పాలీసెట్ ఎప్పుడో? | Andhra pradesh and telangana not prepared polycet notification and schedule | Sakshi
Sakshi News home page

పాలీసెట్ ఎప్పుడో?

Published Wed, Apr 15 2015 4:50 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM

పాలీసెట్ ఎప్పుడో? - Sakshi

పాలీసెట్ ఎప్పుడో?

  • నోటిఫికేషన్ కోసం 2.5 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపు
  • పాలిటెక్నిక్‌లో ప్రవేశాలపై రెండు రాష్ట్రాలదీ నిర్లక్ష్య వైఖరే
  • వేర్వేరుగా ప్రవేశాలకు ఫైలు పెట్టినా స్పందించని ప్రభుత్వాలు
  • సాంకేతిక విద్యా మండలి పదో షెడ్యూల్‌లో ఉన్నందునే ఈ పరిస్థితి
  •  సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్-2015 పరీక్ష నోటిఫికేషన్ కు ఏప్రిల్ వచ్చినా మోక్షం లభించడం లేదు. గత ఏడాది ఈ సమయం నాటికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఈసారి నోటిఫికేషన్ జారీకే అడ్డంకులు తొలగలేదు. దీంతో ఈ ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు ఆలస్యం కావడం తప్పేలా లేదు. రెండు రాష్ట్రాల్లో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు పాలీసెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించే సాంకేతిక విద్యామండలి పదో షెడ్యూల్‌లో ఉన్నందున.. రెండు రాష్ట్రాలకూ కలిపి ఒకేసారి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపట్టాలా? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపట్టాలా? అనే అంశం ఎటూ తేలలేదు.

    ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు ఓ నిర్ణయాన్ని తీసుకోవడంలో ఎడతెగని జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు ఆయోమయానికి గురవుతున్నారు. రెండు రాష్ట్రాల్లో 470 పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా వాటిలో 1,45,481 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో తెలంగాణలోని 194 కాలేజీల్లో 61 వేల సీట్లు అందుబాటులో ఉండగా ఏపీలోని 276 కాలేజీల్లో మిగతా సీట్లు ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత ఏడాది 2,54,060 మంది విద్యార్థులు రెండు రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
     
    ప్రవేశాల్లో తప్పని ఆలస్యం
    గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో ఏప్రిల్ 2న నోటిఫికేషన్ జారీ చేసి వెంటనే దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. మే 21న రాత పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపట్టారు. కానీ ఈసారి పాలిటెక్నిక్ ప్రవేశాలు సకాలంలో జరిగేలా లేవు. సాంకేతిక విద్యామండలి పదో షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష వల్ల సమస్యలొస్తాయని భావించిన అధికారులు వేర్వేరు పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించారు. కానీ దీనిపై ప్రభుత్వాలు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వాల నుంచి ఆమోదం రావడం, నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను ఆహ్వానించడం, పరీక్ష నిర్వహించడం వంటి కార్యక్రమాలకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement