
లక్నో: ముక్తార్ అన్సారీ ముఠాకు చెందిన షూటర్ అనుజ్ కనౌజియా(Anuj Kanaujia) పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఇతనిపై 2.5 లక్షల రివార్డు ఉంది. జంషెడ్‌పూర్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో జార్ఖండ్ పోలీసులు, యూపీ ఎస్టీఎఫ్ సంయుక్తంగా పాల్గొన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తొలుత ఎస్టీఎఫ్‌తో పాటు జార్ఖండ్ పోలీసులు అనుజ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.
అయితే అనుజ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కాల్పులు ప్రారంభించాడు. ఆ దరిమిలా ఇరు వైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ నేపధ్యంలో అనుజ్ మృతి చెందాడు. అనుజ్‌పై పలు నేరపూరిత కేసులు నమోదయ్యాయి. ముక్తార్ గ్యాంగ్(Mukhtar Gang)లో షూటర్‌గా అనుజ్ కీలకంగా వ్యవహరించాడు. యూపీలోని వివిధ జిల్లాల్లో పలు సెక్షన్ల కింద అనుజ్‌పై మొత్తం 23 కేసులు నమోదయ్యాయి.
అనుజ్ కనౌజియా గత కొన్నేళ్లుగా పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో అనుజ్ హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌కు యూపీ ఎస్‌టీఎఫ్ డిప్యూటీ ఎస్పీ డీకే షాహి నాయకత్వం వహించారు. ఈయన ఎన్‌కౌంటర్(Encounter)లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డీకే షాహి యూపీ ఎస్టీఎఫ్‌లో కీలక అధికారిగా పేరొందారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని బండా జైలులో శిక్ష అనుభవిస్తున్న మాఫియా ముక్తార్ అన్సారీ 2024, మార్చి 28న మృతి చెందాడు. ఈ నేపధ్యంలో జైలు అధికారులు అన్సారీకి స్లో పాయిజన్ ఇచ్చారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో అన్సారీ గుండెపోటుతో మరణించినట్లు వెల్లడయ్యింది.
ఇది కూడా చదవండి: Myanmar: భూ ప్రకంపనల వైరల్ వీడియోలు