సర్వీసు ఈనాం అంటే?
శతాబ్దాలు.. దశాబ్దాల క్రితం కుల వృత్తులు చేసే వారికి గ్రామాల్లో భూములను ఈనాంగా ఇచ్చారు. వారి వారి వృత్తుల పరంగా ఆల యాల నిర్వహణలో, ప్రజావసరాల్లో వారి భాగస్వామ్యం ఉండేది. ఈ క్రమంలో రజక, కుమ్మరి, కమ్మరి, మాదిగ, మాల, షరబి, భజంత్రి, పూజారి, వడ్రంగి తదితరుల భుక్తి కోసం అప్పట్లో భూములు ఇచ్చారు. వాటిని అనుభవిస్తూ సేవలు అందించేవారు.
సాక్షి, అమరావతి: సర్వీసు ఈనాం భూమి రైతుల కష్టాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చరమగీతం పాడింది. భూముల సమస్యలన్నింటినీ సానుకూలంగా కొలిక్కి తెచ్చే క్రమంలో సర్వీసు ఈనాం భూముల సమస్యను పరిష్కరించింది. నిషేధిత ఆస్తుల జాబితా 22(ఎ) నుంచి 1.68 లక్షల ఎకరాలను తొలగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో 25 జిల్లాల్లో 1.13 లక్షల మంది కుల వృత్తులు చేసుకునే రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
ఇప్పటికే 2.08 లక్షల ఎకరాల చుక్కల భూములు, 33 వేల ఎకరాల షరతుల గల పట్టా భూములు, ఇవే తరహాలోని మరో 60 వేల ఎకరాలకుపైగా భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించింది. మొత్తం 3 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. తాజాగా 1.68 లక్షల సర్వీస్ ఈనాం భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించడం ద్వారా తాను పేద రైతుల పక్షపాతినని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించారు.
2013లో పొరపాటున 22(ఎ)లోకి
1956లో ఈనాం చట్టం రావడంతో ఈనాం భూములను రద్దు చేసి, వారికి రైత్వారీ పట్టాలు ఇచ్చారు. దాని ప్రకారం చాలా మంది రైతులు పట్టాలు పొందారు. కొందరు రైతులు తమ అవసరాల కోసం అమ్ముకోగా, మరికొందరు వారసులకు ఇచ్చారు. 2013 వరకు ఈ రైత్వారీ పట్టాలను పట్టా భూములుగానే పరిగణించడంతో పట్టాదారులు సకల హక్కులు అనుభవించేవారు. 2013లో ఈ చట్టానికి సవరణ చేశారు. దేవాలయాలు, ధార్మిక సంస్థలకు ఇచ్చిన సర్వీసు ఇనాం భూములను ఉద్ధేశించి ఈ సవరణ జరిగింది.
ఆ సంస్థల్లో పని చేసే వారు ఆ సర్వీసును అందించినంత కాలం ఆ భూమిపైన వచ్చే ఫలసాయాన్ని అనుభవించడమే తప్ప అమ్ముకునేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఇందుకు అనుగణంగా దేవాదాయ, ధార్మిక సంస్థలకు సంబంధించిన ఈనాం భూములను 22(ఎ)లో పెట్టారు. ఆ సమయంలో వాటితోపాటు గ్రామాల్లో చేతి వృత్తుల వారు అనుభవిస్తున్న ఈనాం భూములను కూడా 22(ఎ)లో చేర్చారు.
ఒడ్డున పడేసిన జగన్ ప్రభుత్వం
2013 వరకు ఆ భూములపై సర్వ హక్కులు అనుభవించిన రైతులు ఒక్కసారిగా తమ హక్కులను కోల్పోయినట్లయింది. ఈ తప్పును సరిచేసే అవకాశం ఉన్నా, గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. లక్షలాది మంది రైతులతో ముడిపడి ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన గత ప్రభుత్వం చేయలేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఈ సమస్య రావడంతో పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే సర్వీసు ఈనాం భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించి 2013కు ముందున్న సర్వ హక్కులు కల్పించడానికి మంత్రివర్గం ఆమోదించింది. దీనివల్ల వివిధ కుల వృత్తుల్లోని 1,13,610 మందికి చెందిన 1,68,604 ఎకరాల భూములకు విముక్తి లభించింది. తద్వారా ఆ రైతుల కుటుంబాలకు మేలు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment