సింగరాయకొండ : ఏళ్ల నుంచి రైతుల సాగుబడిలో ఉన్న ఇనాం భూములు దేవునియంటూ దేవాదాయశాఖ అధికారులు ప్రకటించడం సింగరాయకొండ మండలంలో కలకలం సృష్టిస్తోంది. దేవాదాయ, ధర్మాదాయశాఖకు చెందిన భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని ఆ శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ కేబీ శ్రీనివాసరావు ఆదేశాలతో రైతులు ఉలిక్కిపడ్డారు. మరోపక్క ఉన్నతాధికారి ఆదేశాలు అమలు చేసే పనిలో కిందిస్థాయి అధికారులు బిజీగా ఉన్నారు.
వివరాలు.. సింగరాయకొండ మండలంలోని పది గ్రామాల్లో 2,132 ఎకరాలు దేవాదాయశాఖకు చెందినవని, వాటికి రిజిస్ట్రేషన్లు ఆపాలంటూ ఆ భూముల వివరాలకు సంబంధించి సర్వే నంబర్లతో సహా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఓ ఫైల్ అందింది. ఆ భూములను తాము 100 ఏళ్లుగా అనుభవిస్తున్నామని, ఇప్పటికిప్పుడు అవి దేవాదాయశాఖవనడం అన్యాయమని హక్కుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ గ్రామ రెవెన్యూ అధికారులు ఈ విషయంలో ప్రజల పక్షాన నిలిచారు.
1956లో ఇనాం రద్దు చట్టం, 1946 ఎస్టేట్ చట్టం వచ్చాయని, ఈ రెండింటి ప్రకారం రెవెన్యూ రికార్డులు పరిశీలించి సంబంధిత స్థలాలకు రైతువారి పట్టాలతో పాటు, పట్టాదారు పాసుపుస్తకాలు కూడా అప్పట్లోనే ఇచ్చామని చెబుతున్నారు. దేవాదాయశాఖ అధికారులు ఇప్పటికిప్పుడు ఆ స్థలాలు ప్రభుత్వానివని ఏ విధంగా అంటారని, రిజిస్ట్రేషన్లు ఎలా ఆపుతారని ప్రశ్నిస్తున్నారు. స్థానిక నాయకులు మాత్రం సమస్యను కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరంజనేయస్వామి దృష్టికి తీసుకెళ్లారు.
దేవాదాయశాఖ మంత్రి విదేశాలకు వెళ్లారని, ఆయన రాగానే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. దేవాదాయశాఖ ఆదేశాలపై ఉద్యమించేందుకు భూముల పరిరక్షణ కమిటీ ఏర్పడింది. దేవాదాయశాఖ అధికారులు మాత్రం తాము చట్ట ప్రకారం నడుచుకుంటున్నట్లు చెబుతున్నారు.
గత ప్రభుత్వ పుణ్యమేనా?
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి రె వెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అధ్యక్షతన ఇనాం భూములపై కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2013లో యాక్ట్ నంబర్ 16 ఆఫ్ 2013 ప్రకారం 1956 ఇనాం రద్దు చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ఇనాం భూములను దేవాదాయశాఖ పరిధిలోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చట్టం ప్రకారమే తాము రెవెన్యూ శాఖకు సంబంధించి ఆర్‌ఎస్‌ఆర్ ప్రకారం ఏడాది కాలంగా రికార్డులు వెతికి ఇనాం భూముల జాబితా రూపొందించామని అధికారులు వివరించారు. భూములు అనుభవిస్తున్న వారికి త్వరలో నోటీసులు జారీ చేసి వాటిని స్వాధీనం చేసుకుంటామని పేర్కొంటున్నారు.
అవన్నీ ఇనాం భూములే: కేబీ శ్రీనివాసరావు, ఏసీ, దేవాదాయశాఖ
సింగరాయకొండలో ఇనాం భూములు ఉన్నాయని గతంలోనే చెప్పా. అప్పుడు ఎవరూ నా మాట పట్టించుకోలేదు. అయితా రామయ్యశ్రేష్టి సత్రం కమిటీ సభ్యులు మాపై వివిధ రకాల కేసులు బనాయించారు. అందులో భాగంగా అసలు సింగరాయకొండ మండలంలో దేవాదాయశాఖకు చెందిన భూముల వివరాల సమగ్ర సమాచారాన్ని సేకరించాం. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం ఇనాం చట్టం స్థానంలో కొత్త చట్టం రూపొందించింది. ఆ చట్టం ప్రకారమే ఇనాం భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి సమాచారం పంపాం.
ఇనాం భూములన్నీ దేవునివే!
Published Fri, Sep 12 2014 1:48 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement