backwardness
-
వెనుకబాటుతనాన్ని రూపుమాపాలన్నదే సీఎం జగన్ తపన
సాక్షి, కృష్ణా: కులం, డబ్బు, మతం కారణంగా అసమానతలు ఉండకూడదని, స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కలలు కంటున్నామని, కానీ.. అసమానతలు లేని పాలన నాడు వైఎస్సార్.. నేడు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ.. వెనుకబాటుతనాన్ని రూపుమాపాలన్నదే సీఎం వైఎస్ జగన్ తపన అని ఉద్ఘాటించారు. గతంలో ఎందరో పాలకులున్నా ఎవరికీ ఈ తరహా ఆలోచనలు రాలేదు. రాజకీయాలలో కూడా అణగారిన వర్గాలకి ఎక్కువ అవకాశం ఇచ్చింది నాడు వైఎస్సార్.. నేడు సీఎం వైఎస్ జగన్. కౌన్సిల్లో 18 మంది బలహీన వర్గాలు.. ఆరుగురు ఎస్సీలు, నలుగురు మైనార్టీలకి అవకాశమిచ్చారు సీఎం జగన్. అదే చంద్రబాబును చూసుకుంటే.. 2014 నుంచి 2019 వరకు గిరిజలకి, మైనార్టీలకి చంద్రబాబు అవకాశమివ్వలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. అధికారిక హోదాలో 50 శాతం మహిళలకి అవకాశం ఇచ్చారు సీఎం జగన్. ఇక ఏజెన్సీ ప్రాంతంలో నూటికి నూరుశాతం గిరిజనులకే అధికారం. గిరిజనుల ప్రాంతంలో ఆసుపత్రులకి స్పెషలిస్ట్ లకి ఇచ్చిన అత్యధిక జీతం రూ. 6 లక్షలు. ఏజెన్సీ ప్రాంతంలో కూడా వాలంటీర్ల ద్వారా ఇంటికే పాలన అందిస్తున్నాం. విద్య, వైద్యంలో తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులతో ఏజెన్సీ ప్రాంతాల రూపురేఖలే మారిపోతున్నాయి అని సజ్జల వివరించారు. కుంభా రవిబాబు సమర్థుడు గిరిజనులకే కాకుండా అన్ని వర్గాలకి దగ్గర వ్యక్తి కుంభా రవిబాబు. కుంభా రవిబాబు ఎస్టీ కమీషన్ చైర్మన్ గా ఇప్పడివరకు సమర్దవంతంగా పనిచేశారు. ఇపుడు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందన్నారు. బాబు కనీసం ఆ పుణ్యమైనా కట్టుకోవాల్సింది ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా నాడు వైఎస్సార్ ప్రారంభిస్తే.. నేడు సీఎం వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మాణంతో నిరుపేదలకి ముంపు బెడద తప్పింది. ప్రపంచస్ధాయిలో పోటీపడేలా ఇంగ్లీష్ మీడియం బోధన కొనసాగుతోంది. వచ్చే పదేళ్లలో ఏపీ రూపురేఖలే మారిపోతాయి. 2004 నుంచి 2009 మధ్యలో సిఎం వైఎస్సార్ పాలన తర్చాత వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు వినియోగించుకోలేదు. చంద్రబాబు 2014 లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకి భూపంపిణీ చేసి ఎందుకు పుణ్యం కట్టుకోలేదు. చేసింది లేదు కాబట్టే తప్పుడు ప్రచారం వైఎస్సార్ తన అయిదేళ్ల పాలనలో 6 లక్షల ఎకరాలు గిరిజనులకి పంపిణీ చేస్తే...సిఎం వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో నాలుగు లక్షల ఎకరాలు గిరిజనులకి ఇచ్షారు. చంద్రబాబు ఎందుకు ఇలా పంపిణీ చేయలేకపోయారు. ఎన్నికలు దగ్గరపడ్డాయి కాబట్టి చంద్రబాబు పగటి వేషంతో తిరుగుతున్నాడు. ఒకవైపు సొంత పుత్రుడు.. రెండో వైపున దత్తపుత్రుడు.. చంద్రబాబు.. ముగ్గురూ రాష్ట్రమంతా ఎడాపెడా తిరుగుతూ అబద్దాలతో ప్రజలని మభ్యపెట్డాలని చూస్తున్నారు. చంద్రబాబు తనపాలనలో చేసిందేమీ లేదు కాబట్టే సీఎం వైఎస్ జగన్ పై అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 175కి 175 సీట్లు రావాలి. నిలువు దోపిడీ చేసే చంద్రబాబు లాంటి వ్యక్తులని రాజకీయంగా శాశ్వతంగా దూరం పెట్టాలి అని సజ్జల ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. గవర్నరు కోటా ఎమ్మెల్సీల ప్రమాణం గవర్నరు కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి సభ్యులుగా నియమితులైన శ్రీమతి కర్రి పద్మశ్రీ , డా.కుంభా రవిబాబులు శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తమ చాంబరులో వీరిరువురితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. శాసన మండలి సభ్యులుగా వారు పాటించాల్సిన నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిదానాలు, నిర్వర్తించాల్సిన కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపే పుస్తకాలతో కూడిన కిట్లను అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు వారికి అందజేస్తూ అభినందనలు తెలిపారు. వీరిద్దరికీ డిప్యూటీ సీఎం (గిరిజన సంక్షేమ శాఖ మంత్రి) పీడిక రాజన్న దొర, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణా రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పాలకొండ శాసన సభ్యురాలు విశ్వసరాయి కళావతి తదితరులు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ సెక్రటరీ జనరల్ డా.పి.పి.కె. రామాచార్యులు, రాష్ట్ర శాసన మండలి ఓ.ఎస్.డి. సత్యనారాయణ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పిల్లలు... పరిమళించాలి
పిల్లలు ఎలా ఉండాలి? వికసించే పువ్వుల్లా ఉండాలి. సంతోషానికి చిరునామాలా ఉండాలి. ఆందోళన అంటే ఏమిటో తెలియకుండా పెరగాలి. స్కూల్ బ్యాగ్‌లో భవిష్యత్తును నింపుకెళ్లిన పిల్లలు... అదే స్కూల్ బ్యాగ్‌లో భయాన్ని పోగుచేసుకుని వస్తే... తల్లిదండ్రులు అప్పుడేం చేయాలి? పిల్లలను దగ్గరకు తీసుకోవాలి... చేతల్లో ధైర్యాన్నివ్వాలి. ఆనందాల రెక్కలను విరిచేసే దుష్టశక్తుల బారి నుంచి కాపాడాలి. పువ్వుల్లా పరిమళించడానికి కావల్సినంత భరోసా కల్పించాలి. స్కూల్లో అందరు పిల్లలూ ఒకేలా చేరుతారు. స్నేహానికి చిరునామాల్లా, ఉత్సాహంగా ఉంటారు. కొందరు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంటే, మరికొందరు మాత్రం వెనుకపడుతుంటారు. స్వతహాగా ఉండే ఐక్యూ లెవెల్స్ పరిమితులకు లోబడి చదువులో వెనుకబడడం కాదిది. ఉత్సాహంగా ఉంటే పిల్లలు కూడా నిరుత్సాహంగా మారి అన్నింటిలోనూ వెనుకబడుతుంటారు. ఆ వెనుకబాటు వెనుక వాళ్లను వెనుకపడేటట్లు చేసిన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఎందుకు బిడియపడుతున్నారో, ఎందుకు తమను తాము ఒంటరిని చేసుకున్నారో బయటకు తెలియదు. ఆ పిల్లల ప్రవర్తనలో అనారోగ్యకరమైన మార్పు మొదలవుతుంది. అది క్రమంగా మొండితనానికి, ధిక్కారతకు దారి తీస్తుంటుంది. స్కూల్ డైరీలో ‘డిస్ ఒబీడియెంట్, ప్రాబ్లమాటిక్ బిహేవియర్ అనే పదాలతో పేరెంట్స్‌కి పిలుపు వస్తుంది. ఆ పరిస్థితి పేరెంట్స్‌కి ఊహించని శరాఘాతం. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని అయోమయంలో, కొంత అపరాధ భావానికి లోనయ్యి, ఓవర్‌గా రియాక్ట్ అవుతూ పిల్లలను దోషులుగా నిలబెడుతుంటారు. ఈ పరిస్థితిని జాగ్రత్తగా సరిదిద్దకపోతే పిల్లలు దిక్కారతను అలాగే కొనసాగిస్తారు. ఈ సిచ్యుయేషన్ని సున్నితంగా డీల్ చేయడానికి కొన్ని సూచనలు చేశారు క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ సుదర్శిని. పిల్లలు అద్దం వంటి వాళ్లు ‘‘పిల్లల్లో చురుకుదనం తగ్గడం, ఎప్పుడూ డల్‌గా ఉండడం, నిద్రలో ఉలిక్కి పడడం వంటివి కనిపిస్తుంటాయి. పిల్లల మనసులో చెలరేగిన అనేక ఆందోళనలు, భయాలు, అవమానం, అపరాధ భావం వంటి అనేక సమస్యలను వ్యక్తం చేసే లక్షణాలివి. ఈ లక్షణాలను గమనించిన తర్వాత ఇక ఆలస్యం చేయకూడదు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు దగ్గర కూర్చుని పిల్లలను మాటల్లో పెట్టాలి. నేరుగా ‘ఎందుకిలా ఉన్నావని’ అడిగే సమాధానం రాదు. స్కూలు గురించి, ఫ్రెండ్స్ గురించి కదిపితే వాళ్లే ఒక్కొక్కటీ చెప్పడం మొదలుపెడతారు. ఆ చెప్పిన కబుర్లలోనే కారణాలు ఉంటాయి. స్కూల్లో తోటి విద్యార్థులు బాడీ షేమింగ్, బుల్లీయింగ్, ఫిజికల్– ఎమోషనల్ అబ్యూజ్ చేస్తున్నట్లు, భయపెడుతున్నట్లు, బెదిరిస్తున్నట్లు అనిపిస్తే ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పిల్లలను ఒకటికి రెండుసార్లు గద్దించి అడగడం ఏ మాత్రం సరికాదు. పిల్లలు మరింతగా బిగుసుకుపోతారు, కాబట్టి వాళ్ల క్లాస్ టీచర్ దృష్టికి తీసుకువెళ్లాలి. అయితే ఇక్కడ మన పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్న పిల్లలను దోషులుగా, నేరస్థులుగా చూడవద్దు. వాళ్లూ పసిపిల్లలేనని మర్చిపోవద్దు. అయితే వాళ్లు ఆరోగ్యకరంగా పెరగడం లేదని అర్థం. ఎందుకంటే... పిల్లలు తాము దేనిని తీసుకుంటారో దానినే డెలివర్ చేస్తారు. అమ్మానాన్నలు మరెవరినో ఉద్దేశించి ‘వాళ్ల ఎత్తుపళ్ల గురించో, నడక తీరు మీదనో, దేహం లావు– సన్నం, పొడవు, పొట్టి వంటి విషయాల్లో కామెంట్స్ చేసి నవ్వుతూ ఉంటే’ పిల్లలకు అదే అలవాటవుతుంది. పిల్లలు వాళ్లు చూసిన దాన్ని స్కూల్లో తోటి పిల్లల మీద ప్రదర్శిస్తారు. నిజానికి ఎదుటి వాళ్లను అనుకరిస్తూ గేలి చేయడం, లోపాలను ఎత్తి చూపుతూ ఎగతాళి చేయడం అనేది అభద్రతలో ఉంటూ, ఆత్మవిశ్వాసం లేని వాళ్లు చేసే పని. ఆ పని ఇంట్లో పేరెంట్స్ చేస్తుంటే పిల్లలకు అలవడుతుంది. బాల్యంలో ఇలాంటి బీజాలు పడితే ఇక అలాంటి వాళ్లు జీవితాంతం ఏదో ఒక సందర్భంలో ఈ లక్షణాలను బహిర్గతం చేస్తూనే ఉంటారు. జీవితంలో ప్రతి రిలేషన్షిప్కీ విఘాతం కలిగించుకుంటూ ఉంటారు. కాబట్టి చిన్నప్పుడే సరిదిద్దాలి. బొమ్మల్లో వ్యక్తమవుతుంది పిల్లలు మూడీగా ఉంటున్నట్లు గమనిస్తే వాళ్లను డ్రాయింగ్, క్లేతో బొమ్మలు చేయడంలో ఎంగేజ్ చేయాలి. ఇది మంచి స్ట్రెస్ బస్టర్ మాత్రమే కాదు, చక్కటి పరిష్కారమార్గం కూడా. బొమ్మలు వేయడం, బొమ్మలు చేయడం ఒత్తిడికి అవుట్లెట్లా పని చేస్తుంది. మాటల్లో చెప్పలేని విషయాలు బొమ్మల్లో వ్యక్తమవుతాయి. ఆ బొమ్మల్లోని పాత్రలు... పిల్లల్లో దాగి ఉన్న కోపాన్ని, ఇష్టాన్ని, అయిష్టాన్ని, భయాన్ని, బాధించే గుణాన్ని కూడా ప్రతిబింబిస్తుంటాయి. పిల్లల మానసిక సంఘర్షణకు అద్దం పడతాయి. పిల్లల మనసు చదవడానికి ఆ బొమ్మలు ఉపయోగపడతాయి. బాధించే పిల్లలు, బాధితులయ్యే పిల్లలను అధ్యయనం చేయడానికి కూడా ఇదే సరైన మార్గం. బిహేవియరల్ ప్రాబ్లెమ్స్‌తో మా దగ్గరకు తీసుకువచ్చిన పిల్లలకు మేమిచ్చే మొదటి టాస్క్ కూడా అదే. తల్లిదండ్రులకు సూచన ఏమిటంటే... పిల్లలు డల్‌గా ఉంటే ఉపేక్షించవద్దు, అలాగే మీ పిల్లల మీద టీచర్ నుంచి కంప్లయింట్ వస్తే ఆవేశపడవద్దు. టీచర్ ఒక సూచన చేశారంటే ఆ సూచన వెనుక బలమైన కారణం ఉండి తీరుతుందని గ్రహించాలి. టీచర్లు కూడా పిల్లల కాండక్ట్ మీద డిజ్ ఒబీడియెన్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్’ అని రాసే ముందు వాళ్ల పేరెంట్స్‌కు అర్థమయ్యేలా వివరించి చెప్పగలగాలి. ఎందుకంటే పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగేది పేరెంట్స్– టీచర్స్ మధ్య సమన్వయం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది’’ అని వివరించారు డాక్టర్ సుదర్శిని. పిల్లల మనసు సున్నితం. పువ్వులాంటి పిల్లలు పువ్వుల్లానే పెరగాలి. వారి భవిష్యత్తు సుమపరిమళాలతో వికసించాలి. బాధించే పిల్లల మీదా శ్రద్ధ పెట్టాలి! పిల్లల్లో స్వతహాగానే ఒకరికొకరు సహకరించుకునే తత్వం ఉంటుంది. అలాంటిది టీచర్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ సమాచారాన్ని కొందరికి తెలియచేసి, వాళ్లకు కోపం ఉన్న పిల్లలకు సమాచారం చేరనివ్వరు, ఆ టాస్క్‌లో ఫెయిల్ అవ్వాలనే దురుద్దేశంతో ఇలాంటి పని చేస్తారు. ఇది ఏ రకంగానూ పిల్లలను వెనకేసుకు రాదగిన విషయం కాదని పేరెంట్స్ గ్రహించాలి. బాధితులవుతున్న పిల్లల పేరెంట్స్ అయితే విషయం తెలియగానే స్పందించి తమ బిడ్డను కాపాడుకుంటారు. కానీ బాధించే పిల్లల తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. ఇది ఆ పిల్లలకు, సమాజానికి కూడా చాలా ప్రమాదకరం. – డాక్టర్ సుదర్శిని రెడ్డి సబ్బెళ్ల, క్లినికల్ సైకాలజిస్ట్, జీజీహెచ్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి -
ఆ విషయంపై కొణతాల ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు?
ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక పేరుతో జరిగిన ఒక కార్యక్రమం భవిష్యత్తు రాజకీయ దృశ్యం ఇలా ఉండే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. పేరుకు చర్చా వేదిక కాని, పాల్గొన్నవారిలో అత్యధికులు రాజకీయ పార్టీలవారే. అది కూడా తప్పు కాదు. కాని వారంతా అమరావతి 29 గ్రామాల ప్రాంతం మాత్రమే అభివృద్ది చెందాలని కోరుకుంటున్న వారు కావడం విశేషం. రాజకీయాలకు దూరంగా ఉంటూ, అప్పుడప్పుడో, లేక ఎన్నికలప్పుడో తళుకుమంటున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ దీనికి నాయకత్వం వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఆయన చాలా ఆందోళన చెందారు. మంచిదే. కాకపోతే ఎన్నికల సంవత్సరంలోనే కాకుండా, నిరంతరం దీనిపై ప్రజలలో ఆయన ఉన్నట్లయితే ఒక నమ్మకం ఏర్పడేది. అంతేకాదు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు దూరం అయిన కొంత కాలం మౌనంగా ఉండి, సడన్‌గా 2019 ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ వెనుక నిలబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉంటే గౌరవంగా ఉండేది. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడుగా పేరొందిన రామకృష్ణ మంత్రిగానే కాకుండా, ఎంపీగా కూడా పనిచేశారు. అప్పట్లో ఉత్తరాంధ్రలో ఎంత మేరకు అభివృద్ది జరిగింది, అందులో ఆయన భాగస్వామ్యం ఏమిటి? ఆ తర్వాత ఎప్పటి నుంచి అభివృద్ది ఆగిపోయింది? దానికి కారణాలు ఏమిటి? అన్న కోణంలో ఆయన చెప్పినట్లు అనిపించలేదు. కేవలం ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం, వలసలు, ఉద్దానంలో కిడ్నీ సమస్యలు, ప్రాజెక్టులు తదితర అంశాలకే పరిమితం అయ్యారు. అంతే తప్ప కీలకమైన అమరావతి అంశాన్ని విస్మరించినట్లుగా ఉంది. పత్రికలలో వచ్చిన వార్తలు చూస్తే అలా అనిపించింది. ఒకవేళ ఆయన అమరావతి మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర కూడా అభివృద్ది చెందాలని చెప్పి ఉంటే మంచిదే. తెలుగుదేశం హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ది మోడల్ అంతా అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ లాగే సాగిందన్న విమర్శ కొత్తది కాదు. దానివల్లే ఆయన పార్టీ పరాజయం చెందింది. అమరావతి రాజధాని పేరుతో హైకోర్టుతో సహా నవ నగరాలు అన్నీ అక్కడే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాని దానిని జనం వ్యతిరేకించారు. మరి ఈ విషయంలో కొణతాల ఏమి చెబుతున్నారో తెలియదు. ఇప్పుడు కూడా ఆయన తెలుగుదేశంకు మద్దతు ఇస్తున్నట్లయితే, విశాఖ కార్యనిర్వాహక రాజధాని అవసరం లేదని అనుకుంటున్నట్లే అవుతుంది. దీనిపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు. విశాఖలో రిషికొండ తదితర ప్రాంతాలలో అభివృద్ది పనులు జరుగుతుంటే అడ్డుపడుతున్న టీడీపీ, జనసేనలతో కలిసి ఆయన ఉత్తరాంధ్రపై చర్చించడం అంటేనే రాజకీయ లక్ష్యం అర్దం అవుతుంది. అన్నిటికి మించి తెలుగుదేశం మీడియా ఈ వేదికకు విస్తారంగా కవరేజీ ఇచ్చిందంటేనే చర్చలో పాల్గొన్న వారిలో అత్యధికులు ఎటువైపు ఉన్నారో తెలిసిపోతుంది. నిజానికి ఈ రాష్ట్రాన్ని ఏలిందే కాంగ్రెస్, టీడీపీలు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లే అయింది. మరి ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకుబాటు తనానికి ఎవరిని తప్పుపడతారు? ముందుగా తమను తాము విమర్శించుకుని, అప్పుడు ఏమైనా మాట్లాడి ఉండాలి. విద్యావేత్తలు కె.ఎస్.చలం వంటి కొద్ది మినహా మిగిలిన వారంతా రాజకీయవేత్తలే. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పక్షాన ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆయన విశాఖ రాజధాని అవడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ రాజధాని అయితే, అక్కడ పలు అభివృద్ది పనులకు ఆస్కారం ఉంటుంది. ఉత్తరాంధ్ర వాసులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆయన ఏదో గిరిజన డిక్లరేషన్ అనో, మరొకటనో చెబుతున్నారు తప్ప, విశాఖ రాజధాని గురించి మాట్లాడినట్లు లేరు. పైగా విశాఖ రాజధానిగా అవసరం లేదని ప్రచారం చేస్తూ ఉత్తరాంధ్ర అభివృద్దిపై గోష్టికి హాజరవడం గడుసుదనమేనేమో! టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు యథా ప్రకారం నోటికి వచ్చిన ఆరోపణలు చేశారు. స్వయంగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నేతలే భూ ఆక్రమణలకు పాల్పడ్డారని సిట్ ముందు చెప్పారు కదా? దాని గురించి కూడా ప్రస్తావించి ఉండవచ్చు. సీపీఐ రామకృష్ణ తెలుగుదేశం ఏమి చెబితే అదే అంటుంటారని అంటారు. ఆయన కూడా అమరావతి రాజధానిలోనే అన్ని వ్యవస్థలు, సంస్థలు కోరుకునే వ్యక్తి అని భావిస్తారు. ఆయన వచ్చి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు. పైగా ఉత్తరాంధ్రకు పరిశ్రమలు రావని శాపనార్ధాలు పెడుతున్నారు. ఒకసారి అచ్యుతాపురం పారిశ్రామికవాడకు వెళ్లి ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా? రావడం లేదా అని తెలుసుకుంటే మంచిది కదా. ఏదో రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు చేయడం కాకుండా అభివృద్దికి సరైన సూచనలు చేయడం వీరు మానేశారు. ఈ మధ్య కాలంలో సీపీఎం కూడా వీరితో శృతి కలుపుతున్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం కాంగ్రెస్ చాలా చేసిందని చెబుతున్నారు. మరి అసలు ఏమి అభివృద్ది జరగలేదన్నట్లుగా మాట్లాడుతున్న వారితో కలిసి చేతులు ఎందుకు ఎత్తినట్లు? సీపీఐ, సీపీఎంలు కేంద్రంలోని బీజేపీని విమర్శించడానికే ఈ సదస్సును సహజంగానే వాడుకుంటాయి. సీపీఐ రామకృష్ణ ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఆచరణాత్మకంగా వీరు మాట్లాడినట్లు కాకుండా, రాజకీయ లక్ష్యంతో ప్రసంగాలు చేసినట్లు అర్దం అవుతుంది. ఇక లోక్స్తతా అధినేత జయప్రకాశ్ నారాయణ ఎక్కువ భాగం జనరల్‌గా మాట్లాడినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఆయనకు వామపక్ష కార్మిక సంఘాల నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో నిరసన ఎదురైంది. అయినా ఆయన తన వైఖరికే కట్టుబడి ఉన్నట్లు ఉన్నారు. అందువల్ల వారికి సమాధానం ఇవ్వలేదు. ఇది సరైన వేదిక కాదని ఆయన చెప్పారు. జేపీ వాదనతో వామపక్షాలు ఏకీభవించడం లేదు. అది వేరే విషయం. నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ది గురించి చర్చించాలంటే బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లకు కూడా అవకాశం ఇచ్చి ఉండాల్సింది. వారి వాదన ఏమిటో కూడా తెలుసుకోవాలి కదా ఆ పని చేయకుండా ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి కనుక, వచ్చేది ఎన్నికల సంవత్సరం కనుక ఇప్పటి నుంచే వ్యతిరేక ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ ముసుగులో ఈ వేదికను వాడుకున్నట్లు అనిపిస్తుంది. అయితే టీడీపీ, జనసేన నేతలు బీజేపీని విమర్శించలేరు. వైసీపీపైనే విమర్శలు చేస్తుంటారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ నానా పాట్లు పడుతోంది. కాని బీజేపీ ఇంత వరకు సుముఖత కనబరచలేదు. అదే ప్రకారం రాజకీయం ఉంటే వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన( బీజేపీని వదలిపెడితే), వామపక్షాలు కలిసి పోటీచేయవచ్చు. జేపీ లోక్‌సత్తాకు ఒకటో, అరో సీట్లు ఇచ్చి కలుపుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా కొత్త రాజకీయ సమీకరణగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేదికపై కాంగ్రెస్ పార్టీ ఉన్నా వారిని కలుపుకోవడం కష్టం కావచ్చు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే వామపక్షాలు దూరం అవుతాయి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో తన విజయావకాశాలు పెంచుకోవడం కోసం తెలుగుదేశం అనుసరిస్తున్న వ్యూహాలలో ఇది కూడా ఒకటి కావచ్చు. నిజానికి రాష్ట్రాన్ని ఏలిందే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు వైసీపీ అధికారంలోకి వచ్చిందే మూడేళ్ల క్రితం. మరి ఈ ప్రాంత వెనుకబాటుతనానికి ఎవరిని తప్పుపట్టాలి? ముందుగా ఆ సంగతి కూడా చర్చించగలిగి ఉంటే బాగుండేది. ఈ ఏడాదంతా ఇలాంటి రాజకీయ విన్యాసాలు ఇంకా చాలా చూడాల్సిందే. -హితైషి -
డబ్బు లెక్క... ఓ కొలిక్కి వస్తోంది
ఇటీవల ఒక సర్వేలో వెల్లడైన నిజాలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళ బ్యాంకు పోపుల డబ్బానే! ఆర్థిక వ్యవహారాలకు మహిళలు దూరంగానే ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల ఏటీఎమ్ కార్డుల నిర్వహణ భర్తదే! అందుకే... ఫైనాన్షియల్ లిటరసీ అవసరం అంటారు శుభ్రా మహేశ్వరి. ‘‘చాలామంది మహిళలకు ఆర్థిక వ్యవహారాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. ఇది గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులైన మహిళల విషయం కాదు. బాగా చదువుకున్న వాళ్లు కూడా కనీస అవగాహన లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. నగరంలో ఇంటిని నిర్వహించే గృహిణి నెల ఖర్చులకు ముప్పై – నలభై వేల వరకు ఆమె చేతుల మీదుగా ఖర్చు చేస్తుంటుంది. కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో దాస్తే డబ్బే డబ్బును రెట్టింపు చేస్తుందనే చిన్న లాజిక్‌ని మిస్ అవుతున్నారు. ఇది వెల్త్ క్రియేషన్‌లో వెనుకబాటుతనమేనంటారు శుభ్ర. అక్షరాలు వచ్చు! లెక్క తేలదు!! ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే... పెద్ద చదువులు చదువుకున్న మహిళలు కూడా బంగారాన్ని ఆభరణం రూపంలో కొని బీరువాలోనో, బ్యాంకు లాకర్లోనో దాచుకుంటున్నారే తప్ప గోల్డ్‌బాండ్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. బాండ్ రూపంలో ఉన్న బంగారం విలువను అర్థం చేసుకోవడంలో నిరక్షరాస్యతలో ఉన్నారనే చెప్పాలి. బ్యాంకులు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. కానీ చిన్న మొత్తమైనా సరే బ్యాంకులో దాచుకుని బ్యాంకు ద్వారా కానీ యాప్ ద్వారా కానీ లావాదేవీ నిర్వహించడం నేర్చుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నారు. కాలేజీల్లో కూడా విద్యార్థులకు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే నేర్పిస్తారు. డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పించడం మీద దృష్టి వెళ్లడం లేదు. ‘‘పరిశ్రమలు స్థాపించిన మహిళలు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టిన మహిళలు శ్రమించడంలో ఏ మాత్రం అలసత్వం ఉండదు. నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్లనే లాభాల బాట పట్టాల్సిన పరిశ్రమలు పట్టాలు తప్పుతున్నాయి. ఒక చార్టెడ్ అకౌంటెంట్‌గా నేను గమనించింది ఒక్కటే. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ వారికి సరైన మార్గదర్శనం చేసే వారు లేకపోవడంతో ఆ మహిళల శ్రమ వృథా అవుతోంది. వర్క్‌లో డెడికేషన్ ఎంత ముఖ్యమో, రైట్ డైరెక్షన్లో చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నా వంతు సామాజిక బాధ్యతగా మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాను. ఇటీవల మనదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు గణనీయంగా పెరిగారు. ఈ దశలో ఈ చైతన్యం చాలా అవసరం. ఇందుకోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వర్క్ షాపులు చేపడుతున్నాం. భారీ సమావేశాలకు బదులు చిన్న చిన్న క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద విషయాన్ని సరళంగా వివరించడానికి స్థానిక బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాం. సమావేశంలోనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడం కూడా జరుగుతుంది’’ అన్నారు శుభ్రా మహేశ్వరి. కలను దర్శించాలి! ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్‌గా ఆమె మహిళను మానసికంగా శక్తిమంతం చేయడానికి ‘స్ట్రాంగర్ షీ’ అనే కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా ఈ ఏడాది చేపట్టిన అంశం ‘ఫైనాన్షియల్ లిటరసీ’. దేశంలోని గ్రామీణ, పేద మహిళ నుంచి మధ్య తరగతి మహిళలు, వైట్ కాలర్ జాబ్‌లో ఉన్న మహిళలను కూడా కలుసుకుంటారు. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు, డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా నేర్పించడం, డబ్బుతో డబ్బును ఎలా పెంపొందించుకోవాలో తెలియచేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ‘‘భూమ్మీద నీకంటూ ఒక స్థానం ఉంది. ఆకాశంలోనూ నీ కంటూ కొంత భాగం ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ ఎదగడానికి నీకంటూ ఒక కల ఉండాలి. నీ జ్ఞానంతో ఆ కలను దర్శించగలగాలి. ఆ కలను నిజం చేసుకోవడానికి నీ శ్రమను అనుసంధానం చేసుకోవాలి. నీ కలను నిజం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే. కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయంగా ఉండే వారే, ఫలితం పూర్తిగా నీదే. అది విజయం అయినా అపజయం అయినా పూర్తి బాధ్యత నీదేననే విషయాన్ని మర్చిపోకూడదు’’ మహిళలకు నా సందేశం ఇదేనన్నారు శుభ్రా మహేశ్వరి. రోజూ తెల్లకాగితమే! శుభ్రా మహేశ్వరి పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే. తండ్రి పారిశ్రామికవేత్త. ఆమె మాత్రం చార్టెడ్ అకౌంటింగ్ వైపు ఆసక్తి చూపించింది. పెళ్లి తర్వాత ఇరవై ఏళ్ల కిందట భర్తతో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బ్లూ స్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల డైరెక్టర్‌గా విధులు నిర్వహణతోపాటు చార్టెడ్ అకౌంటెంట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానమ్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, నేషనల్ హైవేస్తోపాటు దాదాపుగా మూడు వందల కార్పొరేట్ కంపెనీలకు ఆడిటర్‌గా సేవలందించిన, అందిస్తున్న అనుభవం ఆమెది. ‘‘మన జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త రోజే. డైరీలో కొత్త పేజీనే. ఏమీ రాయని తెల్లకాగితమే. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి కాగితాన్నీ మంచి విషయంతో నింపాలి. అదే అందమైన కథ అవుతుంది. అంటే ఏ ఒక్క రోజునూ నిరుపయోగంగా గడపవద్దు. ప్రయోజనకరంగా గడపాలి’’ అంటారు శుభ్రా మహేశ్వరి. – వాకా మంజులారెడ్డి -
పాలకుల నిర్లక్ష్యం వల్లే ఉత్తరాంధ్ర వెనుకబాటు
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): పుష్కలమైన వనరులు, సుదీర్ఘ చరిత్ర ఉన్న ఉత్తరాంధ్ర వెనుకబాటుకు పాలకులే ప్రధాన కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. రుషికొండలోని ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో బుధవారం ఉత్తరాంధ్ర మేధావులతో కలిసి మలి విడిత పోరాట యాత్ర ప్రారంభించారు. తర్వాత జన స్వరం–ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం–పరిష్కారం అనే అంశంపై ఉత్తరాంధ్ర మేధావులతో చర్చా కార్యక్రమం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమావేశానికి యూపీఎస్ విశ్రాంతి సభ్యులు ప్రొఫెసర్ కె.ఎస్.చలం సమన్వయకర్తగా వ్యవహరించారు. సదస్సులో పవన్ ప్రారంభోపన్యాసం చేస్తూ.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు, ఈ ప్రాంత పరిస్థితులు వింటుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత భవిష్యత్తు ప్రణాళికలపై మేధావులు విశ్లేషణ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాయలసీమలోని అనంతపురంలో నీటి వనరులు లేక ప్రజలు వలసబాట పడుతుండటం చూశామని, అయితే శ్రీకాకుళంలో అన్నివనరులు ఉండీ ఉపాధి కోసం యువత వలస పోతుండటం అత్యంత దారుణమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాధాన్యం కలిగిన వంశధార ప్రాజెక్టు కోసం బంగారం పండే వేల ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేసి, ఆ రైతులనే వలస కూలీలుగా మార్చిన వైనంపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను పర్యటించిన ప్రాంతాల్లో భూ దాతలతో మాట్లాడిన సమయంలో పదిమంది బాగు కోసం తమ భూములిచ్చాం బాబూ.. కానీ తమకు అన్యాయం చేశారని రైతులు చెప్పడంతో గుండె తరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది ఎకరాల భూములను ఇతర ప్రాంతాలకు చెందిన సెటిలర్లు ఆక్రమించుకుని కొనుగోలు చేసి, స్థానికులను బానిసలుగా మార్చేశారని, కోట్లాది నిధులు దోచుకుంటున్నారని విమర్శించారు. వంగపండు ప్రసాదరావు రచించి పాడిన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, జనసేన ఆవిర్భావంపై ప్రజల ఆశాభావం గీతం అందరినీ ఆకట్టుకుంది. సమావేశంలో ఏయూ విశ్రాంతి వైస్ చాన్స్‌లర్ కె.వి.రమణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం కన్వీనర్ అజశర్మ, సభ్యుడు నరవ ప్రకాశరావు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. -
సర్కారు కాలేజీల ‘వెనుకబాటు’
♦ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ♦ ఉత్తీర్ణత అంతంత మాత్రమే ♦ ఫస్టియర్‌లో 37, సెకండియర్‌లో 59 శాతం పాస్ సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇంటర్మీడియట్ ఫలితాల్లో సర్కారు కాలేజీలు వెనకబడ్డాయి. రాష్ట్రస్థాయిలో జిల్లా అగ్రగామిగా ఉన్నా ప్రభుత్వ కాలేజీల విభాగంలో మాత్రం అథమంగానే నిలిచింది. జిల్లాలో 24 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 2015-16 వార్షిక సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 2,943 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో కేవలం 1,082 మంది మాత్రమే (37శాతం) ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం నుంచి 2,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 1,406 మంది మాత్రమే (59శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఉత్తీర్ణత శాతం రాష్ట్ర సగటును సైతం అందుకోకపోవడం గమనార్హం. ‘ప్రథమం’లో చివరి ర్యాంకు... జిల్లాలో 450 ఇంటర్మీడియట్ కాలేజీలుండగా.. ఇందులో 5శాతం ప్రభుత్వ కాలేజీలున్నాయి. మిగతా వాటిలో 280కిపైగా కార్పొరేట్ కాలేజీలు. ఇవన్నీ మహానగరానికి సమీపంలో ఉండడం.. వీటిలో విద్యార్థుల సంఖ్య లెక్కకు మించి ఉండడం.. తాజాగా పాసైన వారిలో ఈ విద్యార్థులే అధికం కావడంతో ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రభాగాన నిలిచిందని చెప్పొచ్చు. అదే ప్రభుత్వ కాలేజీలు, గ్రామీణ కాలేజీల్లో మాత్రం ఫలితాల తీరు అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రభుత్వ కాలేజీల విభాగం ఫస్టియర్ ఫలితాల్లో జిల్లా అట్టడుగున 10 ర్యాంకుతో సరిపెట్టుకోగా.. సెకండియర్‌లో ఏడో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
వెంటాడుతున్న వెనుకబాటుతనం!
అవలోకనం భారతీయ నగరాలకు జీవం పోస్తున్న ఐటీ రంగం, ఐటీ ఆధారిత సేవా రంగాలు గుజరాత్లో కనిపించక పోవడమే అక్కడ పటేళ్ల ఆందోళనకు కారణమవుతోంది. ఇంజనీరింగ్ విద్యాసంస్థల కొరత, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యతా లేమి గుజరాత్ వెనుకబాటుతనానికి మూలం. ముంబై, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్, గుర్గావ్, నోయిడాలలో గుజరాత్ తరహా నిరసన ఘటనలు కనిపించడం లేదు. ఈ నగరాల్లోని యువతకు అందుబాటులో అనేక అవకాశాలున్నాయి. గుజరాత్లో పటేళ్ల ఆందోళనను పరిశీలిస్తున్న వారికి నేను రెండు ప్రశ్నలు సంధిస్తున్నాను. మొదటిది. గుజరాత్ మినహాయిస్తే తక్కిన భారత్‌లో ప్రత్యేకించి 25 ఏళ్ల క్రితం అలాంటి నిరసనలు తీవ్రస్థాయిలో జరిగిన మన నగరాల్లో అలాం టివి ఇప్పుడెందుకు చోటు చేసుకోలేదు? రెండు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగ రాల్లో ఇలాంటివి జరిగి ఉంటే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి ఆందోళన కారులు ఏ భాషలో మాట్లాడేవారు? పటేళ్లు రెండు డిమాండ్లు చేస్తున్నారు. మాకూ రిజర్వేషన్లు ఇవ్వండి లేదా రిజర్వేషన్లను పూర్తిగా తొలగించండి. ఈ రెండో ప్రతి పాదన మధ్యతరగతి, పట్టణ ప్రాంత డిమాండు. నాకు గుర్తున్నంతవరకు చాలా కాలంగా ఈ డిమాండ్ ఉనికిలో ఉంటూనే ఉంది. పటేళ్ల సమస్యపై గుజరాత్‌లోని నగరాల్లో లక్షలాదిమంది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తుండగా ఆ అగ్నిజ్వాల ఇతర ప్రాంతాలకు ఎందుకు వ్యాపించలేదు? దీనిపై మనం కాస్సేపటి తర్వాత చర్చిద్దాం. 2012లో, గుజరాత్ నమూనా అనేది తొలిసారిగా వెలుగులోకి వచ్చినప్పుడు నేనిలా రాశాను: భారత స్థూల దేశీయోత్పత్తిలో సేవారంగంలో వాటా 59 శాతం వరకు నమోదు కాగా, గుజరాత్లో సర్వీసు రంగం జీడీపీలో కేవలం 46 శాతం మాత్రమే కలిగి ఉంది. అంటే జాతీయ సగటు కంటే 13 శాతం తక్కువ. గుజరాత్లో పరిశ్రమల వాటా అధికం (41 శాతం. జాతీయంగా ఇది 30 శాతం మాత్రమే) అయితే ఇది ఎప్పట్నుంచో ఇలాగే నడుస్తోంది. బెంగాల్ కళాకా రులను ఉత్పత్తి చేస్తున్న విధంగా అదే స్థాయిలో గుజరాత్ ప్రథమశ్రేణి పారి శ్రామిక వేత్తలను తయారు చేస్తోంది. కానీ ఇది ఎన్నడూ అక్కరకు రాలేదు. గుజ రాత్ నుంచి తప్పిపోయిన అంశం ఏదంటే నూతన ఆర్థిక వ్యవస్థకు చెందిన డబ్బే. పాశ్చాత్య దేశాలనుంచి తక్కిన నగర భారత్ తెచ్చుకుంటున్న బిలియన్లాది డాలర్ల డబ్బు గుజరాత్ స్వంతం కావటం లేదు. భారతీయ నగరాలకు జీవధాతువుగా నిలుస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత సర్వీసులు (ఐటీ ఈఎస్) గుజరాత్లో ఎందుకు కనిపించ డం లేదనే అంశంపై కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇటీవలే విశ్లేషించింది. ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది, 'ఎందుకంటే,, తక్కువ వ్యయంతో కూడిన రియల్ స్టేట్, తక్కువ పరిహార స్థాయి ఉన్న కారణంగా గుజరాత్ సాపేక్షికంగా తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక వ్యవహారాలను అందిస్తోందని' కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. నరేంద్రమోదీ కూడా ఈ సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'గుజరాత్లో విధానపరమైన ప్రోత్సాహకాలలో కొన్ని: ఎ) ఐటీ పార్క్ డెవ లపర్కి స్టాంప్ డ్యూటీ రద్దు. ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లకు రాయితీ, బి) వివిధ ఆర్థిక ప్రోత్సాహకాలను అందించే ప్రత్యేక ఆర్థిక జోన్ల అభివృద్ధి, సి) వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినప్పటినుంచి అయిదేళ్ల వరకు సంస్థలకు విద్యుత్ చెల్లింపుల నుంచి మినహాయింపు, డి) విద్యుత్ కోతల నుంచి మినహాయింపు, ఇ) కార్మిక చట్టాలను సరళీకరించడం.' అయితే నరేంద్రమోదీ గతంలో ఈ మినహాయింపులన్నీ ప్రకటించినప్పటికీ స్పందన మాత్రం పేలవంగా ఉంది. ఎందుకు? కేపీఎంజీ సంస్థ ఇలా వివరిం చింది. 'ఐటీ-ఐటీఈఎస్ రంగం అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన అవసరం ఏదంటే నిపుణుల లభ్యతే. ఈ టాలెంట్ పూల్ లభ్యత విషయంలో గుజరాత్ అట్టడుగున ఉండిపోయింది.' ఈ వెనుకబాటుతనానికి రెండు కారణాలున్నాయని కేపీఎంజీ భావిస్తోంది: 'ఇంజనీరింగ్ సంస్థల లేమి' 'ఇంగ్లిష్‌లో ప్రావీణ్యతా లేమి' ఈ వ్యాసం మొదట్లో నేను ప్రస్తావించిన రెండు ప్రశ్నలకు సమాధానం ఇక్కడే ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్, గుర్గావ్, నోయిడాలలో గుజ రాత్ తరహా నిరసన ఘటనలు ఎందుకు జరగలేదంటే, ఈ నగరాల్లోని యువతకు అందుబాటులో అనేక అవకాశాలున్నాయి. సాపేక్షికంగా కాస్త సులభంగానే వీరు అక్కడ వైట్ కాలర్ ఉద్యోగాల్లో ప్రవేశించగలుగుతున్నారు. 25 ఏళ్ల క్రితం నాటి నిరసనకారులకు మల్లే కాకుండా ఈ నగరాల్లోని యువతకు ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వారం మా ఆఫీసులో నేనొక సమావేశంలో ఉన్నాను. అక్కడ మేం, ఐటీ ప్రొఫెషనల్స్ వేతనాల గురించి చర్చించుకున్నాం. అత్యంత ప్రాథమికమైన, కంప్యూటర్‌పై పనిచేయగల విజ్ఞానం మాత్రమే అవసరమైన ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు నెలకు రూ.30 వేలు చెల్లిస్తున్నారు. కానీ ఈ పని చేయడానికి సిద్ధపడే వ్యక్తులను వెతకటం అంత సులభం మాత్రం కాదు. ఎందుకంటే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది. పైగా, ఇలాంటి ఉద్యోగాలను చాలామంది దొరకబుచ్చుకోగలుగుతున్నారు. ఎందుకంటే వీరిలో చాలామందికి ఇంగ్లిష్ భాషపై పట్టు ఉంది. ఇంగ్లిష్ భాష వారిని గ్లోబల్ ఎకానమీతో అనుసంధానిస్తోంది. గుజరాత్‌లోని యువతలో చాలా మందికి ఇది అందుబాటులో లేదు (గుజరాత్లో ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తర గతి వరకు ఇంగ్లిష్ నేర్పడం లేదు). భారత్‌లోనే అత్యంత నగరీకరణ పొందిన రాష్ట్రం గుజరాత్. దేశంలోని టాప్ టెన్ నగరాల్లో రెండు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. అయినప్పటికీ నిరసనలు అహ్మ దాబాద్, సూరత్‌లోనే తలెత్తాయి. నేను పాల్గొన్న ఒక టీవీ చర్చలో మరికొన్ని రాష్ట్రాలు ప్రత్యేకించి బెంగాల్ వంటివి కూడా ఇంగ్లిష్‌కు నో చెబుతున్న విధానాన్నే కలిగి ఉన్నాయని నాకు ఒకరు సూచించారు. అయితే కోల్‌కతా నగరం.. టాలెంటు నికర ఎగుమతిదారుగా ఉంటోంది. ఇది తన యాజమాన్యంలో బెంగాలీలకు చోటు కల్పించనటువంటి అరుదైన వైట్ కాలర్ సంస్థగా ఉంది. ఎందుకు? అక్కడ ఇంగ్లిష్ వారు చాలా కాలంగా ఉనికిలో ఉన్నందున నాణ్యమైన పాఠశాలలు కోల్‌కతా నలుదిశలా వ్యాపించి ఉన్నాయి. బెంగాల్ ప్రభుత్వం తన పరిధిలో ఉన్న అంశాల్లో మార్పులు చేస్తూ ఉన్నప్ప టికీ నగరంలో బలంగా ఉన్న మౌలిక వసతుల కల్పన తన పని తాను చేసుకుం టూ పోతోంది. కానీ గుజరాత్ విషయంలో ఇలా జరగటం లేదు. మండల్ కమిషన్ నివేదికను అమలు చేయాలనే అంశంపై ఆందోళనలు, సరళీకరణ భారత్‌లో ఒకే సమయంలో అమలు జరిగాయని గుర్తుంచుకోవాలి. గుజరాత్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళన 25 ఏళ్ల క్రితం జరిగిన ఆం దోళనలను తలపిస్తోంది. ఇతర నగరాల్లోని తోటి భారతీయులు ముందుకెళు తుండగా, ప్రస్తుతం ఆందోళనకారులలో విచారం కలిగిస్తున్న పరిస్థితులు కొంచెం ఎక్కువగానో లేదా తక్కువగానో యథాతథంగా గుజరాత్లో నేటికీ అలాగే ఎందు కుంటున్నాయని మనకు మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) (aakar.patel@icloud.com) -
గతపాలకుల నిర్లక్ష్యం వల్లే వెనుకబాటు
మహబూబ్‌నగర్ రూరల్: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని పార్లమెంటరీ కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మం డల పరిధిలోని దివిటిపల్లి గ్రామంలో బడి పిల్లలకు సన్నబియ్యం భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శినితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో చిన్న చిన్న లోటుపాట్లను సవరించి ప్రజలు పారదర్శకమైన సేవలందిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నదన్నారు. రైతు, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 60వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దివిటిపల్లి గ్రామంలో మౌలిక సదుపాయా కల్పనకు కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డుల ద్వారా లబ్దిదారులకు 6 కేజీల చొప్పున బియ్యం అందజేస్తున్నదన్నారు. అంగన్వాడీల్లో గర్బిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వపరంగా లబ్దిపొందేందుకు లబ్దిదారులు దరఖాస్తులు చేసుకుంటే పరిశీ లించి అర్హులకు అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కోసం అవసరమైన ప్రతిపాదనలు పం పాలని అధికారులకు సూచించారు. అ నంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ హన్మంతురెడ్డి, తహిసీల్దార్ అమరేందర్, ఎంఈఓ వెంకట్రాముడు, సర్పంచ్ పాం డురంగారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు పాలమూరు భారీ ర్యాలీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శనివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్‌గౌడ్, సింగిల్‌విండోచైర్మన్ వెంకటయ్య, ఆనంద్‌గౌడ్, ఇంతియాజ్, చందర్పాటిల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెట్టుగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ న్యూటౌన్, బస్టాండ్, వన్‌టౌన్,గడియారం చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు కొనసాగుతుందన్నారు.