సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారడం లేదు. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సోమవారం తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఇంటర్ బోర్డు వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బోర్డు కార్యాలయాన్ని ముట్టడికి అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ముట్టడిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక, ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. సీఎం నివాసమైన ప్రగతిభవన్ ముందు పెద్దసంఖ్యలో ఏబీవీపీ విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని.. బలవంతంగా అరెస్టు చేసి.. అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నేతల అరెస్టులు..!
ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్‌ను అరెస్టు చేసి కాంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిని అరెస్టు చేసి.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గీతారెడ్డిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డిలను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాంధీ భవన్ నుంచి ఇంటర్ బోర్డ్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్, కార్యదర్శులు కురువ విజయ్‌కుమార్, అల్లం భాస్కర్‌తోపాటు ఎన్‌ఎస్‌యూఐ నేతలను నాంపల్లి చౌరస్తా అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్టేషన్‌కు తరలించారు.
గృహనిర్బంధాలు..
మేడ్చల్‌లో డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌ను సైతం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ సహా తెదేపా నాయకుడు సాధినేని శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ముందస్తుగా పలువురు నాయకులను పోలీసులు గృహనిర్భందించారు. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యలను గృహనిర్భందం చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజ్‌గిరిలో 9 మంది, నేరేడ్ మెట్లో 10 మంది విపక్ష నేతలను అరెస్టు చేశారు. మేడ్చల్‌లో పాతూరి సుధాకర్ రెడ్డి సహా పలువురి నాయకులు అరెస్టయ్యారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు గృహనిర్భందం చేశారు. హైదరాబాద్ వెళ్లకుండా ఆయన ఇంటి ఎదుట పోలీసులు మోహరించారు.
దద్దరిల్లిన ఇంటర్ బోర్డు
ఇంటర్ బోర్డు కార్యాలయం నినాదాలు, నిరసనలతో దద్దరిల్లుతోంది. ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల శ్రేణులు ప్రయత్నించాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నాయకులు బోర్డు కార్యాలయం వద్దకు చేరుకొని.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేస్తూ ముట్టడికి దిగిన నిరసనకారులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
అరెస్టులు.. నిర్బంధం..
ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ బోర్డు ముట్టడికి బయలుదేరిన నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుడు అంజన్‌కుమార్ యాదవ్, టీజేఎస్ అధినేత కోదండరామ్‌ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. తమ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తుండటాన్ని ఉత్తమ్, కోదండరామ్, చాడా వెంకట్‌రెడ్డి ఖండించారు. మరోవైపు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా హైదరాబాద్‌లో సీపీఎం ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలతో తెల్లవారుజామున 4 గంటలకే జూలకంటి ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయనను హౌజ్ అరెస్టు చేసి నిర్బంధించారు.
అరెస్టులపై పొన్నం మండిపాటు
ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అరెస్టులు చేపడుతుండటాన్ని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఖండించారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, అరెస్టులు కాదు విద్యార్థులకు న్యాయం చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హక్కులను కాలరాస్తున్నారని, పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి నిర్బంధించడం అక్రమమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించిన ఏజెన్సీ తప్పిదాలపై ప్రభుత్వం స్పందించిన తీరును నిరసిస్తూ చేపట్టిన తమ పోరాటాన్ని జయప్రదం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment