పరీక్షలను బహిష్కరించి కళాశాల లోపల ఆందోళన చేస్తున్న విద్యార్థులు
మణికొండ: కళాశాలలో చేరే సమయంలో పేర్కొన్న ఫీజులనే చెల్లిస్తాం తప్ప పెంచిన ఫీజులను చెల్లించే ప్రసక్తే లేదని విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళన బాటపట్టారు. రెండు రోజుల పాటు తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నా యాజమాన్యం దిగిరాకపోవటంతో గురువారం ఏకంగా పరీక్షలను సైతం బహిష్కరించి రోడ్డెక్కారు. గండిపేట మండల కేంద్రంలో ఉన్న చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి రూ.1.20 లక్షల ఫీజు తీసుకుంటామని యాజమాన్యం అప్పట్లో పేర్కొంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల విషయంపై తీసుకున్న చర్యలను వ్యతిరేకిస్తూ కొన్ని కళాశాలల వారు కోర్టును ఆశ్రయించారు.
దాంతో రాష్ట్ర హైకోర్టు కళాశాలల్లో అదనపు సౌకర్యాలు ఉన్న పలు కళాశాలలకు అదనపు ఫీజు వసూలు చేసుకునే వీలు కల్పించింది. దాంతో గత సంవత్సరం నుంచి విద్యార్థుల వద్ద రూ.1.20 లక్షలకు బదులుగా కోర్టు సూచించిన విదంగా రూ.2లక్షలు వసూలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోటాలో సీట్లు పొందిన ఎ కేటగిరీ విద్యార్థుల నుంచి యథావిధిగానే ఫీజు వసూలు చేస్తామని సర్క్యులర్ జారీచేయడంతో అప్పట్లో విద్యార్థులు శాంతించారు. ఈ సంవత్సరం నుంచి యాజమాన్యం, ఎన్‌ఆర్‌ఐ కోటాలో సీట్లు పొందిన బి కేటగిరీ విద్యార్థుల నుంచి పెంచిన ఫీజలు చెల్లించాలని నిర్ణయించారు. ఆ విషయం తెలుసుకున్న విద్యార్థులు రెండు రోజులుగా ఆందోళన బాటపట్టారు. కళాశాల ప్రాంగణంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫీజుల చెల్లింపు విషయంలో ప్రశ్నించిన ఒక విద్యార్థిని ప్రిన్సిపాల్ కొట్టడంతో పాటు మరో నలుగురు విద్యార్థుల దుస్తులు విప్పి బంధించారని విద్యార్థులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment