పేరుకే ఆదరణ..! అంతటా.. నిరాదరణే | Their is no adarana scheme implementation in the state | Sakshi
Sakshi News home page

పేరుకే ఆదరణ..! అంతటా.. నిరాదరణే

Published Thu, Dec 13 2018 5:11 AM | Last Updated on Thu, Dec 13 2018 11:08 AM

Their is no adarana scheme implementation in the state - Sakshi

పంపిణీకి నోచుకోకుండా ఈ–కేంద్రంలో పడిఉన్న ఆదరణ పరికరాలు

దుస్తులు కుట్టే వాళ్లంతా వడ్రంగి పని చేయాలి.. వడ్రంగి పని చేసే వాళ్లు దుస్తులు కుట్టాలి.. ఇస్త్రీ చేసే వాళ్లు సెలూన్‌ షాపు పెట్టుకోవాలి.. మేళం వాయించే వారు రాళ్లు కొట్టడం నేర్చుకోవాలి.. కంప్యూటర్‌పై పని చేసే వాళ్లు కుట్టుమిషన్‌ నేర్చుకోవాలి.. ఇలా చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తోంది కదూ! ‘ఆదరణ’ పథకం కింద ఆయా కుల వృత్తుల వారు వారికి కావాల్సిన పరికరాల కోసం దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న తీరు ఇలానే ఉంది మరి. వెనుకబడిన తరగతుల వారికి ఊతమందించేలా ఉండాల్సిన ఈ పథకం ఉసూరుమనిపిస్తోంది. ప్రచారార్భాటం.. నాసిరకం పరికరాలు.. అవినీతి.. వెరసి బీసీలకు ఈ ప్రభుత్వం నిరాదరణే మిగిల్చింది. 7 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 25 వేల మందికి తూతూ మంత్రంగా పనికి రాని పరికరాలు అంటగట్టి ఏదో ఉద్ధరించినట్టు డప్పుకొట్టుకుంటోంది. ఆ కొద్దిమందికి కూడా నాసిరకం పరికరాలు అంటగట్టారు. అందులోనూ అవినీతికి పాల్పడ్డారు.

సాక్షి, నెట్‌వర్క్‌: నాలుగున్నరేళ్ల తర్వాత ఎన్నికలకు ముందు బీసీలను ఆకట్టుకుని వారి వృత్తులకు సంబంధించిన పరికరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం 2003 తర్వాత మరోసారి ప్రవేశపెట్టిన ఆదరణ పథకం అమలులో దారుణంగా విఫలమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరికరాల పంపిణీ అంతా బోగస్‌ అని స్వయంగా లబ్ధిదారులే చెబుతున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనూ పరికరాల్లో నాణ్యత లేదని 47.54 శాతం మంది వెల్లడించడం గమనార్హం. పనికిరాని పనిముట్లు ఇవ్వడమే కాకుండా వివిధ వృత్తులకు సంబంధించిన పరికరాలు తెప్పించడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ పథకం కింద నవంబర్‌ 30 నాటికి 6,97,419 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గత నెల 12న మెగా రుణమేళా నిర్వహించింది. మరో మూడు మేళాలు నిర్వహించి మొత్తం మీద నాలుగు రుణమేళాల్లో 4,02,500 మందికి పరికరాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి విడతలో నవంబర్‌ 30 వరకు 25,093 మందికి మాత్రమే పరికరాలు ఇచ్చింది. ఇందులోనూ సగం మందికిపైగా నాణ్యత లేని పరికరాలు అందాయి. దీంతో దరఖాస్తు చేసుకున్నవారు ఈ నాసిరకం పరికరాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం నాలుగు లక్షల మందికి పైగా పరికరాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా అందులో 1,87,165 మంది మాత్రమే తమ వంతు వాటా చెల్లించారు. దీన్ని బట్టి ఈ పథకం అమలు తీరు ఎంత దారుణంగా ఉందో అవగతమవుతోంది. 

లబ్ధిదారుల ఇబ్బందులెన్నో.. 
ఆదరణ పథకంలో లబ్ధిదారులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్‌లోదరఖాస్తు చేసుకోవడానికి వెళ్తే సర్వర్‌ ప్రాబ్లం ఉందని మళ్లీ రావాలంటూ మీసేవా కేంద్రాల చుట్టూ తిప్పుకుంటున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్నా అనేక సాకులతో కొంతమంది నుంచి దరఖాస్తులు స్వీకరించడం లేదు. ఇప్పటికే నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు మంజూరు చేశామని ఇక కొత్త దరఖాస్తులు స్వీకరించబోమని అధికారులు చెబుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో అర్హులు మిగిలిపోతున్నారు. మరికొంతమందికి వివిధ ధ్రువపత్రాలు తీసుకురావాలని చెబుతుండటంతో వాటికోసం లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. టీడీపీ నేతలు, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు, పట్టణాల్లో మునిసిపల్‌ కమిటీలు చెప్పినవారినే లబ్ధిదారుల జాబితాలో చేరుస్తున్నారు.

టీడీపీ నేతలకు అడిగినంత చెల్లిస్తేనే లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కుతోంది. తమ వంతు వాటా, టీడీపీ నేతలు అడిగినంత చెల్లించి నెలలు గడుస్తున్నా వారికి పరికరాలు అందడం లేదు. కొన్నిచోట్ల అధికారులు ఒక్కో యూనిట్‌కు రెండుసార్లు, మూడుసార్లు కూడా లబ్ధిదారుల నుంచి డీడీలు కట్టించారు. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లా తగరపువలసకు చెందిన చిప్పాడ త్రినాథ్‌ అనే నాయీ బ్రాహ్మణుడు రూ.20 వేల విలువైన యూనిట్‌ పొందడానికి అర్హత సాధిస్తే అందుకు లబ్ధిదారుని వాటా కింద రూ.2 వేలు చెల్లించాల్సి ఉండగా మొదట రూ.1950, రెండోసారి రూ.1639 కట్టించుకున్నారు. గోవాడ రాజు అనే మరొక వ్యక్తి రూ.30 వేల పనిముట్లు పొందడానికి అర్హత పొందితే అతని వాటా కింద రూ.3 వేలకు బదులుగా.. రూ.3,197, రూ.2,709 కలిపి రూ.5,906 వసూలు చేశారు. ఇప్పటివరకు తక్కువమందికి పరికరాలు అందగా వాటిలో ఎక్కువ శాతం నాసిరకం పరికరాలే. అంతేకాకుండా లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న పరికరాలను కాకుండా వేరేవి ఇస్తున్నారు. కొంతమందికి వారి వృత్తులకు సంబంధం లేనివి కూడా ఇచ్చారు. ఆదరణ పథకాన్ని 125 బీసీ సామాజికవర్గాలకు అందించాల్సి ఉండగా కేవలం 15 సామాజికవర్గాలకే అందించారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 

 అధికార పార్టీ నేతల జోక్యమే శాపం.. 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ నేతల సిఫార్సుల మేరకే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికకు మండల, మునిసిపాలిటీ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీల్లో ఉన్నవారు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతలే. గరిష్టంగా రూ.30 వేల వరకు ఉన్న యూనిట్లను అధికార పార్టీ నేతలు తమకు అనుకూలురైన వారికి మాత్రమే దక్కేలా చక్రం తిప్పారని స్వయంగా లబ్ధిదారులే చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి కమిటీల సిఫార్సుల మేరకు టీడీపీ సానుభూతిపరులను మాత్రమే పథకానికి ఎంపిక చేశారని అంటున్నారు. అంతేకాకుండా లబ్ధిదారుల జాబితాలో పేరుండాలంటే ముడుపులు చెల్లించాల్సిందేనంటూ భారీ మొత్తాల్లో వసూళ్లు చేశారని పేర్కొంటున్నారు. ఇక మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు వస్తువుల     కొనుగోలులో తమకు అనుకూల కంపెనీలకు టెండర్లు దక్కేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలోని ఒక్క  ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌కే ఆదరణ పథకం కింద అన్ని వస్తువులను 50 శాతానికిపైగా సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ వ్యవహారంలో పలు లోపాయికారీ ఒప్పందాలు జరిగాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఆదరణ పథకం అంటే.. 
బీసీల్లో చేతివృత్తుల వారికి పనిముట్లు ఇచ్చి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు 2003లో చంద్రబాబు ప్రభుత్వం ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో దీనికి రూ.34.38 కోట్లు కేటాయించారు. నాడు వెలుగు పథకం అమలు చేయని మండలాల్లో మాత్రమే బీసీలకు పనిముట్లు పంపిణీ చేశారు. కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ–2 పేరుతో మరోసారి ఈ పథకాన్ని తెరమీదకి తెచ్చింది. 2018–19కి రూ.750 కోట్లు కేటాయించగా కేవలం రూ.50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. బీసీల్లో చేతివృత్తులవారు లబ్ధి పొందేందుకు అర్హులు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.10 వేలు, 20 వేలు, రూ.30 వేలు ఇలా మూడు యూనిట్లలో దేన్నో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న యూనిట్‌ మొత్తంలో తన వంతు వాటాగా 10 శాతం నగదు చెల్లించాలి. 20 శాతం మొత్తాన్ని జాతీయ బీసీ ఆర్థికాభివృద్ధి సంస్థ రుణంగా ఇస్తుంది. మిగిలిన 70 శాతం మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. తర్వాత పనిముట్లను అందిస్తారు. తొలి దశలో భాగంగా.. నవంబర్‌ 12 నుంచి 30 వరకు కేవలం 25,093 మంది మాత్రమే లబ్ధి పొందారు.  

పరికరాల్లో నాణ్యత లేదు 
క్షౌరవృత్తిలో ఉన్నవారికి వాయిద్య పరికరాలు ఇస్తామని సీఎం చంద్రబాబు తిరుపతికి వచ్చి గొప్పగా చెప్పి వెళ్లారు. సీఎం కార్యక్రమానికి నాతో పాటు చాలా మందిని తిరుపతి తీసుకెళ్లారు. దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు పరికరాలు ఇవ్వలేదు. నాతో పాటు దరఖాస్తు చేసుకున్నవారిలో ఇద్దరికి ఇచ్చారు. వాటిని పరిశీలిస్తే మార్కెట్‌లో రూ.2 వేలు ఉంటే ప్రభుత్వం అందజేసిన పరికరం విలువ రూ.7వేలుగా నమోదు చేశారు. రేట్లు అధికంగా చూపుతున్నా పరికరాల నాణ్యత మాత్రం అంతంత మాత్రంగా ఉంది.  
– ప్రవీణ్‌కుమార్, చిన్నగొట్టిగల్లు, చిత్తూరు జిల్లా  

అవినీతిమయం 
ఆదరణ–2 పథకం అవినీతిమయంగా మారింది. టీడీపీ నేతలు దరఖాస్తులన్నీ వారి ఆధీనంలో ఉంచుకొని వారు చెప్పినవారికే పరికరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిస్తున్నారు. దీంతో అర్హులకు న్యాయం జరగడం లేదు. పథకం కూడా ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. 
– ఉప్పు పాటేశ్వరరావు, లింగముక్కపల్లి, నూజెండ్ల, గుంటూరు జిల్లా 

ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు 
నేను గత కొన్నేళ్ల నుంచి వడ్రంగి పనిచేస్తున్నాను. ఆదరణ పథకం కింద పనిముట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వెళితే సర్వర్‌ పనిచేయడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సాకులతో నా పేరును ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయలేదు.  
–షేక్‌ నాగూర్, కొలకలూరు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా

నగదు చెల్లించినా పరికరాలు ఇవ్వలేదు 
నేను కొండపల్లిలో వెలుగుమిత్రగా పనిచేస్తున్నా. నా భర్త వెంకటేశ్వరరావు కూలీ. నా భర్త చేసే పనికి చేదోడుగా ఉంటుందని స్కమిషన్‌కు దరఖాస్తు చేశాను. అధికారులు చెప్పిన మేరకు రూ.810 డీడీ చెల్లించాను. గుంటుపల్లిలో మంత్రి ఉమా చేతుల మీదుగా మిషన్‌ ఇస్తాం రమ్మని ఫోన్‌ చేశారు. అక్కడకు వెళితే ఇంటికి పంపిస్తామని చెప్పి వెళ్లిపోమన్నారు. తర్వాత ఎంపీడీవో కార్యాలయంలో కలిస్తే మీ పేరు లిస్టులోనే లేదు రెండో లిస్టులో మంజూరు చేస్తామని చెబుతున్నారు.  
– పితాని లక్ష్మీ, కొండపల్లి, మైలవరం, కృష్ణా జిల్లా 

ప్రభుత్వం మోసం చేస్తోంది 
ఆదరణ పేరుతో ప్రభుత్వం పేదలను మోసం చేస్తోంది. టీడీపీ సానుభూతిపరులకు మాత్రమే పరికరాలు దక్కుతున్నాయి. ఇతరుల నుంచి కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు.  
–పులుకూరి కిరణ్, కొండాయిపాలెం, గుంటూరు జిల్లా

రెండు నెలలైనా కుట్టుమిషన్‌ రాలేదు 
కుట్టుమిషన్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి రెండు నెలలైంది. ఇప్పటివరకు కుట్టుమిషన్‌ మంజూరు చేయలేదు. అధికారులను అడుగుతుంటే నియోజకవర్గానికి కేటాయించిన లక్ష్యం మేరకు పరికరాలను అందజేస్తున్నామని చెబుతున్నారు. లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తున్నారో అర్థం కావడం లేదు. 
– దొడ్డాకుల వరలక్ష్మి, మండవల్లి, కైకలూరు, కృష్ణా జిల్లా 

ఆదరణ అంటే చేపల బాక్సులు, కుట్టు మిషన్లేనా? 
సాంకేతిక అభివృద్ధికి దోహదపడే పనిముట్లు ఇస్తామని ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. కంప్యూటర్‌ కోసం దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. అలాంటప్పుడు నైపుణ్య కేంద్రాల ద్వారా శిక్షణ ఇవ్వడం ఎందుకు? కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ సాంకేతిక విద్య కిందకు రాదా? ఆదరణ అంటే చేపల బాక్సులు, కుట్టు మిషన్లేనా? అవి కూడా తక్కువ ధరవి ఎక్కువకు కోట్‌ చేసి కాంట్రాక్టర్లకు అనుకూలంగా నాసిరకం పనిముట్లు ఇస్తున్నారు. 
– జామి అప్పలరాజు, తగరపువలస, విశాఖపట్నం జిల్లా

వాషింగ్‌ మెషీన్‌ పనిచేయడం లేదు  
రజకులకు ఆదరణ పథకం కింద వాషింగ్‌ మెషీన్లు ఇస్తామని ప్రకటించడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాను. అధికారులు చెప్పిన ప్రకారం రూ.3,500 డీడీ కూడా తీశాక వాషింగ్‌ మెషీన్‌ ఇచ్చారు. అయితే మెషీన్‌ హీట్‌ ఎక్కడం లేదు. మరికొంత మందికి ఇచ్చిన వాషింగ్‌ మెషీన్లు కూడా పనిచేయడం లేదని తెలిసింది.  
– చాకలి శివ, దేవనకొండ, కర్నూలు జిల్లా 

ప్రభుత్వ ప్రచారం కోసమే.. 
నేను హెయిర్‌కటింగ్‌ సెలూన్‌ నిర్వహిస్తున్నా. ఆదరణ పరికరాల కోసం రూ.2800 డీడీ చెల్లించాను. అధికారులు ఇచ్చిన కుర్చీలు నాసిరకంగా ఉన్నాయి. కాస్త బలంగా ఉన్నవారు కూర్చుంటే పక్కకు ఒరిగిపోతున్నాయి. ఆదరణ పథకం ప్రభుత్వ ప్రచారం కోసమే. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. 
– పి.రవిశంకర్, అప్సర సర్కిల్, కడప

నాసిరకం పనిముట్లు 
నాణ్యమైన కుర్చీలు ఇస్తామని చెప్పి నాసిరకం అంటగట్టారు. వాయిద్య పరికరాలు కూడా ఎందుకూ పనికిరానివి సరఫరా చేశారు. ఆదరణ పథకం కింద మంజూరు చేసిన పనిముట్లను చూసి చాలామంది దరఖాస్తు చేయడం లేదు.. దరఖాస్తు చేసినవారు డీడీలు తీయడం లేదు.  
– ఇ.రవిశంకర్, బార్బర్‌ షాపు యజమాని, మోచంపేట, కడప 

వడ్రంగి పనిచేసే నేను ఇస్త్రీపెట్టెతో ఏం చేయాలి? 
నేను 15 ఏళ్ల నుంచి వడ్రంగి పనిచేస్తున్నాను. ఆదరణ పథకానికి దరఖాస్తు చేసుకున్నా. మోటార్‌తో కూడిన చెత్రి మిషన్‌ కావాలని కోరితే అధికారులు ఇస్త్రీ పెట్టె, కుట్టు మిషన్‌ ఇస్తామన్నారు. వడ్రంగి పనిచేసే నేను ఇస్త్రీపెట్టె, కుట్టుమిషన్‌తో ఏం చేయాలి? వీటికోసం వడ్రంగి పని వదిలేసి కొత్త పని నేర్చుకోవాలా? 
– జి.గంగరాజు, తంగెళ్లమూడి, ఏలూరు మండలం, పశ్చిమ గోదావరి 

ఇప్పటివరకు మంజూరు కాలేదు 
మాది జగ్గంపేట మండలం జె.కొత్తూరు. రజక వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాతోపాటు మా అమ్మ సత్యవతి పేరున వాషింగ్‌ మెషీన్ల కోసం దరఖాస్తు చేసుకుని అక్టోబర్‌లో మా వాటాగా రూ.3,500 చొప్పున చెల్లించాను. అయితే ఇప్పటివరకు వాషింగ్‌ మెషీన్లు ఇవ్వలేదు. ఎంపీడీవో కార్యాలయంలో అడిగితే మంజూరు కాలేదన్నారు. 
– మాయలేటి శ్రీను, జె.కొత్తూరు, జగ్గంపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా 

ఇస్త్రీపెట్టె తీసుకెళ్లమంటున్నారు.. 
రజకులకు వాషింగ్‌ మెషీన్లు ఇస్తామని అధికారులు చెప్పడంతో డీడీలు తీయడానికి వెళ్లాం. తీరా వాషింగ్‌ మెషీన్లు లేవు.. ఇస్త్రీపెట్టెలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. రూ.30 వేల యూనిట్‌కు ఇస్త్రీపెట్టె తీసుకెళ్లాలని చెప్పడం ఏంటి? పంపిణీ చేసిన వాటిలోనూ 70 శాతం నాసిరకం వస్తువులే. దీనిపై ఆందోళనకు సిద్ధమవుతున్నాం. 
–పి.కొండయ్య, రజక సంఘం జిల్లా నేత, ప్రకాశం జిల్లా 

అర్హులకు అందని పనిముట్లు  
ఆదరణ పథకం కింద అర్హులైన వారికి పనిముట్లు అందని దుస్థితి నెలకొంది. కోడుమూరులో 1500 మంది చేనేత కార్మికులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు కేవలం 100 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఈ 100 మందిలో కూడా 60 శాతం మందికి పనిముట్లు అందలేదు. కేవలం రాజకీయ పలుకుబడి ఉన్నవారు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు.  
– కామార్తి చంద్రశేఖర్, చేనేత కార్మికుడు, కోడుమూరు, కర్నూలు జిల్లా 

కల్లుగీత కార్మికులకు పరికరాలు లేవట
ప్రభుత్వం ఆదరణ పరికరాలు ఇçస్తుందని తెలియడంతో దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లాను. అయితే కల్లు గీత కార్మికులకు ఎలాంటి పరికరాలు లేవని అధికారులు తిప్పిపంపేశారు. ప్రభుత్వం ఆదరణ పథకం కింద బీసీల్లో అన్ని వర్గాలకు పనిముట్లు ఇస్తున్నామని ఆర్భాటంగా చెప్పుకుంటోంది. కానీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. 
కె.తిరుమలయ్య, చిత్తూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement