నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడతో పాటు ఖమ్మం జిల్లాలోని వైరా స్థానం కూడా తమకు ఇవ్వాలని సీపీఎం పట్టుబట్టడం, మిర్యాలగూడ మాత్రమే ఇస్తానని కాంగ్రెస్ చెప్పడంతో సీపీఎం ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇప్పటివరకు రెండు విడతల్లో 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.
కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పొత్తుపై సీపీఎంతో చర్చలు జరుపుతూనే ఉంది. దీంతో చివరి క్షణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై రెండు పార్టీల కార్యకర్తల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు కుదిరిన నేపథ్యంలో.. సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ జోరుగా సాగుతోంది.
అసలు సీపీఎం ఓటింగ్ ఎంత?
సీపీఎం పోటీ చేస్తున్న 19 స్థానాల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి. కాగా సీపీఎం కారణంగా ఈ జిల్లాల్లో లేదా ఈ స్థానాల్లో తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అనే ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓట్లను విశ్లేషిస్తే, సీపీఎం కొన్నిచోట్ల కాస్త ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. భద్రాచలం, వైరా, మిర్యాలగూడ లాంటి స్థానాల్లో ఓ మాదిరి సంఖ్యలో ఓట్లు పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేయగా, సీపీఎం ఒంటరిగా రాష్ట్ర వ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి మొత్తం 91,099 ఓట్లు మాత్రమే పొంది ఒక్క సీటూ గెలవలేదు. సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేసి 83,215 ఓట్లు సాధించినా ఎక్కడా గెలవలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పొందిన ఓట్ల కన్నా సీపీఐ, సీపీఎం పార్టీలు సాధించిన ఓట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు ఏకంగా 6.73 లక్షల ఓట్లు (3.3 శాతం) వచ్చాయి. అంతేకాదు నోటాకు వచ్చిన స్థాయి లోనూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు రాలేదంటే అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
అప్పట్లో నోటాకు 2.2 లక్షలు అంటే 1.1 శాతం ఓట్లు వచ్చాయి. సీపీఎం రాష్ట్రంలో ఆ ఎన్నికల్లో కేవలం 0.44 శాతం ఓట్లు మాత్రమే పొందింది. అధికంగా భద్రాచలంలో 14,228, వైరాలో 11,373, మిర్యాలగూడలో 11,221, ఇబ్రహీంపట్నంలో 9,106, పాలేరులో 6,769 ఓట్లు వచ్చాయి. అత్యంత తక్కువగా హైదరాబాద్‌లోని నాంపల్లిలో 400 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా అప్పటికీ ఇప్పటికీ సీపీఎం పెద్దగా పుంజుకున్నదేంలేదని, వాస్తవానికి అప్పటికంటే ఇప్పుడు పార్టీ ఓటు బ్యాంక్ ఇంకా తగ్గిందనే అభిప్రాయం
వ్యక్తమవుతోంది.
సీపీఎం పోటీతో ఏ పార్టీకి ప్రయోజనం?
2018లో ఓటింగ్‌ను పరిశీలిస్తే చూస్తే, ఇప్పుడు సీపీఎం బరిలో నిలిచే స్థానాల్లో ఎక్కడా గెలిచే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే పార్టీ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆ పార్టీ చెబుతోంది. కాగా ఐదారు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం సీపీఎంకు ఉందని విశ్లేషకులంటున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటే, ఆయా స్థానాల్లో సీపీఎం పోటీ వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అంటున్నారు.
అదే పోటాపోటీగా ఉన్న స్థానాల్లో మాత్రం సీపీఎంకు పడిన ఓట్ల వల్ల ఏదో ఒక పార్టీ నష్టపోయినట్టుగానే పరిగణించాల్సి వస్తుంది. మరోవైపు కొన్నిచోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే ఆ మేరకు కాంగ్రెస్‌కు నష్టమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే, సీపీఎంతో పొత్తుతో కొంత ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయంతోనే.. కాంగ్రెస్ ఇంకా ఆశలు వదులుకోలేదు. మిర్యాలగూడ స్థానంలో అభ్యరి్థని ప్రకటించకుండా అందుకే పెండింగ్‌లో పెట్టిందని చెబుతున్నారు.
మరో 3 స్థానాలకు సీపీఎం అభ్యర్థుల ప్రకటన
ఇప్పటివరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం, మంగళవారం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడలో మట్టిపెల్లి సైదులు, మునుగోడులో దోనూరు నర్సిరెడ్డి, ఇల్లెందులో దుగ్గి కృష్ణలను ఖరారు చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
-బొల్లోజు రవి
Comments
Please login to add a commentAdd a comment