♦ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో
♦ ఉత్తీర్ణత అంతంత మాత్రమే
♦ ఫస్టియర్‌లో 37, సెకండియర్‌లో 59 శాతం పాస్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇంటర్మీడియట్ ఫలితాల్లో సర్కారు కాలేజీలు వెనకబడ్డాయి. రాష్ట్రస్థాయిలో జిల్లా అగ్రగామిగా ఉన్నా ప్రభుత్వ కాలేజీల విభాగంలో మాత్రం అథమంగానే నిలిచింది. జిల్లాలో 24 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 2015-16 వార్షిక సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 2,943 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో కేవలం 1,082 మంది మాత్రమే (37శాతం) ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం నుంచి 2,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 1,406 మంది మాత్రమే (59శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఉత్తీర్ణత శాతం రాష్ట్ర సగటును సైతం అందుకోకపోవడం గమనార్హం.
‘ప్రథమం’లో చివరి ర్యాంకు...
జిల్లాలో 450 ఇంటర్మీడియట్ కాలేజీలుండగా.. ఇందులో 5శాతం ప్రభుత్వ కాలేజీలున్నాయి. మిగతా వాటిలో 280కిపైగా కార్పొరేట్ కాలేజీలు. ఇవన్నీ మహానగరానికి సమీపంలో ఉండడం.. వీటిలో విద్యార్థుల సంఖ్య లెక్కకు మించి ఉండడం.. తాజాగా పాసైన వారిలో ఈ విద్యార్థులే అధికం కావడంతో ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రభాగాన నిలిచిందని చెప్పొచ్చు. అదే ప్రభుత్వ కాలేజీలు, గ్రామీణ కాలేజీల్లో మాత్రం ఫలితాల తీరు అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రభుత్వ కాలేజీల విభాగం ఫస్టియర్ ఫలితాల్లో జిల్లా అట్టడుగున 10 ర్యాంకుతో సరిపెట్టుకోగా.. సెకండియర్‌లో ఏడో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.