వెంటాడుతున్న వెనుకబాటుతనం!
అవలోకనం
భారతీయ నగరాలకు జీవం పోస్తున్న ఐటీ రంగం, ఐటీ ఆధారిత సేవా రంగాలు గుజరాత్‌లో కనిపించక పోవడమే అక్కడ పటేళ్ల ఆందోళనకు కారణమవుతోంది. ఇంజనీరింగ్ విద్యాసంస్థల కొరత, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యతా లేమి గుజరాత్ వెనుకబాటుతనానికి మూలం. ముంబై, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్, గుర్‌గావ్, నోయిడాలలో గుజరాత్ తరహా నిరసన ఘటనలు కనిపించడం లేదు. ఈ నగరాల్లోని యువతకు అందుబాటులో అనేక అవకాశాలున్నాయి.
గుజరాత్‌లో పటేళ్ల ఆందోళనను పరిశీలిస్తున్న వారికి నేను రెండు ప్రశ్నలు సంధిస్తున్నాను. మొదటిది. గుజరాత్ మినహాయిస్తే తక్కిన భారత్‌లో ప్రత్యేకించి 25 ఏళ్ల క్రితం అలాంటి నిరసనలు తీవ్రస్థాయిలో జరిగిన మన నగరాల్లో అలాం టివి ఇప్పుడెందుకు చోటు చేసుకోలేదు? రెండు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగ రాల్లో ఇలాంటివి జరిగి ఉంటే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి ఆందోళన కారులు ఏ భాషలో మాట్లాడేవారు? పటేళ్లు రెండు డిమాండ్లు చేస్తున్నారు. మాకూ రిజర్వేషన్లు ఇవ్వండి లేదా రిజర్వేషన్లను పూర్తిగా తొలగించండి. ఈ రెండో ప్రతి పాదన మధ్యతరగతి, పట్టణ ప్రాంత డిమాండు. నాకు గుర్తున్నంతవరకు చాలా కాలంగా ఈ డిమాండ్ ఉనికిలో ఉంటూనే ఉంది. పటేళ్ల సమస్యపై గుజరాత్‌లోని నగరాల్లో లక్షలాదిమంది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తుండగా ఆ అగ్నిజ్వాల ఇతర ప్రాంతాలకు ఎందుకు వ్యాపించలేదు? దీనిపై మనం కాస్సేపటి తర్వాత చర్చిద్దాం.
2012లో, గుజరాత్ నమూనా అనేది తొలిసారిగా వెలుగులోకి వచ్చినప్పుడు నేనిలా రాశాను: భారత స్థూల దేశీయోత్పత్తిలో సేవారంగంలో వాటా 59 శాతం వరకు నమోదు కాగా, గుజరాత్‌లో సర్వీసు రంగం జీడీపీలో కేవలం 46 శాతం మాత్రమే కలిగి ఉంది. అంటే జాతీయ సగటు కంటే 13 శాతం తక్కువ.
గుజరాత్‌లో పరిశ్రమల వాటా అధికం (41 శాతం. జాతీయంగా ఇది 30 శాతం మాత్రమే) అయితే ఇది ఎప్పట్నుంచో ఇలాగే నడుస్తోంది. బెంగాల్ కళాకా రులను ఉత్పత్తి చేస్తున్న విధంగా అదే స్థాయిలో గుజరాత్ ప్రథమశ్రేణి పారి శ్రామిక వేత్తలను తయారు చేస్తోంది. కానీ ఇది ఎన్నడూ అక్కరకు రాలేదు. గుజ రాత్ నుంచి తప్పిపోయిన అంశం ఏదంటే నూతన ఆర్థిక వ్యవస్థకు చెందిన డబ్బే. పాశ్చాత్య దేశాలనుంచి తక్కిన నగర భారత్ తెచ్చుకుంటున్న బిలియన్లాది డాలర్ల డబ్బు గుజరాత్ స్వంతం కావటం లేదు.
భారతీయ నగరాలకు జీవధాతువుగా నిలుస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత సర్వీసులు (ఐటీ ఈఎస్) గుజరాత్‌లో ఎందుకు కనిపించ డం లేదనే అంశంపై కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇటీవలే విశ్లేషించింది.
ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది, 'ఎందుకంటే,, తక్కువ వ్యయంతో కూడిన రియల్ స్టేట్, తక్కువ పరిహార స్థాయి ఉన్న కారణంగా గుజరాత్ సాపేక్షికంగా తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక వ్యవహారాలను అందిస్తోందని' కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. నరేంద్రమోదీ కూడా ఈ సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
'గుజరాత్‌లో విధానపరమైన ప్రోత్సాహకాలలో కొన్ని:
ఎ) ఐటీ పార్క్ డెవ లపర్‌కి స్టాంప్ డ్యూటీ రద్దు. ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లకు రాయితీ,
బి) వివిధ ఆర్థిక ప్రోత్సాహకాలను అందించే ప్రత్యేక ఆర్థిక జోన్ల అభివృద్ధి,
సి) వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినప్పటినుంచి అయిదేళ్ల వరకు సంస్థలకు విద్యుత్ చెల్లింపుల నుంచి మినహాయింపు,
డి) విద్యుత్ కోతల నుంచి మినహాయింపు,
ఇ) కార్మిక చట్టాలను సరళీకరించడం.'
అయితే నరేంద్రమోదీ గతంలో ఈ మినహాయింపులన్నీ ప్రకటించినప్పటికీ స్పందన మాత్రం పేలవంగా ఉంది. ఎందుకు? కేపీఎంజీ సంస్థ ఇలా వివరిం చింది. 'ఐటీ-ఐటీఈఎస్ రంగం అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన అవసరం ఏదంటే నిపుణుల లభ్యతే. ఈ టాలెంట్ పూల్ లభ్యత విషయంలో గుజరాత్ అట్టడుగున ఉండిపోయింది.'
ఈ వెనుకబాటుతనానికి రెండు కారణాలున్నాయని కేపీఎంజీ భావిస్తోంది: 'ఇంజనీరింగ్ సంస్థల లేమి' 'ఇంగ్లిష్‌లో ప్రావీణ్యతా లేమి'
ఈ వ్యాసం మొదట్లో నేను ప్రస్తావించిన రెండు ప్రశ్నలకు సమాధానం ఇక్కడే ఉంది.
ముంబై, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్, గుర్‌గావ్, నోయిడాలలో గుజ రాత్ తరహా నిరసన ఘటనలు ఎందుకు జరగలేదంటే, ఈ నగరాల్లోని యువతకు అందుబాటులో అనేక అవకాశాలున్నాయి. సాపేక్షికంగా కాస్త సులభంగానే వీరు అక్కడ వైట్ కాలర్ ఉద్యోగాల్లో ప్రవేశించగలుగుతున్నారు. 25 ఏళ్ల క్రితం నాటి నిరసనకారులకు మల్లే కాకుండా ఈ నగరాల్లోని యువతకు ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వారం మా ఆఫీసులో నేనొక సమావేశంలో ఉన్నాను. అక్కడ మేం, ఐటీ ప్రొఫెషనల్స్ వేతనాల గురించి చర్చించుకున్నాం. అత్యంత ప్రాథమికమైన, కంప్యూటర్‌పై పనిచేయగల విజ్ఞానం మాత్రమే అవసరమైన ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు నెలకు రూ.30 వేలు చెల్లిస్తున్నారు. కానీ ఈ పని చేయడానికి సిద్ధపడే వ్యక్తులను వెతకటం అంత సులభం మాత్రం కాదు. ఎందుకంటే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది.
పైగా, ఇలాంటి ఉద్యోగాలను చాలామంది దొరకబుచ్చుకోగలుగుతున్నారు. ఎందుకంటే వీరిలో చాలామందికి ఇంగ్లిష్ భాషపై పట్టు ఉంది. ఇంగ్లిష్ భాష వారిని గ్లోబల్ ఎకానమీతో అనుసంధానిస్తోంది. గుజరాత్‌లోని యువతలో చాలా మందికి ఇది అందుబాటులో లేదు (గుజరాత్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తర గతి వరకు ఇంగ్లిష్ నేర్పడం లేదు).
భారత్‌లోనే అత్యంత నగరీకరణ పొందిన రాష్ట్రం గుజరాత్. దేశంలోని టాప్ టెన్ నగరాల్లో రెండు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. అయినప్పటికీ నిరసనలు అహ్మ దాబాద్, సూరత్‌లోనే తలెత్తాయి.
నేను పాల్గొన్న ఒక టీవీ చర్చలో మరికొన్ని రాష్ట్రాలు ప్రత్యేకించి బెంగాల్ వంటివి కూడా ఇంగ్లిష్‌కు నో చెబుతున్న విధానాన్నే కలిగి ఉన్నాయని నాకు ఒకరు సూచించారు. అయితే కోల్‌కతా నగరం.. టాలెంటు నికర ఎగుమతిదారుగా ఉంటోంది. ఇది తన యాజమాన్యంలో బెంగాలీలకు చోటు కల్పించనటువంటి అరుదైన వైట్ కాలర్ సంస్థగా ఉంది. ఎందుకు? అక్కడ ఇంగ్లిష్ వారు చాలా కాలంగా ఉనికిలో ఉన్నందున నాణ్యమైన పాఠశాలలు కోల్‌కతా నలుదిశలా వ్యాపించి ఉన్నాయి.
బెంగాల్ ప్రభుత్వం తన పరిధిలో ఉన్న అంశాల్లో మార్పులు చేస్తూ ఉన్నప్ప టికీ నగరంలో బలంగా ఉన్న మౌలిక వసతుల కల్పన తన పని తాను చేసుకుం టూ పోతోంది. కానీ గుజరాత్ విషయంలో ఇలా జరగటం లేదు. మండల్ కమిషన్ నివేదికను అమలు చేయాలనే అంశంపై ఆందోళనలు, సరళీకరణ భారత్‌లో ఒకే సమయంలో అమలు జరిగాయని గుర్తుంచుకోవాలి.
గుజరాత్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళన 25 ఏళ్ల క్రితం జరిగిన ఆం దోళనలను తలపిస్తోంది. ఇతర నగరాల్లోని తోటి భారతీయులు ముందుకెళు తుండగా, ప్రస్తుతం ఆందోళనకారులలో విచారం కలిగిస్తున్న పరిస్థితులు కొంచెం ఎక్కువగానో లేదా తక్కువగానో యథాతథంగా గుజరాత్‌లో నేటికీ అలాగే ఎందు కుంటున్నాయని మనకు మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) (aakar.patel@icloud.com)