నమ్మశక్యం గాని రీతిలో అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో 25మందిని పోలీసులు కాల్చి చంపిన ఘటనకు ఏ కారణంచేతనైనా సరే ప్రజాంగీకారం లభించడం, దానికి మీడియా తిరుగులేని విధంగా వత్తాసు పలకటం పౌరసమాజానికి ప్రమాద ఘంటికలను సూచిస్తోంది.
- ఆకార్ పటేల్
గత మంగళవారం ఏపీ పోలీసులు ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారనే మిషతో 20 మంది తమిళులను కాల్చిపడేశారు. అదే రోజు తెలంగాణ పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళుతున్న ఐదుగురిని కాల్చి వేశారు. ఈ రెండు వార్తల్లో ఏ ఒక్కటీ దేశంలోని రెండు ప్రధాన ఇంగ్లిష్ పత్రికల్లో ముఖ్య కథనంలా వచ్చే అర్హత సంపాదిం చుకోలేకపోయాయి.
మన మధ్యతరగతి.. చెట్లు నరికే వారి ని, ముస్లింలను (ఎన్‌కౌంటర్ బాధితులు) చట్ట పరిధికి వెలుపల కాల్చిచంపడం పట్ల స్పందించలేదు. ఆన్‌లైన్‌లో ఈ రెండు ఘట నలపై పాఠకుల వ్యాఖ్యలు పోలీసు చర్య పట్ల సమ్మతి తెలిపాయి. వ్యాఖ్యలు పెట్టిన వారు బాధితుల పట్ల పచ్చి ద్వేషం ప్రకటిం చారు. విచారణ కూడా లేకుండానే వారికి ఆ గతి పట్టాల్సిందేనని వీరంతా తీర్పు ఇచ్చే శారు. మీడియా సైతం ఈ వార్తల పట్ల అత్యంత దురభిప్రాయాలతో కూడిన కథ నాలనే నివేదించింది.
బాధ్యతతో కూడిన వార్తాపత్రికలా వ్యవహరించే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక కూడా ‘తెలంగాణలో కోర్టుకు తీసుకెళుతు న్న 5 మంది సిమి కార్యకర్తల కాల్చివేత’ అనే ముఖ్య శీర్షిక కింద కథనం ప్రచురించిం ది. వికారుద్దీన్ అహ్మద్ ఇద్దరు పోలీసులను చంపడమే కాకుండా, వీలైనప్పుడల్లా వారి ని టార్గెట్ చేస్తూవచ్చాడని ఆ పత్రిక కర స్పాండెంట్ రాశారు. ఇలాంటి సంపాద కీయ వైఖరిని, గర్హనీయమైన భాషను ఒక జాతీయ పత్రిక అనుమతించడమే విషా దం. వికారుద్దీన్ గత కొన్నేళ్లుగా పోలీసు లపై దాడులకు పాల్పడ్డాడనే అనుకుందాం. కానీ న్యాయమూర్తి అతడిని దోషిగా ప్రక టించారా? ప్రకటించలేదు. అతడు విచార ణఖైదీగా కోర్టుకు హాజరవుతున్నాడు. అయి నా సరే.. వికారుద్దీన్ హత్యలు చేశాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్ధారణ చేసింది.
అమెరికాలో ఒకేరోజు 25 మంది నల్ల జాతి ప్రజలను ఉరితీస్తే, ప్రభుత్వం ఉన్న ఫళానా కూలిపోయేది. ఆ దేశ జనాభా మొత్తంగా బాధితులకు సంఘీభావంగా ర్యాలీలు తీసేది. భారత్‌లో పోలీసులను ప్రశంసించని మనలాంటి వాళ్లం కాస్త నోరు తెరిచి ఊరకుండిపోతాం. అంతే తేడా. మీడి యా చాలా కాలం క్రితమే తన పాఠకులు, వీక్షకుల ముందు సాష్టాంగ పడిపోయింద న్నది వాస్తవం. పోలీసులను దూషించడాన్ని మీడియా ఒక స్థాయి వరకు ఆమోదించిం ది. అయితే తాను లక్ష్యంగా పెట్టుకున్న పాఠ కులు, వీక్షకులకు ఇబ్బంది పెట్టనంతవరకే ఇది కొనసాగుతుంది.
నేను ముంబైలో 20 ఏళ్ల క్రితం ఒక పత్రిక సంపాదకుడిగా ఉన్నప్పుడు, ఎన్ కౌంటర్ సంస్కృతి పంజాబ్, ఈశాన్య భార త్ నుంచి అప్పుడే మన నగరాల్లోకి ప్రవేశిం చింది. ఎన్‌కౌంటర్ హత్యలను సమర్థించే భారతీయులు అప్పట్లో చాలా మందే ఉండే వారు. వాటిని విమర్శించేవారిని నాటి టీవీ చర్చల్లో విద్రోహులుగా ఎంచేవారు.
భవన నిర్మాతలు, బాలీవుడ్ నిర్మాత లు, ఫైనాన్షియర్‌ల నుంచి డబ్బు గుంజే ముఠాలను ముంబై పోలీసులు కాల్చి చం పేవారు. చట్టవిరుద్ధమైన పోలీసు చర్యలను ప్రశ్నించే పత్రికా సంపాదకులపై అటు యా జమాన్యం, ఇటు పాఠకులు దాడి చేసే వారు. దోషనిర్ధారణ ద్వారా చట్టాన్ని అమ లు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతు న్నందున, న్యాయ ప్రక్రియతో పనిలేకుండా నే నేరస్థులను నిర్మూలించడం ద్వారా ప్రభు త్వం శాంతిభద్రతలను నెలకొల్పితే మంచి దేనని ఇలాంటివారి నమ్మిక.
ఈ క్రమంలో, డజన్ల కొద్దీ నేరస్థులను చంపుతూ ఎన్‌కౌం టర్ స్పెషలిస్టులుగా ప్రాచుర్యంలోకి వచ్చిన పిరికితనపు పోలీసు అధికారులు పుట్టుకొ చ్చారు. వీరినే ధీరోదాత్తులుగా వర్ణిస్తూ సిని మాలు పుట్టుకొచ్చాయి. వీళ్ల సాహసం అంతా బేడీలతో బంధించిన వ్యక్తులపైకి కాల్పులు జరపడానికే పరిమితం అయ్యేది. ఈ ప్రక్రియకు ఏదో ఒక చోట ముగింపు ఉంటుందని నేను అప్పట్లో భావించేవాడిని. కానీ, నా భావన తప్పయిందనుకోండి. ప్రజావాణికి ప్రతిచోటా ప్రాధాన్యం ఏర్పడు తుండటంతో పౌరులను పాశవికంగా మార్చడం ప్రభుత్వానికి సులభమైపోయిం ది. మనుషులను నేరపూరితంగా, చట్టవిరు ద్ధంగా కాల్చిచంపడం ద్వారా అలాంటివారి పట్ల మీడియా ద్వారా అమానుషంగా వ్యవ హరించడం ఇప్పుడు సులభతరం అయి పోయింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఎవరికెరుక?
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత)
ఈమెయిల్: aakar.patel@icloud.com