Akar Patel
-
లోపాలు సరిదిద్దితేనే అఘాయిత్యాలు ఆగుతాయి
లైంగిక నేరాల బాధితులకు న్యాయం చేయలేకపోతున్నది మనం ఒక్కరం మాత్రమే కాదు. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి ఉంది. అన్ని దేశాల్లోనూ బాధితులకుండే ఉమ్మడి సమస్య... ఆ నేరం జరిగిందని బయటికి చెప్పుకోలేకపోవడం. అందువల్లే అమెరికా వంటి దేశంలో కూడా వేయి నేరాలు జరుగుతుంటే సగటున 310 వెల్లడవుతాయి. ఇక శిక్షల శాతం మరింత తక్కువ. ఆ 310 మందిలో ఆరుగురికి మాత్రమే శిక్ష పడుతుంది. ప్రభుత్వాలు గట్టి సంకల్పంతో పనిచేసి భారీ మార్పులు చేస్తే ఈ స్థితి మారుతుంది. కథువా, ఉన్నావ్‌లలో జరిగిన ఉదంతాల విషయంలో ఒక సమాజంగా మనం ఎలా స్పందించాలి? ప్రపంచ దేశాల్లో లైంగిక హింస పరంగా చూస్తే ఆడవాళ్లకూ, పిల్లలకూ భారత్ అరక్షిత దేశమన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. వాస్తవం ఇది కాకపోయినా ఇది స్థిరపడింది. మనం ఎంత నిజాయితీగా ఉంటు న్నామో, ఎంత మారాల్సి ఉన్నదో విదేశీ మాధ్యమాలు చెప్పే స్థితి రాకూడదు. ఇలాంటి సిగ్గుమాలిన ఉదంతాలను మనమెందుకు నివారించలేకపోతున్నాం? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇవి తగ్గించగలుగుతాం? కేవలం న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ మాత్రమే వీటిని నివారించలేవని ముందుగా మనం తెలుసు కోవాలి. విలువలు విచ్ఛిన్నమయ్యాయి. మహిళల్ని, అల్పసంఖ్యాకుల్ని గౌరవించే చోట పశు ప్రవృత్తికి ప్రోత్సాహం ఉండదు. మనం అలాంటిచోటే ఉంటున్నామా? నిజాయితీగా చెప్పాలంటే జవాబేమిటో అందరికీ స్పష్టంగా తెలుసు. ప్రభుత్వమే ఇలాంటి హింసను అరికట్టాలనడం మనం మన పాత్రను విస్మరించడమే అవు తుంది. ఆ అవగాహనతో ఏం చేయమని ప్రభుత్వాన్ని ఒప్పించాలో చూద్దాం. లైంగిక దాడుల్ని, అత్యాచారాలను నియంత్రించడానికి ప్రధానంగా రెండు అవసరమవుతాయి. అందులో ఒకటి చట్టం. ఇలాంటి ఉదంతాలు జరిగిన ప్రతిసారీ రేపిస్టులను ఉరి తీయాలన్న డిమాండ్ తరచూ వినిపిస్తుంటుంది. కఠినమైన శిక్ష ఉంటే ఈ తరహా నేరాల్ని నివారించవచ్చునని, నేరగాడు తన చర్య పర్యవసానా లను గ్రహించి భయపడతాడని, కనుక తప్పు చేయడానికి సాహసించడని ఈ వాదన లోని ఆంతర్యం. దీనికి అనేక ప్రతివాదాలున్నాయి. అత్యాచారానికైనా, హత్యకైనా ఒకటే శిక్ష గనుక సాక్ష్యం లేకుండా చేయడానికి బాధితురాలిని రేపిస్టు హతమారు స్తాడని దీన్ని వ్యతిరేకించేవారంటారు. దాన్ని కాసేపు పక్కన పెడదాం. రేపిస్టులకు ఉరిశిక్షే సరైందని రాజకీయ నాయకులు ఎక్కువగా చెబుతుంటారు. మీరు ఇటీవలి పత్రికలు తిరగేస్తే ఈ వాదన సమర్థుకులే అధికంగా కనిపిస్తారు. మన దేశంలో హంతకులకు మరణశిక్ష ఉంది. ఇది నివారణగా పనిచేసి హత్యలు ఆగుతున్నాయా? గణాంకాలు ఒకసారి చూద్దాం. 2016లో 136 మందికి న్యాయస్థానాలు ఉరిశిక్ష విధించాయి. కానీ ఆ సంవత్సరం దేశవ్యాప్తంగా 30,000 హత్యలు జరిగాయి. మరణశిక్షల విధింపు హంతకులను తగ్గించలేకపోయింది. మన చట్టాల్లో అప్పీళ్లకూ, రెమిషన్లకూ అవకాశం ఉంది. అందుకే ఆ ఏడాది ఎవరూ ఉరికంబం ఎక్కలేదు. మరణశిక్ష మంత్ర దండమని భావించేవారంతా దీన్ని గమనించుకోవాలి. ఇప్పుడు లైంగిక నేరాలు, అత్యాచారాలకు సంబంధించిన గణాంకాలు చూద్దాం. ఆ సంవత్సరం దేశంలో మొత్తం 38,947 అత్యాచారాలు జరిగాయి. పిల్లలపై 1,06,000 నేరాలు జరిగాయి. అత్యాచారాల సంఖ్యతో వచ్చే ఇబ్బందే మంటే 99 శాతంమంది బాధితులు వాటిపై ఫిర్యాదు చేయరు. ప్రభుత్వ డేటాయే ఈ సంగతి చెబుతోంది. అమెరికాలో ప్రతి వెయ్యి అత్యాచారాలు, లైంగిక నేరాల్లో 310(31 శాతం) మాత్రమే పోలీసుల వరకూ వస్తాయి. అందులో కేవలం ఆరు గురు దోషులకు (అంటే 1 శాతం కన్నా తక్కువ) మాత్రమే శిక్షపడుతుంది. దీనర్ధం ఏమంటే... జరుగుతున్న నేరాల విషయంలో బాధితులకు న్యాయం చేయలేక పోతున్నది మనం ఒక్కరమే కాదు. కనుక ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన, గట్టిగా పనిచేయాల్సిన సంక్లిష్ట సమస్య అని మనం గుర్తించాలి. ఇందులో అనేకానేక అంశాలున్నాయి. అందులో కొన్ని సామాజికమైనవి, మరికొన్ని ప్రభుత్వం సరి దిద్దాల్సినవి. మన దేశంలోనూ, ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ లైంగిక నేరాల బాధితులకుండే ఉమ్మడి సమస్య– అది బాగా వ్యక్తిగతమైన నేరం. తమకు అలా జరిగిందని ఎవరితోనైనా చెప్పుకోవడం అంత సులభం కాదు. ఇక మన దేశానికే ప్రత్యేకమైన సామాజిక అంశాలు కోకొల్లలు. అందులో మన సమాజంలో మహిళల కుండే స్థానం, వారిపట్ల వ్యవహరించే తీరు ప్రధానమైనది. రెండోది– కుటుంబ పరువు, ప్రతిష్టలు మొత్తం వారి శరీరాల్లో ఉన్నాయనుకునే విశ్వాసం. మహిళపై దాడి జరిగితే అది ‘కోల్పోయినట్టే’నని మన భావన. పర్యవసానంగా తనకు జరి గిన అన్యాయాన్ని పోలీస్‌స్టేషన్‌లోని అపరిచితులకు చెప్పడం సంగతలా ఉంచి చివరకు తన కుటుంబానికి కూడా ఏ మహిళా వెల్లడించలేదు. పోలీసులు చేయగలిగింది ఒకటుంది–అది చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం. చట్టం ప్రకారం బాధితులెవరైనా తమకు నచ్చిన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్లో మాత్రమే ఫిర్యాదు చేయనవసరం లేదు. రెండు–బాధితురాలు తాను ఎంపిక చేసుకున్న భాషలో తన వాంగ్మూలాన్ని ఇవ్వొచ్చు. ఇది చాలా కష్టమైన సమస్య. ఎందుకంటే చాలా పోలీ స్స్టేషన్లలో ఇంగ్లిష్ కూడా సరిగా మాట్లాడలేనివారే ఉంటారు. వారు ఎఫ్ఐఆర్ను స్థానిక భాషలోనే రికార్డు చేస్తామంటారు. మూడు–బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా అధికారి మాత్రమే రికార్డు చేయాలి. ఇది జరగడం లేదు. తగినంతమంది మహిళా కానిస్టేబుళ్లు లేదా మహిళా పోలీసు అధికారులు లేకపోవడం ఇందుకు కారణం. ‘కనీస ప్రభుత్వం–గరిష్ట పాలన’ వంటి నినాదాలు అర్ధం లేనివి. ఎందు కంటే మనకున్న పోలీసులు, డాక్టర్లు, నర్సుల సంఖ్య ప్రపంచంలోని మరే ఇతర దేశాల తలసరి సగటు కన్నా చాలా తక్కువ. లైంగిక నేరాలను అరికట్టాలంటే మన సమాజంలో, మహిళలపట్ల వ్యవహరించే తీరులో భారీ మార్పులు తీసుకురావా లని వాస్తవాంశాలు చెబుతున్నాయి. లైంగిక హింసకు సంబంధించిన చట్టాల్లోని అంశాలను దేశంలోని పోలీస్స్టేషన్లన్నీ సక్రమంగా పాటించేలా చూడాలి. ఇది చాలా కష్టసాధ్యమైనదే. కానీ అలా చేయగలిగితే–కనీసం ఇతర ప్రపంచ దేశాలతో సమానంగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుంది. ఫిర్యాదులు పెరిగాక వాటిపై సరైన దర్యాప్తు జరిగేలా చూడాలి. అందుకు వనరులు అవసరం. ఇప్పుడున్న పోలీసుల సంఖ్యతో, ఈ బడ్జెట్‌తో అది సాధ్యపడదు. అది చేస్తే శిక్షల సూచీ పెరుగుతుంది. ఇదంతా చాలా కష్టం. మన రాజకీయ నాయకుల్లో చాలామందికి ఈ సంగతి తెలుసు. కనుక ‘రేపిస్టులకు ఉరిశిక్ష వేయాలి’ అని వారు సులభంగా అంటుం టారు. హంతకులకు మరణశిక్ష విధిస్తున్నా హత్యలపై వాటి ప్రభావం లేదన్న వాస్తవం వారిని కలతపెట్టదు. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
క్రికెట్ క్రీడపై కుహనా దేశభక్తి క్రీనీడ
అవలోకనం ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌కు వెళ్లిపోవాలనుకుంటే దాన్ని దేశద్రోహంగా చూడం. మన క్రికెటర్ల విషయంలో ఇది ఎందుకు భిన్నంగా ఉండాలి? ఒక ప్రైవేట్ సంస్థ అయిన బీసీసీఐకి తన తరఫున ఎవరు ఆడాలో, ఆడరాదో నిర్ణయించే హక్కు ఉంది. కానీ, శ్రీశాంత్ తన వృత్తి విషయంలో, క్రీడా నైపుణ్యం విషయంలో ఏమి చేయాలో చెప్పే హక్కు మనకు ఎవరికీ లేదు. ముప్పయ్యేళ్ల క్రితం క్లయివ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్ట్ ఇండీస్ క్రికెట్ జట్టు ప్రాబల్యం క్షీణించడం ప్రారంభించింది. దీంతో అలన్ బోర్డర్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రపంచంలోకెల్లా బలమైన జట్టుగా మారింది. ఆస్ట్రేలియా జట్టులో చాలా మంది ఎడమ చేతి ఆటగాళ్లు ఉండేవారు. అలన్ బోర్డర్, ఓపెనింగ్ బ్యాట్స్‌మేన్ కెప్లర్ వెసల్ కూడా ఆ బాపతే. నిజానికి కెప్లర్ దక్షిణ ఆఫ్రికా దేశస్తుడు. దక్షిణ ఆఫ్రికా జాతి వివక్షను పాటిస్తూ నల్ల జాతీయులకు, ఆసియా సంతతి, మిశ్రమ జాతుల వారికి ఓటింగ్ హక్కును నిరాకరించింది. దీంతో ప్రపంచ క్రికెట్, ఆ దేశంతో క్రీడా సంబంధాలపై నిషేధం విధించింది. అందువల్ల సొంత దేశం తరఫున ఆడలేని కెప్లర్ తన జాతీయతను మార్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు జింబాబ్వే దేశస్తుడైన గ్రేమ్ హిక్ ఇంగ్లండు జట్టు తరఫున ఆడాడు. ఆస్ట్రేలియా జట్టులో ఆడాలని నిర్ణయించుకున్న దక్షిణ ఆఫ్రికా క్రీడాకారులలో కెవిన్ పీటర్సన్ కూడా ఒకడు. లూక్ రోంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు రెండింటి తరఫునా ఆడాడు. ఇయాన్ మోర్గాన్ కూడా ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లు రెండింటిలోనూ ఆడాడు. ఇతర దేశాలకు చెందిన ఈ వ్యక్తులు తమ జట్లలో చేరి ఆడటం పట్ల ఈ దేశాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవనేది స్పష్టమే. అలాగే తమ మాతృ దేశం తమను కోరుకోవడం లేదని లేదా అవసరం లేదనుకుంటోందని భావించిన పౌరులు మరో దేశానికి వెళ్లి క్రికెట్ ఆడాలని కోరుకోవడంలో ఆయా దేశాలకు సైతం ఎలాంటి అభ్యంతరాలూ లేవనేది కూడా స్పష్టమే. ఈ వారం, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్, బీసీసీఐకి తను అక్కర్లేకపోతే మరే ఇతర దేశం తరఫునైనా ఆడతానని అన్నాడు. శ్రీశాంత్ విషయంలో ఇచ్చిన మునుపటి ఆదేశాలను ఒక న్యాయస్థానం కొట్టివేసి, అతనికి క్రికెట్ ఆడే హక్కు లేదని చెప్పింది. ఆ తర్వాతనే శ్రీశాంత్ ఈ మాట అన్నారు. 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని క్రికెట్ నుంచి నిషేధించారు. అప్పుడు అతని వయసు 29 ఏళ్లు. ఒక్కో బంతిపై పందెం కాయడాన్ని స్పాట్ ఫిక్సింగ్ అంటారు. ఫలానా బంతికి ఒక బౌలర్ వికెట్ తీసుకుంటాడని లేదా నో బాల్ వేస్తాడని లేదా బాట్స్‌మేన్ బౌండరీ కొడతాడని పందెం కాయమని బుకీలు పిలుస్తారు. బుకీ, బౌలర్‌తో లాలూచీ పడగలిగితే అతను ఏదైనా ఒక బంతిని ఎలా బౌల్ చేస్తాడనే విషయంపై ముందుగానే అంచనాకు రాగలుగుతాడు. గెలుపు లేదా ఓటమి అంటూ పందేలు కాసి విసిగిపోయి, ఏదైనా మరింత ఉద్విగ్నభరితమైనదాని కోసం ఎదురుచూసే వారికి (మన దేశంలో అలాంటి వారు చాలావరకు గుజరాతీలే) ఆ బుకీలు స్పాట్ బెట్టింగ్ అవకాశాన్ని కల్పిస్తారు. బుకీకి, క్రీడాకారులకు మధ్య లాలూచీ ఉన్నా ఇలాంటి పందేలలో హస్తలాఘవాన్ని ప్రదర్శించడం తేలికేం కాదు. కొన్నేళ్ల క్రితం కొందరు పాకిస్తానీ క్రికెటర్లు ఇలా చేస్తూ బ్రిటిష్ మీడియాకు దొరికిపోయారు. శ్రీశాంత్ పై వచ్చిన ఆరోపణలు కూడా అ కాలం నాటివే. అతనిపై నిషేధం విధించినా, న్యాయస్థానం ఆ ఆరోపణలను కొట్టేసింది. గత నాలుగేళ్లుగా అతను క్రికెట్ ఆడలేకపోయాడు. దీంతో శ్రీశాంత్ ఎంతగా అసంతృప్తితో ఉన్నాడంటే, తాజా కోర్టు ఆదేశాల తర్వాత ‘‘నిషేధం విధించినది బీసీసీఐ తప్ప ఐసీసీ కాదు. భారత జట్టు తరఫున కాకపోతే నేను మరే దేశం తరఫునైనా ఆడవచ్చు. నాకు ఇప్పుడు 34 ఏళ్లు. మహా అయితే మరో ఆరేళ్లు మాత్రమే ఆడగలను. క్రికెట్ ప్రేమికునిగా నేను క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. అంతేకాదు, బీసీసీఐ ఒక ప్రైవేటు సంస్థ. దాని జట్టును భారత్ క్రికెట్ జట్టు అంటున్నది మనమే. అయినా అది ఒక ప్రైవేటు సంస్థ మాత్రమేనని మీకు తెలుసు.’’ అతని దృక్కోణం ఏమిటో సులువుగానే తెలుస్తోంది. తన జీవితాన్నంతటినీ పెట్టుబడిగా పెట్టిన క్రీడలో అతన్ని భారత్‌లో ఆడనివ్వడం లేదు. అలాంటప్పుడు మరో దేశం తరఫున ఎందుకు ఆడకూడదు? అతను ఆ పని చేయడం పూర్తిగా సరైనదేనని నాకు అనిపిస్తోంది. దీని వల్ల తలెత్తే జాతీయతను మార్చుకోవడం వంటి ఆచరణాత్మక సమస్యలను పక్కన పెట్టండి. ఒక భారతీయుడు మరో దేశస్తుడు కావడం కంటే ఒక దక్షిణ అఫ్రికా దేశీయుడు ఆస్ట్రేలియా పౌరుడు కావడం చాలా తేలిక. ఏది ఏమైనా శ్రీశాంత్ విదేశాల్లో తాను ఆడేది టీ–20 క్రికెట్ మాత్రమేనని సూచించాడు. అతని నిర్ణయం ఏదైనా కానివ్వండి, సొంత దేశం వద్దంటున్నా, దాని పట్ల విధేయతను ప్రదర్శించి మరో దేశం తరఫున ఆడవద్దని అతన్ని కోరడం అన్యాయం అంటాను. క్రికెట్ క్రీడను ఇంత తీవ్రంగా పట్టించుకునేది మన భారతీయులం మాత్రమే. మనం బోలెడంత జాతీయవాదాన్ని ఆ క్రీడలో పెట్టుబడిగా పెట్టాం. బీసీసీఐ జట్టు, పాకిస్తాన్ క్రికెట్ అసోసియేషన్ నియంత్రణలోని జట్టును ఓడిస్తే ‘‘పాకిస్తాన్’’ను ‘‘భారత్’’ ఓడించినట్టు లెక్క. క్రికెట్ క్రీడలోని గెలుపు, ఓటముల విషయంలో వ్యక్తమయ్యే మన ఉద్వేగాలు ప్రబలమైనవి. జనాదరణ గల మన మరే సాంస్కృతిక రూపంలోనూ అంత బలంగా ఉద్వేగాలు వ్యక్తం కావడం కనిపించదు. ప్రియాంకా చోప్రా లాంటి హీరో లేదా హీరోయిన్ బాలివుడ్‌ను వదిలేసి హాలీవుడ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటే.. ఆమె చర్యలను మనం దేశద్రోహంగా చూడం. పైగా భారతీయులలో ఒకరు హాలీవుడ్లో విజయాలను సాధిం చడం గొప్పని భావిస్తాం. ఇది మన క్రికెటర్ల విషయంలో మాత్రం ఎందుకు భిన్నంగా ఉండాలి? దీన్ని అర్థం చేసుకోవడం తేలికేం కాదు. ఈ విషయంలో ఎవరైనాగానీ శ్రీశాంత్ పట్ల సానుభూతిని చూపవచ్చు. ఒక ప్రైవేట్ సంస్థ అయిన బీసీసీఐకి తన తరఫున ఎవరు ఆడాలి లేదా ఎవరు ఆడరాదు అని నిర్ణయించే హక్కు పూర్తిగా ఉంది. ఆ సంస్థ ప్రపంచంలోనే అత్యంత అవినీతిగ్రస్తమైన క్రీడా సంస్థ అనే విషయాన్ని ఇప్పటికి పక్కన పెడదాం. శ్రీశాంత్ తన వృత్తి విషయంలో, క్రీడా నైపుణ్యం విషయంలో ఏమి చేయాలో చెప్పే హక్కు మనలో ఎవరికీ లేదు. అతను మన బూటకపు క్రికెట్ దేశభక్తి జ్యోతిని ఎత్తిపట్టాలని ఆశించడం అల్పత్వం, బాల్య చాపల్యం. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ aakar.patel@icloud.com -
జన సమీకరణ మరచిన కాంగ్రెస్
అవలోకనం గుజరాత్లో కాంగ్రెస్ నిలకడగా 30 శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తూ వచ్చింది. గెలుపు, ఓటములకు మధ్య తేడాను తెచ్చే మూడు లేదా నాలుగు శాతం అదనపు ఓట్లను సంపాదించలేక పోతోంది. రెండేళ్లుగా రాష్ట్రంలో జరిగిన పెద్ద ఆందోళనలన్నీ బీజేపీ విధానాలు సృష్టించిన సమస్యలవల్ల జరిగినవే. వాటిలో ఏ ఒక్క దానిపై ప్రజలను సమీకరించి ఉన్నా కాంగ్రెస్ ఆ అదనపు ఓట్లను సాధించగలిగేదే. దాని ఈ అశక్తత వల్లనే బీజేపీ గుజరాత్లో నిశ్చింతగా ఉండగలుగుతోంది. బీజేపీ అజేయమైనది అనుకోవచ్చుగానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అలాంటిది కాజాలదు. రాష్ట్రం తర్వాత రాష్ట్రాన్ని బీజేపీ కైవసం చేసుకుంటూ పోతుంటే, అందుకు కాంగ్రెస్ ప్రతిస్పందన భయం, భీతావహం చెందడంగానే ఉంది. రాహుల్ గాంధీ కథనం ప్రకారం నాలుగు నెలల క్రితమే నితీశ్ కుమార్ ఫిరాయింపు గురించి వారికి ముందస్తు సమాచారం ఉంది. అయినా వారు ఎందుకిలా నిస్సహాయంగా ఉన్నారు? అర్థం చేసుకోవడం కష్టం. గోవా శాసనసభలో ఎక్కువ స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ మెరుగైన స్థితిలో ఉన్నా వేచి చూసింది. ప్రతిభ, శక్తి ఉండి, ఆకలితో ఉన్న బీజేపీ ప్రత్యర్థిగా ఉన్నా.. అలా వేచి చూస్తూ ఉండటం ఘోర తప్పిదం. గుజరాత్లో శంకర్‌సింహ్ వాఘేలా నిష్క్రమణతో కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. ఆరుగురు ఎమ్ఎల్ఏలు పార్టీని వీడటంతో రాజ్యసభకు అహ్మద్ పటేల్ ఎన్నిక అనుమానాస్పదంగా మారింది. మిగతా ఎమ్ఎల్ఏలు అందరినీ అనుమానించి, కర్ణాటకకు పంపడమే కాంగ్రెస్ ప్రతిస్పందన అయింది. ఆ పార్టీ ఇంకా అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం అదే. గుజరాతీల అభిప్రాయం ప్రకారమే బీజేపీ అత్యంత అధ్వానమైన పని తీరును కనబరచినది గుజరాత్‌లోనే. జనాదరణను కోల్పోవడం గురించి ఆందోళనపడవలసినది బీజేపీనే. గత రెండేళ్ల కాలంలో, గుజరాత్లో లక్షలాదిగా ప్రజలు పాల్గొన్న పలు ఆందోళనలు జరిగాయి. హార్దిక్ పటేల్ నేతృత్వంలో రిజర్వేషన్ల కోసం పాటీదార్ల ఆందోళన సాగింది. దానికి ప్రతిగా అల్పేశ్ ఠాకూర్ నాయకత్వాన ఓబీసీ క్షత్రియుల ఆందోళన నడిచింది. ఉనా ఘటన తదుపరి జిగ్నేశ్ మెవానీ నేతృత్వంలో దళితుల తిరుగుబాటు జరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వజ్రాల వ్యాపారులు, జౌళి కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు, ప్రదర్శనలు నిర్వహించారు. జీఎస్టీ విధింపు తదుపరి లక్షలాదిగా వ్యాపారులు సూరత్‌లో ప్రదర్శనలు జరిపారు. ఈ సమస్యలన్నీ బీజేపీ విధానాల ప్రత్యక్ష ఫలితమే అయినా, ఈ ఆందోళనలన్నీ కాంగ్రెస్ నాయకత్వం వహించకుండా జరిగినవే. పైన పేర్కొన్న ముగ్గురిలాంటి యువ నాయకులను అవి ముందుకు తెచ్చాయి, లేదంటే నాయకులు లేకుండానే సాగాయి. రాజకీయ సమస్యలపై ప్రజలను ఎలా సమీకరించాలో కాంగ్రెస్ మరిచిపోయిందని ఇది తెలియజేస్తోంది. గాంధీ విజయవంతంగా నడిపిన పలు ఉద్యమాలు, బార్డోలీ సత్యాగ్రహం వంటివి గుజరాత్లో జరిగినవి కావడమే విచిత్రం. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ నిలకడగా 30 శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తూ వచ్చింది. అయితే, గెలుపు, ఓటములకు మధ్య తేడాను తెచ్చే ఆ అదనపు మూడు లేదా నాలుగు శాతం ఓట్లను అది సంపాదించలేకపోతోంది. ఈ సమస్యలలో ఏ ఒక్క దానిపై అది ప్రజలను తన చుట్టూ సమీకరించి ఉన్నా, ఆ అదనపు ఓట్లను సాధించగలిగేదే. ఈ ఆందోళనలన్నీ సాగుతున్నా ప్రజలను సమీకరించలేని కాంగ్రెస్ అశక్తత వల్లనే బీజేపీ గుజరాత్లో నిశ్చింతగా ఉండగలుగుతోంది. బీజేపీ అజేయమైనదని అనుకోవచ్చుగానీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఏ పార్టీ అలాంటిది కాజాలదు. కర్ణాటకలో బీజేపీ నిజానికి రక్షణ కాచుకునే స్థితిలో ఉంది. ఎత్తులు, పై ఎత్తులు వేయగల కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దేశీయ శైలిలోని తన రాజకీయ ఎత్తుగడలతో హిందుత్వ పార్టీ తలమునకలై ఉండేలా చేస్తున్నారు. బెంగళూరులో ఆయన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రయోగిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ హిందీని కోరుకుంటోంది కాబట్టి, ఆ అంశంపై బీజేపీ బలహీనమైన స్థితిలో ఉంది. స్థానిక బీజేపీ మౌనంగా ఉండటమో లేదా నష్టాన్ని చవి చూడటమో చేయక తప్పదు. లింగాయతుల సమస్య మరొకటి. వారు తమ కులాన్ని హిందూ మతానికి వెలుపల ఉండే ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరుతున్నారు. లింగాయతులు కోరితే, వారి మత వేర్పాటు ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని సిద్ధరామయ్య ప్రతిపాదించారు. అమాయకంగా కనిపించే ఈ ప్రతిపాదన పెద్ద గందరగోళాన్ని రేపింది. లింగాయతులు బీజేపీకి గట్టి మద్దతుదార్లు కావడమే (పార్టీ నేత బీఎస్ యడ్యూరప్ప లింగాయతుడే) సమస్య. లింగాయతుల మత వేర్పాటువాదాన్ని బీజేపీ–ఆర్ఎస్ఎస్ ఆమోదించవు. ఈ విషయంలో కూడా అది తిరిగి మౌనం వహించడమో లేదా నష్టపోవడమో చేయాల్సిందే. బీజేపీ చెప్పే జాతీయవాదంపై ఉన్న దృష్టి కేంద్రీకరణను సిద్ధరామయ్య, కర్ణాటకకు ప్రత్యేక పతాకం వంటి సమస్యలపైకి మరల్చారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు కలసి బీజేపీకి రాజకీయ సవాలును విసరడం సాధ్యమేనని ఇవన్నీ చెబుతున్నాయి. మన దేశంలోని రాజకీయ పార్టీలు గడ్డు కాలంలో మద్దతుదార్లను ఎలా సమీకరించగలుగుతాయి? దేశంలోని అత్యంత సునిశిత బుద్ధిగల రాజకీయవేత్తల నుండి కాంగ్రెస్ ఆ పాఠం నేర్చుకోవాల్సి ఉంటుందేమో. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నేత్రి మాయావతి... తనను మాట్లాడనివ్వడం లేదని ఆరోపించి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె ఆగ్రహం నిజమో, కాదో గానీ ఆమె చేసిన పని మాత్రం ఉద్దేశపూర్వకంగా చేసినదే. అంటే, ఆమె క్షేత్రస్థాయికి పోయి, తాను కోల్పోయిన మద్దతును తిరిగి పునర్నిర్మించుకుంటారని అర్థం. మాయావతి విస్మరించిన దళిత గ్రూపుల వెంటబడి బీజేపీ... ఐక్య దళిత గుర్తింపును జాతులు, ఉపకులాలుగా ఛిన్నాభిన్నం చేసిందని స్థానిక రాజకీయాల పరిశీలకులు చెబుతారు. ఆమె పార్టీ యూపీలో 20 నుంచి 25 శాతం ఓట్లను సంపాదించుకుంటుంది. బహుముఖ పోటీకి దిగిన అన్ని పార్టీలూ ఆ ఓట్ల పరిధిలోనే ఉంటాయి. కాబట్టి ఆమె గెలవడానికి సహేతుకమైన అవకాశమే ఉంటుంది. కానీ కుల కూటము లను నిర్మించడంలో అమిత్షాకున్న అద్భుత శక్తిసామర్థ్యాలు బీజేపీకి అత్యధిక సంఖ్యలో ఓట్లను సంపాదించి పెట్టాయి. సమాజ్‌వాదీ పార్టీగానీ (అది 29 శాతం ఓట్ల వద్ద నిలిచిపోయింది) లేదా బీఎస్పీగానీ దానికి సమతూగలేకపోయాయి. ఈ పరిస్థితిని మార్చడానికి ఉన్న ఏకైక మార్గం ప్రజా సమీకరణే. ఆ విషయం మాయావతికి తెలుసు. కాంగ్రెస్, ఈ భీతావహ స్థితి గడచిపోయాక, గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆ పని చేయడం ఎలాగో ఆలోచించాలి. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com ఆకార్ పటేల్ -
ఇది నాయకత్వ మార్పుతో నయంకాని రుగ్మత
అవలోకనం బలమైన, ప్రభావశీలమైన రాజకీయ కథనమేదీ అందించలేకపోవడమే కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద వైఫల్యం. ఇది ఆ పార్టీని అవసానకాల క్షీణతకు చేర్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలను కోల్పోయి, జాతీయ స్థాయిలోనూ ఓడిపోతోంది. ఇలాంటి పార్టీలు కొత్త నాయకత్వం వల్ల పునరుజ్జీవితమయ్యేవి కావు. ఆ విషయాన్ని అంగీకరిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏమిటి? మన దేశంలోని అతి పాత పార్టీ చరిత్రలోనే అధ్వాన స్థితిలో ఉంది. తనంతట తానుగా కోలుకునేలా సైతం లేదు. అది దాని అవసాన కాల క్షీణ దశలో ఉన్నదా లేక ఒక కొత్త నేత వచ్చి పునరుజ్జీవితం చేస్తాడని ఎదురు చూస్తోందా? అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఆ పార్టీలో మొదట కొట్టవచ్చినట్టుగా కనిపించేది, నిరాకరణ. అంటే తమ పార్టీని ఏదో దీర్ఘ కాలిక సమస్య పట్టిపీడిస్తోందనే దానిపట్ల అపనమ్మకం. రెండు కార ణాల రీత్యా ఇది అర్థం చేసుకోగలిగినదే. ఒకటి, కేవలం 34 నెలల క్రితమే కాంగ్రెస్ సంఖ్యాధిక్యతను గలిగి దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీగా ఉండటం. వరు సగా పదేళ్లు కాంగ్రెస్ ప్రధాని అధికారంలో ఉండటం... 1970లలోని ఇందిరా గాంధీ పాలన తదుపరి ఇదే మొదటిసారి. అలాంటి దశ ముగింపునకు వచ్చిం దంటే అది తాత్కాలికమైనదేనని, ఓటర్లు తిరిగి తమ పార్టీకి అనుకూలంగా మారు తారని అనుకోవడం సహజమే. ఇక రెండవ కారణం, కుటుంబ నియంత్రణలోని ఏ పార్టీలోనైనా ఉండే ఆశ్రిత వర్గం జనాదరణగల నేతలై ఉండరు. వారికి నాయక త్వానికి నిజాన్ని చెప్పడం వల్ల ఒరిగేదీ ఉండదు, పార్టీ శ్రేణులను సమీకరించాల్సిన బాధ్యతా ఉండదు. కాబట్టి, వారికి సైతం క్షేత్ర స్థాయి వాస్తవికత తెలిసి ఉండదు. రెండు, తమదైన రాజకీయ కథనం అంటూ ఒకటి లేకపోవడమే సమస్య తప్ప, నాయకుడు లోపించడం కాదు. నిజమే, నరేంద్ర మోదీకి చాలా ఆకర్షణ శక్తి ఉంది. అది ఇతరులలో అంకితభావాన్ని ప్రేరేపిస్తుంది. ఆయన గొప్ప ఉపన్యాసకు డని మనకందరికీ తెలుసు. అయితే, ఆయనకున్న ముఖ్య ప్రతిభ సూక్ష్మీకరణ. అంటే దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను సైతం అతిగా సరళీకరించిన చట్రంలోకి కుదించేయడం. ఉదాహరణకు, బలహీనమైన, పిరికి నాయకత్వం వల్లనే ఉగ్రవాదం పెచ్చరిల్లిందని, తాను దాన్ని తుదముట్టించేస్తానని ఆయన అంటారు. కానీ ఆయన ఆ పని చేయలేరనే వాస్తవం ఇప్పడు మనకు తెలిసింది. అయినా దానికి వ్యతిరేకమైన రాజకీయ కథనం ఏదీ లేదు. రాజకీయ చర్చ ఏ పరిధుల్లో, ఏ ప్రాతిపదికలపై సాగాలో కూడా మోదీ చాలా చక్కగా నిర్వచించగలుగుతారు. కాబట్టే దేశంలోని పౌరులందరిపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపిన పెద్ద నోట్ల రద్దును... నల్లధనానికి, ఉగ్రవాదానికి, నకిలీ నోట్లకు వ్యతిరేకంగా సాధించిన గొప్ప విజయంగా చలామణీ చేయగలిగారు. బలమైన, ప్రభావశీలమైన రాజకీయ కథనాన్ని దేన్నీ అందించలేకపోవడమే రాహుల్ గాంధీ అతి పెద్ద వైఫల్యం. ఆయన బహిరంగ ఉపన్యాసాల్లోని నిస్తేజం, నిస్సత్తువ ద్వితీయ ప్రాధాన్యంగల బలహీనతలు మాత్రమే. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఆధార్లను మోదీ నీరుగారుస్తున్నా... వాటిని సొంతం చేసుకునే సామర్థ్యం సైతం ఆయనలో కొరవడింది. క్షేత్ర స్థాయి కార్యకర్తలు లేకపోవడం మూడో సమస్య. భారతీయ జనతా పార్టీకి క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. వారిలో చాలా మంది అంకితభావంగల వారు, అత్యున్నతస్థాయి ప్రేరణ గలవారు. కొన్నేళ్ల క్రితం వరకు వ్యక్తులను పరిచయం చేయడానికి ‘స్వాతంత్య్ర సమర యోధుడు’ అనే మాట మనకు వినిపిస్తుండేది. ఈ వ్యక్తులు కాంగ్రెస్ నేతృత్వంలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించినవారు. 1930లలో పుట్టిన వారు కాంగ్రెస్ పేరు స్వతంత్రంతో ముడిపడి ఉన్నందున నెహ్రూకు, ఆ తర్వాత ఇందిరా గాంధీకి తమ సేవలను అందించారు. 1980ల కల్లా ‘కాంగ్రెస్ కార్యకర్త’ అనే ఆ వ్యక్తి అదృశ్యం కావడం ప్రారంభమై, నేడు అస్తిత్వంలోనే లేకుండా పోయాడు. హిందుత్వ లేదా కమ్యూనిజంలాగా ఆ పార్టీకి ఏదైనా ఒక భావజాలం లేదు. ప్రత్యేకించి, దళితులలో మాయావతికి, ముస్లింలలో అసదుద్దీన్ ఒవైసీకి ఉన్నట్టు ఆ పార్టీకి విధేయమైన సామాజిక పునాది కూడా లేదు. ఈ వాస్తవం కారణంగా స్థానిక కాంగ్రెస్ నేతలు తమ సొంతడబ్బుతో మద్ద తుదార్ల పునాదిని తయారుచేసుకోక తప్పడం లేదు. ఇది నాలుగో సమస్యకు దారితీస్తుంది, అది వనరులు. ఎన్నికలకు భారీ మొత్తాల్లో డబ్బు అవసరం. ఎన్ని కల రాజకీయాలకు నిధులు రెండు మార్గాల ద్వారా సమకూరుతాయి. పార్టీకి వచ్చే అధికారిక విరాళాలు, సభ్యత్వ రుసుముల ద్వారా లేదా అవినీతి ద్వారా వచ్చేవి. ఈ నిధుల్లో కొంత భాగాన్ని అభ్యర్థులకు పంపిణీ చేసి, మిగతా దాన్ని జాతీయ స్థాయి ప్రచారం, ప్రయాణాలు, ప్రదర్శనలు, సభలకు అయ్యే వ్యయాలు వగైరాకు సాధారణ నిధికి పంపుతారు. ఇక రెండవది అభ్యర్థులు పెట్టే వ్యక్తిగత పెట్టుబడి. శాసనసభలకు పోటీ చేయడానికి రూ. 10 కోట్లకు పైగా, పార్లమెంటుకైతే మరింత ఎక్కువ కావాలి. ఇది రహస్యమేం కాదు. నేడు కాంగ్రెస్ రెండు పెద్ద రాష్ట్రాల్లోనే.. కర్ణాటక, పంజాబ్‌లలోనే అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాలే ఆ పార్టీ జాతీయ స్థాయిలో మనగలగడానికి తగినంత డబ్బును సమకూర్చలేవు. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన అభ్యర్థులు ఇక ఎంత మాత్రమూ తమ సొంత డబ్బును భారీగా వెచ్చిం చరు. ఓటమి పాలయ్యే పార్టీకి భారీగా పెట్టుబడి పెట్టే మూర్ఖులు ఎవరుంటారు? ఇది ఆ పార్టీని అవసానకాల క్షీణతకు చేర్చింది. కాంగ్రెస్ రాష్ట్రాలను కోల్పో యింది కాబట్టి, జాతీయస్థాయిలోనూ ఓడిపోతోంది. అది ప్రతిపక్షంలో ఉన్న గుజ రాత్లాంటి రెండు పార్టీల రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్‌కు గెలిచే శక్తిలేదు. గుజరాత్లో జరిగిన లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ చివరిసారిగా మూడు దశా బ్దాల క్రితం గెలిచింది. నేటి శివరాజ్‌సింగ్ చౌహాన్, రామన్సింగ్ల పదవీ కాలం ముగిసేటప్పటికి కాంగ్రెస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారానికి దూరంగా ఉండి 15 ఏళ్లు అవుతాయి. చూడబోతే అది శాశ్వతంగానే ప్రతిపక్షంలో ఉండే ట్టుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో ఇప్పుడూ, యూపీ, బిహార్, తమిళనాడు లలో ముందే అది అర్థవంతమైన ప్రతిపక్షం హోదాను సైతం కోల్పోయింది. ఇలాంటి పార్టీలు కొత్త నాయకత్వం వల్ల పునరుజ్జీవితమయ్యేవి కావు. ఆ విషయాన్ని అంగీకరిద్దాం. ఆగ్రహావేశపూరితమైన నేటి జాతీయవాదం భయా నికి... తన కుమారుడి మృతదేహాన్నే వద్దనుకున్న ముస్లిం తండ్రిని అది శ్లాఘి స్తుంది. మరణంలోసైతం శత్రుత్వం, ద్వేషం మిగిలే ఉంటాయి. ఏ విలువలూ, ఎలాంటి విశ్వసనీయతాలేని అలాంటి పార్టీలు బతికి బట్టకట్టే ఆశలేదు, చని పోతాయి. కాంగ్రెస్‌కు తెలిసివస్తున్నది అదే. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
మనకు ఒలింపిక్ పతకాలు ఎందుకు రావంటే..
అవలోకనం పతకాలు గెలవకుండా భారతీయులను నిలువరిస్తున్నది బాహ్య ప్రపంచం కాదు. మన సంస్కృతే ఆ పని చేస్తోంది. సాంస్కృతికంగా మనలాంటివే అయిన మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కలుపుకుంటే మనం 160 కోట్ల ప్రజలం. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు. అయినా ప్రపంచ స్థాయిలో దాదాపుగా మనం ఎందుకూ కొరగాము. కేవలం మన సంఖ్య వల్లనైనా ఎట్టకేలకు కొన్ని పతకాలు రావడం మొదలైనా మనం సుదీర్ఘకాలంపాటూ అక్కడే ఉంటాం. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల ఘోర ప్రదర్శన గురించి చదువుతుంటే ఎవరికైనాగానీ క్రీడలలో మనం మరీ ఇంత అధ్వానమా అని అనిపించవచ్చు. దక్షిణ ఆసియా దేశాల్లోని ఒక దేశం ఇంత వరకు ఎన్నడూ పంపనంతటి పెద్ద ఒలింపిక్ బృందాన్ని మనం పంపడం గురించి మీడియా నెలల తరబడి కథనాలను వెలువరించింది. ఈసారి మనం మంచి ఫలితాలను సాధిస్తామనే ఆశతో ఉన్నట్టు అనిపించింది. ఒక కుస్తీ వస్తాదుపై విధించిన డోపింగ్ నిషేధాన్ని ఎత్తివేయడం ఒక రోజున ప్రధాన వార్త అయింది. ఆ రోజు రాత్రి నేను హాజరుకావాల్సిన రెండు టీవీ కార్యక్రమాలు రద్దు కావడం వల్ల నాకా విషయం తెలిసింది.కాబట్టి మనం ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శనను చూపుతున్నామా? మన ప్రదర్శన ఇంత అధ్వానంగా ఉండ టానికి రెండు కారణాలున్నాయి. ఒకటి సార్వత్రిక కారణమే. అది బాహ్య ప్రపంచంతో ముడిపడి ఉన్నది. అంటే క్రీడా సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహం, మద్దతు, తగు పోషకాహార స్థాయి, సాధారణ ప్రజారోగ్యం, మంచి తర్ఫీదు (కోచింగ్), శిక్షణ వంటివని నా భావన. ఇవి ఉంటే ఒక దేశం పతకాలను సాధించడం మొదలెడుతుంది. వీటిలోని చాలా విషయాలకు సంబంధించి మన దేశంలోని పరిస్థితులు మెరుగుపడుతున్నాయి, కాదనలేం. ఉదాహరణకు, సదుపాయాలు, తర్ఫీదు (క్రికెట్లో జరుగుతున్నట్టే వీటిలోనూ చాలా భాగం విదేశీయులకు ఔట్‌సోర్స్ చేస్తున్నారు). మనకున్న సదుపాయాలు పాశ్చాత్య దేశాలతో పోల్చదగినవేమీ కావు. అయినా పరిస్థితులు మెరుగుపడుతున్నాయనేది కాదనలేం. మన దేశంలో చాలా మంది ప్రజలు పేదలు, వారికి తగినంత పోషకాహారం లభించడం లేదనేది నిజం. అయినా చాలా మందికి లభిస్తోందనేదీ వాస్తవమే. భారీ పరిమాణంలోని మధ్య తరగతి పోషకాహార అవసరాలన్నీ తీరుతున్నాయి. ఈ మధ్యతరగతి చాలా దేశాల జనాభాకు సమానమని తరచుగా వింటుంటాం. ఇక పతకాల విజేతలకు డబ్బు, ఉద్యోగాల రూపంలో ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ లభిస్తూనే ఉంది. కాబట్టి ఈ అంశాన్ని ఒక పరిధికి మించి తప్పు పట్టలేం. క్రికెట్ కంటే అథ్లెటిక్స్ (వ్యాయామ క్రీడలు) తదితరాలకు మీడియా నుంచి చాలా తక్కువ మద్దతు లభిస్తున్నదనడం సరైనదే. కానీ అది చాలా దేశాల్లో కూడా ఉన్న వాస్తవమే. చరిత్రలోనే గొప్ప ఒలింపిక్ క్రీడాకారుడైన మైఖేల్ ఫెల్ప్స్‌ను న్యూయార్క్ వీధుల్లో ఎవరూ గుర్తుపట్టరు. అదే బేస్‌బాల్, బాస్కెట్ బాల్ స్టార్లనైతే జనం ముంచెత్తుతారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా సార్వత్రికంగా ఆవశ్యకమైన పరిస్థితులు మన దేశంలో కూడా ఉన్నాయి. అంటే మనం మరిన్ని పతకాలను గెలవాల్సి ఉన్నదని అర్థం. ఇక స్థూలంగా రెండో కారణాన్ని చూద్దాం. ఇది బయటి ప్రపంచానికి సంబంధించిన ప్రత్యేక దృక్కోణం, శారీరక శ్రమ. నేను చెప్పేదాని అర్థం బోధపడటానికి నేనో రాజకీయ ఉదాహరణను చూపుతాను. అమెరికా మూడో అధ్యక్షుడైన థామస్ జెఫర్సన్ చాలావరకు ఉదయాన్నే బయటకు వెళ్లి తానే స్వయంగా తన బారోమీటర్తో వాతావరణంలోని పీడనం ఎంత ఉన్నదో కొలిచేవాడు. 43వ అధ్యక్షుడైన జార్జి డబ్ల్యూ బుష్‌కు కలుపు మొక్కలను ఏరేయడం, తన ఫామ్ హౌస్ ఆవరణలో మొలిచిన పిచ్చిమొక్కలను పీకిపారేసి శుభ్రం చేయడం అంటే ఇష్టం. మన నేతల్లో ఎవరైనా అలాంటి పనులు చేయడాన్ని మనం ఊహిం చగలమా? లేదు. మనలో కొద్దిమందిమి మాత్రమే అలాంటి పనులను చేస్తుండటమే అందుకు కారణం. మనకు సేవకులున్నది కేవలం ఆర్థిక కారణాల వల్లనే కాదు. శారీరక శ్రమను చేయడం మనకు ఆకర్షణీయంగా అనిపించదు. ఆ పని చేయడం సామాజిక స్థాయిని తక్కువగా చూపుతుంది. మన తోటను చూసుకుని, కారును కడిగిపెట్టేవారు ఎవరైనా దొరికేట్టయితే ఆ పనులను మనం చేయం. మనకు తోట ఉన్నందుకు సంతోషిస్తామే తప్ప. తోట పని చేయడాన్ని ఆస్వాదించలేం. ఇలాంటి సంస్కృతిలో, శారీరక శ్రమ చేసే జీవితం పట్ల తృణీకార భావం ఉన్నచోట... సదుపాయాలు ఎంత మంచిగా ఉన్నాగానీ ప్రపంచస్థాయి వ్యాయామ క్రీడాకారులను తయారుచేయడం సాధ్యం కాదు. శారీరక శ్రమతో కూడిన పనిని చేయడంలో ఆనందాన్ని పొందడమే ఇక్కడ కీలకమైనది. భారతీయులు చేసే అలాంటి పనిలో అత్యధికం జిమ్‌లో చే సేదే. ఒక సోఫాను ఎత్తాలన్నా లేదా మరో చోటికి మార్చాలన్నా మరెవరో వచ్చి చేయాల్సిందే. తమ పనిని చేసిపెట్టమని అడగని కొందరు అమెరికన్ కోటీశ్వరులు నాకు తెలుసు. ఇంట్లోని తమ వ్యక్తిగత ప్రదేశంలోకి వేరెవరో ప్రవేశించడం వారికి ఇష్టం ఉండదు. శారీరక శ్రమతో కూడిన రోజువారీ పనులను చేయడంలో వారు ఆనందాన్ని పొందుతారు. మనం ఆ పని చేయం. అది కనిపించే వాస్తవం. అలాంటి చోట యువతీయువకులు ఏకాగ్రదృష్టితో తమ శారీరక నైపుణ్యాలపైన కేంద్రీకరిస్తారని ఆశించలేం.పతకాలు గెలవకుండా భారతీయులను నిలువరిస్తున్నది బాహ్య ప్రపంచం కాదు. మన సంస్కృతే ఆ పని చేస్తోంది. సాంస్కృతికంగా మనలాంటి వారే అయిన మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కలుపుకుంటే మనం 160 కోట్ల ప్రజలం. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు. అయినా ప్రపంచ స్థాయిలో దాదాపుగా మనం ఎందుకూ కొరగాము.కేవలం మన సంఖ్య వల్లనైనా ఎట్టకేలకు కొన్ని పతకాలు రావడం మొదలైనా మనం సుదీర్ఘకాలంపాటూ అక్కడే ఉంటాం. బహుశా నౌకరు చేసిచ్చిన టీ తాగుతూ మనలో ఉన్న లోపం ఏమిటా అని చర్చిస్తాం. వ్యాసకర్త: ఆకార్ పటేల్, కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
స్టింగ్ జర్నలిజం శకం ముగిసిపోయిందా?
అవలోకనం తెహెల్కాతో ప్రారంభమైన స్టింగ్ జర్నలిజం శకం ఒకప్పుడు ఉండేదని చెబుతాను. ఇప్పుడు తెహెల్కాయే వెనుకబడిపోయింది. ఇప్పుడు అవినీతి అంతం కాలేదు కానీ ప్రభుత్వంలోని వ్యక్తులు మరింత జాగ్ర త్తగా ఉంటున్నారన్నదే వాస్తవం. లంచం అనేది ఎవరైనా సరే బతకడానికి ఒక మార్గంలా కనిపిస్తోంది. ఇలాంటి వారు లంచగొండులని, అవినీతిపరులని స్టింగ్ ఆపరేషన్ల ద్వారా చూపించడం వల్ల ఇలాంటి సంస్కృతిపై తగినంత ప్రభావం చూపడం లేదు. ప్రస్తుతం ‘స్టింగ్’ అనే పదం ‘ఎన్కౌంటర్’ అనే పదంలాగే తన విలువను కోల్పోయింది. అంటే జరిగిన ఒక చర్యకు మనం సాక్ష్యులమైనప్పటికీ, బ్లాక్ అండ్ వైట్‌లోని ఒక చర్య ప్రదర్శనకు అది సరిపోదని నేననుకుంటున్నాను. దాన్ని వీడియోలో చిత్రీకరించి ఉండవచ్చు కానీ అది సత్యానికి ఒక వైపు మాత్రమే. ఎందుకలా? దీనిపై దృష్టి సారించి, ఈ రెండు పదాలు తమ విశ్వసనీయతను ఎలా కోల్పోయాయో తెలుసుకుందాం. ఖలిస్తాన్ కోసం సిక్కు వేర్పాటువాద ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు, 1980లలో ఎన్కౌంటర్ అనే పదం భారతీయులకు సుపరిచి తమైంది. ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు హతమైన వార్తలు అప్పట్లో సర్వసాధా రణమైపోయాయి. ముంబైలో 1990లలో పోలీసులు మాఫియాలో కిందిస్థాయి భాగస్వాములను వరుస ఎన్కౌంటర్లలో చంపేశారు. చేతులకు బేడీలు వేసి ఉన్న మనుషులపై ట్రిగ్గర్ నొక్కడానికి ఇష్టపడే అధికారులు ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా మారారు. ఈ క్రమంలో కొంతమంది అమాయకుల్ని కూడా చంపేశారు. అందుకే ‘ఉస్కా ఎన్కౌంటర్ హో గయా’ అనే పదబంధానికి ఎవరో ఒకరిని ఉద్దేశ పూర్వకంగా ఎంపిక చేసుకుని తర్వాత వారిని చంపేశారనే అర్థం వచ్చేసింది. అయితే స్టింగ్ అనే పదం కూడా ఎన్కౌంటర్ పదంలాగా ఎందుకు విశ్వస నీయత కోల్పోయింది. మీడియాలో 15 ఏళ్ల క్రితం తెహెల్కా పత్రిక చేపట్టిన భారీ స్థాయి పరిశోధనతో స్టింగ్ ఆపరేషన్ల సంప్రదాయం ప్రారంభమైంది. వీడియో కెమెరాలను సూక్ష్మరూపంలోకి తీసుకువచ్చి సైనిక, నిఘా సాంకేతిక జ్ఞానాన్ని వాణిజ్య అప్లికేషన్లకు బదిలీ చేయడం వల్లే ఈ తరహా పరిశోధన సాధ్యమైంది. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి మహమ్మద్ అజారుద్దీన్ వంటి ప్రముఖ క్రీడాకారుల గురించి బీసీసీఐ అధికారులు, క్రికెటర్లు మాట్లాడుతుండటాన్ని తెహెల్కా రికార్డు చేసింది. తర్వాతేం జరిగింది? విదేశీ క్రీడాకారులు (దక్షిణాఫ్రికా ప్రముఖ క్రికెటర్ హాన్సీ క్రోన్యే) బెట్టింగ్ ఆరోపణలలో చిక్కుకుని తప్పును అంగీకరించడం, శిక్షలకు గురవడం జరగ్గా భారత్‌లో మాత్రం ఇలాంటి ఉదంతాలు అస్పష్టంగానే ముగిసి పోయాయి. అజారుద్దీన్‌పై నిషేధం ఎత్తివేశారు. అతడు రాజకీయనేతగా అవతారమెత్తి ఎంపీ స్థానం గెల్చుకున్నాడు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యం ఉన్నప్పటికీ తాను తప్పు చేసినట్లు అతడు ఎన్నడూ అంగీకరించలేదు. తప్పించు కోవడం క్రోన్యేకి సాధ్యం కానప్పటికీ అజారుద్దీన్ మాత్రం బయటపడగలిగాడు. బెట్టింగ్ ఆరోపణల్లో చిక్కుకున్న ప్రముఖ క్రికెటర్లలో ఏ ఒక్కరూ దెబ్బతినలేదు. తెహెల్కా స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పుడు నేను ముంబైలో ఒక వార్తాపత్రికను ఎడిట్ చేస్తు ఉండేవాడిని. తెహెల్కా బయటపెట్టిన విషయం మమ్మల్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆ పరిశోధనా ప్రతులను మొత్తంగా ప్రచురించాము. భారతీయ క్రికెట్‌కు చెందిన గొప్ప, మంచి క్రికెటర్లు అవినీతి గురించి ఎంతో తేలిగ్గా మాట్లాడుతున్న మాటలను బయటపెట్టిన ప్రతులవి. కానీ ఈ స్టింగ్ వల్ల తర్వాత జరిగిందేమిటి? చెప్పడానికి ఇది కష్టమే. ప్రపంచంలోనే అత్యంత అవినీతి లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్‌తోపాటు క్రికెట్లో అవినీతి కొనసాగుతోంది. క్రికెటర్లు సస్పెండ్ అవుతూనే ఉన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు గాను శిక్షల పాలవుతున్నారు. అయితే స్పష్టమైన తీర్పులను సాధించలేని ఈ స్టింగ్‌ల వైఫల్యం అన్నిచోట్లా కనబడుతుంది. ఈ నెలలో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఒక స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకుంది. పార్టీకి చెందిన డజనుకు ైపైగా సభ్యులు నగదు, హామీలు పొందుతున్న దృశ్యాలను ఈ స్టింగ్‌లో చిత్రీకరించారు. ఎంపీలు, ఎమ్మె ల్యేలతోపాటు వీరిలో అందరూ ఉన్నతాధికారులే ఉన్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ స్పందన ఏమిటి? ఈ వ్యవహారంలో వాస్తవానికి తామే బాధితులమని, శత్రువులు తమైపై చేసిన విష ప్రచారమని ఆ పార్టీ ప్రకటించింది. భారత్‌లో స్టింగ్ ఆపరేషన్ల సాధారణ వైఫల్యానికి రెండు కారణాలున్నాయి. మన కోణంలో నైతిక బాధ్యత భావన ఏమంత పటిష్టమైనది కాకపోవడం అతి ప్రధాన కారణం. ఎందుకంటే మన నీతిసూత్రాలు చాలా సరళతతో, వెసులు బాటుతో ఉంటాయని చెప్పాలి, లాలూ ప్రసాద్ యాదవ్ ప్రదర్శిస్తున్నట్లుగా.. అవినీతి నేతలుగా ప్రదర్శి తమైన వారు, చివరకు నేరస్థులుగా శిక్షపడిన వారు రాజకీయాల్లో కొనసాగగలరు. అలాగని లాలూ ఒక్కరే కాదు. ఏదీ వాస్తవంగా పనిచేయని వ్యవస్థలో, మధ్యవర్తి చట్టబద్ధత కలవాడిగా మారుతున్నాడు. ఇక లంచం అనేది ఎవరైనా సరే బతక డానికి ఒక మార్గంలా కనిపిస్తోంది. ఇలాంటి వారు లంచగొండులని, అవినీతి పరులని స్టింగ్ ఆపరేషన్ల ద్వారా చూపించడం వల్ల మన సంస్కృతిపై తగినంత ప్రభావం చూపడం లేదు. అధికారంలో ఉన్న అనేకమంది వ్యక్తులు స్టింగ్ ఆపరేషన్ల బారినపడ్డారు కానీ, తమకు వ్యతిరేకంగా సాక్ష్యాలను వీరు సులువుగా తోసిపుచ్చుతున్నారు. ఉదాహరణకు, సాహెబ్ (నరేంద్రమోదీ) డిమాండ్ చేశారు కాబట్టి ఒక యువ మహిళపై నిఘా ఉంచవలసిందిగా గుజరాత్ పోలీసు అధికారులను ఆదేశించిన అమిత్‌షా కుంభకోణం ఉంది. బీజేపీ నాటి అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ఒక స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయి అవినీతికి గాను శిక్షపడి జైలు పాలైనప్పటికీ, అతి తక్కువ కాలం మాత్రమే కారాగారంలో ఉండి తర్వాత బెయిల్ తెచ్చుకుని ఇంట్లో ఉండి చనిపోయారు. ఇక స్టింగ్ ఆపరేషన్లు వాస్తవంగానే పనిచేయవు అనేందుకు మరో కారణం ఏదంటే మీడియా తరచుగా రాజీపడిపోవడమే. ఒక కార్పొరేట్ సంస్థ నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేస్తూ స్టింగ్ వీడియోకు దొరికిపోయిన జీ టీవీ ఎడిటర్ స్వయంగా అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నాడు. ఇందుకుగాను అతడు అరెస్టయినప్పటికీ తన స్థానంలో కొనసాగుతూనే ఉన్నాడు. చివరకు తెహెల్కా సంస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ అనైతిక చర్యల కారణంగా ఆ పత్రిక సైతం తన ప్రతిష్టను పూర్తిగా పోగొట్టుకుంది. అయితే స్టింగ్ ఆపరేషన్ల వల్ల ప్రజలు అలసి పోయారని నా అనుమానం. కారణం ఏదైనా కావచ్చు. సంతృప్తికరమైన ఫలి తాలను ఇవ్వకుండా ముగిసిపోయే కథనాల పట్ల కొద్దికాలం తర్వాత ఆసక్తి తగ్గిపోతుంది. తెహెల్కా మాజీ ఉద్యోగుల్లో ఒకరైన అనిరుద్ధ బహల్ తరచుగా స్టింగ్ జర్నలిజం చేస్తుంటారు కాని తన కృషికి పెద్దగా కవరేజ్ దొరకలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత, తన ప్రభుత్వంలోని అధికారులు లంచం తీసుకుంటుంటే వాటిని రహస్యంగా రికార్డు చేయాలని, అప్పుడే వారిని తాను శిక్షించగలనని అరవింద్ కేజ్రీవాల్ పౌరులను ప్రోత్సహించారు. ఇందుకు సంబంధించిన ప్రచారాన్ని భారీస్థాయిలో నిర్వహించారు కానీ అదెలా ముగిసి పోయిందో స్పష్టం కాలేదు. దీనివల్ల నాకు తెలిసి పెద్ద ఫలితం రాలేదు. పశ్చిమబెంగాల్లో ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన తాజా స్టింగ్ ఆపరేషన్ అక్కడ త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీని దెబ్బతీస్తుందంటే నేను ఆశ్చర్యపోతాను. తెహెల్కాతో ప్రారంభమైన స్టింగ్ జర్నలిజం శకం ఒకప్పుడు ఉండేదని చెబుతాను. ఇప్పుడు తెహెల్కాయే వెనుకబడిపోయింది. ఇప్పుడు అవినీతి అంతం కాలేదు కానీ ప్రభుత్వంలోని వ్యక్తులు మరింత జాగ్ర త్తగా ఉంటున్నారన్నదే వాస్తవం. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
‘జాతీయవాదులకు’ మంచి రోజులు వచ్చేశాయి
అవలోకనం మహత్తరమైన మన భారత జాతీయవాదులు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వారి వెంటపడుతున్నారు. వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ లేదా మరే ఇతర ప్రేమా కాదు... విద్వేషం, విరోధం. భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ఏ విదేశీ పత్రికైనా చూడండి. భారత్ గురించి ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని ప్రపంచం భావిస్తోంది కాబట్టి. అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు. మహారాష్ట్రలో ఒక ముస్లిం శాసన సభ్యుడ్ని, అతడు ‘‘భారత్ మాతా కీ జై’’ (తల్లి భారతికి విజయం) అనడానికి బదులు ‘‘జై హింద్’’ (భారత దేశానికి విజయం) అనే అంటానని అన్నందుకు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ రెండు నినాదాల మధ్య ఉన్న తేడా ఏమిటో నాకూ క చ్చితంగా తెలియదు. కానీ అది శిక్షార్హమైందనేది మాత్రం స్పష్టం. భారత వ్యతిరేకమైన రాతలేవీ రాయడం లేదని హామీ ఇవ్వాలని ఉర్దూ రచయితలందరినీ మార్చి 19న కోరారు. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ నిర్దేశనలోని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్’(ఎన్‌యూపీయూఎల్), ఉర్దూ రచయితలను దిగువ ప్రకటనపై సంతకం చేయాలని కోరింది: ‘నేను.........ను ........... కొడుకు/కూతురు ,........ శీర్షికగల నా పుస్తకం/పత్రికను ఎన్‌యూపీయూఎల్ ఆర్థిక సహాయ పథకం కింద పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆమోదం పొందాను. ఇందులో భారత ప్రభుత్వ విధానాలకు లేదా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైనది, దేశంలోని వివిధ వర్గాల మధ్య ఏ విధమైన వైమనస్యానికి కారణమయ్యేది ఏదీ లేదు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ దేని నుంచీ దీనికి ఆర్థిక సహాయం అందలేదు.’’ ఇదీ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక తెలిపిన విషయం. జాతీయవాదులకు, జాతి వ్యతిరేకులకు మధ్య సాగుతున్న మోసపూరితమైన, ఈ సొంత తయారీ చర్చ త్వరలోనే సమసిపోతుందని ఆశపడుతున్న నాలాంటి వాళ్లకు ఈ వార్త నిరుత్సాహం కలిగించింది. నాకైతే ఇప్పుడు సాగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ వంటి విషయాల గురించి రాయాలని ఉంది. కానీ ఈ వార్తా కథనం వల్ల... మధ్యయుగాల కాలపు ఈ నిత్య పోరాటంలో నేను కూడా ఏదో ఒక పక్షాన నిలవడం తప్ప, గత్యంతరం లేకపోయింది. మన హిందుత్వ జాతీయవాదులు ప్రచారం చేస్తున్నది విభిన్న తరహా జాతీయవాదం. అది, మరో దేశంతో పోలిస్తే మరొక దేశంలోని వారికి తమ పట్ల ఉండే భావం అని చెప్పే యూరోపియన్ జాతీయవాదం కాదు. సెర్బియన్లను, ఆస్ట్రో-హంగేరియన్లు, వారిని రష్యన్లు, వారిని జర్మన్లు, వారిని ఫ్రెంచ్‌వాళ్లు ద్వేషించటం వల్ల ప్రపంచ యుద్ధం జరిగింది. ఇటాలియన్లు ఆ యుద్ధంలో ఎందుకు చేరారో నాకైతే గుర్తులేదు. కానీ బ్రిటిష్‌వాళ్లు ప్రతి ఒక్కరినీ ద్వేషించేవారనేది మాత్రం నిజం. ఒక్కసారి నిప్పు అంటుకున్నదే చాలు, అంతా ఒకరిపైకి మరొకరు విరుచుకుపడ్డారు. టర్కులను, అరబ్బులను, భారతీయులను, తత్పర్యవసానంగా అమెరికా వంటి దేశాలనూ అందులోకి ఈడ్చారు. రెండు ప్రపంచ యుద్ధాలలో ఆ దేశాలు తమకు తాము చేసుకున్న హాని ఫలితంగా యూరోపియన్ దేశాలు తమ సంకుచితత్వాన్ని కోల్పోయాయి. అదే ఆ తర్వాత వారిలో యూరోపియన్ యూనియన్ పట్ల ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈయూ అంటేనే, తమ తమ జాతీయతలను వదుల్చుకుని, తమ సరిహద్దులను, మార్కెట్లను ఒకరికొకరు తెరుచుకోవాలని కోరుకున్న ప్రజా సముదాయాలు. కాగా, నేటి భారతదేశంలోని మన ‘జాతీయవాదం’ మరో జాతికి వ్యతిరేకమైనది కాదు, ఇతర భారతీయులకు వ్యతిరేకమైనది. అందుకే ఇది విభిన్నమైనది. మహత్తరమైన మన భారత జాతీయవాదులు, మరో దేశానికి వ్యతిరేకంగా కాదు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వెంటపడుతున్నారు. వారికి పట్టేది, వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ కాదు లేదా మరే ఇతర ప్రేమా కాదు. అది విద్వేషం, విరోధం. భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ‘జాతి వ్యతిరేకత’ అని మనం అభియోగంగా అతి తేలికగా వాడేసే ఈ పదం నేడు యూరోపియన్ భాషలలో నిజంగా వాడుకలో ఉన్నది కాదు. భారతీయుల వంటి ప్రాచీన కాలపు ప్రజలు మాత్రమే వాడేది. జాతి అనేది ఏ అర్థాన్ని ఇస్తుందో దానికి వ్యతిరేకమైన విషయలకే అది ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్ మాతా కీ జై అనడం గాక, ఏది నిజమైన జాతీయవాదమో నిర్ణయించేది ఎవరు? నిజంగానే నాకు భారత జాతీయవాదం అంటే ఏమిటో తెలియదు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జాతీయవాదం అంటే ఏమిటనే అంశంపై బహిరంగ ఉపన్యాసాల పరంపరను నిర్వహిస్తోంది. వీడియోల సెట్టుగా అవి అందుబాటులోకి వస్తున్నాయి. అవి విద్వద్వంతమైనవే అయినా సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి. అదో గొప్ప కృషే. కానీ అందులో చాలా భాగం భారతీయుల మీదనే వృథా చేస్తారేమోనని నా భయం. మీరెంత ఘోరంగా ప్రవర్తించినా ఫర్వాలేదు, భారత్ మాతా కీ జై అని అంటున్నంత కాలం మీరీ దేశంలో జాతీయవాదే. వార్తా పత్రికల్లోనే వచ్చిన మరో కథనం, ఇద్దరు ముస్లింల గురించినది. వారిలో ఒకరు 15 ఏళ్ల పిల్లాడు. సరిగ్గా అమెరికన్ ఆఫ్రికన్లను అమెరికాలో చేసినట్టే... వాళ్లను కూడా చెట్టుకు కట్టేసి చిత్రహింసల పాలు చేసి చంపారు. వారిద్దరూ గేదెలను మేపుకుంటున్నారు. కాబట్టి వారి నేరం ఏమిటో స్పష్టం కాలేదు. అయితే ఈ విద్వేషాన్ని ఎక్కడి నుంచి రేకెత్తిస్తున్నారనేది మాత్రం పూర్తిగా కచ్చితంగా తెలిసినదే. ఇదేమైనా ప్రభుత్వం కాస్త ఆగేట్టు చేస్తుందా? ఎంతమాత్రమూ చేయదు. ఇంకా మరింత ‘‘జాతీయవాదం’’ కోసం పిలుపునివ్వడం కోసం ఈ వారాంతంలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కానున్నది. ఇప్పటికీ మనకున్నది సరిపోదా? నాగరిక సమాజంలో భారత ప్రతిష్టపై ఇది ఎలాంటి ప్రభావాన్ని కలుగజేస్తుందో బీజేపీ వాళ్లకు తెలియదా? ఏ విదేశీ పేపర్‌ను లేదా పత్రికైనా తీసుకోండి. భారత్ గురించి అందులో ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని మనలో చాలా మందిమి, మిగతా ప్రపంచమూ కూడా భావిస్తోంది కాబట్టి. ఈ పరిస్థితుల్లో అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు. విద్వేషం నిండిన, కపట జాతీయవాదులకు మంచి రోజులు వచ్చేశాయి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
కొత్త అర్థం సంతరించుకున్న ‘జాతి వ్యతిరేకత’
అవలోకనం ఢిల్లీలాగే బస్తర్‌లో కూడా ప్రభుత్వం దృష్టిలో జాతి వ్యతిరే కి ముద్ర కొత్త అర్థాన్ని సంతరించుకున్నట్టుంది. ఒకసారి మీపై ‘జాతి వ్యతిరేకి’ ముద్ర వేశారంటే, మీకిక రాజ్యాంగం ప్రకారం సంక్రమించే ప్రాథమిక హక్కులు ఏవీ ఉండవనే అనిపిస్తోంది. మీరిక ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీల్లేదు, హింసకు వ్యతిరేకంగా మీకు ఇక రక్షణ లభించదు, మీరు దూషణలకు గురైనా న్యాయం జరగదు. ఢిల్లీ నగరం అసమ్మతి వ్యక్తం చేసే హక్కు కోసం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాటం సాగుతున్న రణ రంగంగా మారిందని అనక తప్పదు. ఇంతకు ముందు, 2012 డిసెంబర్ 12 రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం జరిపి, హత్యగావించిన సందర్భంగానే ఇంత స్థాయి తిరుగుబాటు వెల్లువెత్తడం చూశాం. అయితే ఒక విశ్వవిద్యాలయంలో చేసిన నినాదాల గురించిన ఆగ్రహం ఈసారి చీలిపోయింది. అలాఅని ఈ సందర్భంగా ముందుకు వచ్చిన సమస్యలు తక్కువ ప్రాధాన్యంగలవేం కావు... మనం ఇంకా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును గౌర విస్తున్నామా? ఇతరుల హక్కుల పరిరక్షణ కోసం నిలిచే వారికి రక్షణ కల్పిస్తున్నామా? ఢిల్లీకి 1,500 కిలో మీటర్ల దూరంలో ఉన్న బస్తర్‌లో కూడా ఇవే ప్రశ్నలు... మరింత కొట్టవచ్చినట్టుగా ముందుకు వస్తున్నాయి. రాజ్య నిర్బంధం అక్కడ మెల్లగా పెరుగుతున్న ఆగ్రహం నుంచి, పూర్తి స్థాయి విస్ఫోటనంగా మారుతోంది. బస్తర్ కేంద్రంగా పనిచేస్తున్న కార్యకర్తలను, పాత్రికేయులను పోలీసులు పిలిచి ప్రశ్నించడం నిత్యకృత్యంగానూ, వృత్తిపరమైన ప్రమాదంగానూ మారింది. తప్పుడు అరెస్టులు కూడా నిజమైన ముప్పుగానే మారుతున్నాయి. స్థానిక పాత్రికేయుడు సంతోష్ యాదవ్ దాదాపు ఐదు నెలలుగా తప్పుడు అభియోగాలతో పెట్టిన కేసుల కింద నిర్బంధంలో ఉన్నాడు. ఈ ప్రాంతంలోని ఆదివాసుల దుస్థితిపై వార్తా కథనాలను వెలువరించినందుకుగానూ ఆయనను 2015 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. అంతకు ముందు కూడా పోలీసులు తరచుగా ఆయనను వేధింపులకు గురిచేశారు. ఒక సందర్భంలో బట్టలూడదీసి చావ బాదారు కూడా. ఆయన సహాయం చేయడం వల్ల చాలా మంది ఆదివాసులకు న్యాయ సహాయం లభించింది. కిక్కిరిసిన ఛత్తీస్‌గఢ్ జైళ్లలో వేలాదిమంది ఆది వాసులు నక్సలైట్లన్న ఆరోపణతో మగ్గుతున్నారు. ఖైదీలను ఉంచగలిగిన పూర్తి స్థాయిని బట్టి చూస్తే జాతీయ స్థాయిలో జైళ్లలోని ఖైదీలు సగటున 114%. కాగా ఆ రాష్ట్ర జైళ్లలోని ఖైదీలు సగటున 253% అని జగదల్పూర్ న్యాయ సహాయ బృందం (జగ్లాగ్) సమీకరించిన సమాచారం తెలుపుతోంది. ఇక కంకేర్ జైల్లో అది 428%. సంతోష్ యాదవ్ న్యాయవాది ఈశా ఖందెల్వాల్, తన సహ కార్యకర్త షాలినీ జిరాతో కలిసి జగదల్పూర్ న్యాయ సహాయ బృందంలో భాగంగా ఆదివాసీ గ్రామీణులకు ఏళ్లతరబడి న్యాయ సహాయం అందిస్తున్నారు. పోలీసులు వారిద్దరినీ హఠాత్తుగా ప్రశ్నించడానికి పిలిపించారు. దీంతో గతవారం, ఇంటి యజమాని ఆ ఇద్దరు న్యాయవాదులను ఇల్లు ఖాళీ చేయమన్నాడు. అలాగే మాలినీ సుబ్రహ్మణ్యంకు కూడా ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు అందాయి. బస్తర్‌లోనే నివసిస్తూ, అక్కడి మానవ హక్కుల ఉల్లంఘన గురించి నివేదిస్తున్న జాతీయ మీడియాకు చెందిన పాత్రికేయులు కొద్ది మందిలో ఆమె ఒకరు. ఈ కార్యకర్తలు, పాత్రికేయులు ఒకరి పనికి మరొకరు సహాయ పడుతుండే వారు. మాలినీ సుబ్రహ్మణ్యం మావోయిస్టుల మద్దతుదారని ఆరోపిస్తూ ఆమె ఇంటి ముందు రాష్ట్ర పోలీసులతో సంబంధాలున్న ‘సామాజిక్ ఏక్తా మంచ్’ అనే మావోయిస్టు వ్యతిరేక గ్రూపు సభ్యులు ప్రదర్శన జరిపారు. ఆమె వారిపై పెట్టిన కేసులో ఖందెల్వాల్ న్యాయవాదిగా ఉన్నారు. సంతోష్ యాదవ్‌ను చట్టవ్యతిరేక కార్యకాలాపాల (నివారణ) చట్టం, ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక పోలీసు భద్రతా చట్టం, తదితర చట్టాల కింద నిర్బంధించిన విషయాన్ని కూడా మాలినీ సుబ్రహ్మణ్యం జాతీయ మీడియాకు నివేదించారు. జగదల్పూర్ న్యాయ సహాయ బృందానికి చెందిన ఇద్దరు న్యాయవాదులతో పాటూ, మాలినీ సుబ్రహ్మణ్యం కూడా ఇప్పుడు బస్తర్‌కు వెలుపలే ఉన్నారు. యాదవ్ ఇంకా జైల్లోనే మగ్గుతున్నాడు. సోనీ సోరీ అనే ఆదివాసీ కార్యకర్తను పోలీసు కస్టడీలోనే అత్యాచారం జరిపి, ఏళ్ల తరబడి నిర్బంధించారు. చివరికి ఆమెను నిర్దోషిగా విడుదల చేసినా... ఆమెపై దాడి తప్పలేదు. ఫిబ్రవరి 20 రాత్రి ఆమెపై నల్లటి పదార్థాన్ని చల్లిన దుండగులు, బస్తర్‌లోని ఒక సీనియర్ అధికారికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే ఇక ఆమె కుమార్తెపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ‘మావోయిస్టు’ అని ఆరోపణకు గురైన హద్మా కశ్యప్‌ను ఫిబ్రవరి 3న పోలీసులు బూటకపు ఎదురు కాల్పుల్లో హతమార్చారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదే పోలీసు అధికా రికి వ్యతిరేకంగా ఆ ఎన్‌కౌంటర్‌పై ఫిర్యాదు చేసే విషయంలో సోనీ సోరీ ఆ కుటుంబానికి సహాయం చేస్తున్నారు. బస్తర్‌లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతున్నాయని పలు వార్తా నివేదికలు వెలువడిన తర్వాతే అక్కడి నుంచి పాత్రికేయులను, న్యాయ వాదులను బహిష్కరించడం, సోనీ సోరీపై దాడి జరగడం కాకతాళీయమే కావచ్చు. నవంబర్ నుంచి తమపై భద్రతా బలగాలు పలుమార్లు మూకుమ్మడి అత్యాచారాలు, లైంగిక దాడులు, హింసకు పాల్పడ్డాయని ఆదివాసీ గ్రామీణ మహిళలు పలు సందర్భాల్లో తెలిపారని బేలా భాటియా అనే పాత్రికేయురాలు తెలిపారు. ఆమె స్వయంగా వేధింపులకు గురయ్యారు కూడా. ఈ కేసులన్నిటి లోనూ పోలీసులు మొదట్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి నిరాకరించారు. అయితే కార్యకర్తలు పట్టువిడవకుండా అదేపనిగా ఒత్తిడి చేస్తూ రావడంతో అంగీకరించక తప్పలేదు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు పాత్రికేయులను మావోయిస్టు మద్దతుదార్లనడానికి సాధారణంగా వెనుకాడరు. ‘జాతి వ్యతిరేకత’ కథనాన్ని ప్రయోగించడంలోనూ అంతే చురుగ్గా ఉంటారు. గత వారం, బస్తర్‌లోని బీబీసీ హిందీ పాత్రికేయులు ఒకరికి బెదిరింపులు రావడంతో తమ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లి పోయారు. ‘‘నీలాంటి జర్నలిస్టుతో కాలాన్ని వృథా చేసుకోవడంలో అర్థం లేదు. జాతీయవాద, దేశభక్త వర్గానికి చెందిన మీడియా నాకు మద్దతు తెలుపుతుంది, నేను వారితో సమయం వెచ్చించడం మంచిది’’ అని ఆ ప్రాంతంలోని అత్యంత సీనియర్ పోలీసు అధికారి, బస్తర్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆ బీబీసీ జర్నలిస్టుకు టెక్స్ట్ మెసేజ్ పంపారు. ఢిల్లీలాగే బస్తర్‌లో కూడా ప్రభుత్వం దృష్టిలో ‘జాతి వ్యతిరే కి’ ముద్ర కొత్త అర్థాన్ని సంతరించుకున్నట్టుంది. ఒకసారి మీపై ‘జాతి వ్యతిరేకి’ ముద్ర వేశారంటే, మీకిక రాజ్యాంగం ప్రకారం సంక్రమించే ప్రాథమిక హక్కులు ఏవీ ఉండవనే అనిపిస్తోంది. మీరిక ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీల్లేదు, మీకిక హింసకు వ్యతిరేకంగా రక్షణ లభించదు, లేదా మీరు దూషణలకు గురైనా న్యాయం జరగదు. మధ్య యుగాల యూరప్‌లో అసమ్మతి తెలిపినవాళ్లను మంత్రగాళ్లు ముద్ర వేసి సజీవ దహనం చేసేవారు. ఆ రోజుల్లోలాగే నేడు ఢిల్లీ, బస్తర్‌లలో మంటలు వెలిగిస్తే చాలు... వెంటనే తోసేయడానికి గుంపులు సిద్ధంగా ఉంటున్నాయి. -ఆకార్ పటేల్ వ్యాసకర్త : కాలమిస్టు, రచయిత -
నేరమే అధికారమై ప్రజలను వేటాడుతున్న చోట...!
అవలోకనం సామూహిక హింసాత్మక ఘటనలకు సంబంధించి న్యాయం జరగకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, వాటిలో పాలుపంచుకున్న లేదా అందుకు పురికొల్పిన వారిని అంటే తన సొంత మనుషులను విచారించడంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి ఆసక్తి చూపకపోవడమే. ఢిల్లీలో సిక్కుల ఊచకోత, భోపాల్ విషవాయువు లీక్, బాబ్రీ మసీదు కూల్చివేత అనంతర మత ఘర్షణలు, గుజరాత్ మారణకాండ వంటి ఘటనల్లో బాధితులు నేటికీ తగిన న్యాయాన్ని పొందలేకపోవడానికి ఇదే కారణం. మన సామూహిక జాతీయ విషాదాలు అనేకం కాబట్టి, వాటిని లెక్కిం చడం కూడా కష్టమే అవుతుంది. నేను 40ల మధ్య వయసులో ఉన్నాను. వేలాదిమంది హత్యకు దారితీసిన కనీసం అయిదు ఘటనలు కలుగ జేసిన గాయాలు నాకు వ్యక్తిగతంగా కూడా గుర్తున్నాయి. ఈ మారణ కాండలు ఏవంటే , 2 వేలమంది ముస్లింలను చంపిన 1983 నాటి నెల్లి హత్యాకాండ, 1984 డిసెంబర్లో 3 వేలమంది మరణాలకు దారితీసిన భోపాల్ విషవాయు ప్రమాదం. తర్వాత అదే నెలలో ఢిల్లీలో 2 వేల మంది సిక్కుల ఊచకోతకు దారితీసిన ఇందిరాగాంధీ హత్యానంతర దాడులు, బాబ్రీమసీదును కూల్చివేసిన అనంతరం 1992లో దేశ వ్యాప్తంగా వేలాదిమంది హత్యకు దారితీసిన ఘటనలు (ఆనాటికి నేను 20లలో ఉండేవాడిని, నా చుట్టూ ఏం జరుగుతోందో నాకు పూర్తిగా బోధపడేది). తర్వాత 2002లో గుజరాత్లో కనీసం వెయ్యిమంది హత్యకు దారితీసిన హింసాత్మక దాడులు. దేశంలో జరిగిన మరికొన్ని ప్రధాన ఘటనలను వదిలిపెట్టాననడంలో సందే హమే లేదు. బోటు ప్రమాదాల్లో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయిన ఘట నలు జరిగాయి. మరోవైపున ప్రకృతి వైపరీత్యాలలో వేలాదిమంది చనిపోతున్నా, ప్రభుత్వాలు తమ పౌరులకు ఎలాంటి సహకారం అందించలేని పరిస్థితిలో ఉండేవి. నేనిక్కడ వేలాది కశ్మీరీల హత్య గురించి, పండిట్ల వలస గురించి పొందుపర్చడం లేదు. ఎందుకంటే, ఇవి ఒక ఘటనలో కాకుండా నెలలు లేదా సంవత్సరాల పరిణామ క్రమంలో జరుగుతూ వచ్చాయి. ఇక్కడ నేను పొందుపర్చిన హింసాత్మక సందర్భాల్లో బాధితులకు న్యాయం అనేది అంత సులభంగా దక్కలేదు. వీటిలో ఒక్కటంటే ఒక్క ఘటన ఫలితాలను, వాటి పర్యవసానాలను పరిశీలించినట్లయితే ఒక జాతిగా మనం పూర్తిగా పతన మైన విషయం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. వీటిని నిష్పక్షపాత దృష్టితో మనం చూసినట్లయితే, తీవ్రనేరాలకు పాల్పడిన వారిపై తగిన విధంగా దర్యాప్తు చేసి, వారిని జవాబుదారులను చేయడంలో మన వైఫల్యం స్పష్టమవుతుంది. మన దేశంలో జరుగుతున్న సామూహిక హింసాత్మక ఘటనలకు సంబం ధించి న్యాయం జరగకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, హింసా ఘటనల్లో పాలుపంచుకున్న లేదా అందుకు పురికొల్పిన వారిని అంటే తన సొంత ప్రజలను విచారించడంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి ఆసక్తి చూపకపోవడమే. ఉదాహరణకు, పై ఘటనల్లో చివర పేర్కొన్న గుజరాత్ హింసాకాండకు సంబం ధించి తగిన న్యాయాన్ని పొందలేకపోవడానికి ఇదే కారణం. ఈ ఉదాహరణను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఆ ఘటన గురించి నాకు బాగా తెలుసు. పైగా గుజరాత్ హింసాకాండకు చెందిన కొన్ని అంశాలను పరిశీలించడానికి భారత సంపాదక మండలి పంపిన త్రిసభ్య కమిటీలో నేనూ భాగం పంచుకున్నాను. ఢిల్లీలో 1984లో సిక్కుల హత్యాకాండపై దృఢవైఖరితో వ్యవహరించడం ద్వారా ఈ నిరాశా నిస్పృహల వలయాన్ని ఛేదించడానికి నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. సిక్కుల ఊచకోత ఘట నలో పాలుపంచుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండుగులను ఉద్దేశపూర్వకంగా కాపాడుతూ వచ్చారని బీజేపీ చాలాకాలంగా ఆరోపిస్తోంది. కేంద్రంలో అధికారం చేపట్టాక, ఎన్డీయే కూటమి ప్రభుత్వం దీనిపై ఒక కమిటీని నియమించింది. ఢిల్లీలో హింసాకాండ సందర్భంగా జరిగిన దాడులపై తగిన విధంగా దర్యాప్తు జరగలేదని, దర్యాప్తు రూపాన్ని మార్చేందుకోసం ఒక కపట ప్రయత్నం చేశారని ఈ కమిటీ కనుగొంది. దీంతో ఇంతవరకు పరిశోధన జరగని కేసుల్లో తాజా ఎఫ్ఐఆర్ నివేదికలు, నేరారోపణలను నమోదు చేయడానికి ఎన్టీయే ప్రభుత్వం ఒక త్రిసభ్య బృందాన్ని ఏర్పర్చింది. మూడు దశాబ్దాల క్రితం ఊచకోతకు గురైన బాధిత కుటుంబాలకు న్యాయం అందించే విషయంలో ఈ బృందం నిర్ణయాత్మకంగా, దృఢంగా, శరవేగంగా స్పందిస్తుందని నేను ఆశించాను. ఢిల్లీ హత్యాకాండకు సంబంధించిన కేసులు చాలా పాతబడిపోయాయని, వాటిని పునరుద్ధరించడం చాలా కష్టమని పలువురు భావిస్తున్నప్పుడు, ఢిల్లీ హింసాకాండ బాధ్యులను శిక్షించినట్లయితే, భారతీయుల రక్తాన్ని చిందిస్తున్న వారు శిక్ష నుంచి తప్పించుకోవడం కష్టమని మనలో చాలా మందికి అది కాస్త నమ్మకాన్నిచ్చి ఉండేది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ కమిటీని నియమించారు. ఐపీఎస్ అధికారి ప్రమోద్ అస్థానా నేతృత్వంలో ఏర్పాటైన ఈ ప్రత్యేక బృందంలో మరొక పోలీసు అధికారి కుమార్ గ్యానేష్, రిటైర్డ్ సెషన్స్ న్యాయమూర్తి రాకేష్ కపూర్ సభ్యులుగా ఉన్నారు. ఈ హత్యాకాండకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యం చేసిన లేదా తగిన విధంగా పరిశీలించని సాక్ష్యాధారాల పరిశీలనకోసం ప్రభుత్వం ఈ ముగ్గురికీ ఆరునెలల సమయాన్ని ఇచ్చింది. ఆరు నెలల తర్వాత అంతవరకు వారేం చేశారన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే కమిటీ విచారణను మరికొంత కాలం పొడిగించింది. కొన్ని వారాల క్రితం నాటి కారవాన్ సంచికలోని ఒక నివేదిక ఈ అంశాన్ని ప్రస్తావించి, ఈ బృందం సాధించిందేమీ లేదని తేల్చేసింది. ఢిల్లీ మారణకాండ బాధితులకు, వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహి స్తున్న న్యాయవాది హెచ్ఎస్ ఫోల్కా చెప్పిన మాటలను ఆ పత్రిక ఉటంకించింది. ఆయనిలా అన్నారు. ‘‘సిట్‌ను ప్రభుత్వం ఏర్పర్చినప్పుడు దాన్నుంచి చాలా ఆశించాం. కానీ వీరు ఈ కేసుకు సంబంధించిన ఏ అంశంపైనా అడుగు ముందు కేసింది లేదు. ఆ హత్యాకాండ బాధితుల్లో ఏ ఒక్కరినీ వీరు కలిసిన పాపాన పోలేదు. బాధితుల్లో ఒకరు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఒక ఫిర్యాదు పంపి నప్పుడు, ఏ వ్యాఖ్య చేయకుండానే దాన్ని వెనక్కి పంపించారు. కనీసం ఆ ఫిర్యాదును వారు అంగీకరించలేదు.’’ వాస్తవానికి సిట్ ఏర్పాటే ఒక మాయ అని, దాన్నుంచి దేన్నీ కోరుకోకుండా, ఆశించకుండా, కేవలం తాము సిట్‌ను ఏర్పర్చామన్న పేరు కొట్టేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఆ లాయర్ పేర్కొన్నారు. ఇది నిజం కాదనే నేను భావిస్తున్నాను. సిక్కులపై హింసాకాండను నిరోధించడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత విషయంలో సందేహమే లేదు. ఆ పార్టీకి చెందినవారే స్వయంగా నాటి మారణకాండలో పాల్గొన్నారంటూ వారిపై తీవ్ర నేరారోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేరస్తులపై దృఢంగానూ, నిర్ణయాత్మకంగానూ వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం తన వైఖరిని ప్రదర్శిస్తే, భారతీయులకు అది గొప్ప సేవ చేసినట్లే. కనీసం ఈ ఒక్క మారణకాండకు సంబంధించినంతవరకయినా న్యాయం సాధ్యమేనని ప్రభుత్వ దృఢవైఖరి సూచిస్తే అదే చాలు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
చట్టాల్లో మార్పుతేవడమే సంస్కరణ లక్ష్యమా?
అవలోకనం చరిత్రలో ఎలాంటి మినహాయింపులూ లేకుండా విజయవంతమైన దేశాలన్నింటికీ రెండు పరిస్థితులు తోడయ్యాయని చెప్పాలి. మొదటిది ప్రభుత్వ జోక్యం. రెండోది నిత్య చలనశీలత. ప్రభుత్వం అనేది పెట్టుబడిదారీ, సోషలిస్టు, నియంతృత్వం లేదా ప్రజాస్వామ్యం.. ఎలాంటి స్వభావంతో ఉన్నదైనా కావచ్చు కాని అది కచ్చితంగా అర్థికరంగంలోని అన్ని అంశాల్లోనూ సరైనవిధంగా జోక్యం చేసుకోవాలి. గుజరాత్‌తో సహా భారత్‌లో ప్రభుత్వ వ్యవస్థ ఇక్కడే అనునిత్యం విఫలమౌతూ వస్తోంది. అగ్రరాజ్యం కావాలంటే భారత్‌కు అవసరమైన ది ఏమిటి? మొట్టమొదటిగా అది మహా శక్తి కావాలి. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపగల సామర్థ్యంతో కూడిన సార్వభౌమాధికార ప్రభుత్వంగా భారత్, అంతర్జాతీయ సంబంధాల్లో తన్ను తాను నిర్వచించుకోవాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులైన యునెటైడ్ స్టేట్స్, చైనా, ఫ్రాన్స్, రష్యా, యునెటైడ్ కింగ్డమ్ లనే మనం మహాశక్తివంతమైన దేశాలుగా లెక్కించవచ్చు. భద్రతామండలిలో వీటికున్న వీటో అధికారం వల్లేకాక, వాటి సంపద, సైనిక శక్తి వల్ల కూడా ఈ ఐదు దేశాలూ ప్రపంచ ఘటనలపై ప్రభావం చూపగలవు. వీటిలోఫ్రాన్స్, యూకే వంటి కొన్ని దేశాల్లో సైనిక శక్తిని ఉద్దేశ పూర్వకంగానే తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధం వచ్చే అవకాశం తక్కువ. ఈ అయిదు దేశాల తర్వాత సైనిక పరంగా కాకున్నా, ఆర్థికపరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే రెండు దేశాలున్నాయి. అవి జర్మనీ, జపాన్. వీటి తర్వాత ఏమంత ప్రభావం చూపనప్పటికీ సంపద్వంతమైన చిన్న దేశాలు కొన్ని ఉన్నాయి. స్పెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్, తైవాన్, ఇటలీ, చిలీ, ఆస్ట్రేలియా, నార్డిక్ దేశాలు (డెన్మార్క్, ఫిన్లాండ్, ఐర్లండ్, నార్వే, స్వీడెన్) ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌ను ఈ విభాగంలోని దేశాల్లో చేర్చవచ్చు. అధిక జనాభా క లిగిన దేశాలు కొన్ని సంపద్వంతమైనవి కావు. పైగా వనరుల లేమి కారణంగా ఇవి సైనికంగా శక్తివంతమైనవి కావు. ఇలాంటి దేశాల్లో దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, బ్రెజిల్, నైజీరియా. నేను భారత్‌ను నైజీరియాతో పోల్చడం పాఠకులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కాని ఈ రెండు దేశాలూ ఒకే విధమైన తలసరి ఆదాయాన్ని కలిగివున్నాయి. అధిక జనాభాయే భారత్‌కు దాని వాస్తవ స్థితి కంటే మరింత యుక్తమైన దేశంగా గుర్తింపునిస్తోందనిపిస్తుంది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే, భారత వాస్తవ స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీ పీ డాలర్ల విలువతో పోలిస్తే ఇటలీ జీడీపీ కంటే తక్కువ. కాని ఇట లీ జనాభా మాత్రం 60 మిలియన్లు (లేదా ఆరు కోట్లు) మాత్రమే. అంటే భారత జనాభాతో పోలిస్తే ఇటలీ జనాభా 20 రెట్లు తక్కువ, అంటే ఇటలీతో పోలిస్తే వ్యక్తిగతంగా భారత్ ఉత్పాదకత 5 శాతం కంటే తక్కువ మాత్రమే. ఇది కాస్త మంద్రస్థాయిలోనే కావచ్చు, పరిస్థితిని మనకు అనుకూలంగా మారుస్తోంది. కాబట్టి భారత్‌ను మహాశక్తిని చేయడానికి మనం చేయవలసింది ఏమిటి? దీంట్లో అతి చిన్న అంశం నా దృష్టిలో ఏమిటంటే ప్రభుత్వం చేయవలసిన పనే. ఆర్థిక వార్తాపత్రికలను మనం చూసినట్లయితే, వాటి ప్రధానాంశం సంస్కరణలే. పైగా భారత్ విజయబాట పట్టాలంటే ప్రభుత్వం సంస్కరణలను తీసుకు రావాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు కూడా. సంస్కరణలు సాధారణంగా క్రమబద్ధీకరణను ఎత్తివేసి వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. వాస్తవం ఏమిటంటే అనేక దేశాలు సంస్కరణలు మొదలుపెట్టేశాయి కాని అవేవీ మహా శక్తివంతమైన దేశాలు కాలేదు. ఉదాహరణకు సోవియట్ యూనియన్ ఒక నియంత్రిత ఆర్థిక వ్యవస్థ. అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుందని అర్థం. కానీ ఆ దేశంలో ఏ సంస్కరణలూ ఉండేవి కావు. అయినప్పటికీ 1947 నుంచి 1975 వరకు సోవియట్లు ప్రతి సంవత్సరం డబుల్ డిజిట్ వృద్ధిని సాధిస్తూ వచ్చారు. అది కూడా భారత్ కంటే అత్యధిక తలసరి ఆదాయంతో వారు ఆ వృద్ధిని సాధించారు. అలాగే క్యూబా సైతం ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణను రద్దు చేయలేదు కానీ ప్రపంచం మొత్తం మీద అత్యధిక మానవాభివృద్ధి సూచికలను (ఆరోగ్యం, విద్యా రంగాల్లో) నమోదు చేసింది. కాబట్టి ఆర్థికాభివృద్ధికి అవసరమైనది సంస్కరణలు మాత్రమే కాదని స్పష్టమవుతోంది. చరిత్రలో ఎలాంటి మినహాయింపులూ లేకుండా విజయ వంతమైన దేశాలన్నింటికీ రెండు పరిస్థితులు తోడయ్యాయని చెప్పాలి. మొదటిది ప్రభుత్వ జోక్యం. కాఠిన్యతను, తీవ్రతను తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రభుత్వ సామర్థ్యంగా దీన్ని నేను నిర్వచిస్తాను. కాఠిన్యతను గుత్తకు తీసుకోవడం ఎలాగంటే, పౌరులందరూ స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేలా చేయడం, న్యాయాన్ని, సేవలను సమర్థవంతంగా బదలాయించడం. ప్రభుత్వం పెట్టుబడి దారీ, సోషలిస్టు, నియంతృత్వం లేదా ప్రజాస్వామ్యం.. ఎలాంటి స్వభావంతో ఉన్నదైనా కావచ్చు కాని అది కచ్చితంగా అన్నింట్లోనూ తల దూర్చాలి. గుజరాత్‌తో సహా భారత్‌లో ప్రభుత్వ వ్యవస్థ ఈ అన్ని అంశాల్లో నిత్యం విఫలమౌతూ వస్తోంది. రెండోవిషయం సమాజంలో కాయపుష్టి, చలనశీలత. ప్రగతిశీలమైన ఏ సమాజమైనా కొత్త విషయాలను కనిపెట్టే సామర్థ్యంతోపాటు దాతృత్వాన్ని, పరోపకార తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది చాలా సంక్లిష్ట విషయం కాబట్టి మరోసందర్భంలో దీనిపై రాస్తాను. ఇక మొదటి విషయానికి సంబంధించి చూస్తే, సులభంగా చె ప్పాలంటే ఇది చట్టాలు లేదా చట్టాలలో మార్పులకు సంబంధించినది కాదు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది సంస్కరణకు సంబంధించింది కాదు. అది పాలనకు సంబంధించింది. ఇది అమలు చేయడంలో ప్రభుత్వ సమర్థతకు సంబంధించింది. ఇది లేకుండా చట్టంలో మార్పులు ఏమీ చేయలేవు. అందుకనే ప్రధాని నరేంద్రమోదీ మలేసియాలో ఇచ్చిన ప్రసంగం నాలో ఆసక్తిని కలిగించింది. అక్కడ ఆయన చెప్పిన ప్రధానాంశాలు ఇవి. ‘సంస్కరణకు అంతం లేదు. సంస్కరణ అంటే గమ్యం చేరడానికి చేసే సుదీర్ఘ ప్రయాణంలో తగిలే స్టేషన్ మాత్రమే. భారత పరివర్తనే గమ్యం.’ తాను 2014లో ఎన్నికల్లో గెలిచినప్పుడు భారత్ అత్యంత అధిక స్థాయిలో ద్రవ్య, కరెంట్ ఖాతా లోటుకు సంబంధించి తీవ్రమైన సవాల్‌ను ఎదుర్కొనేదని మోదీ తన ప్రసంగంలో చెప్పారు. ‘సంస్కరణలు అవసరమనేది స్పష్టమే. మాకు మేముగా ఒక ప్రశ్న వేసుకున్నాం. సంస్కరణలు దేనికి? అంచనా వేసిన జీడీపీ వృద్ధిని పెంచడానికి మాత్రమేనా? లేదా సమాజంలో మార్పును తీసుకురావ డానికా? నా సమాధానం స్పష్టమే. మనం పూర్తిగా మారేందుకు సంస్కరణకు అవకాశం ఇవ్వాలి,’ అని ప్రధాని అన్నారు. ప్రధాని ఈ అంశాన్ని సరైన రీతిలో చెప్పగలిగారని నాకు అనిపిస్తోంది. అయితే సమాజాలు వెలుపలి నుంచి ప్రభుత్వం ద్వారా పరివర్తన చెందవని, అంతర్గతంగా సాంస్కృతికపరంగానే అవి మార్పు చెందుతాయన్నది నా అభిప్రాయం. కాకుంటే, ప్రధాని మాటల్లో చెప్పినంత స్పష్టతను వాటి అమలు విషయంలో కూడా ప్రదర్శించగలిగితే చూడ్డానికి అది మనోహరంగా ఉంటుందనడంలో సందేహమే లేదు. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com) ఆకార్ పటేల్ -
ఈ మహా యోధుడూ దేశద్రోహేనా?
అవలోకనం టిప్పు వంటి యోధానుయోధుల గురించి చదవడానికి, చదివిన తర్వాత వారిపై ఏదైనా రాయడానికి, వ్యాఖ్యానించడానికి మనకు ఏమాత్రం మనస్కరించదు. కానీ వారి గురించిన నానా చెత్త విషయాలను మాత్రం మనం ఎల్లపుడూ నమ్మేందుకే ఇష్టపడుతుంటాం. పైగా మనకు అతి కొద్దిగా తెలిసిన విషయాలపై నిరసన తెలిపేందుకే మనం సిద్ధమవుతుంటాం కూడా. పాకిస్తాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కొన్ని వారాల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకోసం బెంగళూరుకు వచ్చారు. ఆ కార్యక్రమంలో నేనూ భాగస్వామి నయ్యాను. ఆయన నాకు గతంలోనే తెలుసు. దక్షిణ భారత్‌లో ఆయన ఏం చూడ దల్చుకున్నారని అడిగాను. (బెంగళూరును సందర్శించడానికి అనుమతి పొందిన మొదటి లేదా రెండవ పాకిస్తానీ హై కమిషనర్ బహుశా ఆయనే కావచ్చు. నగరంలోని టెక్నాలజీ పార్కులను చూడాలనుకుంటున్నట్లు, అలాగే మైసూరుకు వెళ్లాలని ఉందని కూడా ఆయన చెప్పారు. బెంగళూరు నుంచి మైసూరుకు రెండు గంటల ప్రయాణం. అక్కడ మైసూరుకు వెలుపల ఉన్న శ్రీరంగపట్నంలోని టిప్పు సుల్తాన్ ప్యాలెస్ చూడాలన్నది ఆయన కోరిక. భారతీయులందరూ టిప్పును చూసి గర్వించాలని బాసిత్ అభిప్రాయం వెలిబుచ్చారు. కాని ఇటీవలి పరిణా మాలు చూస్తుంటే ఆయన అభిప్రాయం తప్పు కావచ్చు. టిప్పు జయంతి వేడుకలను నిర్వహించే విషయమై చెలరేగిన గొడవల్లో.. గత వారం కర్ణాటకలో ఇద్దరు మరణించారు. నేడు భారత్‌ను తీవ్రంగా నిస్పృహకు గురిచేస్తున్న అనేక అంశాల్లో హిందూ-ముస్లిం సమస్య ఒకటి. మనదైన ప్రపంచం లో చక్రవర్తులను మంచివారు (అశోకుడు, అక్బర్ తదితరులు), చెడ్డవారు (ఔరంగజేబు, టిప్పు సుల్తాన్) అని వేరు చేసి చూస్తుంటారు. చరిత్రను వాస్తవం లేదా హేతువు దృష్ట్యా కాకుండా భావోద్వేగాల బట్టి మాత్రమే చూస్తున్న దేశంలో సమాజపు నిర్దిష్ట స్వభావం ఇలాగే ఉంటుంది. పైగా ఇది దాదాపు నిరక్షరాస్యులు, లేదా ఒక మేరకు చదువుకున్న ప్రజలకు ఇది సంకేతంగా కూడా. టిప్పు, ఆయన సైనికాధిపతులపై ప్రశంసలు కురిపించడం అనేది వారిపట్ల వ్యతిరేకతను పెంచి పోషిస్తోంది. హిందువులకు వ్యతిరేకంగా జిహాద్లో నిరంత రం మునిగి తేలిన వ్యక్తిగా టిప్పును ఇప్పుడు చిత్రిస్తున్నారు. ఇది నిజంగానే బూటకమైంది. అయితే ఈ విషయాన్ని నేను ఇక్కడ నిరూపించడానికి ప్రయత్నిం చబోను. టిప్పు మీద వచ్చిన పుస్తకాలను చదివి, సమాధానపడి తర్వాత మీమీ అభిప్రాయాలు చెబితే బాగుంటుంది. అయితే ఇక్కడ సమస్యల్లా ఏమిటంటే నాగ రిక ప్రపంచంలో వలే కాకుండా ఇండియాలో చరిత్రకు సంబంధించి చాలా తక్కు వ పుస్తకాలే రాయడం జరిగింది. స్మృతులను రాసి ఉంచడం, దినచర్యను రాసి ఉంచుకునే సంప్రదాయం మనకు లేదు. గత చరిత్రలోని వ్యక్తులు, ప్రముఖులపై కొత్త రచనలు చేయడంలో మనకు ఎలాంటి ఆసక్తీ లేదు కూడా. అందుకే టిప్పుపై భారతీయులు రాసిన పుస్తకాలేవీ మనకు కనిపించవు. టిప్పు గురించి ఏదయినా తెలుసుకోవాలంటే 19వ శతాబ్ది నాటి ‘హైదర్ ఆలీ, టిప్పు సుల్తాన్ అండ్ ది స్ట్రగుల్ ఆఫ్ ది ముస్లిమన్ పవర్స్ ఆఫ్ ది సౌత్’ వంటి పుస్తకాలను తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. దీన్ని రాసింది లూయిస్ బౌరింగ్ (సెయింట్ మార్క్ రోడ్ లోని బౌరింగ్ క్లబ్ ద్వారా బెంగళూరు ప్రజలకు ఇతడు సుపరిచితుడే). టిప్పుకు సంబంధించినంత వరకు రెండు లేదా మూడు అంశాలు నాకు ఎంతో ఆసక్తిగొలుపుతుంటాయి. మొదటిది: ఇంగ్లీష్ వారికి టిప్పు కొరకరాని కొయ్యగా మారాడు. ఆ కాలానికి సంబంధించి మన చిట్టచివరి, మహా చరిత్రకా రుల్లో ఒకరైన సర్ జాదూనాథ్ సర్కార్ రచనలను గానీ మనం చదివినట్లయితే, మారాఠాల లాగా కాకుండా టిప్పు నిజమైన యోధుడిగా ఉండేవాడని మనకు స్పష్టమవుతుంది. పానిపట్ యుద్ధంలో పరాజయం తర్వాత మరాఠాలు కుప్పకూ లిన చరిత్రను టిప్పు వీరోచిత ప్రతిఘటనను పోల్చి చూస్తే మనకు విషయం స్పష్ట మవుతుంది. కేవలం 40 సంవత్సరాల్లోపే.. అంటే 1761 (పానిపట్ యుద్ధంలో అహ్మద్ అబ్దాలీ గెలుపొందిన సంవత్సరం) నుంచీ 1799లో టిప్పు యుద్ధంలో నేలకూలిన కాలంలోనే ఇదంతా జరిగింది. ఈ కొద్ది సంవత్సరాల కాలంలోనే బ్రిటిష్ వారు తమ శత్రువులందరినీ ఓడించివేశారు. పంజాబ్ మాత్రమే వారికి కొరుకుడు పడకుండా మిగిలిపోయింది. ఆపై కొన్ని దశాబ్దాల అనంతరం రంజిత్ సింగ్ మరణం తర్వాత పంజాబ్ సైతం కుప్పగూలిపోయింది. బ్రిటిష్ పాలకులకు నిజమైన ప్రతిఘటనను ఇచ్చింది టిప్పుమాత్రమే. ఒక సాటిలేని సేనాధిపతిగా, భౌగోళిక రాజకీయాలను (బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రెంచ్‌వారిని నిలపడం) సమయస్ఫూర్తితో అవగాహన చేసుకున్న టిప్పుకు యుద్ధానికి సంబంధించినంత వరకు ఆధునిక దృక్పథం ఉండేది. రెండవది : యుద్ధంలో రాకెట్లను తొలిసారి ప్రయోగించినది టిప్పు సైన్యమే అనేది జగమెరి గిన సత్యం. ఈ ముతక రాకెట్లకు టిప్పు సైనికులు కత్తులను జోడించి శత్రు సైన్యం పైకి ప్రయోగించేవారు. బ్రిటిష్ చరిత్రలోనే మేటి సేనాని అర్థర్ వెలస్లీ (డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్) చివరకు టిప్పును ఓడించగలిగాడు. వాటర్లూ యుద్ధంలో నెపోలి యన్ను పరాజితుడిని చేసింది కూడా వెలస్లీయే. సైనికపరంగా, జాతీయవాదపరంగా టిప్పు ఆనాడు సాధించిన మేటి విజ యాలను ఈరోజు అంత సులువుగా నిర్లక్ష్యం చేయడం నన్ను ఎంతగానో నిస్పృహ కు గురి చేస్తోంది. ఇది నిజమైనా, నిజం కాకపోయినా అతడు హిందువులను వధించాడు లేక మతమార్పిడికి గురిచేశాడు అనే భావనను మాత్రమే నేడు గుర్తుం చుకోవడం నిజంగా విషాదకరం. మనందరం గుర్తుంచుకోవలసిన విషయం ఏమి టింటే, అశోక చక్రవర్తి కళింగ రాజ్యాన్ని జయించినప్పుడు అతడు విదేశీయులను, ముస్లింలను ఊచ కోత కోయలేదు. మనకు చరిత్ర అందించిన పాఠాల మేరకు అశోకుడు ఒరియా మాట్లాడే వేలాదిమంది హిందువులను ఊచకోత కోశాడు. అయినప్పటికీ అశోకుడిని మహా వ్యక్తిగా పిలుస్తుంటాం. అతడి రాజచిహ్నమైన సింహం గణతంత్ర భారత్ అధికారిక చిహ్నమైంది. భారతీయ పతాక మధ్యలోని చక్రాన్ని అశోక చక్రం అని పిలుస్తారు. ఎందుకంటే అది కూడా అతని చిహ్నమే. ఈ ఇద్దరూ ఒకే నేరం చేశారని ఆరోపణలు మిగిలి ఉండగా మనం టిప్పును కాకుండా అశోకుడిని మాత్రమే ఎందుకు గౌరవిస్తున్నాం? మనకు సమాధానం తెలుసు. అది చాలా స్పష్టమైనదే. భారత్‌లో ఒక హిందువు చేసిన పనులు ఒక ముస్లిం రాజు చేయకూడదంతే.. అద్భుతమైన పాటియాలా రాజప్రాసాదాన్ని స్థాపించినవాడు మహారాజా అలా సింగ్. తన జీవిత కాలంలో ఇతడు సాధించిన సైనిక విజయాలేమీ లేవు. అతడు సాధించిన ఘనత ఏమిటంటే మరాఠాలను ఓడించడంలో అతడు అబ్దాలీకి సహకరించడమే. దీనికి గాను ఇతడు ఆప్ఘన్ రాజు గౌరవ పురస్కారాలను అందుకున్నాడు. కానీ అలా సింగ్‌ను కాని అతడి వారసులను భారత్‌లో ఎవరయినా ద్రోహులుగా చూస్తున్నారా? పైగా పాటియాలా రాజులు మహారాజా రంజిత్ సింగ్‌ను నిరంతరం ప్రతిఘటిస్తూ వచ్చారు. కానీ వారిని ఎవరూ జాతి వ్యతిరేకులుగా చూడటం లేదు. ముస్లిం రాజులకు మాత్రమే ఈ విధమైన ‘గౌరవం’ లభిస్తూంటుంది మరి. టిప్పు వంటి యోధానుయోధుల గురించి చదవడానికి, చదివిన తర్వాత వారిపై ఏదైనా రాయడానికి, వ్యాఖ్యానించడానికి మనకు ఏమాత్రం మనస్కరిం చదు. కానీ వారి గురించి నానా చెత్త విషయాలను మాత్రం మనం ఎల్లపుడూ నమ్మేందుకే ఇష్టపడుతుంటాం. పైగా మనకు అతి కొద్దిగా తెలిసిన విషయాలపై నిరసన తెలిపేందుకే మనం ఎల్లప్పుడు సిద్ధమవుతుంటాం. - ఆకార్ పటేల్ (వ్యాసకర్త రచయిత, కాలమిస్టు aakar.patel@icloud.com) -
మన విజయాలపై పరాజయాలదే పైచేయి?
అవలోకనం: మనం ఏ విషయంలోనూ ప్రపంచస్థాయి నేతలం కాము. కాబట్టే క్రికెట్లో కూడా మనం ప్రపంచానికి నాయకత్వం వహించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. మనం ఎందుకింత చెత్తగా ఆడుతుంటాం అనే విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండానే కోట్లాది భారతీయులం క్రికెట్‌ను చూస్తూ ఆ క్రీడకు వందల కోట్ల రూపాయలను అప్పనంగా అందిస్తూ ఉంటాం. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రదర్శితమయ్యే భారతీయుల తీవ్ర జాతీయవాదం, ఉత్సాహం మన జట్టు వాస్తవ ఆటతీరులో ప్రతిఫలించకపోవడమే అసలైన విషాదం. మనకాలపు అతి గొప్ప రహస్యాలలో ఇదీ ఒకటి అయి ఉండాలి: భారతీయులు క్రికెట్లో ఎందుకు ఆధిపత్యం చలాయించడంలేదు? అంటే నా ఉద్దేశం అడపాదడపా విజయాలు సాధించలేదని కాదు. మనం అలాంటి విజయాలు పొందుతున్నాం. కాని ఒకప్పుడు వెస్టిండీస్.. తర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం చలాయించినట్లుగా మనం ఎందుకు క్రికెట్‌పై శాశ్వతంగా ఆధిపత్యం చలాయించలేకపోతున్నాం అన్నదే ప్రశ్న. ఇంతవరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన క్రికెట్ బోర్డు భారత్‌దే. కాబట్టి మనకు తగిన వనరులు లేవన్నది ప్రశ్నే కాదు. క్రికెట్ లోని ప్రతి ఆర్థిక అంశంపైనా మనం ఎంతగా ఆధిపత్యం చలాయిస్తున్నామంటే, ఇతర దేశాల క్రికెట్ బోర్డులన్నీ ఇండియాకు వంత పాడే స్థాయికి దిగిపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత లాభదాయకమైన ఈవెంట్‌గా మారింది. కానీ భారత పలుకుబడి దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా మోటార్ సైకిళ్లనుంచి పాన్ మసాలా వరకు అమ్మకాలు సాగిస్తూ భారతీయ కంపెనీల ప్రకటనలే కనిపిస్తుం టాయి. అలాంటప్పుడు వాస్తవ క్రీడలో మనం ఎందుకు ఆధిపత్యం చలాయించ లేకపోతున్నాం? మనం గెలిచిన మ్యాచ్‌ల (124) కంటే మనం ఓడిపోయిన మ్యాచ్‌ల (157) సంఖ్యే ఎక్కువ. ఇది ఆశ్చర్యం గొలిపించదు. ఎందుకంటే మనం సొంత గడ్డపైనే బాగా ఆడతాం. మన స్లో వికెట్ పిచ్‌లపై రెండు సార్లు మనల్ని ఔట్ చే యడం ఇతర జట్లకు సాధ్యం కాదు. మరోవైపున మనం ఫాస్ట్ వికెట్ పిచ్‌లపై త్వరత్వరగా అవుట్ అయిపోతుంటాం. కాబట్టి అలాంటి చోట్ల గెలవడం కంటే ఓడిపోవడమే చాలా సులభంగా ఉంటుంది. అయితే ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్ని దేశాలతోనూ మనకు పరాజయ రికార్డే ఎందుకుంది? ఆస్ట్రేలియాపై మనం 24 టెస్టుల్లో గెలుపొందగా, 40 సార్లు ఓడిపోయాం. ఇంగ్లండ్‌పై 21 సార్లు గెలిస్తే, 43 సార్లు ఓడిపోయాం. వెస్టిండీస్‌పై 16 సార్లు గెలిస్తే 30 సార్లు ఓడిపోయాం. చివరకు పాకిస్తాన్‌పై కూడా మనం 9 సార్లు గెలిస్తే, 12 సార్లు ఓడిపోయాం. (పాకిస్తాన్‌తో మనం ఎక్కువ మ్యాచ్‌లు ఆడనందుకు మనల్ని మనం అభినందించుకోవాలి. ఎందుకంటే బలమైన ఉద్వేగాలతో కూడిన ప్రస్తుత వాతావరణంలో పరాజయాన్ని మనం అసలు సహించలేం). గత రెండు దశాబ్దాలకు పైబడి మాత్రమే క్రికెట్ ఆడుతూ వస్తున్న దక్షిణాఫ్రికాపై కూడా మనం 7 విజయాలను నమోదు చేయగా 13 సార్లు ఓటమిపాలయ్యాం. మొత్తంమీద మనం విజయాల రికార్డును అధికంగా నమోదు చేసిన టీమ్‌లు రెండే రెండు. ఒకటి శ్రీలంక (మనకు 16 విజయాలు, 7 ఓటములు) రెండు న్యూజిలాండ్ (మనకు 18 విజయాలు, 10 ఓటములు). ఇక వన్డే ఇంటర్నేషనల్ పోటీల్లో కూడా విషయాలు ఇంతకంటే ఏమంత భిన్నంగా లేవు. ఈ రంగంలో మరిన్ని గణాంకాలను మీ ముందుంచి విసిగించను, నిస్పృహకు గురిచేయను. నిష్పక్షపాతంగా మనం ఈ సంఖ్యల కేసి చూసినట్లయితే అవి ఒక వింత విషయాన్ని మనకు తెలియబరుస్తాయి. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రదర్శితమయ్యే భారతీయుల తీవ్ర జాతీయవాదం, శ్రద్ధ, ఉత్సాహాలు మన జట్టు వాస్తవ ఆటతీరులో ప్రతిఫలించవు. బాలీవుడ్ భాషలో చెప్పాలంటే మనం షారుక్ ఖాన్ గురించి ఆలోచిస్తూ షాహిద్ కపూర్ క్రికెట్‌ను ఆస్వాదిస్తూంటాం. ఇక్కడ ప్రశ్న ఏదంటే, భారతీయులు నిజంగా ఆసక్తి ప్రదర్శిస్తున్న ఏకైక ఆటలో మనం ఎందుకు ఆధిపత్యం చలాయించలేకపోతున్నాం? మన జనాభా 120 కోట్లు. మనలో చాలామంది ఏ ఇతర క్రీడనూ తిలకించరు, ఆడరు. ఆస్ట్రేలియా జనాభా రెండున్నర కోట్లకంటే తక్కువ. కాని వారు క్రికెట్‌ను తమ ఏకైక క్రీడగా ఎన్నడూ భావించరు. క్రికెట్ ప్రపంచాన్ని మొత్తంగా కలిపినా భారత జనాభాలో సగానికంటే మించదు. కాబట్టి తగినంత టాలెంట్ లేకపోవడం అనేది ప్రశ్నే కాదు. ఐపీఎల్ విస్తరణలో ఉన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి ఏమిటంటే టీమ్‌లను భ ర్తీ చేయడానికి స్థానిక టాలెంట్ తగినంతగా లేకపోవడమే. అందుకే కొంతమంది గుర్తింపు పొందిన స్థానిక ప్లేయర్లు అంత భారీ వేతనాలు తీసుకుంటున్నారు. ఇది అధిక డిమాండ్ కంటే సరఫరా కొరతనే సూచి స్తుంటుంది. కాని మనకున్న జనాభా సంఖ్యను చూసినట్లయితే, ఆస్ట్రేలియా జట్టు తరహా నాణ్యత కలిగిన 60 జట్లు మనకు ఉండాలి. కాని మనకు ఒక్కటంటే ఒక్క సరైన జట్టు లేదు. మన చరిత్రలోనే ఆస్ట్రేలియా జట్టు లాంటి ఒక్క జట్టును మనం చూడలేం. ఎందుకు? ఇది స్లో, ఫాస్ట్ పిచ్‌కు సంబంధించిన విషయం కాదు. అసలు విషయం అదే అయితే మనం ఫాస్ట్వికెట్లపై శిక్షణ ఎందుకు తీసుకోం? మన జట్లకు సరైన విధంగా శిక్షణ ఇవ్వడానికి మన వద్ద కోరినంత డబ్బు ఉంది కూడా. అయినా మనం అలాంటి శిక్షణ ఎందుకు ఇప్పించడం లేదు? బహుశా శిక్షణ లేకపోవడం, సామగ్రి, సౌకర్యాలు లేకపోవడం నిజమైన సమస్య కాకపోవచ్చు. మీలో చాలామంది ఆలోచిస్తున్నట్లే, దీనికి జవాబు మరోచోట ఉంటుందని నేననుకుంటున్నాను. బహుశా ప్రగాఢవాంఛ, నైపుణ్యంపై ఇది ఆధారపడి ఉండవచ్చు. మనం ఏ విషయంలోనూ ప్రపంచస్థాయి నేతలం కాము. కాబట్టే క్రికెట్లో కూడా మనం ప్రపంచానికి నాయకత్వం వహించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. వ్యక్తులుగా నైపుణ్యంపై మనం పెడుతున్న మదుపు చాలా తక్కువ. మైదానంలో ఉన్న మన క్రికెటర్లను... ఆస్ట్రేలియాతో, వెస్టిండీస్‌తో, ప్రత్యేకించి ప్రస్తుతం భారత్‌లో సందర్శిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లతో పోల్చి చూసినట్లయితే ఏదో తప్పు జరుగుతోందని, చాలా తేడాగా ఉందని మనకు తెలిసిపోతుంటుంది. ఒక పక్షం ఏమో (మన పక్షం కాదు) అథ్లెటిక్స్లాగా పని చేస్తుంటారు. భారత క్రికెటర్లు కాస్త ఉబ్బినట్లుగా, ఫిట్ కానట్లుగా కనిపిస్తుంటారు. కానీ వారు జాతీయ జట్టులోకి ప్రవేశిస్తుంటారు. అత్యంత నైపుణ్యం కంటే ‘ఫర్వాలేదు’ అనేదే మనకు చాలా ముఖ్యమైన లక్షణంగా కనబడుతుంటుంది. క్రికెట్లో మనం ఆధిపత్యం చలాయించలేకపోవడం అనేది మన కాలపు అతి పెద్ద మిస్టరీల్లో ఒకటై ఉండాలని నేను ఈ వ్యాసం మొదట్లోనే రాశాను. అయితే అది మాత్రమే కాదు. మనం ఎందుకింత చెత్తగా ఆడుతుంటాం అనే విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండానే కోట్లాది భారతీయులం క్రి కెట్‌ను చూస్తూ ఆ క్రీడకు వందల కోట్ల రూపాయలను అప్పనంగా అందిస్తూ ఉంటాం. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com) -
వెంటాడుతున్న వెనుకబాటుతనం!
అవలోకనం భారతీయ నగరాలకు జీవం పోస్తున్న ఐటీ రంగం, ఐటీ ఆధారిత సేవా రంగాలు గుజరాత్లో కనిపించక పోవడమే అక్కడ పటేళ్ల ఆందోళనకు కారణమవుతోంది. ఇంజనీరింగ్ విద్యాసంస్థల కొరత, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యతా లేమి గుజరాత్ వెనుకబాటుతనానికి మూలం. ముంబై, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్, గుర్గావ్, నోయిడాలలో గుజరాత్ తరహా నిరసన ఘటనలు కనిపించడం లేదు. ఈ నగరాల్లోని యువతకు అందుబాటులో అనేక అవకాశాలున్నాయి. గుజరాత్లో పటేళ్ల ఆందోళనను పరిశీలిస్తున్న వారికి నేను రెండు ప్రశ్నలు సంధిస్తున్నాను. మొదటిది. గుజరాత్ మినహాయిస్తే తక్కిన భారత్‌లో ప్రత్యేకించి 25 ఏళ్ల క్రితం అలాంటి నిరసనలు తీవ్రస్థాయిలో జరిగిన మన నగరాల్లో అలాం టివి ఇప్పుడెందుకు చోటు చేసుకోలేదు? రెండు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగ రాల్లో ఇలాంటివి జరిగి ఉంటే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి ఆందోళన కారులు ఏ భాషలో మాట్లాడేవారు? పటేళ్లు రెండు డిమాండ్లు చేస్తున్నారు. మాకూ రిజర్వేషన్లు ఇవ్వండి లేదా రిజర్వేషన్లను పూర్తిగా తొలగించండి. ఈ రెండో ప్రతి పాదన మధ్యతరగతి, పట్టణ ప్రాంత డిమాండు. నాకు గుర్తున్నంతవరకు చాలా కాలంగా ఈ డిమాండ్ ఉనికిలో ఉంటూనే ఉంది. పటేళ్ల సమస్యపై గుజరాత్‌లోని నగరాల్లో లక్షలాదిమంది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తుండగా ఆ అగ్నిజ్వాల ఇతర ప్రాంతాలకు ఎందుకు వ్యాపించలేదు? దీనిపై మనం కాస్సేపటి తర్వాత చర్చిద్దాం. 2012లో, గుజరాత్ నమూనా అనేది తొలిసారిగా వెలుగులోకి వచ్చినప్పుడు నేనిలా రాశాను: భారత స్థూల దేశీయోత్పత్తిలో సేవారంగంలో వాటా 59 శాతం వరకు నమోదు కాగా, గుజరాత్లో సర్వీసు రంగం జీడీపీలో కేవలం 46 శాతం మాత్రమే కలిగి ఉంది. అంటే జాతీయ సగటు కంటే 13 శాతం తక్కువ. గుజరాత్లో పరిశ్రమల వాటా అధికం (41 శాతం. జాతీయంగా ఇది 30 శాతం మాత్రమే) అయితే ఇది ఎప్పట్నుంచో ఇలాగే నడుస్తోంది. బెంగాల్ కళాకా రులను ఉత్పత్తి చేస్తున్న విధంగా అదే స్థాయిలో గుజరాత్ ప్రథమశ్రేణి పారి శ్రామిక వేత్తలను తయారు చేస్తోంది. కానీ ఇది ఎన్నడూ అక్కరకు రాలేదు. గుజ రాత్ నుంచి తప్పిపోయిన అంశం ఏదంటే నూతన ఆర్థిక వ్యవస్థకు చెందిన డబ్బే. పాశ్చాత్య దేశాలనుంచి తక్కిన నగర భారత్ తెచ్చుకుంటున్న బిలియన్లాది డాలర్ల డబ్బు గుజరాత్ స్వంతం కావటం లేదు. భారతీయ నగరాలకు జీవధాతువుగా నిలుస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత సర్వీసులు (ఐటీ ఈఎస్) గుజరాత్లో ఎందుకు కనిపించ డం లేదనే అంశంపై కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇటీవలే విశ్లేషించింది. ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది, 'ఎందుకంటే,, తక్కువ వ్యయంతో కూడిన రియల్ స్టేట్, తక్కువ పరిహార స్థాయి ఉన్న కారణంగా గుజరాత్ సాపేక్షికంగా తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక వ్యవహారాలను అందిస్తోందని' కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. నరేంద్రమోదీ కూడా ఈ సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'గుజరాత్లో విధానపరమైన ప్రోత్సాహకాలలో కొన్ని: ఎ) ఐటీ పార్క్ డెవ లపర్కి స్టాంప్ డ్యూటీ రద్దు. ఐటీ, ఐటీఈఎస్ యూనిట్లకు రాయితీ, బి) వివిధ ఆర్థిక ప్రోత్సాహకాలను అందించే ప్రత్యేక ఆర్థిక జోన్ల అభివృద్ధి, సి) వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినప్పటినుంచి అయిదేళ్ల వరకు సంస్థలకు విద్యుత్ చెల్లింపుల నుంచి మినహాయింపు, డి) విద్యుత్ కోతల నుంచి మినహాయింపు, ఇ) కార్మిక చట్టాలను సరళీకరించడం.' అయితే నరేంద్రమోదీ గతంలో ఈ మినహాయింపులన్నీ ప్రకటించినప్పటికీ స్పందన మాత్రం పేలవంగా ఉంది. ఎందుకు? కేపీఎంజీ సంస్థ ఇలా వివరిం చింది. 'ఐటీ-ఐటీఈఎస్ రంగం అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన అవసరం ఏదంటే నిపుణుల లభ్యతే. ఈ టాలెంట్ పూల్ లభ్యత విషయంలో గుజరాత్ అట్టడుగున ఉండిపోయింది.' ఈ వెనుకబాటుతనానికి రెండు కారణాలున్నాయని కేపీఎంజీ భావిస్తోంది: 'ఇంజనీరింగ్ సంస్థల లేమి' 'ఇంగ్లిష్‌లో ప్రావీణ్యతా లేమి' ఈ వ్యాసం మొదట్లో నేను ప్రస్తావించిన రెండు ప్రశ్నలకు సమాధానం ఇక్కడే ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్, గుర్గావ్, నోయిడాలలో గుజ రాత్ తరహా నిరసన ఘటనలు ఎందుకు జరగలేదంటే, ఈ నగరాల్లోని యువతకు అందుబాటులో అనేక అవకాశాలున్నాయి. సాపేక్షికంగా కాస్త సులభంగానే వీరు అక్కడ వైట్ కాలర్ ఉద్యోగాల్లో ప్రవేశించగలుగుతున్నారు. 25 ఏళ్ల క్రితం నాటి నిరసనకారులకు మల్లే కాకుండా ఈ నగరాల్లోని యువతకు ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వారం మా ఆఫీసులో నేనొక సమావేశంలో ఉన్నాను. అక్కడ మేం, ఐటీ ప్రొఫెషనల్స్ వేతనాల గురించి చర్చించుకున్నాం. అత్యంత ప్రాథమికమైన, కంప్యూటర్‌పై పనిచేయగల విజ్ఞానం మాత్రమే అవసరమైన ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు నెలకు రూ.30 వేలు చెల్లిస్తున్నారు. కానీ ఈ పని చేయడానికి సిద్ధపడే వ్యక్తులను వెతకటం అంత సులభం మాత్రం కాదు. ఎందుకంటే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది. పైగా, ఇలాంటి ఉద్యోగాలను చాలామంది దొరకబుచ్చుకోగలుగుతున్నారు. ఎందుకంటే వీరిలో చాలామందికి ఇంగ్లిష్ భాషపై పట్టు ఉంది. ఇంగ్లిష్ భాష వారిని గ్లోబల్ ఎకానమీతో అనుసంధానిస్తోంది. గుజరాత్‌లోని యువతలో చాలా మందికి ఇది అందుబాటులో లేదు (గుజరాత్లో ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తర గతి వరకు ఇంగ్లిష్ నేర్పడం లేదు). భారత్‌లోనే అత్యంత నగరీకరణ పొందిన రాష్ట్రం గుజరాత్. దేశంలోని టాప్ టెన్ నగరాల్లో రెండు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. అయినప్పటికీ నిరసనలు అహ్మ దాబాద్, సూరత్‌లోనే తలెత్తాయి. నేను పాల్గొన్న ఒక టీవీ చర్చలో మరికొన్ని రాష్ట్రాలు ప్రత్యేకించి బెంగాల్ వంటివి కూడా ఇంగ్లిష్‌కు నో చెబుతున్న విధానాన్నే కలిగి ఉన్నాయని నాకు ఒకరు సూచించారు. అయితే కోల్‌కతా నగరం.. టాలెంటు నికర ఎగుమతిదారుగా ఉంటోంది. ఇది తన యాజమాన్యంలో బెంగాలీలకు చోటు కల్పించనటువంటి అరుదైన వైట్ కాలర్ సంస్థగా ఉంది. ఎందుకు? అక్కడ ఇంగ్లిష్ వారు చాలా కాలంగా ఉనికిలో ఉన్నందున నాణ్యమైన పాఠశాలలు కోల్‌కతా నలుదిశలా వ్యాపించి ఉన్నాయి. బెంగాల్ ప్రభుత్వం తన పరిధిలో ఉన్న అంశాల్లో మార్పులు చేస్తూ ఉన్నప్ప టికీ నగరంలో బలంగా ఉన్న మౌలిక వసతుల కల్పన తన పని తాను చేసుకుం టూ పోతోంది. కానీ గుజరాత్ విషయంలో ఇలా జరగటం లేదు. మండల్ కమిషన్ నివేదికను అమలు చేయాలనే అంశంపై ఆందోళనలు, సరళీకరణ భారత్‌లో ఒకే సమయంలో అమలు జరిగాయని గుర్తుంచుకోవాలి. గుజరాత్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళన 25 ఏళ్ల క్రితం జరిగిన ఆం దోళనలను తలపిస్తోంది. ఇతర నగరాల్లోని తోటి భారతీయులు ముందుకెళు తుండగా, ప్రస్తుతం ఆందోళనకారులలో విచారం కలిగిస్తున్న పరిస్థితులు కొంచెం ఎక్కువగానో లేదా తక్కువగానో యథాతథంగా గుజరాత్లో నేటికీ అలాగే ఎందు కుంటున్నాయని మనకు మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) (aakar.patel@icloud.com) -
రెండు సైన్యాల మధ్య ఓ అర్ధరాత్రి గోడ..!
అవలోకనం మనం మరొక స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, భారత జాతీయవాదపు మూడు అంశాలకేసి దృష్టి సారించాలని అనుకుంటు న్నాను. మొదటిది ఏమిటంటే మనకు ఇన్నాళ్లూ బోధిస్తూ వచ్చిన భారత మ్యాప్‌కి సంబంధించిన సగుణవాది స్వభావం (మానవ లక్షణాలను కలిగి ఉం డటం అని అర్థం) మదరిండియా లేక భారతమాత చిత్రం దేశ భౌగోళిక చిత్రపటంకి సంబం ధించిన భౌతిక రేఖలను పోలి ఉంటుంది. మన దేశాన్ని చీరకట్టులోని మహిళగా కూడా చూపిస్తుంటారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ఈ చిత్రం తలను పోలి ఉంటుంది. దక్షిణాదిన ఉన్న ఓ చిన్న ద్వీపకల్పం అతి ఇరుకైన భాగం ఆమె కాలి అందియలు, పాదాలను పోలి ఉంటుంది. కెరటంలా లేచే ఆమె చీర కొంగు ఈశాన్య రాష్ట్రాల రూపం దాల్చి ఉంటుంది. 40 సంవత్సరాల క్రితం నాటి మ్యాప్‌లను కూడా నేను స్పష్టంగా గుర్తించుకోగలిగేవాడిని. ఎందుకంటే ప్రజల హృదయాల్లో అవి ప్రతి ధ్వనిస్తుండేవి. కాబట్టే అవి చాలా కాలం అందరి జ్ఞాపకాల్లో ఉండేవి. దీని విశిష్ట గుణం ఏమిటంటే, ఇండియా మ్యాప్‌లో ఏమాత్రం మార్పు చేసినా సరే దేశంలోని ఏ వ్యక్తికీ అది ఆమోదనీయం కాదు. ఎందుకంటే దీర్ఘ కాలంగా వారు భారత మ్యాప్‌ని మానవరూపంలో, సజీవమైన అర్థంలో చూస్తూ వస్తున్నారు. భారత మ్యాప్ ఏవో కొన్ని రేఖలు, స్థల వర్ణనతో కూడిన అంశాల కలయిక కాదు. అందుకే, ఆ మ్యాప్‌లో ఎలాంటి మార్పులనైనా తీసుకురావటం ప్రభుత్వానికి కష్టమయ్యేది. చైనాతో సరిహద్దు సమస్య కానీ, కశ్మీర్లో చాలా భాగం పాకిస్తాన్ ఆక్రమ ణలో ఉందన్న వాస్తవం కానీ మన అధికారిక మ్యాప్‌ల నుంచి కనుమరుగు కావ డం కష్టం. మనకు వెలుపలి ప్రపంచం ప్రచురించే ఇండియన్ మ్యాప్‌ల భౌతిక రూపాన్ని సవరిస్తూ, వాటిపై అధికారిక స్టాంపులను ముద్రిస్తూ ఉండటంలో మన ప్రభుత్వం ఎల్లప్పుడూ తలమునకలవుతూ ఉంటుంది. వాటిలోని తప్పులు ఎంతో అభ్యంతరకరమైనవని చూపడమే ప్రభుత్వ ఉద్దేశం. కాని అలాంటి మ్యాప్‌లు చాలా తరచుగా కనబడుతుంటాయి. వాటిని ఎవరైనా తెలిసో తెలి యకో ఉపయోగిస్తున్నట్లయితే మన మీడియా అలాంటి ఘటనలపై ఆగ్రహం ప్రదర్శిస్తుంటుంది. భారతమాత చిత్రపటంలో ఏ కొంచెం మార్పులు చేసినా సరే చాలామంది భారతీయులకు అది తీవ్రమైన నేరంగా కనిపిస్తుంటుంది. ఆమె రూపం విషయంలో ఎలాంటి ఉల్లంఘనలూ జరగకూడదు మరి. మనం అర్థం చేసుకోవలసిన రెండో అంశం ఏమిటంటే ఆ మ్యాప్ చరిత్రే. 1947లో భారత్‌కు వారసత్వంగా వచ్చినది వలస రాజ్యమే. దీనికి అత్యంత దూకుడుతో కూడిన విస్తరణ స్వభావం ఉండేది. మొఘలులు సైతం ఎన్నడూ స్వాధీనపర్చుకోనంత పెద్ద భూభాగాన్ని, ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతం మొత్తాన్ని ఇది కైవసం చేసుకుంది. మొఘలులు లేదా వారి వారసులు ఈశాన్య ప్రాంతాన్ని స్వాధీనపర్చుకోలేకపోయారు అంటే అర్థం ఈ ప్రాంతాలు ఒక కొత్తవైన, అసలు ఒప్పందాల మాటున భద్రంగా ఉండేవి. శాశ్వతమైన, పొందికైన దేశంలో భాగం గా మనం భావిస్తున్న పలు భూభాగాలను బ్రిటిష్ భారతీయ సైన్యం పోరాడి గెలుచుకుంది. ఈ వాస్తవాంశాన్ని భారతీయులకు ఎవరూ బోధపర్చలేదు. వలస సైన్యం ఆక్రమణకు లోబడినవి కాబట్టే ఆ ప్రాంతాల్లో భారత్‌పట్ల అంతటి శత్రుభావం, తిరుగుబాట్లు చోటు చేసుకుంటూ వచ్చాయి. కానీ నాగాల సమస్యపట్ల మహాత్మా గాంధీకి కాస్త సానుభూతి ఉండేదని తెలుసుకుంటే కొంతమందికి ఆశ్చర్యం కలుగవచ్చు. ఏదేమైనప్పటికీ, వలసపాలనా కాలంలో వలే, కఠిన చట్టాలకింద మగ్గిపోతున్న భారత్‌లోని ఒక భాగం పట్ల సగటు భార తీయుడికి ఏమంత సానుభూతి ఉండేది కాదు. ఈ చట్టాలవల్లే భారతీయ సైన్యం ఆ ప్రాంతంలో తాను చేసే తప్పులకు శిక్షలన్నవే లేకుండా, పూర్తి రక్షణతో కార్య కలాపాలు కొనసాగిస్తోంది. మన జాతీయ వాదానికి అది సంరక్షకురాలు అనే భావనతో మెజారిటీ భారతీయులు భారత సైన్యం చర్యల పట్ల పెద్ద పట్టింపు లేకుండా గడిపేస్తుంటారు. ఇక మూడో అంశం ఏమిటంటే భారత సైన్యపు జాతీయవాద స్వభావం ఒక భ్రమ అన్నదే. వలసపాలనలో భారత్‌లో ఉన్నది ఒక కిరాయి సైన్యం. 1947 ఆగ స్టు నెలలో ఓ అర్ధరాత్రి అది ఉన్నట్లుండి జాతీయ సైన్యంగా మారిపోయిందన్నది వాస్తవం. పాకిస్తాన్ కూడా ఇదే ప్రక్రియలోకి వెళ్లింది. ఆగస్టు 14కి ముందు నాటి బ్రిటిష్ సైన్యానికి (బలూచ్ రెజిమెంట్‌కు చెందిన పంజాబీలు, గూర్ఖా రెజిమెం టుకు చెందిన నేపాలీలే అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో నిరాయుధులైన సిక్కులు, హిందువులు, ముస్లింలను వందలాదిగా కాల్చిచంపారు), ఆగస్టు 15 నాటి భారతీయ స్వేచ్ఛా సైన్యానికి ఏమాత్రం వ్యత్యాసం ఉండేది కాదు. భారతీయ సైన్యం దీర్ఘకాలంగా గర్వించదగిన సమరోచిత సైనిక వార సత్వాన్ని కలిగి ఉండేదని నా భావన. అదే సమయంలో పుట్టుకతోనే పూర్తిగా కిరాయి స్వభావంతో కూడిన చరిత్ర దానికుండేది. క్రీస్తుకు ముందు నాలుగో శతా బ్దంలో గ్రీకు చరిత్రకారుడు అరియన్, అలెగ్జాండర్ ది గ్రేట్ సైనిక దండయాత్రల గురించి రాశాడు. దీనికోసం ఇతడు జనరల్ టాలమీ (ఇతడు క్లియోపాత్రతో ముగిసిన గ్రీక్-ఈజిప్షియన్ ఫారోల వంశక్రమాన్ని కనుగొన్నాడు) రాసిన చరి త్రను ప్రధానంగా ఉపయోగించుకున్నాడు. పంజాబ్‌లో మాసిడోనియన్ సైన్యం సాగించిన అతి కష్టమైన దండయాత్ర గ్రామీణులు కిరాయికి కుదుర్చుకున్న కిరాయి సైనికులకు వ్యతిరేకంగా నడిచింది. అంతకు వందేళ్లకు క్రితం గ్రీకు చరిత్ర కారుడు హెరోడోటస్ కూడా ఇదే విషయాన్ని నివేదిస్తూ.. ప్లేషియా యుద్ధ రంగంలో పర్షియన్ సేనలో భారతీయ కిరాయిసేనల రెజిమెంట్ ఉండేదని రాశాడు. ఈ విభాగం ధరించిన దుస్తులు, ఆయుధాల గురించి హెరోడోటస్ వర్ణిం చాడు. ఇక మొఘల్ కాలంలో అయితే, జాట్ల నుంచి మరాఠాలు, సిక్కుల దాకా ఎవరు ఎక్కువ కిరాయి చెల్లిస్తే వారి తరపున పోరాడేందుకు భారతీయులు అందుబాటులో ఉండేవారన్నది అందరికీ తెలిసిన విషయమే. భారత్‌పై విదేశీ దురాక్రమణతో సంబంధమున్న ప్రతి సమరంలోనూ అంటే ప్లాసీ లేదా హల్దీఘాటీ వంటి యుద్ధాలన్నింటిలోనూ విజయం సాధించిన పక్షంలో మెజారిటీ పోరాటయోధులుగా భారతీయులే ఉండేవారు. భారతీయ సైన్యం జాతీయవాద స్వభావంతో కూడి నదనే మన సంప్రదాయిక విశ్వాసానికి ఈ ఉదాహరణలు ఏమంత అనుగుణంగా ఉండటం లేదు కదా. కానీ మనం బాల్యం నుంచి పాఠశాలల్లో నేర్చుకుంటూ వచ్చిన పాఠాల్లో ఈ చరిత్ర లేదు. మన వాస్తవ చరిత్ర తెలిసిన వారు మాత్రం తాము తప్పక సమా ధానపడవలసిన రెండు విభిన్న వర్ణనలతో నిత్యం ఘర్షిస్తుంటారు. మన సంస్కృతి స్వభావం, దాని సున్నితత్వాల సుతిమెత్తనితనం నేప థ్యంలో పైన పేర్కొన్న మూడు అంశాలూ సమీప భవిష్యత్తులో మార్పు చెందు తాయని నేను భావించడం లేదు. కాని ఒక చిన్నదైన, తెలివైన శ్రోతల బృందానికి ఒక కాలమిస్టు రాసి పంచుకోగలిగిన విషయంగా ఈ మూడు అంశాలు ఉనికిలో ఉండవచ్చు మరి. - ఆకార్ పటేల్ (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com -
జరిమానాలతో వీధులను శుభ్రంగా ఉంచగలమా?
- ఆకార్ పటేల్ దేశంలో చెత్తా చెదారాన్ని బహిరంగ స్థలాల్లో పడవేస్తే అక్కడికక్కడే జరిమానా విధించేలా ఒక కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ఈ వారం వార్తలు వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ కథనం పతాక శీర్షికగా వచ్చింది. అంటే ప్రభుత్వంలో ఉండి దీన్ని లీక్ చేసినవారు, దాన్ని నివేదించిన వారు ఈ చట్టాన్ని ముఖ్యమైనదిగా భావించారన్నమాట. ‘బహిరంగ స్థలాల్లో చెత్త పడవే యటం, ఎలక్ట్రానిక్ వ్యర్థాన్ని డంప్ చేయడం, బహిరంగ స్థలాలను మురికి చేయ టం, నిషేధించిన ప్లాస్టిక్ సంచులను ఉపయోగించడం వంటివాటిని స్వల్ప నేరాల కింద పరిగణించి అక్కడికక్కడే జరిమానా విధించటానికి’ పర్యావరణ మంత్రిత్వ శాఖ సమాయత్తమవుతున్నట్లు ఆ పత్రికా వార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అతి ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటైన ‘స్వచ్ఛ భారత్ అభియాన్‌కు చట్టపరమైన కోరలను’ ఈ బిల్లు కల్పించనున్నట్లు ఇది స్పష్టం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ గత అక్టోబర్‌లో ప్రారంభించిన కీలకమైన ప్రాజెక్టు.. ‘స్వచ్ఛదనం ప్రాతిపదికన చెత్త పడేసే వారిపై జరిమానాలు, పరిహారా లను ప్రవేశపెట్టి సింగపూర్ తొలి ప్రధానమంత్రి లీ కాన్ యు ప్రారంభించిన ఆధునీకరణ తరహా ప్రాజెక్టును పోలి ఉన్నదని’ ఆ వార్తా కథనం తెలిపింది. అయితే అలాంటి వాటికి సింగపూర్ మంచి నమూనేయేనా, లీ చేపట్టిన పరి ష్కారం ఇక్కడ వర్తిస్తుందా? ఇక్కడ మనం మొదటగా గుర్తించవలసింది ఏమి టంటే, చైనా ప్రజలు (సింగపూర్‌లో చైనీయులే ప్రధానంగా ఉన్నారు) దక్షిణా సియా ప్రజల స్థాయిలో తమ వీధులను, ఇరుగు పొరుగు ప్రదేశాలను అంత చెత్తగా ఉంచుకోరు. మనం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ (శ్రీలంక దీనికి మిన హాయింపు) దేశాల కేసి చూస్తే మనకీవిషయం స్పష్టంగా బోధపడుతుంది. చైనీ యులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. అంటే తమ మాతృ భూమిలో కానీ, ప్రపం చమంతటా తాము నివసిస్తున్న ప్రాంతాల్లో కానీ (అమెరికాలో వీరు నివసించే ప్రాంతాలను చైనా టౌన్స్ అంటారు) పరిశుభ్రత పట్ల ఒక ప్రాథమిక అవగాహ నను, విజ్ఞతను, క్రమాన్నీ, గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. పైగా, తామున్న పరిసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటారు. అదే మన విషయంలో అలా కనిపించదు. చట్టాలు కొంతవరకు మాత్రమే సాయపడగలవని నేను చెప్పగలను. సింగ పూర్‌ను పరిశుభ్రంగా ఉంచింది లీ మేధోతనమే అనుకున్నట్లయితే హాంకాంగ్‌ను ఎవరు క్రమంలో పెట్టారు? ఇక్కడ కూడా చైనీయులే అధిక సంఖ్యలో ఉన్నారు. కాగా ఇక్కడ కూడా సింగపూర్ వంటి నియంతృత్వ పాలనే ఉంది. రెండో విషయం ఏమిటంటే, పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ కొత్త చట్టం వాస్తవంగా కొత్తదేనా? గత కొన్ని నెలలుగా పత్రికల్లో వస్తున్న పతాక శీర్షికలను గమనించినట్లయితే, ’వీధుల్లో చెత్త పారవేసినందుకు ఇప్పుడు ఫైన్ కట్టండి’ అంటూ అమృత్సర్ నుంచి వచ్చిన ఒక వార్త మనకు కనబడుతుంది. ఇలాంటి చర్యలకుగాను స్పాట్ ఫైన్ అనేది సరిపోదని అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించిందట. చెత్త పడవేసిన చోటే ఫైన్ కట్టే నిబంధన ఇప్పటికే ఉన్నప్పటికీ, చట్టాన్ని ఉల్లంఘించినవారిని కోర్టులో హాజరు పర్చాలని, ఆ బాధను వారు అనుభవించాలని అమృత్సర్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. రైల్వేలలో వ్యక్తులు చెత్త పడేస్తున్నారని, (భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత చెత్తతో, మురికితో కూడి ఉంటాయని) అలాంటివారిపై రూ.5 వేల వరకు అపరాధం విధిస్తారని గత సంవత్సరం ఆ పత్రిక ప్రకటించింది. వీధుల్లో చెత్త పారవేస్తూ కనిపిస్తే చాలు ఆ వ్యక్తిపై అక్కడికక్కడే రూ.500 జరి మానా విధిస్తామంటూ గత సంవత్సరం ఆగస్టులో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. వీధుల్లో ఉమ్మివేయడం, చెత్త పారవేయడం, మూత్ర విసర్జన వంటి చర్య లకు పాల్పడితే అక్కడికక్కడే రూ.500లు ఫైన్ విధించేలా కొత్త చెత్త వ్యతిరేక చట్టం రూపొందుతోందని 2010 సంవత్సరంలోనే హిందూస్తాన్ టైమ్స్ రాసింది. ఇప్పుడు మరొక చట్టం దానికి అపశవ్య దిశలో రూపొందుతున్నట్లు కనబడు తోంది. నిజానికి ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంది? సమస్య అల్లా ఎక్కడుందంటే, ప్రభుత్వం ఒక చట్టం ద్వారా సామాజిక, సాంస్కృతిక మార్పును ప్రభావితం చేయాలనుకుంటోంది. అలా చేయవచ్చా? దీనికి సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే శిశు హత్యలు, వరకట్న హత్యలు కూడా సాంస్కృతిక నేరాలే. వీటి విషయంలో కూడా కఠిన చట్టాలను తీసుకురావాలి. ఎందుకంటే అవి కూడా హత్యలతో సమానమే. వాటితో ఆ మార్గంలోనే వ్యవహరించాలి. స్వచ్ఛ భారత్ అభియాన్ పేరిట జరుగుతున్న గందరగోళం ఇదే. ఇంతకూ ఈ పథకం దేనికి ఉద్దేశించిందన్నది కొన్ని సంకేతాలు పంపుతోంది. ప్రధాన మంత్రి తన చీపురు ద్వారా వ్యక్తిగత ఉదాహరణను నెలకొల్పారు. పలు ప్రదేశా లలో చీపురుతో చెత్తను శుభ్రం చేస్తూ కనిపించారు. ఇదంతా ఒక వారం లేకుంటే మరికొన్ని రోజులు మాత్రమే నడిచిందని పలు వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఒక రోజు మాత్రమే చీపురు పట్టుకుని వీధుల్లోకి వచ్చినందుకు ప్రముఖ వ్యక్తు లను అభినందించటానికి మాత్రమే ఆయన ట్వీట్లు పరిమితమయ్యాయి. మరోై వైపున ప్రభుత్వ ప్రకటనలు స్వచ్ఛభారత్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మరుగు దొడ్లు నిర్మించడమని చెప్పాయి. అక్కడ లక్ష్యాలన్నీ గణాంకాల రూపంలోనే కనిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్ అభియాన్‌తో గాంధేయ పని విధానాన్ని అలవర్చడానికి మోదీ ప్రయత్నిస్తున్నట్లు నేను భావిస్తున్నాను. మన సామాజిక, సాంస్కృతిక సమస్య లను పరిష్కరించడంలో ఆ మార్గం అత్యాశతో కూడుకున్నదే అయినప్పటికీ ఆ ఆలోచన ఉన్నతమైనదే. తన మరుగుదొడ్డిని తానే శుభ్రపర్చుకోవడం, తన బట్టలను తానే వడకటం వంటి చర్యల ద్వారా గాంధీ ఒక నిరుపమాన వ్యక్తిగత ఉదాహరణగా నిలిచారు. మోదీ ప్రభుత్వం ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా గాంధీ ఈ విషయంలో విఫలమయ్యారు. తన తరపున చేయడానికి మరొకరు సిద్ధంగా ఉన్నంతవరకు ఏ భారతీయుడు కూడా తన మరుగుదొడ్డిని తానే శుభ్రపర్చుకోవడం అనేది కల్లే. ఇక పోతే ఖాదీ మన జ్ఞాపకాల్లోంచే కనుమరుగైపోయింది. మరి మోదీ విజయం సాధిస్తారా? సాధించలేరు. ఎందుకంటే సాంస్కృతిక మార్పు అనేది కేవలం చట్టం రూపంలో జరగదు. పైగా ఒకే ఒక రాత్రిలో అది సాధ్యం కాదు కూడా. ఆ మార్పు అంతర్గతంగానే రావాలి. గాంధీ దాన్ని అర్థం చేసుకున్నారు. మోదీ పట్ల భారతీయులకు చాలా సానుకూల ముద్ర ఉంది. ఆయన వ్యక్తిగత ఉదాహరణ ప్రత్యేకమైనది. ఈ విషయంపై తాను నిజంగానే తీవ్రంగా ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడే ఆయన కేంద్రీకరించాలి. గాంధీ జీవిత కాలంలో దీన్ని సాధించలేకపోయినట్లే, మోదీ జీవితకాలంలో ఈ మార్పు రాక పోవచ్చు. అయితే ఏదో ఒక కొత్త చట్టం కంటే ఆయన ప్రయత్నమే మరింత సమ ర్థవంతంగా ప్రభావం చూపగలదు. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) -
అటూ ఇటూ ఎన్కౌంటర్లతో ప్రమాద ఘంటికలు
నమ్మశక్యం గాని రీతిలో అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో 25మందిని పోలీసులు కాల్చి చంపిన ఘటనకు ఏ కారణంచేతనైనా సరే ప్రజాంగీకారం లభించడం, దానికి మీడియా తిరుగులేని విధంగా వత్తాసు పలకటం పౌరసమాజానికి ప్రమాద ఘంటికలను సూచిస్తోంది. - ఆకార్ పటేల్ గత మంగళవారం ఏపీ పోలీసులు ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారనే మిషతో 20 మంది తమిళులను కాల్చిపడేశారు. అదే రోజు తెలంగాణ పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళుతున్న ఐదుగురిని కాల్చి వేశారు. ఈ రెండు వార్తల్లో ఏ ఒక్కటీ దేశంలోని రెండు ప్రధాన ఇంగ్లిష్ పత్రికల్లో ముఖ్య కథనంలా వచ్చే అర్హత సంపాదిం చుకోలేకపోయాయి. మన మధ్యతరగతి.. చెట్లు నరికే వారి ని, ముస్లింలను (ఎన్కౌంటర్ బాధితులు) చట్ట పరిధికి వెలుపల కాల్చిచంపడం పట్ల స్పందించలేదు. ఆన్లైన్లో ఈ రెండు ఘట నలపై పాఠకుల వ్యాఖ్యలు పోలీసు చర్య పట్ల సమ్మతి తెలిపాయి. వ్యాఖ్యలు పెట్టిన వారు బాధితుల పట్ల పచ్చి ద్వేషం ప్రకటిం చారు. విచారణ కూడా లేకుండానే వారికి ఆ గతి పట్టాల్సిందేనని వీరంతా తీర్పు ఇచ్చే శారు. మీడియా సైతం ఈ వార్తల పట్ల అత్యంత దురభిప్రాయాలతో కూడిన కథ నాలనే నివేదించింది. బాధ్యతతో కూడిన వార్తాపత్రికలా వ్యవహరించే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక కూడా ‘తెలంగాణలో కోర్టుకు తీసుకెళుతు న్న 5 మంది సిమి కార్యకర్తల కాల్చివేత’ అనే ముఖ్య శీర్షిక కింద కథనం ప్రచురించిం ది. వికారుద్దీన్ అహ్మద్ ఇద్దరు పోలీసులను చంపడమే కాకుండా, వీలైనప్పుడల్లా వారి ని టార్గెట్ చేస్తూవచ్చాడని ఆ పత్రిక కర స్పాండెంట్ రాశారు. ఇలాంటి సంపాద కీయ వైఖరిని, గర్హనీయమైన భాషను ఒక జాతీయ పత్రిక అనుమతించడమే విషా దం. వికారుద్దీన్ గత కొన్నేళ్లుగా పోలీసు లపై దాడులకు పాల్పడ్డాడనే అనుకుందాం. కానీ న్యాయమూర్తి అతడిని దోషిగా ప్రక టించారా? ప్రకటించలేదు. అతడు విచార ణఖైదీగా కోర్టుకు హాజరవుతున్నాడు. అయి నా సరే.. వికారుద్దీన్ హత్యలు చేశాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్ధారణ చేసింది. అమెరికాలో ఒకేరోజు 25 మంది నల్ల జాతి ప్రజలను ఉరితీస్తే, ప్రభుత్వం ఉన్న ఫళానా కూలిపోయేది. ఆ దేశ జనాభా మొత్తంగా బాధితులకు సంఘీభావంగా ర్యాలీలు తీసేది. భారత్‌లో పోలీసులను ప్రశంసించని మనలాంటి వాళ్లం కాస్త నోరు తెరిచి ఊరకుండిపోతాం. అంతే తేడా. మీడి యా చాలా కాలం క్రితమే తన పాఠకులు, వీక్షకుల ముందు సాష్టాంగ పడిపోయింద న్నది వాస్తవం. పోలీసులను దూషించడాన్ని మీడియా ఒక స్థాయి వరకు ఆమోదించిం ది. అయితే తాను లక్ష్యంగా పెట్టుకున్న పాఠ కులు, వీక్షకులకు ఇబ్బంది పెట్టనంతవరకే ఇది కొనసాగుతుంది. నేను ముంబైలో 20 ఏళ్ల క్రితం ఒక పత్రిక సంపాదకుడిగా ఉన్నప్పుడు, ఎన్ కౌంటర్ సంస్కృతి పంజాబ్, ఈశాన్య భార త్ నుంచి అప్పుడే మన నగరాల్లోకి ప్రవేశిం చింది. ఎన్కౌంటర్ హత్యలను సమర్థించే భారతీయులు అప్పట్లో చాలా మందే ఉండే వారు. వాటిని విమర్శించేవారిని నాటి టీవీ చర్చల్లో విద్రోహులుగా ఎంచేవారు. భవన నిర్మాతలు, బాలీవుడ్ నిర్మాత లు, ఫైనాన్షియర్ల నుంచి డబ్బు గుంజే ముఠాలను ముంబై పోలీసులు కాల్చి చం పేవారు. చట్టవిరుద్ధమైన పోలీసు చర్యలను ప్రశ్నించే పత్రికా సంపాదకులపై అటు యా జమాన్యం, ఇటు పాఠకులు దాడి చేసే వారు. దోషనిర్ధారణ ద్వారా చట్టాన్ని అమ లు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతు న్నందున, న్యాయ ప్రక్రియతో పనిలేకుండా నే నేరస్థులను నిర్మూలించడం ద్వారా ప్రభు త్వం శాంతిభద్రతలను నెలకొల్పితే మంచి దేనని ఇలాంటివారి నమ్మిక. ఈ క్రమంలో, డజన్ల కొద్దీ నేరస్థులను చంపుతూ ఎన్‌కౌం టర్ స్పెషలిస్టులుగా ప్రాచుర్యంలోకి వచ్చిన పిరికితనపు పోలీసు అధికారులు పుట్టుకొ చ్చారు. వీరినే ధీరోదాత్తులుగా వర్ణిస్తూ సిని మాలు పుట్టుకొచ్చాయి. వీళ్ల సాహసం అంతా బేడీలతో బంధించిన వ్యక్తులపైకి కాల్పులు జరపడానికే పరిమితం అయ్యేది. ఈ ప్రక్రియకు ఏదో ఒక చోట ముగింపు ఉంటుందని నేను అప్పట్లో భావించేవాడిని. కానీ, నా భావన తప్పయిందనుకోండి. ప్రజావాణికి ప్రతిచోటా ప్రాధాన్యం ఏర్పడు తుండటంతో పౌరులను పాశవికంగా మార్చడం ప్రభుత్వానికి సులభమైపోయిం ది. మనుషులను నేరపూరితంగా, చట్టవిరు ద్ధంగా కాల్చిచంపడం ద్వారా అలాంటివారి పట్ల మీడియా ద్వారా అమానుషంగా వ్యవ హరించడం ఇప్పుడు సులభతరం అయి పోయింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఎవరికెరుక? (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) ఈమెయిల్: aakar.patel@icloud.com -
ఆ ఆర్థిక అద్భుతం ఇక్కడ అసాధ్యం!
అవలోకనం చరిత్రలో అతి కొద్ది దేశాలు మాత్రమే సింగపూర్ తరహా శరవేగ పురోగతిని సాధించగలిగాయి. కానీ లీ కాన్ యూ వంటి ఒక దృఢమైన నేతకు అధికారం అప్పగించడం అనేది భారత్ వంటి దేశాల స్థితిని మార్చలేదు. కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన సింగపూర్ నిర్మాత లీ కాన్ యూను అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ ప్రశంసిస్తూ ఆర్థిక రంగంలో ఆయన సాధించిన విజయాన్ని ఎత్తిచూపారు. ‘‘1965లో స్వాతంత్య్రం పొందినప్పుడు 500 డాలర్ల మేరకు ఉన్న సింగపూర్ జనాభా వార్షిక తలసరి ఆదాయాన్ని లీ ఆయన సహచరులు నేటికి 55,000 డాలర్లకు పెంచారు. ఒక తరం గడిచేసరికి సింగపూర్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా, ఆగ్నేయాసియాలో అతి ప్రధానమైన మేధో మహానగరంగా, ఆ ప్రాంతంలోనే అతి పెద్ద ఆసుపత్రుల నిలయంగా, అంతర్జాతీయ వ్యవ హారాలపై నిత్యం సదస్సులు జరిపేందుకు అత్యంత అనుకూల ప్రాంతంగా మారిపోయింది.’’ ఏ రకంగా చూసినా ఇది అసాధారణ విజ యం. చరిత్రలో అతి కొద్ది దేశాలు మాత్రమే ఇంత టి శరవేగ పురోగతిని సాధించగలిగాయి. అయితే సింగపూర్ కొన్ని ముందస్తు అనుకూలతలతో లీ చేతుల్లోకి వచ్చిందన్న విషయాన్ని మరువరాదు. శతాబ్దం పాటు అది బ్రిటిష్ పాలనలో ఉండేది. దానికి చక్కగా అభివృద్ధి చెందిన నౌకాశ్రయం ఉం డేది. పైగా, స్వాతంత్య్రం సిద్ధించేనాటికి ఈ నగరం వాణిజ్య కేంద్రంగా కూడా ఏర్పడి ఉంది. ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే, 1965లో భారతీయుల తలసరి ఆదాయం 100 డాలర్లు మాత్రమే ఉండేది. సింగపూర్‌తో పోలిస్తే భారత్ ఆర్థికంగా మరింత అసమానతలతో కూడిన సమాజం. సింగపూర్‌కు మరో అనుకూలత కూడా ఉంది. అది అతి తక్కువ జనాభా ఉన్న అతి చిన్న దేశం. సింగపూర్‌లో మూడింట రెండొంతులు లేదా అంతకంటే ఎక్కువమంది ప్రజలు చైనా నుంచి వలస వచ్చిన వ్యాపార వర్గాలతో కూడినవారు. నియంతృత్వ పాలనకు తలొగ్గి ఉండే కన్ఫ్యూసి యస్ సంస్కృతిని వీరు జీర్ణించుకుని ఉండేవారు. క్రమశిక్షణ, నిజాయితీ ప్రాతిపదికగా లీ పాలనా యంత్రాంగం ఈ అనుకూలతలను అద్భు తంగా ఉపయోగించుకుంది. దీని మూలంగానే ఆయన ఒక నిజమైన విశ్వ నగరాన్ని నిర్మించగలి గారు. సింగపూర్ సందర్శించిన ఎవరైనా సరే.. దాని సౌందర్యాన్ని, చక్కదనాన్ని ప్రశంసించకుండా ఉం డలేరు. అది అత్యంత సంపద్వంతమైనదీ, పరిశు భ్రమైనది మాత్రమే కాకుండా, జపాన్, యూరప్‌కు మధ్య ఉన్న ఏ నగరంకంటే కూడా ఉత్తమంగా అల రారుతూ వస్తోంది. దీన్ని సందేహించవలిసిన అవ సరం లేదు. ‘‘లీ దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడు. నాయకులలో ఆయన సింహం లాంటివారు. లీ కాన్ యూ జీవితం ఎవరికైనా అమూల్య పాఠా లను బోధిస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ సింగ పూర్ నిర్మాతను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. మరి ఆ పాఠాలు ఏమిటి? భారత్ వంటి దేశాలకు వాటిని వర్తించవచ్చా? మోదీ వంటి దృఢమైన నేతలు (నిజమైన ప్రజాస్వామిక శక్తి లేని కిసింజర్ వంటి దృఢమైన నేతలు కూడా) లీని ప్రేమించటం సహజమే. ఎం దుకంటే సింగపూర్ నిర్మాణక్రమంలో లీ పొందిన అధికారం సంపూర్ణమైనది, నిరపేక్షమైనది. మరి అవధుల్లేని ఈ అధికారంలోని అనుకూలతలు ఏవి? సింగపూర్ ప్రధాన పత్రిక స్ట్రెయిట్స్ టైమ్స్‌లో 2012లో ఒక కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తున్న లీ కెక్ చిన్ అనే 46 ఏళ్ల వయసున్న పాఠకుడు రాసిన ఒక ఉత్తరాన్ని చూద్దాం. ఆ పత్రికలో అచ్చయిన ‘రెండు పార్టీల వ్యవస్థ ఇక్కడ పనిచేయదు’ అనే శీర్షికతో వచ్చిన కథనంపై ఆ పాఠకుడు ఇలా స్పందించారు. ‘‘ప్రస్తుత సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్ రెండు మంచి రాజకీయ పార్టీల వ్యవస్థను నెలకొల్పడానికి సింగపూర్‌లో తగినంత సమర్థులు లేరని భావిస్తుంటారు. అయితే దీన్ని మరింత విశా ల దృష్టితో చూడాలి. ఏక పార్టీ వ్యవస్థ ఉన్న దేశంతో బహుళ పార్టీలవ్యవస్థ ఉన్న దేశాన్ని పోల్చి చూద్దాం. ఇండియా, చైనాలనే పరిశీలిద్దాం. ఈ రెండు దేశాలు అత్యంత భారీ జనాభాను, ఏకజాతీయ సంస్కృతిని కలిగి ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండు దేశాలూ ఆర్థికంగా బాగానే అభివృద్ధి చెందుతున్నాయి. వీటి లో చైనానే ఉత్తమంగా పనిచేస్తోందనటం వాస్తవం. చైనాలో అమలవుతున్న ఏక పార్టీ ప్రభుత్వమే (ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కమ్యూనిస్టు ప్రభు త్వం) దీనికి కారణమని నేను భావిస్తున్నాను. ఒకే పార్టీ ఉనికిలో ఉన్నందున చైనా నేతలకు మొత్తం దేశాన్ని ఒకే దిశలో నడిపే వీలు చిక్కింది. మరోవై పున రెండు పార్టీలు లేదా బహుళ పార్టీల వ్యవస్థలో ప్రతి పార్టీ కూడా తమ ప్రయోజనాల కోసమే పోరా డతాయి కొన్ని సార్లు ఇవి దేశ పురోగతిని కూడా ఫణంగా పెడతాయి. ఉదాహరణకు, మౌలిక వస తుల కల్పనను వృద్ధి చేస్తే మొత్తం జాతి ప్రయోజ నం పొందుతుంది. కాని ఒక మంచి ప్రణాళికను కూడా ప్రతిపక్షం తన పార్టీ ప్రయోజనాల కోసం అడ్డుకోవచ్చు. దీని వల్ల ఒక దేశం ఆర్థికాభివృద్ధి విష యంలో మరోవైపుకు కొట్టుకుపోయి కృశించిపో వచ్చు. ఉదాహరణకు అమెరికానే తీసుకుందాం. ఒక రాజకీయపార్టీ మరొక రాజకీయ పార్టీని అధిగ మించాలని చేస్తున్న ప్రయత్నాల వల్ల గత దశాబ్దం పొడవునా అమెరికాలో ప్రగతి స్తంభించిపోయింది. మరోవైపున ఆసియా టైగర్లుగా పేరొందిన హాంకాంగ్, తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల ఆర్థిక వ్యవస్థలు సహజ వనరుల లేమి ఉన్న ప్పటికీ ముందడుగు వేస్తున్నాయి. కానీ సింగపూర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది తాజా ద్రవ్య సంక్షోభం నుంచి కూడా సాపేక్షికంగా తేరుకుని బతికి బట్ట కట్టింది. మన వ్యవస్థలోని ఏక పార్టీ ప్రభుత్వం దేశాన్ని ఒకే దిశగా నడిపించడమే దీనికి కారణమని నా విశ్వాసం. రెండు పార్టీలు లేదా బహుళ పార్టీ లను కలిగి ఉన్న పెద్ద దేశాలు తప్పులు చేసి కూడా బయటపడగలవు. కానీ సింగపూర్ వంటి చిన్న దేశానికి అలాంటి సందర్భంలో రెండో అవకాశానికి ఏమాత్రం వీలుండదు.’’ లీ ఎందుకు విజయం సాధించగలిగారో చెప్ప డానికి ఇదొక ప్రామాణిక వాదన. సింగపూర్‌పై ఆయన నియంతృత్వమే ఇందుకు కారణమని ఈ వాదన తేల్చి చెబుతుంది. జనాభాలో ప్రతిభ అపా రంగా ఉండటం, దేశం పరిమాణం చాలా చిన్నదై ఉండటంతో ఇక్కడి నియంతృత్వం పెద్దగా ప్రపం చం దృష్టిలో పడలేదు. అత్యున్నత ఆర్థిక పురోగతి సాధించడానికి ప్రభుత్వం అన్ని రంగాల్లో సమర్థవం తంగా చొచ్చుకుపోవలసి ఉంటుందనడంలో వివా దం లేదు. అయితే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ చేయిపెట్టి చొరబడటం (పౌరులు స్వచ్చందంగా అత్యవసర సేవలపై పన్ను విధింపునకు, తీర్పుల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి లోబడి ఉండటం) అనేది అతి పెద్దవీ, వనరుల కోసం కొట్టుమిట్టాడుతున్న భారత్ వంటి దేశాలకు సులభ పరిష్కారం కాదు. ఒక దృఢమైన నేతకు అధికారం అప్పగించడం అనేది భారత్ వంటి దేశాలను మార్చలేదు. బహు శా ఈ వాదనను లీ సమర్థిస్తారని నేననుకోవడం లేదు. తాను సాధించిన అద్భుత విజయం ఇండి యా లాంటి దేశాల్లో ఎందుకు సాధ్యపడలేదని లీ తరచుగా ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. సింగపూర్‌లోని నియంతృత్వ పాలనకు వస్తు న్న చెడ్డపేరును ఎవరూ పెద్దగా పరిగణించడం లేదు. ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన నా సింగపూర్ ఫ్రెండ్ పీటర్ ఓంగ్.. తన పౌరులపై సింగపూర్ విధించిన ఏకత్వంలో దాగిన క్రూరత్వంపై తీవ్ర అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. లీ నిరంకుశత్వం, విప రీత ధోరణులతో కూడిన పాలన (ఉదాహరణకు చూయింగ్ గమ్‌పై నిషేధం విధించడం, కొరడా లతో కొట్టడం వంటి తీవ్రమైన శిక్షలు) సింగపూర్ ప్రతిష్టకు ఎలాంటి విలువను ఆపాదించడానికి బదు లుగా నష్టం కలిగించాయని చెప్పక తప్పదు. అయితే 1965లో భారత్‌తో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువగా ఉన్న సింగపూర్ తలసరి ఆదా యాన్ని 2015 నాటికి 30 రెట్లు అధిక స్థాయికి తీసు కుపోవడంలో లీ సాధించిన విజయం అద్భుతమని నేను మళ్లీ చెబుతున్నాను. కానీ, లీ సింగపూర్ మన కు ఒక ఆదర్శం అని చెప్పడం తప్పు. పైగా లీ కానీ, లేదా ఆయన వంటి మరొక ప్రవక్త కానీ భారత్ వంటి దేశాల్లో ఈ ఆర్థిక అద్భుతాన్ని సాధిస్తారని భావించడం తప్పు. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్:aakar.patel@icloud.com -
ఆ ఓటమికి కుట్ర కారణమనడం సబబేనా?
అవలోకనం ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ మూడు రంగాల్లోనూ భారత్ జట్టు అసాధారణమైన ఆటతీరును కనబర్చింది. బంగ్లాదేశ్‌తో ముగిసిన క్వార్టర్ ఫైనల్లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను నోబాల్‌గా ప్రకటించడంలో కుట్ర జరిగిందన్న ఆరోపణ కాస్త అతిగా ఉందనే చెప్పాలి. కామన్వెల్త్ దేశాలు అసాధారణంగా వ్యవ హరిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద విషయాల్లో మనం మన వైఫల్యా లను, ఓటములను అల వోకగా అంగీకరిస్తుం టాం. మన సమాజాలు పేదవి, నిరక్షరాస్యతతో కూడుకున్నవనీ, చాలావరకు ఇవి అనాగరికమై నవనీ, తరచుగా అప్రజాస్వామికంగా ఉంటాయని అంగీకరించడంలో భారతీయులు, పాకిస్తానీయు లు, బంగ్లాదేశీయులూ మొదటివరుసలో ఉంటారు. అయితే ఎక్కడో ఒకచోట మనం దీన్ని అతిక్రమిస్తుం టాం. సాధారణంగా క్రికెట్ విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. క్రికెట్‌కి సంబంధించి మనం కొన్ని సందర్భాల్లో అవలంబించే వైఖరి ఆమోద నీయం కాదు. శ్రీలంక టెస్ట్ క్రికెట్ ఆడే దేశంగా ఆవిర్భవించి, భారత్‌తో తన తొలి మ్యాచ్ ఆడటం నాకు గుర్తుంది. భారత్‌తో పోలిస్తే రమేష్ రత్నా యకే, అశాంతె డి మెల్ వంటి ఫాస్ట్ బౌలర్లతో, కొద్ది మంది గొప్ప బ్యాట్స్మెన్లతో వారు గట్టి జట్టుగా కనిపించేవారు. దాదాపు 30 ఏళ్లకు ముందు శ్రీలంకలో జరిగిన తొలిటెస్టు పర్యటనలో (నేను పొరపడనట్లయితే, కపిల్‌దేవ్ సంధించిన తొలి బంతిని అరవింద డిసి ల్వా సిక్స్‌గా మలచినట్లు గుర్తు) కపిల్‌దేవ్ అంపై రింగ్‌పై ఎంత ఆగ్రహం వ్యక్తపరిచాడంటే, లంకే యులు తమ దేశం వెలుపల ఎన్నటికీ విజయం సాధించలేరని ప్రకటించాడు. అయితే తన ప్రకటన తప్పు అని తెలుసుకోవడానికి కపిల్‌కు అట్టే సమ యం పట్టలేదు. కానీ ఆక్షణంలో మాత్రం తన నాయకత్వంలోని బలమైన భారత్ జట్టును అంగుష్ట మాత్రపు పొరుగుదేశం ఓడించవచ్చన్న వాస్తవాన్ని కపిల్ అంగీకరించలేకపోయాడు. మనం ప్రస్తుత ప్రపంచ కప్ విషయానికి వద్దాం. పూర్తిగా ఏకపక్షంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో, బ్యాటింగ్‌తో పోలిస్తే పేలవంగా కనిపించే భారతీయ బౌలింగ్ అసాధార ణమైన ఆటతీరుతో మెప్పించింది. అటు ఫీల్డింగ్ లోనూ, అటు బ్యాటింగ్‌లోనూ ప్రత్యర్థి జట్టుపై మొత్తం నూరు ఓవర్లలో ఆధిక్యత చూపడంలో మన బౌలర్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. క్వార్టర్ ఫైనల్లోనూ ఇదే జరిగింది. భారతీయ ఇన్నింగ్స్ మధ్యలో వికెట్లు కోల్పోనప్పటికీ రన్ రేట్ ఒక్కసారిగా పడిపోవడం మినహాయిస్తే, భారత్ ఆట మొత్తంలో ఆధిక్యత కనబర్చింది. కానీ ఆట ముగిశాక బంగ్లాదేశ్ పత్రికలను చూసినట్లయితే, వారి జట్టుకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని అవి రాశాయి. ’బంగ్లాదేశ్ సెమీస్ ఆశల్ని ఘోరంగా దెబ్బతీసిన వివాదాస్పదమైన అం పైరింగ్’ ఇది బంగ్లాదేశ్ అతిపెద్ద జాతీయ వార్తా పత్రిక డైలీ స్టార్ పెట్టిన ప్రధాన శీర్షిక. రోహిత్ శర్మ 91 పరుగుల వద్ద ఆడుతున్నప్పుడు రుబెల్ హుసేన్ ఫుల్ టాస్ బంతితో లభించిన క్యాచ్‌ని అంపైర్ నోబాల్‌గా ప్రకటించడం మ్యాచ్‌ని మలుపు తిప్పిం దని బంగ్లా పత్రిక వ్యాఖ్యానించింది. అంపైర్ నిర్ణయంతో బతికిపోయిన రోహిత్ మరో 46 పరు గులు చేయగలిగాడు. భారత్ జట్టు బ్యాటింగ్ ఆ దశలో ఉన్న తీరును పరిశీలిస్తే ఈ అంపైరింగ్ లోపం వల్ల బంగ్లాకు పెద్దగా ఒనగూరేదేమీ లేదు. రీప్లేని చూపించినప్పుడు, అంపైర్ ఇయాన్ గౌల్డ్ తప్పు నిర్ణయం చాలా స్పష్టంగా కనిపించింది. బ్యాట్స్‌మన్ బ్యాట్‌తో బంతిని తాకినప్పుడు అది తక్కువ ఎత్తులో ఉండటం పదేపదే రీప్లేలో కనిపిం చింది. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా లెగ్ ఎంపైర్ నిర్ణయం వెలువరించాల్సి ఉండగా, ఆ స్థానంలో ఉన్న అలీమ్ దార్ మౌనంగా ఉండిపో వడం బంగ్లా జట్టు అభిమానులకు మిస్టరీగా కనబడింది. ఇతరులు సైతం దీన్ని తప్పుగానే భావించారు. భారత్ మాజీ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్ సైతం దీనిపై ట్వీట్ చేస్తూ, ‘గౌల్డ్ది తప్పు నిర్ణయం. బంతి ఆ సమయంలో ఖచ్చితంగా నడుము పైభాగంలో ఎగరలేదు. రోహిత్ నిజంగానే ఊపిరి పీల్చుకున్నట్ల యింది. అదనంగా 20 పరుగులు రావడానికి ఇది దోహదం చేస్తుంది’ అని పేర్కొన్నాడు. అంపైర్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటారన్నది వాస్తవం. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, ఉమేష్ యాదవ్ వేసిన మొట్టమొదటి ఓవర్ నాలు గో బంతికే ఇమ్రుల్ కేస్ కాట్ బిహైండ్ రూపంలో ఔటయ్యాడు. స్నికోమీటర్ దాన్ని స్పష్టంగా చూపిం చింది కూడా. కాని అప్పీల్‌కు అంపైర్ స్పందిం చలేదు. అంపైరింగ్ లోపాల గురించి విషం కక్కు తున్నప్పుడు బంగ్లాదేశీ పత్రికలకు ఈ విషయం గుర్తుకు రాకపోవడం సహజమే. నిజానికి ఈ విషయంలో గౌల్డ్ తప్పు లేకపో వచ్చు. పైగా అది నో బాల్ అని ప్రకటించింది కూడా తను కాదు. స్క్వేర్ లెగ్‌లో ఉన్న అంపైర్ దార్ వెనువెంటనే నో బాల్ అని సంకేతమిచ్చాడు (అప్పటికి రోహిత్ షాట్ ఇంకా క్యాచ్ కాలేదు). ఆ బంతి నడుముకు పైభాగంలో వచ్చిందని దార్ తప్పుగా భావించి ఉండవచ్చు. (వాస్తవానికి అది నడుముకు కొన్ని అంగుళాల కిందే వచ్చింది), కానీ దీనిలో కుట్రకు అవకాశమే లేదు. ఏదేమైనా నేను తొలి పేరాలోనే చెప్పినట్లు ఇది క్రికెట్. బంగ్లాదేశీ యులు మైదానంలోని స్టాండ్లలో ఒక బ్యానర్‌ను ప్రదర్శించేశారు. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అని ఆ బ్యానర్ చూపించింది. అయితే ఇలాంటి సూత్రీకరణ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా నుండి రావడం గమనార్హం. ‘వెల్డన్ ఐసీసీ (ఇండియన్ క్రికెట్ కౌన్సిల్), మీరు పూర్తిగా అమ్ముడుపోయారు!!’ అంపైర్ నిర్ణయం మిస్టరీగా ఉందన్న ప్రాతి పదికనే రమీజ్ అమ్ముడుపోవడం అనే పదాన్ని వాడారు. అతనొక్కడే కాదు. షోయబ్ అక్తర్ కూడా ఇలాగే ట్వీట్ చేశాడు. ‘పాపం, బంగ్లాదేశ్ బాగా ఆడింది. ఈ మ్యాచ్‌లో వంచన జరిగింది. కానీ ఈసారి...’ కానీ మోసం చేసిందెవరు? దీన్ని మా త్రం ఎవరూ చెప్పడం లేదు. తాను కొంత అతిగా వ్యవహరించినట్లు రమీజ్ తర్వాత గుర్తించాడు కాబోలు... (లేదా భారత్ ట్వీటర్ సేన నుంచి వెల్లు వెత్తిన విమర్శల ప్రభావం వల్ల కూడా కావచ్చు) తర్వాత ఇలా ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన ఆట. అద్భుత ప్రదర్శన. 7 వరుస విజయాలు సాధించిన టీమ్ ఇండియాకు అభినందనలు’ కానీ బంగ్లాదేశ్‌లో తాము గెలవాల్సిన చోట మోసపోయామన్న భావం ఇప్పటికీ బలంగా వినిపి స్తోంది. ఐసీసీ వివాదాస్పదమైన అంపైరింగ్‌పై బం గ్లాదేశ్ అప్పీల్‌కు సిద్ధం అనీ, యుద్ధనేరాలకు గాను ఐసీసీని విచారించాలి అనీ బంగ్లాదేశ్ పత్రికలు అనేక పతాక శీర్షికలలో ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నా యి. ఇది కాస్త అతిగా ఉందని నా అభిప్రాయం. ఆ నిర్దిష్ట కథనాన్ని నేను చదివినప్పుడు అది అంతర్జా తీయ క్రిమినల్ కోర్టుకు వెళ్లాలని సూచిస్తోంది. నేను మెల్లగా ఆ పేజీని తిరగేశాను. బంగ్లాదేశ్ అభిమానులు కూడా అలాగే చేయడం మంచిది. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్:aakar.patel@icloud.com -
ఆ ‘పురా వైభవం’ ఇతర నదులకు వద్దా?
ఒక్క ‘పవిత్ర’ నదిని ప్రక్షాళన చేసినంతమాత్రాన యావద్దేశం శుద్ధి అయిపోతుందా? అది అసాధ్యం. మన దేశంలోని 90 శాతం రాష్ట్రాలలో గంగానది అస్సలు ప్రవహించడం లేదు. అలాంటప్పుడు పురాణ ప్రాధాన్యత మిషతో ఈ నది ప్రక్షాళన కోసం ఇన్ని వనరులను ఎందుకు ఖర్చు పెడుతున్నారు? గంగానది శుద్ధి కార్య క్రమం గడచిన 30 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. నాటి నుంచి నేటి వరకు దాదాపు రూ. 2 వేల కోట్లను ఖర్చు పెట్టారు. భారత సర్వో న్నత న్యాయస్థానం కొన్ని వారాల క్రితం ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మంద లించింది. గంగానది శుద్ధి కార్యక్రమాన్ని మీరు ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేయదల్చుకున్నారా లేక వచ్చే అయిదేళ్లకు కూడా దీన్ని కొనసాగించాల నుకుం టున్నారా తేల్చి చెప్పమంటూ సుప్రీంకోర్టు నిగ్గ దీసింది. మీ కార్యాచరణ పథకం చూశాక గంగా నది వచ్చే 200 సంవత్సరాల్లో కూడా పరిశుద్ధం కాదనిపిస్తోందన్నది కోర్టు వ్యాఖ్య. గంగానది తన పురాతన వైభవాన్ని తిరిగి పొందేలా, భవిష్యత్ తరాలు దాన్ని దర్శించగలిగేలా మీరు తగిన చర్యలు చేపట్టాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. కోర్టు వ్యాఖ్యకు స్పందించిన కేంద్రం గంగా నది ప్రక్షాళన కార్యక్రమం 2018 నాటికి పూర్తవుతుందని తెలిపింది. అంటే నరేంద్ర మోదీ ప్రస్తుత పదవీ కాలం లోనే ఇది పూర్తవుతుందని దీనర్థం. గంగానది పొడవునా ఉన్న 118 కాలుష్య పట్టణాలను ఇప్పటికే గుర్తించామని, వాటి పురపాలక సంస్థలను మేలుకో వలసిందిగా ఆదేశించామని కేంద్రం వివరించింది. గంగ ప్రక్షాళనకు మరొక శ్రీధరన్ కోసం సుప్రీం కోర్టు అన్వేషిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పతాక శీర్షికలో పేర్కొంది. దేశంలో వివిధ క్లిష్టతరమైన రైల్వే ప్రాజెక్టులను నిర్మించిన శ్రీధరన్ విశ్రాంత ఉన్నతాధికారి. గంగ ప్రక్షాళన పథకంలో వ్యవస్థా గత లోపాలున్నాయని, ఈ పథకాన్ని అమలు చేస్తు న్న ఉన్నత స్థాయి వ్యక్తులను మార్చాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడుతున్నట్లు ఆ వార్త పేర్కొంది. గంగానది ప్రక్షాళన పథకాన్ని సుప్రీంకోర్టు చాలా కాలంగా ముందుకు నెడుతూ వస్తోంది. ఈ ప్రక్షాళన కోసం పనిచేస్తున్న అన్ని ప్లాంట్ల స్థితిపై, అవి ఎప్పుడు పని మొదలెడతాయన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు కేంద్రాన్ని ఆదే శించింది. ఈ అంశంపై ఉన్నతాధికారుల పరిభా షలో కాకుండా, దాన్ని నిరూపించదగిన పదజా లంతో నిర్దిష్టకాల కార్యాచరణను సమర్పించాలని కోరింది. ‘గంగానది ప్రక్షాళన పట్ల మీరు ఎంతో నిబద్ధ తను ప్రకటించారు. ఈ విషయంపై మాకంటే మీరే మరింత బాధ్యతతో ఉండాల’ని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. నా ప్రశ్న ఒక్కటే: అలా ఎందు కుండాలి? ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ ఒక్క నది ప్రక్షాళనపై మాత్రమే ఎందుకు నొక్కి చెబుతున్నారు? గంగాన దిని ప్రక్షాళన చేస్తే భారతదేశం మొత్తంగా శుద్ధి అయిపోతుందా? లేదు. అది సాధ్యం కాదు. మన దేశంలోని 90 శాతం రాష్ట్రాలలో గంగానది అస్సలు ప్రవహించడం లేదు. అలాంటప్పుడు కేవలం ఒక్క నది ప్రక్షాళన కోసం ఇన్ని వనరులను ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇంత ప్రభుత్వ యంత్రాంగ సమయాన్ని ఎందుకు వెచ్చిస్తున్నారు? పలువురు హిందువులు ఈ నదిని పవిత్రమై నదిగా భావిస్తున్నారన్న వాస్తవంతో సుప్రీంకోర్టు ప్రభావితం కాలేదా? ఇలాంటి వాగ్దానాలతో మోదీ ప్రభుత్వం హిందువుల ఓట్ల కోసం ప్రయత్నిస్తుం డవచ్చు కానీ, అది రాజకీయం. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లను తిరస్కరించడం వంటి చర్యల్లోనూ ప్రభుత్వ వైఖరి ప్రతిఫలిస్తోంది. (వెను కబడిన ముస్లింలు వెనుకబడిన హిందువుల మాదిరే నిరుపేదలు. కాని వారి పూర్వీకులు మరొక దేవుడిని ప్రార్థించడాన్ని ఎంచుకున్నందున ప్రత్యేకించి ఈ తరగతి ముస్లింలను శిక్షిస్తున్నారు. ఎద్దులను చంప డంపై నిషేధం విధించడంలో కూడా ప్రభుత్వం వైఖరిలో సత్వర స్పందన కనిపిస్తుంది. భారతీయ జనతాపార్టీ నుంచి ఎవరైనా ఇలాంటి చర్యలనే ఊహిస్తారు. వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో నాకు ఎలాంటి సమస్య ఎదురుకాదు కూడా. నా సమస్య ఏమిటంటే.. సుప్రీంకోర్టు గంగా నది ప్రక్షాళనలో ఎందుకిలా జోక్యం చేసుకుంటోం ది? మతపరమైన మనోభావాలు, కల్పనలు కోర్టు ప్రాధాన్యతలను ఎందుకు నిర్దేశిస్తున్నాయి? పైగా, ఒక గుజరాతీయుడిగా మరో విషయం కూడా నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అదేంటంటే, ‘తపి’ నది ప్రక్షాళనపై ఎందుకు దృష్టి సారించడం లేదు? చాలా మంది సూరత్ వాసులను ఈ నది భయపెడు తుంటుంది. మా అమ్మ నర్మదానదికి విశేష ప్రాధా న్యతను ఇస్తుంది. హిందువులను బుజ్జగించడానికి నర్మదానది ప్రక్షాళనను ఎందుకు చేపట్టరు? దక్షిణభారత్‌లో నివసిస్తున్న వాడిగా కృష్ణా, కావేరీ నదులపై భారీగా ఖర్చుపెట్టి, మానవ శక్తిని వెచ్చించడానికి నేనిష్టపడతాను. ఈ రెండు నదుల ప్రక్షాళనను ఎందుకు చేపట్టలేదు? బ్రహ్మపుత్రానది లేదా బహుశా గంగానది కంటే ఎక్కువగా మురికి మయమైపోయిన యమునా నదిని ఎందుకు ప్రక్షా ళన చేయరు? భవిష్యత్ తరాల ప్రజలు వీటిని తమ పురాతన వైభవంలో (దానర్థం ఏదైనా కావచ్చు) భాగంగా ఎందుకు చూడకూడదు? గంగానదీ పరీవాహక ప్రాంతం పొడవునా నెల కొన్న 113 పట్టణాలలో పేరుకుపోతున్న చెత్తలో మూడింట రెండొంతులకు పైగా, దేశంలోని జాతీ య నదుల్లోకి చేరిపోతోంది. ఈ కోణంలో గంగానది ప్రక్షాళనకు సుదీర్ఘ ప్రక్రియ అవసరం తప్పకపోవ చ్చని ఒక నివేదిక తెలిపింది. పలు ప్రభుత్వ సంస్థల నుంచి నిపుణుల బృందం సిద్ధం చేసిన మరొక నివేదిక మరింత దారుణమైన వివరాలను బయట పెట్టింది. ఈ అన్ని పట్టణాలు 363.6 కోట్ల లీటర్ల మురికినీటిని ప్రతిరోజూ సృష్టిస్తున్నాయని, అయితే ఐదు రాష్ట్రాల పరిధిలో నెలకొన్న ఈ పట్టణాల్లోని మురికినీటి శుద్ధి కర్మాగారాలు కేవలం 102.7 కోట్ల లీటర్ల నీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. అంటే గంగానదిని ప్రక్షాళన చేయడమంటే ఈ నగరాలన్నింటినీ ప్రక్షాళన చేయడమని అర్థం. ఈ పట్టణాల్లో నివసిస్తున్న పౌరులకు సమర్థవంతమైన మురికినీటి నిర్వహణ, పారిశుధ్య పరిస్థితులను కల్పించాలి. ఇలా చేస్తే నిజంగా బాగుంటుంది. అదే సమయంలో దేశంలోని ఇతర పట్టణాల మాటేంటి? పవిత్రమైన నదిని కాలుష్యం చేయగలగిన స్థితిలో అవి లేవు కాబట్టి వాటిని సవతి పుత్రుల్లాగే కేంద్రం తీసిపారేయవలసిందేనా? పురాణాల్లో దానికున్న ప్రాధాన్యత రీత్యా గం గానదిని ప్రత్యేక దృష్టితో చూడాలన్న సుప్రీంకోర్టు భావనను, హిందూయేతర, హిందూమతేతర భార తీయులు ఎలా అర్థం చేసుకుంటారన్నది హిందు వుగా నాకు అందోళన కలిగిస్తోంది. అంతకుమించి, దాని ప్రత్యేకత దృష్ట్యా గంగానదిపైనే దృష్టి సారిం చాలన్న భావనను మన మీడియా కూడా పెద్దగా ప్రశ్నించడం, ప్రతిఘటించడం లేదన్న వాస్తవం నన్ను మరింతగా కలవరపెడుతుంటుంది. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్: aakar.patel@icloud.com - ఆకార్ పటేల్ -
ఈ ‘ఆద్మీ’ కూడా ఆ తానులో ముక్కేనా?
ఆకార్ పటేల్ సంక్షోభ సమయంలోనూ ఎంతో హుందాగా వ్యవహరించిన యోగేంద్ర యాదవ్‌ను, ప్రశాంత భూషణ్లను కీలక కమిటీ నుంచి మొరటుగా తొలగించిన తీరు తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసింది. అన్ని పార్టీల కంటే తామే పరిశుద్ధులమని చెప్పుకుంటున్న వారి ఔద్ధత్యానికి గండిపడింది. మన ఇతర రాజకీయ పార్టీలలాగే సంకుచితం గానూ, వంచనాత్మకం గానూ వ్యవహరించిన ఆమ్ ఆద్మీ పార్టీ గత వా రం తన మద్దతుదారుల ను, కార్యకర్తలను నిరా శపర్చింది. ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీ వాల్ అనుకూల నాయకత్వం, కీలకమైన నిర్ణాయక కమిటీ నుంచి ఇద్దరు అత్యంత గౌరవనీయులైన సభ్యులను గతవారం తొలగించింది. ఉన్నత విద్యా వంతుడు యోగేంద్ర యాదవ్, న్యాయవాది ప్రశాం త భూషణ్‌లు అధికారం అందరికీ ప్రాప్తించాలనే సూత్రానికి ఆప్ కట్టుబడి ఉండాలంటూ అత్యంత బాధ్యతాయుతమైన రీతిలో కోరి కేజ్రీవాల్‌కు ఆగ్ర హం కలిగించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్య మంత్రిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా జోడు పదవుల్లో ఉన్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ సూత్రాన్ని ఇది ఉల్లంఘించింది. ఈ వివాదంపై మీడియాకు ఉప్పందింది. దీనిపై పార్టీ తీవ్ర ఒత్తిడికి గురయింది. మార్చి 2న కేజ్రీవాల్ ఈ సమస్యపై రెండుసార్లు ట్వీట్ చేశారు. ‘‘పార్టీలో జరుగుతున్న పరిణామాలతో నేను గాయపడ్డాను. ఢిల్లీ మాపై చూపినదానికి ఇది నమ్మక ద్రోహం. ఈ పెంటలో అడుగుపెట్టను. ఢిల్లీ పాలనపైనే కేంద్రీకరిస్తాను. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీయబోను’’. ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఎవరు ద్రోహం చేశారు? కేజ్రీవాల్ అభిప్రాయం ప్రకారం ఆప్ నిరంకుశ పార్టీగా మారకూడదంటూ ఎంతో హుం దాగా, నమ్రతతో డిమాండ్ చేసినవారే మరి. ఈ వ్యవహారంలోకి తాను దిగబోనని కేజ్రీవాల్ ప్రకటిస్తూనే యాదవ్, భూషణ్‌లపై దాడికి తన సహచరులను పురికొల్పారు. వీరిలో మాజీ జర్నలి స్టు అశుతోష్, ఆశిష్ ఖేతన్ కూడా ఉన్నారు. ఆశిష్ అయితే ట్వీటర్లో తాను వాడిన భాష పట్ల కేజ్రీవా ల్ క్షమాపణ చెప్పినట్లుగా తన యజమాని తరపున వకాల్తా పుచ్చుకుని మరీ వార్తను మోసుకొచ్చాడు. పరిణామాలు తీవ్రమవుతున్నప్పుడు కేజ్రీవాల్ మాత్రం పదిరోజుల విరామం పేరుతో ఢిల్లీకి దూర మయ్యారు. క్రమశిక్షణా రాహిత్యంపై నిర్ణయం తీసుకునే సమావేశంలో ఉండవలసిందిగా కేజ్రీవా ల్ను పార్టీ కోరింది కాని యాదవ్, భూషణ్‌ల పని పట్టే బాధ్యతను అతడు తన అనుంగు సహచరు లకు వదిలిపెట్టేశారు. నిజానికి ఈ జగడం నుంచి కేజ్రీవాల్ తనకుతానుగా దూరం జరిగారని వార్త వచ్చింది. అయితే, ఘటనల పరిణామ క్రమంలో అది నిజం కాదని తేలిపోయింది. యాదవ్, భూషణ్‌లకు జరిగిన అన్యాయంపై ఆప్ సభ్యుడొకరు తీవ్రంగా స్పందించిన ఉదం తాన్ని ప్రచురించిన ఒక బ్లాగ్ కథనం, ఆ సమావేశం లో ఏం జరిగిందో స్పష్టంగా బయటపెట్టింది. తా ము లేకుండానే అత్యున్నత నిర్ణాయక కమిటీని కొత్తగా ఏర్పర్చుకోవచ్చని, ఈ కమిటీని ఇతరులతో విస్తరించుకోవచ్చనీ అభిశంసనకు గురైన ద్వయం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఒక ప్రతిపాదన చేసిందట. నిర్ణాయక కమిటీని మార్పు లు లేకుండా అలాగే కొనసాగించవచ్చనీ, దాంట్లో సభ్యులుగా ఉంటున్నప్పటికీ కమిటీ కార్యక్రమాలకు తాము పూర్తిగా దూరమవుతామని ఆ ఇద్దరూ మరొక ప్రతిపాదన కూడా చేశారట. ఇవి రెండూ కూడా హేతుబద్ధమైన రాజీలే. అయితే కొనసాగుతున్న సభ కాస్త విరామం తీసుకుందనీ, ఆ సమయంలో కేజ్రీవాల్‌ను ఫోన్లో సంప్రదించారని వార్తలొచ్చాయి. దాని తర్వాతే ఓటింగ్ జరిగింది. ఆ ఇద్దరినీ స్వల్పతేడాతో కమిటీ నుంచి తొలగించారు. వారి గర్వభంగానికి ఇదే మార్గమని కేజ్రీవాల్ శిబిరం భారతీయ ైశైలిలో భావించింది కానీ వారు తప్పటడుగు వేశారు. ఎందుకంటే ఆ ఇద్దరూ ఈ మొత్తం ఘటనలో అత్యంత హుందాతో వ్యవహరించారు. తమ ఆరో పణలను మీడియా ముందుకు తీసుకెళ్లడానికి వారు తిరస్కరించారు. దీంతో అందరి సానుభూతి వారికే దక్కింది. అయితే కేజ్రీవాల్‌కు నిజమైన సమస్య మరొక చోట పొంచుకుని ఉంది. ఈ మొత్తం వ్యవహారం పార్టీకి అత్యంత విలు వైన సంపదను దెబ్బతీసింది. ఆ సంపద పార్టీ వలం టీర్లు. ఇతర రాజకీయ పార్టీల నుంచి ఈ పార్టీని వేరు చేస్తున్నది వీరే. వీరు ప్రధానంగా మధ్యతరగతి నుంచి వచ్చారు. తాము చూస్తున్న పరిణామాల పట్ల వీరు బాధపడ్డారు. వారి ఉద్వేగాలు బయట పడాలి. వారి ప్రతిస్పందనకు ట్వీటర్, ఫేస్బుక్ వంటివే సరైనవిగా ఉంటాయి. కేజ్రీవాల్ బృందం తమ తప్పిదాన్ని గుర్తించ గానే వారు చివరకు నోరు మూసుకున్నారు. అశు తోష్, ఖేతన్ ఈ వ్యవహారంలో కొనసాగించిన దూ కుడు ట్వీట్లను నిలిపివేశారు. దీనికి నిస్సందేహంగా కేజ్రీవాల్ ఆదేశాలే కారణమై ఉంటాయి. ముఖ్య మంత్రి ఇప్పటివరకూ మౌనంగానే ఉన్నారు కానీ ఈ వ్యవహారంలో తాను ప్రయోగించిన మాటలను తానే దిగమింగుకుని, ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే ఈ సమస్యతో వ్యవహరించక తప్పదు. ఆమ్ఆద్మీ పార్టీకి సంబంధించినంతవరకూ ఈ అహంకారపూరితమైన దాడితో నాకు ఎల్లప్పుడూ సమస్యే. ఇతర పార్టీలన్నీ అవినీతిమయమైనవనీ, సూత్రరహితమైనవనీ, తాము మాత్రమే పవిత్ర మైన వారిమనీ వారు నొక్కి చెప్పుకునేవారు. ఆ విశ్వసనీయతకు ఈ వారం గండిపడింది. పైగా తమ తొలి ఢిల్లీ ఎన్నికల నుంచి వారు ప్రచారం చేస్తూ వచ్చిన స్వరాజ్ భావన ప్రస్తుతం ఛిన్నాభిన్న మైపోతోంది. ఇరుగుపొరుగున ఉన్నవారికీ, భవం తుల్లో ఉన్నవారికీ కూడా అధికారం ప్రాప్తించాలనీ, ప్రభుత్వ డబ్బును ఎక్కడ, ఎలా ఖర్చుచేయాలనే విషయాన్ని సాధారణ పౌరులూ, ఓటర్లూ నిర్ణయిం చాలన్నదే స్వరాజ్య భావన. ఇప్పుడు ఆప్ స్వరా జ్యలో ‘స్వ’ (లేదా నేను) ఎవరు అన్నదే నాకు ఆశ్చ ర్యం కలిగిస్తోంది. ఎందుకంటే కేజ్రీవాల్, అతడి స్వయంపాలనే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. అందుకే యోగేంద్ర యాదవ్ గురించి కేజ్రీ వాల్ భయపడి ఉండాలి. ఆమ్ ఆద్మీ పార్టీలో అత్యం త ప్రముఖ వక్తల్లో ఒకరైన ఈయన కేజ్రీవాల్‌కి ఇబ్బంది కలిగించే పక్షంలో ఉన్నట్లు కనబడుతోంది. అత్యంత అవకాశవాది అయిన నా స్నేహితురాలు షాజియా ఇల్మీ చేసింది సరైందేనని ఈ ఘటన తేల్చి చెప్పింది. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరు తున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆప్ చాలా కోణాల్లో నిరంకుశంగా ఉండిందని, ఉంటోందనీ చెప్పారు. ఆరోజు ఆమె చెప్పిన ఈ మాటలను విని మేం ఒక్కసారిగా నవ్వేశాం. కానీ, ఆమె మాటలు తప్పని నేడు చెప్పగలిగేది ఎవరు? (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్:aakar.patel@icloud.com -
రెండు సహస్రాబ్దాల భారతీయ ప్రచురణలు..!
ప్రాచీన గ్రీకు, లాటిన్ భాషల్లోని వందలాది పుస్తకాల అనువాదాలతో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌కి చెందిన లోబ్ క్లాసికల్ లైబ్రరీ ప్రచురణలు జగత్ప్రసిద్ధి పొందాయి. అదే బాటలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమారుడు రోహన్ రెండు వేల ఏళ్ల కాలం పొడవునా ఆవిర్భవించిన భారతీయ ప్రాచీన రచనల ఆంగ్ల అనువాదాల ప్రచురణకు నడుంకట్టడం ప్రశంసనీయం. లోబ్ క్లాసికల్ లైబ్రరీ పేరిట హార్వర్డ్ యూనివ ర్సిటీ ప్రెస్ చాలాకాలం క్రితం ప్రచురించిన పుస్త క పరంపర నాకు ఎంతో ప్రీతిపాత్రమైన వాటిలో ఒకటి. ప్రాచీన గ్రీకు, లాటిన్ భాషకు చెందిన వందలాది పుస్తకాల అనువాదాలను వీరు ప్రచురించారు. ఈ పుస్తకాలు అనేక కారణాలతో విశిష్టమైనవి. మొదటిది వాటి పరిమాణం. మనిషి తన జేబులో పెట్టుకుని సులు వుగా మోసుకెళ్లేంత చిన్న పరిమాణంలో ఈ పుస్త కాలు ఇమిడిపోయేవి. ఈ పుస్తకాలు 6 3/8 అంగు ళాల పొడవు, 4 1/4 అంగుళాల వెడల్పుతో అతి చిన్న పరిమాణంలో ఉండేవి. నా వద్ద ఉన్న గ్రంథా లయంలోని దాదాపు 6 వేల పుస్తకాలలో ఇవి అత్యంత చిన్న పుస్తకాలు. వీటిలో ఏ పుస్తకం కూడా మందపాటిగా ఉండేవి కావు. ఎందుకంటే ఒకే పుస్త కాన్ని పలు సంపుటాలలో ప్రచురించేవారు. ఉదాహ రణకు, యురిపిడెస్ రచించిన మూడు నాటకాలు ఒకే సంపుటిగా ఉండవచ్చు కానీ పర్షియన్ యుద్ధ చరిత్ర నాలుగు భాగాలుగా ఉండేది. ఈ లోబ్ పుస్తకాలను నాగరిక యూరోపియ న్లు 19వ శతాబ్దం ద్వితీయార్థం వరకు చదివేవా రని భావిస్తున్నారు. ప్లేటో, అరిస్టాటిల్, హిప్పోక్రా ట్లు, ప్లూటార్చ్ రచనలు కానీ, హాన్నిబాల్ విజయా లను వర్ణించిన పొలీబియస్ రచనలు, అలెగ్జాండర్ విజయగాథలను నమోదు చేసిన అర్రియాన్ రచ నలు, ఇలియడ్, మహావిషాదాంత నాటకాలు ఈ గ్రంథాలయంలోని గ్రీక్ విభాగంలో ఉండేవి. ఇక లాటిన్ సంపుటాల్లో సిసెరో, సెనెకా, సీజర్ (ప్రాచీ న చరిత్రకు సంబంధించిన అత్యుత్తమ రచయి తలు), లూసియాన్ వంటి తదుపరి వ్యంగ్య రచయి తలు, లివీ, స్యుటోనియస్ వంటి చరిత్రకారులు రచించిన ఉత్తమ గ్రంథాలు కొలువుతీరి ఉండేవి. క్రీస్తు పూర్వం 8వ శతాబ్ది కాలంలో (రోమన్లు 1,300 సంవత్సరాల తర్వాతివారు) నివసించి ఉన్న హోమ ర్ వంటి జగద్విఖ్యాత రచయితల పుస్తకాల జాబితా లోబ్ క్లాసికల్ లైబ్రరీ లాటిన్ విభాగంలో ఉండేది. ఈ పుస్తకాలు ఇంత అసాధారణంగా ఉండటా నికి రెండో కారణం ఏదంటే, వీటిలోని ప్రతి ఎడమ పేజీలోనూ గ్రీకు, లాటిన్ మూల పాఠం ఉండేది. ఆధునిక ఇంగ్లిష్ అనువాదం కుడి పేజీలో ఉండేది. గ్రీకు, లాటిన్ రెండు భాషలను కొంతవరకు చదవగ లిగిన మాబోటి వారికి ఈ పుస్తకాలు నిజంగా వరం లాటివి. సుప్రసిద్ధ రచయిత్రి వర్జీనియా ఊల్ఫ్ ఈ పుస్తకాల సిరీస్ గురించి 1917లో ఇలా రాశారు. ‘‘ఒక పుటలో గ్రీకు, లాటిన్.. మరొకపుటలో ఇంగ్లిష్ పాఠంతో ఉండే లోబ్ లైబ్రరీ, స్వేచ్ఛకు నిజ మైన బహుమతిగా అడుగుపెట్టింది. ఔత్సాహిక పాఠకులు ఉన్నారనే సంగతిని ఈ లైబ్రరీ గుర్తిం చింది. కొంతమేరకు వీరికి గౌరవం లభించింది కూడా. సామాన్య అభిరుచి ఉన్నవారు కూడా ఈ లైబ్రరీ ప్రచురణలకు ఆకర్షితులయ్యేవారు. చాలావ రకు ఇవి అపార గౌరవాన్ని పొందేవి. గ్రీకు భాష లోని కాఠిన్యతను ఈ అనువాదాలు విస్తరించలేదు. దీంతో సాధారణ ఔత్సాహికులకు అవి చాలా వాస్త వంగానూ, గొప్పగానూ ఉండేవి. పైగా, లోబ్ ప్రచు రణల నుంచి ఎన్నడూ మనం స్వతంత్రంగా ఉండలే మన్న వాస్తవాన్ని గుర్తిస్తూ మన మనస్సులను సమా ధానపర్చుకోవాల్సిందే.’’ లోబ్ సంపుటాలు అన్నీ హార్డ్ బౌండ్తోటే ఉం డేవి. ఒక్కొక్కటి ఒక్కో రంగుతో విడిగా ఉండేవి. గ్రీకు పుస్తకాలు ఆకుపచ్చరంగుతో ఉండేవి. లాటిన్ పుస్తకాలు ఎర్రరంగుతో ఉండేవి. ఇక వీటికి విశిష్టత చేకూర్చిన మూడో అంశం ఏదంటే వీటిని దాతృత్వ సంస్థల నిధులతో ప్రచురించేవారు. లోబ్ క్లాసికల్ లైబ్రరీ లక్ష్యాన్ని వివరిస్తూ జేమ్స్ లోబ్ ‘వాటి లక్ష్యం, వాటి పరిధి గురించిన మాట’ ను తొలి సంపుటాల్లో పొందుపర్చారు. ‘‘సాహిత్యం లో నిజమైన భాగాలుగా తమకు తాముగా ప్రకా శించే అనువాదాల రూపంలో పురాతన గ్రీకు, రోమ్ సుప్రసిద్ధ రచయితల తాత్వికతను, చెణుకులను, భాషా సౌందర్యాన్ని, గ్రహణను మరింతగా అందు బాటులోకి తీసుకురావడం, గ్రీకు, లాటిన్ రచన లలోని పరిపూర్ణ ఆనందాన్ని అనుభూతి చెందుతూ చదివేలా చేయటం, సాధారణ పాఠకుడికి తలు పులు మూసివేసేటటువంటి, మూల గ్రంథంలోని ప్రతి పంక్తిని యథారూపంలోకి తీసుకువచ్చే పేలవ మైన ఆలోచనల నకలు లేదా రాతప్రతిని తలపించ నివ్వకపోవడం, మూల రచనకు సంబంధించిన ఉత్తమ సంక్లిష్ట పాఠాలను ఈ అనువాదాలతో పక్క పక్కనే ఉంచి పాఠకులకు అందించడం అనే లక్ష్యాన్ని నాకు నేనే విధించుకున్నాను,’’ లోబ్ అంతటి విలువైనదిగా రూపొందిన తొలి భారతీయ సిరీస్ విడుదల సందర్భంగా నేను దీన్ని రాస్తున్నాను. ఇది మూర్తి క్లాసికల్ లైబ్రరీ, దీన్ని కూ డా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్సే ప్రచురించింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నారా యణ మూర్తి కుమారుడు రోహన్ (తన చివరి పేరు ను వైవిధ్యంతో ఉచ్చరిస్తారు) అందించిన నిధితో ఏర్పడిన మూర్తి లైబ్రరీ, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలోని పాఠకులకు గడచిన రెండు సహస్రా బ్దాల అత్యుత్తమ భారతీయ సాహిత్య రచనలను అందించడం, ప్రపంచ సాహిత్య సాంస్కృతిక సంపదలో భాగంగా ఈ రచనలను నూతన తరానికి తిరిగి పరిచయం చేయడం అనే లక్ష్యసాధనతో ఏర్పాటైంది. సీనియర్ మూర్తి సహచర ఇన్ఫోసిస్ బిలియ నీర్లు నందన్ నీలేకని, విప్రో వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్‌జీలు తమ దాతృత్వ చర్యలకు సంబంధించి నంతవరకు భారతీయ బిలియనీర్లలోకెల్లా అత్యంత క్రియాశీలకంగా ఉంటున్నమాట వాస్తవం. అయితే తతిమ్మా భారతీయ సంపన్నులతో పోలిస్తే వీరు మినహాయింపుగా ఉండటమే విషాదకరం. భార తీయ మహా సంపన్నులలో చాలామంది ఆలయా లు, ఖరీదైన ఆసుపత్రుల నిర్మాణానికే తన విరాళా లను వెచ్చిస్తున్నారు. యువ మూర్తి (రోహన్) తన డబ్బును ఇలాంటి మహత్తర కార్యక్రమానికి వెచ్చిం చడం ప్రశంసనీయం. గత నెల విడుదలైన తొలి అయిదు సంపు టాలు ఇవీ: బులే షా రచించిన ‘సుఫీ గీతాలు’; అబుల్ ఫజల్ రచించిన ‘అక్బర్ చరిత్ర 1వ భాగం’; తొలి బౌద్ధ మహిళల కవితలు ‘తెరిగాథ’; తెలుగు ప్రామాణిక రచన ‘మను కథ’ (మనుచరిత్రము); అంధ రచయిత సూరదాస్ రచనగా చెబుతున్న ‘సుర్ సముద్రం’. రోహన్ మూర్తి తీసుకువస్తున్న ప్రచురణలు లోబ్ కంటే విస్తృతమైనవి, పెద్దవి. అయితే ఇవి కూడా ఎడమవైపు మూల రచన, కుడివైపున అను వాదం రూపంలోనే ఉంటున్నాయి. ఈ సంవత్సరం మరిన్ని రచనలు ప్రచురణకు నోచుకుంటున్నాయి. తొలి అయిదు రచనలలోని వైవిధ్యతను చూశాక, లోబ్ క్లాసిక్స్లాగా, మూర్తి క్లాసిక్స్ కూడా చరిత్రలో నిలిచిపోగలవని భావిస్తున్నాను. అవలోకనం: ఆకార్ పటేల్, (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) -
కాలపరీక్షకు నిలిచిన స్వచ్ఛ పరిమళం
అవలోకనం గాంధీ బోధనల్లో, ఆచరణలో అర్థం కానివి ఏవీ లేవు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీర్తి నేటికీ చెక్కు చెదరకుండా నిలిచే ఉంది. రాజకీయవేత్తకు ఉండవలసిన నిరాడంబరత విషయంలో తన వెనుక ఆయన ఎంత స్వచ్ఛమైన పరిమళాన్ని వదిలిపెట్టి వెళ్లారో కదా! ఈ నెలలో భారత దేశంలోకెల్లా అత్యంత సుప్రసిద్ధ వ్యక్తి హంతకుడి 67వ వర్ధంతిని మనం గుర్తుంచుకోబోతున్నాం. అయితే గాంధీ ని గాడ్సే ఆనాడు ఎందుకు చంపినట్లు? అన్నదే కీలకం. అరెస్టయ్యాక గాడ్సేని నాటి హిందుస్తాన్ టైమ్స్ పత్రిక సంపాదకుడు, గాంధీ కుమారుడు దేవదాస్ కలుసుకున్నారు. వీరిద్దరూ కలుసుకున్న ఘటనను నాథూరాం గాడ్సే సోదరుడు, గాంధీ హత్యానేరంలో సహ భాగస్వామి, సహ దోషి అయిన గోపాల్ గాడ్సే (జైలు పాలయ్యాడు కానీ ఉరికెక్కలేదు) రాసిన ‘గాంధీజీస్ మర్డర్ అండ్ ఆఫ్టర్’ పుస్తకంలో వర్ణించారు. తన తండ్రి హంతకుడిని చూసేందుకు గాంధీ తనయుడు పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఎలాంటి నమ్రతాలేని, రక్తపిపాసిని తాను కలుసుకుంటున్నట్లు దేవదాస్ భావించి ఉంటాడని గోపాల్ గాడ్సే ఆ పుస్తకంలో రాశాడు. అయితే అత ను ఊహించినదానికీ, నాథూరాం మృదు సంభాష ణలు, ప్రశాంత చిత్తానికీ, ఏమాత్రం పోలిక లేకుం డాపోయిందని గోపాల్ పేర్కొన్నాడు. వారిద్దరి కలయిక ఇలాగే జరిగిందా అనేది మనకయితే తెలీదు. కానీ, గోపాల్ గాడ్సే ప్రకారం ‘నేను నాథూరాం వినాయక్ గాడ్సేని, హిందూ రాష్ట్ర దినపత్రిక సంపాదకుడి’ని అని నాథూరాం తనను కలవడానికి వచ్చిన దేవదాస్ గాంధీకి చెప్పాడట. ‘ఈ రోజు మీ తండ్రిని కోల్పోయారు. ఆ విషాదానికి నేనే కారణం. మీకూ మీ కుటుంబానికి కలిగిన ఈ వియోగానికి నేను చాలా చింతిస్తున్నా. దయచేసి నన్ను నమ్మండి. మీ పట్ల ఎలాంటి వ్యక్తిగత ద్వేషం తోనో, కక్షతోనో లేక దురుద్దేశంతోనో నేనీ కార్యాన్ని తలపెట్టలేదు’ అని నాథూరాం అన్నాడు. అలాంట ప్పుడు ఇలా ఎందుకు చేశావని దేవదాస్ అడిగారు. కేవలం రాజకీయ అంశమే దీనికి కారణమని నాథూరాం చెప్పాడు. తన చర్యను వివరించడానికి కాస్త సమయం కావాలని నాథూరాం కోరాడు. కానీ పోలీసులు అనుమతించలేదు. న్యాయస్థానంలో కూడా నాథూరాం తన చర్య గురించి ఒక ప్రకట నలో వివరించాడు. అయితే కోర్టు దాన్ని నిషేధిం చింది. నాథూరాం వీలునామాను తర్వాత గోపాల్ గాడ్సే తన పుస్తకానికి అనుబంధంగా పునర్ముద్రిం చాడు. ఆ వీలునామాలోని చివరి వాక్యం ఇలా సాగుతుంది. ‘న్యాయస్థానంలో నేను చేసిన ప్రకట నపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తి వేసినట్లయితే, దాన్ని ప్రచురించడానికి నీకు అధికారమి స్తున్నాను.’ ఇంతకూ ఆ ప్రకటనలో ఏముంది? దాంట్లో గాడ్సే కింది అంశాలను పొందుపర్చాడు. గాంధీ అంటే తనకెంతో గౌరవమని చెప్పుకున్నాడు. ‘‘అన్నిటికంటే మించి వీర సావర్కర్, గాంధీ రాసి న, మాట్లాడిన ప్రతిదాన్నీ నేను క్షుణ్ణంగా చది వాను. నాకు తెలిసినంతవరకు.. గత ముప్పై సంవ త్సరాల కాలంలో ఏ ఇతర అంశం కంటే, భారతీ యుల ఆలోచనలను, కార్యాచరణను మలచడంలో ఈ ఇద్దరు సిద్ధాంతవేత్తలదే అధికపాత్ర. ముప్పై రెండు సంవత్సరాలుగా గాంధీపై పేరుకుపోతూ వస్తున్న ఆగ్రహం, ప్రకోపం, ఇటీవల ఆయన చేప ట్టిన ముస్లిం అనుకూల నిరాహారదీక్షతో చరమ స్థాయికి చేరుకుంది. దీంతోటే గాంధీ అనే వ్యక్తి ఉనికిని తక్షణమే ముగించాల్సిన అవసరముందని నేను భావించాను. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడి భారతీయుల హక్కులు, వారి శ్రేయస్సును పరిరక్షించడానికి గాంధీ చాలా బాగా పనిచేశారు. కానీ, అక్కడి నుంచి భారత్‌కు తిరిగొచ్చినప్పుడు ఆయన ఒక స్వీయాత్మక మనస్తత్వాన్ని పెంపొం దించుకున్నారు. దీంట్లోంచే ఏది తప్పు, ఏది సరై నది అని తేల్చడంలో తాను మాత్రమే అంతిమ న్యాయమూర్తి అనే అభిప్రాయాన్ని పెంచుకున్నారు. దేశం తన నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లయితే, తన లోపరాహిత్యాన్ని, అమోఘమత్వాన్ని యావ ద్దేశం ఆమోదించవలసి ఉంటుంది. అలా జరగనట్ల యితే కాంగ్రెస్‌కు దూరంగా జరిగి తన సొంత మార్గాన్ని కొనసాగిస్తారు.’’ ఈ ఆలోచనే గాంధీకి వ్యతిరేకంగా తీవ్ర చర్య కు పురికొల్పింది. ఎందుకంటే నాథూరాం దృష్టిలో గాంధీ ఆలోచనలకు వ్యతిరేక వైఖరి అవలంబించా లంటే అడ్డదారులు పనికిరావు. కాంగ్రెస్ తన ఇచ్ఛను గాంధీ పాదాక్రాంతం చేయాలి. ఆయన విపరీత మనస్తత్వానికి, చాపల్యానికి, అధిభౌతికత త్వానికి, ఆదిమ దార్శనికతకు తాళం వాయించడా నికే అది కట్టుబడాలి. లేదా గాంధీ లేకుండానే కాంగ్రెస్ కొనసాగాలి. నాథూరాం మరొక ఆరోపణ ఏమంటే, గాంధీ పాకిస్తాన్‌ను సృష్టించారు. ‘గాంధీ సమ్మతితో కాం గ్రెస్ అగ్రనేతలు దేశాన్ని విభజించి, చీల్చి వేస్తున్న పుడు, (దేశం పట్ల మేం అప్పటికే ఒక ఆరాధనా భావాన్ని పెంచుకుని ఉన్నాం) నా మనస్సు ఆగ్ర హంతో దహించుకుపోయింది. నాకు వ్యక్తిగతంగా ఏ ఒక్కరిమీదా దురుద్దేశం లేదు కానీ ముస్లింల పట్ల అన్యాయంగా సానుకూల విధానంతో వ్యవహరిస్తు న్న ప్రస్తుత ప్రభుత్వం పట్ల నా కెలాంటి గౌరవ భావం లేదని చెబుతున్నాను. అదే సమయంలో ఈ ప్రభుత్వ విధానం మొత్తంగా గాంధీ ఉనికితోటే సాధ్యమవుతోందని నేను స్పష్టంగా గ్రహించాను’. అయితే గాడ్సే వాదనలో ఒక సమస్య ఉంది. అదేమిటంటే, గాంధీ విపరీత మనస్తత్వం కలవా రని గాడ్సే ఆలోచించడమే. గాంధీ పట్ల యావత్ ప్రపంచం దీనికి వ్యతిరేకంగానే ఆలోచిస్తోంది. పైగా గాడ్సే ప్రకారం గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఒక నియం త. తన దృక్పథాన్ని కాంగ్రెస్ ఆచరించేలా చేసేం దుకోసం గాంధీ నిరాహార దీక్ష చేపట్టారని కూడా గాడ్సే అన్నాడు. ఒక నియంతకు ఆదేశించడం తప్ప మరే చర్యకైనా పూనుకోవలసిన అవసరం ఏముం ది? గాంధీ చివరి నిరాహారదీక్షను (పాకిస్తాన్‌కు నిధులు విడుదల చేయకూడదన్న భారత్ నిర్ణయా నికి వ్యతిరేకంగా) నాథూరాం వ్యతిరేకిస్తున్నాడు. అయితే భారత్ గతంలో ఈ అంశంలో చేసిన వాగ్దానం నుంచి వెనక్కి పోయినప్పుడు మాత్రమే ఇలా జరిగింది. వాస్తవానికి ఈ వ్యవహారంలో భారత్ హుందాతో, సరైన దారిలో వెళ్లేటట్టు చేసింది గాంధీ మాత్రమే. నాథూరాం చెప్పిందాంట్లో ఏ కొంచెం కూడా తర్కబద్ధంగా లేదు. తన చర్యకు ఏది కారణం అనే అంశంపై గతంలో తను చేసిన ప్రకటనకు ఇది భిన్నంగా ఉంది. గాంధీ లౌకిక భావజాలం పట్ల నాథూరాం ద్వేషం పెంచుకున్నాడు. ఈ లౌకిక భావ జాలమే నిజమైన హిందూ స్ఫూర్తి. ఆరెస్సెస్ ప్రభా వంతో సంపూర్ణంగా కలుషితమైన ఆలోచనతో అతడు ఈ స్ఫూర్తినే అంతిమంగా వ్యతిరేకించే స్థాయికి వెళ్లిపోయాడు. వాస్తవమేమిటంటే గాంధీ బోధనల్లో కాని, ఆయన ఆచరణలో కాని అర్థం కాని వి, ఆక్షేపణీయ మైనవి ఏవీలేవు. అందుకే రాజకీయ వేత్తగా గాంధీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీర్తి దశా బ్దాలు గడిచినా చెక్కు చెదరకుండా నిలిచే ఉంది. సుప్రసిద్ధ రచయిత జార్జి ఆర్వెల్ 1949లో గాంధీ గురించి రాస్తూ ఇలా అన్నారు. ‘నాలాగే గాం ధీ పట్ల ఎవరైనా ఒక సౌందర్యాత్మక అప్రీతిని, అయి ష్టతను కలిగి ఉండవచ్చు. ఆయనకు ఆపాదించిన రుషిత్వ భావనను ఎవరైనా తిరస్కరించవచ్చు (గాంధీ ఎన్నడూ ఏ రకంగానూ తనను రుషిలా భావించుకోలేదు), రుషిత్వాన్ని ఒక ఆదర్శభావ నగా ఎవరైనా తోసిపుచ్చి, గాంధీ ప్రాథమిక లక్ష్యా లు మానవ వ్యతిరేకమని, ప్రతీఘాతుకతత్వంతో కూడినవని ప్రకటించవచ్చు. కాని రాజకీయవేత్తకు ఉండవలసిన నిరాడంబరత విషయంలో, మన కాలపు ఇతర ప్రధాన రాజకీయ ప్రముఖులతో పోల్చి చూసినప్పుడు, తన వెనుక ఆయన ఎంత స్వచ్ఛమైన పరిమళాన్ని వదిలిపెట్టి వెళ్లారో కదా!’ నాథూరాం ఆరోపణలు కాల పరీక్షకు నిలబ డని సమయంలో ఈ 2015లో కూడా ఇదెంత వాస్త వమో కదా! (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) Aakar.patel@icloud.com) -
ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?
ఇన్ఫోసిస్, విప్రో వంటి సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగులతో ముడిపడిన ఘటనలను ఆసక్తికరంగా, పతాక వార్తలుగా చూపించే మన మీడియా అదే సమయంలో రిలయెన్స్ ఉద్యోగుల విషయాలకు అంత ప్రాధాన్యత ఇవ్వదు. కారణం రిలయెన్స్‌కు ఉన్న ప్రకటనలిచ్చే శక్తి. అంగబలం, అర్థబలం కూడా. ఈ వారం పత్రికలలో వచ్చిన రెండు ప్రధాన వార్తలు నన్ను ఆశ్చర్యం లో ముంచెత్తాయి. వీటి లో మొదటిది భారతీ యజనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఫెరోజ్ వరుణ్ గాంధీ రాసిన ఒక వ్యాసం. ‘ఒక అనిశ్చితమైన, మత్స్య న్యాయాన్ని పోలిన జీవితం’ గురించి వరుణ్ ఇక్కడ వర్ణించారు. భారతదేశంలో వ్యవసాయ పరిస్థితిని వర్ణిస్తూ ఆయన ఈ మాట లన్నారు. అంటే పెద్ద చేప చిన్న చేపను మింగే తర హా జీవితం భారతీయ రైతులదని అర్థం. నామ మాత్రంగా మిగిలిపోయిన భారతీయ రైతులు శతా బ్దాలుగా ఘోరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతు న్నారని ఆయన వ్యాసాన్ని ముగించారు. పైగా భారతీయ రైతులలో చాలామంది అనిశ్చితమైన మత్స్యన్యాయాన్ని పోలి ఉండే ‘నిరుపేద, మురికి, పశుప్రాయమైన, అల్ప జీవితం బారిన పడి నలుగు తున్నారన్నది ఆయన వ్యాసం ముగింపు. ఇక వరుణ్ గాంధీ పేర్కొన్న రెండో ప్రధాన వార్త ఏదంటే.. ‘కోట్లకు పడగలెత్తిన ముంబై మహిళ దిక్కులేని మరణం, ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన ఉన్నత న్యాయస్థానం’. ముంబై నగరంలోని వెర్సో వాలోని యారి రోడ్డులో రూ. 30 కోట్ల విలువైన ఆస్తి ఉన్న 68 ఏళ్ల ముంబై మహిళ నిర్లక్ష్యం కారణంగా మరణించిన తీరును విని ఆగ్రహించిన హైకోర్టు, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిశంసించిందని ఈ వార్త పేర్కొంది. నగరంలోని ఈ శివారు ప్రాంతంలో చాలా మంది సంపన్నులు నివసిస్తుంటారు. ఆమె కుటుంబం కానీ, ప్రభుత్వం కానీ.. సీని యర్ పౌరుల సంక్షేమానికి, వైద్య సహాయానికి, వృద్ధుల శరణాలయాలకు బాధ్యత వహించే చట్టం ద్వారా ఆ వృద్ధురాలి బాగోగులను ఏమాత్రం పట్టిం చుకోకపోవడం దురదృష్టకరమని న్యాయస్థానం పేర్కొంది. నగరంలోని ఇతర సీనియర్ పౌరులు ఇలాంటి దుస్థితిని ఎదుర్కోకూడదని కోర్టు అభిప్రా యపడింది. పైగా, తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007 పరిధి, పరిమితు లను తాను సమీక్షించాలనుకుంటున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఆ వృద్ధురాలి తరఫున వాదించిన న్యాయ వాది... గత ఐదేళ్లుగా ఆమె అలాంటి దీనస్థితిలోనే గడిపిందని ఇతరులకు ఆమె దుస్థితి ఎదురు కాకూ డదని కోర్టుముందు పేర్కొన్నారు. సీనియర్ పౌరు లపట్ల నిర్లక్ష్యం వహించి దురదృష్ట పరిణామాలకు కారణభూతులైన వారు అలాంటి వారి ఆస్తులకు వారసులు కానివిధంగా ఒక చట్టాన్ని తీసుకురా వాలని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే సహజ కారణాలతోనే ఆమె మరణించినట్లు ఆ వృద్ధురాలి శవ పంచనామా నివేదిక తెలిపిందని కోర్టు తెలిపింది. పతాక వార్త ప్రకటిస్తున్నట్లు, ఈ కథనంలో అంతకంటే తీవ్ర నేరంగా కనిపించిన అంశం ఏదం టే సంపన్న మహిళ అలాంటి దుస్థితిని అనుభవిం చిందన్న వాస్తవమే. వరుణ్ గాంధీ వ్యాఖ్య స్పష్టం చేసినట్లుగా బత కడానికి కొన్ని కోట్లమంది పోరాటం సల్పుతున్న దేశంలో సంపన్నురాలైన వ్యక్తిపై మీడియా దృష్టి పెడుతోంది. కొంతవరకు ఇది ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రముఖ వ్యక్తుల జీవితాలపై వార్తలు కవర్ చేయడం సాధారణంగా జరిగేదేనని ప్రపంచ మీడియా ఆమోదించింది. సంపన్నుల జీవితాలు మీడియా కవరేజ్ దృష్టిలో అత్యంత విలువైనవే మరి. అయితే భారత్‌లో దీన్ని సంప న్నులకే కాకుండా, మధ్యతరగతికి కూడా విస్తరిం చారు. అదే సమయంలో చాలా తరచుగా విశాల ప్రజారాసుల జీవితాలను మీడియా పూర్తిగా మిన హాయిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రమాదాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. కానీ తరచుగా బీఎండబ్ల్యు ప్రమాదం అనే అంశాన్ని ప్రధాన వా ర్తగా ఎంచుకుంటుంటారు. ఎందుకంటే ఒక ఫ్యాన్సీ కారు మరింత ప్రాధాన్యమైన వార్తగా అర్హతను పొం దుతుంది. మన వార్తా పత్రికలతో బాగా పరిచ యమున్న వారిని బాగా ఇబ్బందిపెట్టే, కలవరపర్చే అంశాల్లో ఇదొకటి. ఈ అంశానికి సంబంధించి మరో ఉదాహర ణను తీసుకుందాం. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకు, ప్రత్యేకించి సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన ఉద్యోగిని తీసుకుందాం. సాఫ్ట్వేర్ సంస్థలు పెద్దగా ప్రకటనలు ఇవ్వవన్నది తెలిసిందే. బెంగళూరుకు కేంద్రంగా పనిచేసే ఇన్ఫోసిస్‌కు లక్ష మంది ఉద్యోగు లున్నారు. ఈ సంస్థ ఉద్యోగి ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా, అత్యాచారానికి, హింసకు గురైనా, దొంగతనం బారిన పడినా సాధారణ ప్రజానీకం కూడా అలాంటి స్థితిని ఎదుర్కొనడంలో భాగంగానే వీటిని చూడాలి. అంతకుమించిన ప్రాధాన్యత ఇలాంటి ఘటనలకు ఉండదు. కాని మన మీడియా మాత్రం అనివార్యంగా ఇలాంటి సందర్భాల్లో ఆ సంస్థ పేరును తాటికా యంత అక్షరాలతో ప్రధాన వార్తగా తీసుకొస్తుంది. పైగా ఇంటర్నెట్లో ‘ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య’, ‘విప్రో ఉద్యోగి ఆత్మహత్య’ అనే పదాలతో ఇంటర్నె ట్లో సెర్చ్ కూడా చేస్తుండటం చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం పొందటం అనేది ఆసక్తి గొలుపుతుంటుంది కాబట్టి వార్త అలాగే రూపొందుతుందని మీడియా వాదించ వచ్చు. కానీ ‘రిలయెన్స్ ఉద్యోగి ఆత్మహత్య’ అనే పదాన్ని సెర్చ్ చేయండి మరి. ఈ పదానికి ఇంటర్నె ట్లో లభించే ప్రాధాన్యత పూర్తి విరుద్ధంగా ఉం టుంది. రిలయెన్స్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకో కపోవచ్చు లేదా ఒకవేళ వారు నిజంగా ఆత్మహత్య చేసుకున్నా, మీడియా ఆ కంపెనీకి సంబంధించిన వార్తలను ప్రచురించడానికి వెనుకడుగు వేస్తుంది. అదే సమయంలో ఇన్ఫోసిస్, విప్రో సంస్థల విష యానికి వస్తే మీడియా ఇలాంటి సందర్భాల్లో చాలా ఆసక్తిని ప్రదర్శిస్తుంది. ఎందుకు? ఎందుకంటే సాఫ్ట్వేర్ సంస్థల కంటే రిలయెన్స్‌కు అంగబలం, అర్థబలం మెండు. అంతేకాకుండా అది వాటికంటే పెద్ద ప్రకటనదారు కూడా. దీంతో పోలిస్తే భారతీయ పత్రికలకు, టీవీ స్టేషన్లకు ప్రకటనలు ఇస్తే సాఫ్ట్వేర్ సంస్థలకు ఒరిగే దేమీ ఉండదు. రిలయెన్స్ కంపెనీకి దాని ఉద్యోగు లకు సంబంధించిన విషయాలను కూడా మీడియా నివేదించాలని నేను ఇక్కడ చెప్పడం లేదు. కాని అదే సమయంలో సాఫ్ట్వేర్ సంస్థల పట్ల మీడియా తప్పు చేస్తున్నదని మాత్రమే చెబుతున్నాను. ప్రాధా న్యతలను బట్టి వార్తలను నివేదించే సమస్యను మరో కవరేజ్‌లో కూడా మనం చూడవచ్చు. భార త్లో ఏటా 25 వేల అత్యాచారాలు జరుగుతున్నా యి. (వాస్తవానికి పశ్చిమ దేశాలతో సహా ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే), కానీ మీడి యా మాత్రం ఈ అత్యాచారాల్లో అత్యంత ప్రాధా న్యత కలిగి ఉన్నారని తను భావించే బాధితులనే వార్తల కోసం ఎంచుకుంటుంది. ఢిల్లీ నగరంలో ట్యాక్సీ సర్వీసులో అనేకమంది అమ్మాయిలు అత్యా చారాలకు గురవుతున్న వాస్తవం కట్టెదుట కనిపిస్తు న్నప్పటికీ ఉబెర్ క్యాబ్‌లో ఎగువ తరగతి మహిళ అత్యాచారానికి గురైన కథనం విపరీత ప్రాధాన్య తను పొందుతుంది. స్పష్టంగానే భారతీయ మీడియా మధ్యతరగతి భారతీయుల మనోభావాలకు నిత్యం విలువనిస్తోం ది. వీరి దృష్టిలో పేదలు అంతగా పట్టించుకోదగి నంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే పేదల జీవి తాలే అంత ప్రాధాన్యమైనట్టివి కాదు. (థామస్ హాబ్స్ మాటల్లో చెప్పాలంటే అవి ‘మురికి, పశు ప్రాయమైన, అల్ప’ జీవితాలు మరి). (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) - ఆకార్ పటేల్ Aakar.patel@icloud.com) -
పరుష వ్యాఖ్యల వెనక అసలు ఆంతర్యం?!
విశ్లేషణ ఈ వారం ఒక కేంద్ర మంత్రి భారతీయులను రామ్జాదాలు (హిందువులని అర్థం) లేక హరా మ్జాదాలు (అక్రమ సంతానం) అంటూ వేరు పర్చడాన్ని మనం చూశాం. భారతీయ జనతా పార్టీలో చేరిన పలువురు నిరక్షర లేదా అర్థ నిరక్షర సాధ్విలలో ఈమె కూడా ఒకరు. మీడి యా విరుచుకుపడ్డాక మంత్రి సాధ్వి నిరంజన ముక్తసరిగా ఒక పశ్చాత్తాప ప్రకటన చేశారు. ఇలాంటి అసభ్య భాషను హిందుత్వ పార్టీలు తమ పునాదిని బలపర్చు కోవడం కోసం తరచుగా ఉపయోగించేవి. మీడియాలో రచ్చ జరిగాక ప్రతిపక్షం దాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చింది. కేంద్రమంత్రి అరు ణ్ జైట్లీ, సాధ్వి నిరంజన ప్రకటనను ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం వెంటనే ఈ అంశంపై స్పందించలేదు. అలాంటి వ్యాఖ్య ల వెనుక ఉన్న సంకేతం ప్రబలమైనదని ఆయనకు తెలుసు. ఆ తర్వాత ప్రధాని దీనిపై ఒక వార్తను లోపాయికారిగా లీక్ చేశా రు. నేతలు తమ మాటల విషయంలో జాగ్రత్త పడాలని మోదీ అంతర్గ త సమావేశంలో హెచ్చరించారన్నదే ఆ వార్త. అయితే ఈ హెచ్చరికలో ఖండనను పోలిన స్పష్టత లేకపోవడం గమనార్హం. తన మంత్రులు, ఎంపీలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోనంటూ మోదీ గట్టి సందే శాన్ని ఇవ్వాలనుకుని ఉంటే, మంత్రివర్గం నుంచి నిరంజనను తొలగిం చడమే సరైన చర్య అయి ఉండేది. పాత్రధారిని నేరుగా విమర్శించ కుండా ఆమె చర్యలను మాత్రమే విమర్శించడం వల్ల ఏమీ ఒరగదు. వాస్తవానికి మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల దాడులను దారి మళ్లించడానికి క్షమాపణను ప్రతిపాదించినట్లు కనబ డుతోంది. ప్రతిపక్షం మోదీ చేసిన ఈ తప్పును పసిగట్టి దాన్ని అనుకూ లంగా మార్చుకోవడానికి మరింత ఒత్తిడి చేసింది. అప్పుడు మాత్రమే మోదీ పార్లమెంటుకు వచ్చి ఎవరైనా సరే అలాంటి వ్యాఖ్యలను చేయ కూడదంటూ వివరణ ఇచ్చారు. అయితే హిందుత్వ తరపున వ్యవహరి స్తున్నవారు అలాంటి మాటలు ఎందుకు వాడుతున్నారన్నదే ప్రశ్న. బీజేపీ అనామక అభ్యర్థి గిరిరాజ్ సింగ్ ఎన్నికల ప్రచార కార్యక్ర మంలో ఒక వ్యాఖ్య చేయడం ద్వారా ఉన్నట్లుండి వెలుగులోకి వచ్చారు. ఆయన మాటల ప్రకారం ‘నరేంద్రమోదీని అడ్డుకోవాలని భావిస్తున్న వారు పాకిస్తాన్ మద్దతుకోసం చూస్తున్నారు. రాబోయే రోజుల్లో, ఇలాం టి వ్యక్తులకు భారత్‌లో, జార్ఖండ్‌లో చోటు ఉండదు. ఎందుకంటే పాకిస్తానే వారికి సరైన చోటు’. అదేసమయంలో వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా గుజరాత్లో ఒక సభలో మాట్లాడిన టేప్ లీక్ అయింది. దావూది బోహ్రా అనే వ్యక్తి ఆస్తి కొనుగోలు ఘటనలో పొరుగున నివసిస్తున్న ఒక హిందువు తొగాడియా సలహాను అర్థించారు. భారత్ లోని సంపన్న కమ్యూనిటీల్లో బోహ్రా ఒకటి. వీరు సున్నీ ముస్లింలతో కలిసి జీవించలేరు. హిందువులు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో నివసించడానికే బోహ్రాలు మొగ్గు చూపుతారు. కాని తొగాడియాను సల హా కోరిన హిందూ వ్యక్తి, ఈ బోహ్రా కుటుంబం తమ పక్కన నివసిం చడానికి ఇష్టపడలేదు. దాంతో బోహ్రా కుటుంబంలో చీలికలు, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి వారు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తి నుంచి వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేయాలని తొగాడియా సల హా ఇచ్చారు. ఇది వీడియోలో కూడా రికార్డయింది. ఈ రెండు ఘటనలు ఒకే సమయంలో జరిగాయి. దాంతో తమ కేంపెయిన్‌ను దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారంటూ మోదీ ఒక సాధారణ ట్వీట్‌తో సరిపెట్టేశారు. మోదీ తర్వాత గిరిరాజ్‌ను మంత్రిని చేసేశారు. గుజరాతీ మాట్లాడలేని వారు తొగాడియా మాటలను తప్పు గా అర్థం చేసుకుని ఉండవచ్చని ఆరెస్సెస్ కూడా బొంకింది. (కాని నేను ఆ పూర్తి పాఠాన్ని లైవ్‌మింట్.కామ్ నుంచి యథాతథంగా అనువ దించాను.) తొగాడియా వీహెచ్‌పీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీనికి కారణం ఉంది. ఒకవైపు ముక్తసరిగా అర్థ ఖండనలు చేస్తున్న ప్పటికీ మరోవైపు మోదీ, ఆరెస్సెస్ ఇలాంటి అభ్యంతరకర ప్రకట నలను ఆమోదిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను ప్రోత్స హిస్తున్నారు. ఎందుకంటే భారత్‌లోని ఒక సువిశాల ప్రాంతం ఇలాంటి వ్యక్తులపట్ల అనుకూలంగా స్పందిస్తోంది మరి. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)