూడా సెలవు రోజైన ఆదివారం రాత్రి జారీ చేయడం గమనార్హం. ఈ బదిలీల్లో అప్రధాన పోస్టుల్లో ఉన్న తొమ్మిది మందికి అత్యంత ముఖ్యమైన రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీవోలు)గా పోస్టింగులు లభించాయి. తహసీల్దార్లకు డిప్యూటి కలెక్టర్లుగా తాత్కాలిక పదోన్నతి కల్పనలో సీనియారిటి, మెరిట్‌లను కాలరాస్తూ కావాల్సిన వారికి పదోన్నతులు కట్టబెట్టారని విమర్శలు వచ్చిన రెండు మూడు రోజులకే డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లోనూ అలాంటి విమర్శలే వెల్లువెత్తాయి.
ఎంపీడీవోల బదిలీల్లోనూ ఇదే తంతు: ఎన్నికల నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ శాఖలోనే రెండు రోజుల క్రితం ఏకంగా 448 మంది ఎంపీడీవోలను బదిలీ చేశారు. అయితే, సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన ఎంపీడీవోలను తమకు కావాల్సిన ప్రదేశాల్లోకి బదిలీ చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుకూలంగా ఉండరు అన్న వారిని సుదూర ప్రాంతాలకు పంపించారు. ఇందులో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ వర్గాలను టార్గెట్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పనిచేసే ఎంపీడీవోలలో ఎక్కువ మందిని పక్కనే ఉన్న కృష్ణా, ప్రకాశం జిల్లాలకు బదిలీ చేసి, మరికొందరిని తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ చేశారు. వారిలో ఏడుగురు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారున్నట్లు సమాచారం. అలాగే, ప్రకాశం జిల్లాలో పనిచేసే ఎంపీడీవోలలో కొందర్ని పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాకు బదిలీచేసి, నెల్లూరుకు బదిలీ చేయాలని కోరుకున్న వారిని కర్నూలు జిల్లాకు బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి.
సొంత సామాజిక ఉద్యోగికి అందలం
నిబంధనలకు విరుద్ధమని ఐఏఎస్ అధికారి పేర్కొన్నా సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ స్వయంగా జోక్యం చేసుకుని ఓ ఎంపీడీవో ఉద్యోగిని గ్రామీణాభివృద్ధి శాఖకు రెగ్యులర్ ఉద్యోగిగా బదలాయించారు. అంతేకాక.. ఆ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏకంగా డిప్యూటీ డైరక్టర్ పదవి కట్టబెట్టడం ఆ శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంవల్లే ఇది జరిగిందని సహచర ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వద్ద ప్రైవేట్ కార్యదర్శి (పీఎస్)గా పనిచేస్తున్న పి. రోశయ్య ఎంపీడీవో అధికారే అయినప్పటికీ.. ఇటీవల కన్ఫర్డ్ ఐఏఎస్‌ల పదోన్నతుల్లో తనను ఐఏఎస్ హోదాకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అందుకు కావాల్సిన అర్హతలు లేని కారణంగా ఆ దరఖాస్తును ప్రభుత్వం పక్కనపెట్టింది. ఇప్పుడు అదే మరో ఎంపీడీవో ఉద్యోగిని పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖకు రెగ్యులర్ ఉద్యోగిగా బదలాయింపుతోపాటు ఉన్నత పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి నోట్‌ఫైల్‌లో పేర్కొన్నప్పటికీ మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు ఇద్దరూ జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికారంతో ఆమోదం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment