చట్టాల్లో మార్పుతేవడమే సంస్కరణ లక్ష్యమా?
అవలోకనం
చరిత్రలో ఎలాంటి మినహాయింపులూ లేకుండా విజయవంతమైన దేశాలన్నింటికీ రెండు పరిస్థితులు తోడయ్యాయని చెప్పాలి. మొదటిది ప్రభుత్వ జోక్యం. రెండోది నిత్య చలనశీలత. ప్రభుత్వం అనేది పెట్టుబడిదారీ, సోషలిస్టు, నియంతృత్వం లేదా ప్రజాస్వామ్యం.. ఎలాంటి స్వభావంతో ఉన్నదైనా కావచ్చు కాని అది కచ్చితంగా అర్థికరంగంలోని అన్ని అంశాల్లోనూ సరైనవిధంగా జోక్యం చేసుకోవాలి. గుజరాత్‌తో సహా భారత్‌లో ప్రభుత్వ వ్యవస్థ ఇక్కడే అనునిత్యం విఫలమౌతూ వస్తోంది.
అగ్రరాజ్యం కావాలంటే భారత్‌కు అవసరమైన ది ఏమిటి? మొట్టమొదటిగా అది మహా శక్తి కావాలి. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపగల సామర్థ్యంతో కూడిన సార్వభౌమాధికార ప్రభుత్వంగా భారత్, అంతర్జాతీయ సంబంధాల్లో తన్ను తాను నిర్వచించుకోవాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులైన యునెటైడ్ స్టేట్స్, చైనా, ఫ్రాన్స్, రష్యా, యునెటైడ్ కింగ్‌డమ్ లనే మనం మహాశక్తివంతమైన దేశాలుగా లెక్కించవచ్చు.
భద్రతామండలిలో వీటికున్న వీటో అధికారం వల్లేకాక, వాటి సంపద, సైనిక శక్తి వల్ల కూడా ఈ ఐదు దేశాలూ ప్రపంచ ఘటనలపై ప్రభావం చూపగలవు. వీటిలోఫ్రాన్స్, యూకే వంటి కొన్ని దేశాల్లో సైనిక శక్తిని ఉద్దేశ పూర్వకంగానే తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధం వచ్చే అవకాశం తక్కువ.
ఈ అయిదు దేశాల తర్వాత సైనిక పరంగా కాకున్నా, ఆర్థికపరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే రెండు దేశాలున్నాయి. అవి జర్మనీ, జపాన్. వీటి తర్వాత ఏమంత ప్రభావం చూపనప్పటికీ సంపద్వంతమైన చిన్న దేశాలు కొన్ని ఉన్నాయి. స్పెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్, తైవాన్, ఇటలీ, చిలీ, ఆస్ట్రేలియా, నార్డిక్ దేశాలు (డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఐర్లండ్, నార్వే, స్వీడెన్) ఈ జాబితాలో ఉన్నాయి.
భారత్‌ను ఈ విభాగంలోని దేశాల్లో చేర్చవచ్చు. అధిక జనాభా క లిగిన దేశాలు కొన్ని సంపద్వంతమైనవి కావు. పైగా వనరుల లేమి కారణంగా ఇవి సైనికంగా శక్తివంతమైనవి కావు. ఇలాంటి దేశాల్లో దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, బ్రెజిల్, నైజీరియా. నేను భారత్‌ను నైజీరియాతో పోల్చడం పాఠకులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కాని ఈ రెండు దేశాలూ ఒకే విధమైన తలసరి ఆదాయాన్ని కలిగివున్నాయి. అధిక జనాభాయే భారత్‌కు దాని వాస్తవ స్థితి కంటే మరింత యుక్తమైన దేశంగా గుర్తింపునిస్తోందనిపిస్తుంది.
దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే, భారత వాస్తవ స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీ పీ డాలర్ల విలువతో పోలిస్తే ఇటలీ జీడీపీ కంటే తక్కువ. కాని ఇట లీ జనాభా మాత్రం 60 మిలియన్లు (లేదా ఆరు కోట్లు) మాత్రమే. అంటే భారత జనాభాతో పోలిస్తే ఇటలీ జనాభా 20 రెట్లు తక్కువ, అంటే ఇటలీతో పోలిస్తే వ్యక్తిగతంగా భారత్ ఉత్పాదకత 5 శాతం కంటే తక్కువ మాత్రమే. ఇది కాస్త మంద్రస్థాయిలోనే కావచ్చు, పరిస్థితిని మనకు అనుకూలంగా మారుస్తోంది. కాబట్టి భారత్‌ను మహాశక్తిని చేయడానికి మనం చేయవలసింది ఏమిటి? దీంట్లో అతి చిన్న అంశం నా దృష్టిలో ఏమిటంటే ప్రభుత్వం చేయవలసిన పనే. ఆర్థిక వార్తాపత్రికలను మనం చూసినట్లయితే, వాటి ప్రధానాంశం సంస్కరణలే. పైగా భారత్ విజయబాట పట్టాలంటే ప్రభుత్వం సంస్కరణలను తీసుకు రావాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు కూడా. సంస్కరణలు సాధారణంగా క్రమబద్ధీకరణను ఎత్తివేసి వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. వాస్తవం ఏమిటంటే అనేక దేశాలు సంస్కరణలు మొదలుపెట్టేశాయి కాని అవేవీ మహా శక్తివంతమైన దేశాలు కాలేదు.
ఉదాహరణకు సోవియట్ యూనియన్ ఒక నియంత్రిత ఆర్థిక వ్యవస్థ. అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుందని అర్థం. కానీ ఆ దేశంలో ఏ సంస్కరణలూ ఉండేవి కావు. అయినప్పటికీ 1947 నుంచి 1975 వరకు సోవియట్లు ప్రతి సంవత్సరం డబుల్ డిజిట్ వృద్ధిని సాధిస్తూ వచ్చారు. అది కూడా భారత్ కంటే అత్యధిక తలసరి ఆదాయంతో వారు ఆ వృద్ధిని సాధించారు. అలాగే క్యూబా సైతం ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణను రద్దు చేయలేదు కానీ ప్రపంచం మొత్తం మీద అత్యధిక మానవాభివృద్ధి సూచికలను (ఆరోగ్యం, విద్యా రంగాల్లో) నమోదు చేసింది. కాబట్టి ఆర్థికాభివృద్ధికి అవసరమైనది సంస్కరణలు మాత్రమే కాదని స్పష్టమవుతోంది. చరిత్రలో ఎలాంటి మినహాయింపులూ లేకుండా విజయ వంతమైన దేశాలన్నింటికీ రెండు పరిస్థితులు తోడయ్యాయని చెప్పాలి. మొదటిది ప్రభుత్వ జోక్యం. కాఠిన్యతను, తీవ్రతను తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రభుత్వ సామర్థ్యంగా దీన్ని నేను నిర్వచిస్తాను. కాఠిన్యతను గుత్తకు తీసుకోవడం ఎలాగంటే, పౌరులందరూ స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేలా చేయడం, న్యాయాన్ని, సేవలను సమర్థవంతంగా బదలాయించడం. ప్రభుత్వం పెట్టుబడి దారీ, సోషలిస్టు, నియంతృత్వం లేదా ప్రజాస్వామ్యం.. ఎలాంటి స్వభావంతో ఉన్నదైనా కావచ్చు కాని అది కచ్చితంగా అన్నింట్లోనూ తల దూర్చాలి. గుజరాత్‌తో సహా భారత్‌లో ప్రభుత్వ వ్యవస్థ ఈ అన్ని అంశాల్లో నిత్యం విఫలమౌతూ వస్తోంది.
రెండోవిషయం సమాజంలో కాయపుష్టి, చలనశీలత. ప్రగతిశీలమైన ఏ సమాజమైనా కొత్త విషయాలను కనిపెట్టే సామర్థ్యంతోపాటు దాతృత్వాన్ని, పరోపకార తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది చాలా సంక్లిష్ట విషయం కాబట్టి మరోసందర్భంలో దీనిపై రాస్తాను.
ఇక మొదటి విషయానికి సంబంధించి చూస్తే, సులభంగా చె ప్పాలంటే ఇది చట్టాలు లేదా చట్టాలలో మార్పులకు సంబంధించినది కాదు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది సంస్కరణకు సంబంధించింది కాదు. అది పాలనకు సంబంధించింది. ఇది అమలు చేయడంలో ప్రభుత్వ సమర్థతకు సంబంధించింది. ఇది లేకుండా చట్టంలో మార్పులు ఏమీ చేయలేవు. అందుకనే ప్రధాని నరేంద్రమోదీ మలేసియాలో ఇచ్చిన ప్రసంగం నాలో ఆసక్తిని కలిగించింది. అక్కడ ఆయన చెప్పిన ప్రధానాంశాలు ఇవి. ‘సంస్కరణకు అంతం లేదు. సంస్కరణ అంటే గమ్యం చేరడానికి చేసే సుదీర్ఘ ప్రయాణంలో తగిలే స్టేషన్ మాత్రమే. భారత పరివర్తనే గమ్యం.’
తాను 2014లో ఎన్నికల్లో గెలిచినప్పుడు భారత్ అత్యంత అధిక స్థాయిలో ద్రవ్య, కరెంట్ ఖాతా లోటుకు సంబంధించి తీవ్రమైన సవాల్‌ను ఎదుర్కొనేదని మోదీ తన ప్రసంగంలో చెప్పారు. ‘సంస్కరణలు అవసరమనేది స్పష్టమే. మాకు మేముగా ఒక ప్రశ్న వేసుకున్నాం. సంస్కరణలు దేనికి? అంచనా వేసిన జీడీపీ వృద్ధిని పెంచడానికి మాత్రమేనా? లేదా సమాజంలో మార్పును తీసుకురావ డానికా? నా సమాధానం స్పష్టమే. మనం పూర్తిగా మారేందుకు సంస్కరణకు అవకాశం ఇవ్వాలి,’ అని ప్రధాని అన్నారు.
ప్రధాని ఈ అంశాన్ని సరైన రీతిలో చెప్పగలిగారని నాకు అనిపిస్తోంది. అయితే సమాజాలు వెలుపలి నుంచి ప్రభుత్వం ద్వారా పరివర్తన చెందవని, అంతర్గతంగా సాంస్కృతికపరంగానే అవి మార్పు చెందుతాయన్నది నా అభిప్రాయం.
కాకుంటే, ప్రధాని మాటల్లో చెప్పినంత స్పష్టతను వాటి అమలు విషయంలో కూడా ప్రదర్శించగలిగితే చూడ్డానికి అది మనోహరంగా ఉంటుందనడంలో సందేహమే లేదు.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com)
ఆకార్ పటేల్