బాబు నహీ ‘కియా’ | Chandrababu New Drama Before the Election | Sakshi
Sakshi News home page

బాబు నహీ ‘కియా’

Published Thu, Jan 31 2019 4:27 AM | Last Updated on Thu, Jan 31 2019 4:27 AM

Chandrababu New Drama Before the Election - Sakshi

కియా మోటార్స్‌ ఏర్పాటుకు భారత్‌–కొరియా దేశాల ప్రధానుల మధ్య జరిగిన ఒప్పందం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: మీరొక కార్ల కంపెనీ స్థాపించారనుకుందాం.. అది నిర్మాణం కూడా పూర్తి చేసుకోకముందే, ఇంకెక్కడి నుంచో కారును తీసుకొచ్చి, ఇక్కడే తయారు చేశారు చేశామహో అని టముకు వేసుకుంటే చూసేవాళ్లు ఏమనుకుంటారు? కచ్చితంగా మోసగాడనే అనుకుంటారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు కూడా అలాగే ఉంది. సరిగ్గా ఎన్నికల ముందే చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తంటాలు పడుతున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఏర్పాటు చేసిన ‘కియా’ మోటార్స్‌ ప్లాంట్‌లో వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే ఇక్కడ కార్ల ఉత్పత్తికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. అయినా ఈ ప్లాంట్‌ నుంచి తొలి కారు బయటకు వచ్చేసిందంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. ఇదంతా తన ఘనతేనని ఊరూవాడా ఊదరగొడుతున్నారు. కరువు జిల్లా అనంతపురం రూపురేఖలు సమూలంగా మార్చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు. దక్షిణ కొరియా నుంచి కారు తెప్పించి, అది ఇక్కడే తయారు చేశామంటూ నిస్సిగ్గుగా తన అనుకూల మీడియా అండతో ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు తీరును చూసి రాష్ట్ర ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

అనుబంధ పరిశ్రమలు ఏర్పాటైతేనే.. 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో ‘కియా’తో అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. 2017లో పెనుగొండ సమీపంలోని ఎర్రమంచి గ్రామం వద్ద కియా కార్ల ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభమైంది. 2019 ద్వితీయార్ధంలో కారును బయటకు తీసుకురావడమే లక్ష్యంగా కియా కంపెనీ పనిచేస్తోంది. ఈ విషయాన్ని 2018 ఫిబ్రవరి 22న జరిగిన ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ సెరమనీ (కియా రూపకల్పన ప్రక్రియ వేడుక)లో కియా ప్రెసిడెంట్‌ పార్క్‌ ప్రకటించారు. మొదట కార్ల విడిభాగాలను దక్షిణ కొరియా నుంచి తెప్పించి, ఇక్కడ వాటిని అమర్చి కార్లను తయారీ చేస్తారు. అనుబంధ పరిశ్రమలు ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయిలో అన్ని పరికరాలను ఇక్కడే తయారు చేసే అవకాశం ఉంది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే 3 వేల మందికి ప్రత్యక్షంగా, 7 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. వృత్తి నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సాంకేతిక విద్యను అభ్యసించి, ‘కియా’కు అవసరమైన వృత్తి నైపుణ్యం ఉంటేనే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు.  

ఎన్నికల షెడ్యూల్‌కు ముందు బాబు హడావుడి 
కియా ఫ్యాక్టరీకి శంకుస్థాపన తర్వాత 2018 ఫిబ్రవరి 22న ‘ప్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ సెరమనీకి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఏ ఫ్యాక్టరీకైనా భూమిపూజ, శంకుస్థాపన చేస్తారు. ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి బయటకు వచ్చే సమయంలో ప్రారంభోత్సవం చేస్తారు. కానీ, చంద్రబాబు అందుకు భిన్నంగా శంకుస్థాపన, భూమిపూజతోపాటు ఫ్రేమ్‌ ఇన్‌స్టలేషన్‌ సెరమనీలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ నెలరోజుల్లో వెలువడుతుందనగా ‘కియా’ నుంచి కార్లు బయటకు వస్తున్నాయని ప్రచారం చేసుకునేందుకు ‘ట్రయల్‌ ప్రొడక్షన్‌ సెరమనీ’ని జనవరి 29న నిర్వహించారు.  

మరో ఏడాది సమయం తప్పదు 
కియా కార్ల తయారీ ప్లాంట్‌లో మిషనరీ అమరికే ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు. మిషనరీ అమరిక నేపథ్యంలో ట్రయల్‌ ప్రొడక్షన్‌ వేడుక నిర్వహించారు. కార్లు ఉత్పత్తి అయ్యి, మార్కెట్‌లోకి వచ్చేందుకు మరో ఆరు నెలలు పడుతుందని చంద్రబాబుతోపాటు కియా ప్రతినిధులు చెబుతున్నా.. నిజానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. కొరియా నుంచి యంత్రాలు రావాల్సి ఉంది. ఏడాదికి 3 లక్షల కార్లు తయారు కావాలంటే, రోజుకు 822 కార్లు ఉత్పత్తి కావాలి. అంటే గంటకు 34 కార్ల చొప్పున సిద్ధం కావాలి. కార్ల తయారీలో ప్రెస్, బాడీఫిట్టింగ్, పెయింట్‌ తదితర రంగాల్లో 300 రోబోలను అమర్చాల్సి ఉంది. ఇప్పటిదాకా ఒక్క రోబో కూడా సిద్ధం కాలేదు. ఇవన్నీ తెలిసినా కొరియా తెచ్చిన కారులో ‘షికారు’ చేసి, తన అనుకూల మీడియా ద్వారా పచ్చి అబద్ధాలు చంద్రబాబు వల్లెవేస్తుండడం గమనార్హం. 

ఉద్యోగాల కల్పనలోనూ మోసం 
‘కియా’ పరిశ్రమలో 86 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తామని ప్రభుత్వం మొదట్లో ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానికుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందిస్తామని హామీ ఇచ్చింది. కియా సంస్థలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చింది. ప్రత్యక్షంగా కల్పించే 3 వేల ఉద్యోగాల్లో కనీసం 10 శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వలేదు. ఈ పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో కార్ల తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్న సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ నియమిస్తున్నారు. ఇదేం అన్యాయమని ముఖ్యమంత్రి చంద్రబాబును విలేకరులు ప్రశ్నిస్తే... ‘స్థానికులకే ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావు. వృతి నైపుణ్యం ఉండాలి కదా? అందుకోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. భూములు కోల్పోయిన 376 కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం’’ అని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ‘కియా’లో కొందరు స్థానికులకు వాచ్‌మెన్లు, స్వీపర్లు, టాయిలెట్లు శుభ్రం చేయడం వంటి చిన్నాచితక పనులే దక్కాయి. 
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని కియా మోటర్స్‌ ప్లాంటు వద్ద పనులు జరుగుతున్న దృశ్యం 

ముందే చక్కబెట్టిన మంత్రులు 
కియా మోటార్స్‌ పెనుకొండ సమీపంలో ఏర్పాటవుతున్నట్లు ముందుగానే తెలుసుకున్న మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, బీకే పార్థసారథి తదితరులు ఎర్రమంచి పరిసర ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. ‘కియా’లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు మొదలైతే ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. ఇది ముందుగానే ఊహించిన టీడీపీ ప్రజాప్రతినిధులు నిరుపేద రైతుల నుంచి అతితక్కువ ధరకు పెద్దఎత్తున భూములు కొనేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement