ఈ మహా యోధుడూ దేశద్రోహేనా?
అవలోకనం
టిప్పు వంటి యోధానుయోధుల గురించి చదవడానికి, చదివిన తర్వాత వారిపై ఏదైనా రాయడానికి, వ్యాఖ్యానించడానికి మనకు ఏమాత్రం మనస్కరించదు. కానీ వారి గురించిన నానా చెత్త విషయాలను మాత్రం మనం ఎల్లపుడూ నమ్మేందుకే ఇష్టపడుతుంటాం. పైగా మనకు అతి కొద్దిగా తెలిసిన విషయాలపై నిరసన తెలిపేందుకే మనం సిద్ధమవుతుంటాం కూడా.
పాకిస్తాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కొన్ని వారాల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకోసం బెంగళూరుకు వచ్చారు. ఆ కార్యక్రమంలో నేనూ భాగస్వామి నయ్యాను. ఆయన నాకు గతంలోనే తెలుసు. దక్షిణ భారత్‌లో ఆయన ఏం చూడ దల్చుకున్నారని అడిగాను. (బెంగళూరును సందర్శించడానికి అనుమతి పొందిన మొదటి లేదా రెండవ పాకిస్తానీ హై కమిషనర్ బహుశా ఆయనే కావచ్చు.
నగరంలోని టెక్నాలజీ పార్కులను చూడాలనుకుంటున్నట్లు, అలాగే మైసూరుకు వెళ్లాలని ఉందని కూడా ఆయన చెప్పారు. బెంగళూరు నుంచి మైసూరుకు రెండు గంటల ప్రయాణం. అక్కడ మైసూరుకు వెలుపల ఉన్న శ్రీరంగపట్నంలోని టిప్పు సుల్తాన్ ప్యాలెస్ చూడాలన్నది ఆయన కోరిక. భారతీయులందరూ టిప్పును చూసి గర్వించాలని బాసిత్ అభిప్రాయం వెలిబుచ్చారు. కాని ఇటీవలి పరిణా మాలు చూస్తుంటే ఆయన అభిప్రాయం తప్పు కావచ్చు.
టిప్పు జయంతి వేడుకలను నిర్వహించే విషయమై చెలరేగిన గొడవల్లో.. గత వారం కర్ణాటకలో ఇద్దరు మరణించారు. నేడు భారత్‌ను తీవ్రంగా నిస్పృహకు గురిచేస్తున్న అనేక అంశాల్లో హిందూ-ముస్లిం సమస్య ఒకటి. మనదైన ప్రపంచం లో చక్రవర్తులను మంచివారు (అశోకుడు, అక్బర్ తదితరులు), చెడ్డవారు (ఔరంగజేబు, టిప్పు సుల్తాన్) అని వేరు చేసి చూస్తుంటారు. చరిత్రను వాస్తవం లేదా హేతువు దృష్ట్యా కాకుండా భావోద్వేగాల బట్టి మాత్రమే చూస్తున్న దేశంలో సమాజపు నిర్దిష్ట స్వభావం ఇలాగే ఉంటుంది. పైగా ఇది దాదాపు నిరక్షరాస్యులు, లేదా ఒక మేరకు చదువుకున్న ప్రజలకు ఇది సంకేతంగా కూడా.
టిప్పు, ఆయన సైనికాధిపతులపై ప్రశంసలు కురిపించడం అనేది వారిపట్ల వ్యతిరేకతను పెంచి పోషిస్తోంది. హిందువులకు వ్యతిరేకంగా జిహాద్‌లో నిరంత రం మునిగి తేలిన వ్యక్తిగా టిప్పును ఇప్పుడు చిత్రిస్తున్నారు. ఇది నిజంగానే బూటకమైంది. అయితే ఈ విషయాన్ని నేను ఇక్కడ నిరూపించడానికి ప్రయత్నిం చబోను. టిప్పు మీద వచ్చిన పుస్తకాలను చదివి, సమాధానపడి తర్వాత మీమీ అభిప్రాయాలు చెబితే బాగుంటుంది. అయితే ఇక్కడ సమస్యల్లా ఏమిటంటే నాగ రిక ప్రపంచంలో వలే కాకుండా ఇండియాలో చరిత్రకు సంబంధించి చాలా తక్కు వ పుస్తకాలే రాయడం జరిగింది.
స్మృతులను రాసి ఉంచడం, దినచర్యను రాసి ఉంచుకునే సంప్రదాయం మనకు లేదు. గత చరిత్రలోని వ్యక్తులు, ప్రముఖులపై కొత్త రచనలు చేయడంలో మనకు ఎలాంటి ఆసక్తీ లేదు కూడా. అందుకే టిప్పుపై భారతీయులు రాసిన పుస్తకాలేవీ మనకు కనిపించవు. టిప్పు గురించి ఏదయినా తెలుసుకోవాలంటే 19వ శతాబ్ది నాటి ‘హైదర్ ఆలీ, టిప్పు సుల్తాన్ అండ్ ది స్ట్రగుల్ ఆఫ్ ది ముస్లిమన్ పవర్స్ ఆఫ్ ది సౌత్’ వంటి పుస్తకాలను తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. దీన్ని రాసింది లూయిస్ బౌరింగ్ (సెయింట్ మార్క్ రోడ్ లోని బౌరింగ్ క్లబ్ ద్వారా బెంగళూరు ప్రజలకు ఇతడు సుపరిచితుడే).
టిప్పుకు సంబంధించినంత వరకు రెండు లేదా మూడు అంశాలు నాకు ఎంతో ఆసక్తిగొలుపుతుంటాయి. మొదటిది: ఇంగ్లీష్ వారికి టిప్పు కొరకరాని కొయ్యగా మారాడు. ఆ కాలానికి సంబంధించి మన చిట్టచివరి, మహా చరిత్రకా రుల్లో ఒకరైన సర్ జాదూనాథ్ సర్కార్ రచనలను గానీ మనం చదివినట్లయితే, మారాఠాల లాగా కాకుండా టిప్పు నిజమైన యోధుడిగా ఉండేవాడని మనకు స్పష్టమవుతుంది. పానిపట్ యుద్ధంలో పరాజయం తర్వాత మరాఠాలు కుప్పకూ లిన చరిత్రను టిప్పు వీరోచిత ప్రతిఘటనను పోల్చి చూస్తే మనకు విషయం స్పష్ట మవుతుంది.
కేవలం 40 సంవత్సరాల్లోపే.. అంటే 1761 (పానిపట్ యుద్ధంలో అహ్మద్ అబ్దాలీ గెలుపొందిన సంవత్సరం) నుంచీ 1799లో టిప్పు యుద్ధంలో నేలకూలిన కాలంలోనే ఇదంతా జరిగింది. ఈ కొద్ది సంవత్సరాల కాలంలోనే బ్రిటిష్ వారు తమ శత్రువులందరినీ ఓడించివేశారు. పంజాబ్ మాత్రమే వారికి కొరుకుడు పడకుండా మిగిలిపోయింది. ఆపై కొన్ని దశాబ్దాల అనంతరం రంజిత్ సింగ్ మరణం తర్వాత పంజాబ్ సైతం కుప్పగూలిపోయింది.
బ్రిటిష్ పాలకులకు నిజమైన ప్రతిఘటనను ఇచ్చింది టిప్పుమాత్రమే. ఒక సాటిలేని సేనాధిపతిగా, భౌగోళిక రాజకీయాలను (బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రెంచ్‌వారిని నిలపడం) సమయస్ఫూర్తితో అవగాహన చేసుకున్న టిప్పుకు యుద్ధానికి సంబంధించినంత వరకు ఆధునిక దృక్పథం ఉండేది. రెండవది : యుద్ధంలో రాకెట్లను తొలిసారి ప్రయోగించినది టిప్పు సైన్యమే అనేది జగమెరి గిన సత్యం. ఈ ముతక రాకెట్లకు టిప్పు సైనికులు కత్తులను జోడించి శత్రు సైన్యం పైకి ప్రయోగించేవారు. బ్రిటిష్ చరిత్రలోనే మేటి సేనాని అర్థర్ వెలస్లీ (డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్) చివరకు టిప్పును ఓడించగలిగాడు. వాటర్లూ యుద్ధంలో నెపోలి యన్‌ను పరాజితుడిని చేసింది కూడా వెలస్లీయే.
సైనికపరంగా, జాతీయవాదపరంగా టిప్పు ఆనాడు సాధించిన మేటి విజ యాలను ఈరోజు అంత సులువుగా నిర్లక్ష్యం చేయడం నన్ను ఎంతగానో నిస్పృహ కు గురి చేస్తోంది. ఇది నిజమైనా, నిజం కాకపోయినా అతడు హిందువులను వధించాడు లేక మతమార్పిడికి గురిచేశాడు అనే భావనను మాత్రమే నేడు గుర్తుం చుకోవడం నిజంగా విషాదకరం.
మనందరం గుర్తుంచుకోవలసిన విషయం ఏమి టింటే, అశోక చక్రవర్తి కళింగ రాజ్యాన్ని జయించినప్పుడు అతడు విదేశీయులను, ముస్లింలను ఊచ కోత కోయలేదు. మనకు చరిత్ర అందించిన పాఠాల మేరకు అశోకుడు ఒరియా మాట్లాడే వేలాదిమంది హిందువులను ఊచకోత కోశాడు. అయినప్పటికీ అశోకుడిని మహా వ్యక్తిగా పిలుస్తుంటాం. అతడి రాజచిహ్నమైన సింహం గణతంత్ర భారత్ అధికారిక చిహ్నమైంది. భారతీయ పతాక మధ్యలోని చక్రాన్ని అశోక చక్రం అని పిలుస్తారు. ఎందుకంటే అది కూడా అతని చిహ్నమే.
ఈ ఇద్దరూ ఒకే నేరం చేశారని ఆరోపణలు మిగిలి ఉండగా మనం టిప్పును కాకుండా అశోకుడిని మాత్రమే ఎందుకు గౌరవిస్తున్నాం? మనకు సమాధానం తెలుసు. అది చాలా స్పష్టమైనదే. భారత్‌లో ఒక హిందువు చేసిన పనులు ఒక ముస్లిం రాజు చేయకూడదంతే.. అద్భుతమైన పాటియాలా రాజప్రాసాదాన్ని స్థాపించినవాడు మహారాజా అలా సింగ్. తన జీవిత కాలంలో ఇతడు సాధించిన సైనిక విజయాలేమీ లేవు. అతడు సాధించిన ఘనత ఏమిటంటే మరాఠాలను ఓడించడంలో అతడు అబ్దాలీకి సహకరించడమే. దీనికి గాను ఇతడు ఆప్ఘన్ రాజు గౌరవ పురస్కారాలను అందుకున్నాడు. కానీ అలా సింగ్‌ను కాని అతడి వారసులను భారత్‌లో ఎవరయినా ద్రోహులుగా చూస్తున్నారా? పైగా పాటియాలా రాజులు మహారాజా రంజిత్ సింగ్‌ను నిరంతరం ప్రతిఘటిస్తూ వచ్చారు. కానీ వారిని ఎవరూ జాతి వ్యతిరేకులుగా చూడటం లేదు. ముస్లిం రాజులకు మాత్రమే ఈ విధమైన ‘గౌరవం’ లభిస్తూంటుంది మరి.
టిప్పు వంటి యోధానుయోధుల గురించి చదవడానికి, చదివిన తర్వాత వారిపై ఏదైనా రాయడానికి, వ్యాఖ్యానించడానికి మనకు ఏమాత్రం మనస్కరిం చదు. కానీ వారి గురించి నానా చెత్త విషయాలను మాత్రం మనం ఎల్లపుడూ నమ్మేందుకే ఇష్టపడుతుంటాం. పైగా మనకు అతి కొద్దిగా తెలిసిన విషయాలపై నిరసన తెలిపేందుకే మనం ఎల్లప్పుడు సిద్ధమవుతుంటాం.
- ఆకార్ పటేల్
(వ్యాసకర్త రచయిత, కాలమిస్టు aakar.patel@icloud.com)