జరిమానాలతో వీధులను శుభ్రంగా ఉంచగలమా?
- ఆకార్ పటేల్
దేశంలో చెత్తా చెదారాన్ని బహిరంగ స్థలాల్లో పడవేస్తే అక్కడికక్కడే జరిమానా విధించేలా ఒక కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ఈ వారం వార్తలు వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ కథనం పతాక శీర్షికగా వచ్చింది. అంటే ప్రభుత్వంలో ఉండి దీన్ని లీక్ చేసినవారు, దాన్ని నివేదించిన వారు ఈ చట్టాన్ని ముఖ్యమైనదిగా భావించారన్నమాట. ‘బహిరంగ స్థలాల్లో చెత్త పడవే యటం, ఎలక్ట్రానిక్ వ్యర్థాన్ని డంప్ చేయడం, బహిరంగ స్థలాలను మురికి చేయ టం, నిషేధించిన ప్లాస్టిక్ సంచులను ఉపయోగించడం వంటివాటిని స్వల్ప నేరాల కింద పరిగణించి అక్కడికక్కడే జరిమానా విధించటానికి’ పర్యావరణ మంత్రిత్వ శాఖ సమాయత్తమవుతున్నట్లు ఆ పత్రికా వార్త తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అతి ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటైన ‘స్వచ్ఛ భారత్ అభియాన్‌కు చట్టపరమైన కోరలను’ ఈ బిల్లు కల్పించనున్నట్లు ఇది స్పష్టం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ గత అక్టోబర్‌లో ప్రారంభించిన కీలకమైన ప్రాజెక్టు.. ‘స్వచ్ఛదనం ప్రాతిపదికన చెత్త పడేసే వారిపై జరిమానాలు, పరిహారా లను ప్రవేశపెట్టి సింగపూర్ తొలి ప్రధానమంత్రి లీ కాన్ యు ప్రారంభించిన ఆధునీకరణ తరహా ప్రాజెక్టును పోలి ఉన్నదని’ ఆ వార్తా కథనం తెలిపింది.
అయితే అలాంటి వాటికి సింగపూర్ మంచి నమూనేయేనా, లీ చేపట్టిన పరి ష్కారం ఇక్కడ వర్తిస్తుందా? ఇక్కడ మనం మొదటగా గుర్తించవలసింది ఏమి టంటే, చైనా ప్రజలు (సింగపూర్‌లో చైనీయులే ప్రధానంగా ఉన్నారు) దక్షిణా సియా ప్రజల స్థాయిలో తమ వీధులను, ఇరుగు పొరుగు ప్రదేశాలను అంత చెత్తగా ఉంచుకోరు. మనం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ (శ్రీలంక దీనికి మిన హాయింపు) దేశాల కేసి చూస్తే మనకీవిషయం స్పష్టంగా బోధపడుతుంది.
చైనీ యులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. అంటే తమ మాతృ భూమిలో కానీ, ప్రపం చమంతటా తాము నివసిస్తున్న ప్రాంతాల్లో కానీ (అమెరికాలో వీరు నివసించే ప్రాంతాలను చైనా టౌన్స్ అంటారు) పరిశుభ్రత పట్ల ఒక ప్రాథమిక అవగాహ నను, విజ్ఞతను, క్రమాన్నీ, గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. పైగా, తామున్న పరిసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటారు. అదే మన విషయంలో అలా కనిపించదు. చట్టాలు కొంతవరకు మాత్రమే సాయపడగలవని నేను చెప్పగలను. సింగ పూర్‌ను పరిశుభ్రంగా ఉంచింది లీ మేధోతనమే అనుకున్నట్లయితే హాంకాంగ్‌ను ఎవరు క్రమంలో పెట్టారు? ఇక్కడ కూడా చైనీయులే అధిక సంఖ్యలో ఉన్నారు. కాగా ఇక్కడ కూడా సింగపూర్ వంటి నియంతృత్వ పాలనే ఉంది.
రెండో విషయం ఏమిటంటే, పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ కొత్త చట్టం వాస్తవంగా కొత్తదేనా? గత కొన్ని నెలలుగా పత్రికల్లో వస్తున్న పతాక శీర్షికలను గమనించినట్లయితే, ’వీధుల్లో చెత్త పారవేసినందుకు ఇప్పుడు ఫైన్ కట్టండి’ అంటూ అమృత్‌సర్ నుంచి వచ్చిన ఒక వార్త మనకు కనబడుతుంది. ఇలాంటి చర్యలకుగాను స్పాట్ ఫైన్ అనేది సరిపోదని అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించిందట.
చెత్త పడవేసిన చోటే ఫైన్ కట్టే నిబంధన ఇప్పటికే ఉన్నప్పటికీ, చట్టాన్ని ఉల్లంఘించినవారిని కోర్టులో హాజరు పర్చాలని, ఆ బాధను వారు అనుభవించాలని అమృత్‌సర్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. రైల్వేలలో వ్యక్తులు చెత్త పడేస్తున్నారని, (భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత చెత్తతో, మురికితో కూడి ఉంటాయని) అలాంటివారిపై రూ.5 వేల వరకు అపరాధం విధిస్తారని గత సంవత్సరం ఆ పత్రిక ప్రకటించింది. వీధుల్లో చెత్త పారవేస్తూ కనిపిస్తే చాలు ఆ వ్యక్తిపై అక్కడికక్కడే రూ.500 జరి మానా విధిస్తామంటూ గత సంవత్సరం ఆగస్టులో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది.
వీధుల్లో ఉమ్మివేయడం, చెత్త పారవేయడం, మూత్ర విసర్జన వంటి చర్య లకు పాల్పడితే అక్కడికక్కడే రూ.500లు ఫైన్ విధించేలా కొత్త చెత్త వ్యతిరేక చట్టం రూపొందుతోందని 2010 సంవత్సరంలోనే హిందూస్తాన్ టైమ్స్ రాసింది. ఇప్పుడు మరొక చట్టం దానికి అపశవ్య దిశలో రూపొందుతున్నట్లు కనబడు తోంది. నిజానికి ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంది?
సమస్య అల్లా ఎక్కడుందంటే, ప్రభుత్వం ఒక చట్టం ద్వారా సామాజిక, సాంస్కృతిక మార్పును ప్రభావితం చేయాలనుకుంటోంది. అలా చేయవచ్చా? దీనికి సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే శిశు హత్యలు, వరకట్న హత్యలు కూడా సాంస్కృతిక నేరాలే. వీటి విషయంలో కూడా కఠిన చట్టాలను తీసుకురావాలి. ఎందుకంటే అవి కూడా హత్యలతో సమానమే. వాటితో ఆ మార్గంలోనే వ్యవహరించాలి.
స్వచ్ఛ భారత్ అభియాన్ పేరిట జరుగుతున్న గందరగోళం ఇదే. ఇంతకూ ఈ పథకం దేనికి ఉద్దేశించిందన్నది కొన్ని సంకేతాలు పంపుతోంది. ప్రధాన మంత్రి తన చీపురు ద్వారా వ్యక్తిగత ఉదాహరణను నెలకొల్పారు. పలు ప్రదేశా లలో చీపురుతో చెత్తను శుభ్రం చేస్తూ కనిపించారు. ఇదంతా ఒక వారం లేకుంటే మరికొన్ని రోజులు మాత్రమే నడిచిందని పలు వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఒక రోజు మాత్రమే చీపురు పట్టుకుని వీధుల్లోకి వచ్చినందుకు ప్రముఖ వ్యక్తు లను అభినందించటానికి మాత్రమే ఆయన ట్వీట్‌లు పరిమితమయ్యాయి. మరోై వైపున ప్రభుత్వ ప్రకటనలు స్వచ్ఛభారత్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మరుగు దొడ్లు నిర్మించడమని చెప్పాయి. అక్కడ లక్ష్యాలన్నీ గణాంకాల రూపంలోనే కనిపిస్తున్నాయి.
స్వచ్ఛభారత్ అభియాన్‌తో గాంధేయ పని విధానాన్ని అలవర్చడానికి మోదీ ప్రయత్నిస్తున్నట్లు నేను భావిస్తున్నాను. మన సామాజిక, సాంస్కృతిక సమస్య లను పరిష్కరించడంలో ఆ మార్గం అత్యాశతో కూడుకున్నదే అయినప్పటికీ ఆ ఆలోచన ఉన్నతమైనదే. తన మరుగుదొడ్డిని తానే శుభ్రపర్చుకోవడం, తన బట్టలను తానే వడకటం వంటి చర్యల ద్వారా గాంధీ ఒక నిరుపమాన వ్యక్తిగత ఉదాహరణగా నిలిచారు. మోదీ ప్రభుత్వం ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా గాంధీ ఈ విషయంలో విఫలమయ్యారు. తన తరపున చేయడానికి మరొకరు సిద్ధంగా ఉన్నంతవరకు ఏ భారతీయుడు కూడా తన మరుగుదొడ్డిని తానే శుభ్రపర్చుకోవడం అనేది కల్లే.
ఇక పోతే ఖాదీ మన జ్ఞాపకాల్లోంచే కనుమరుగైపోయింది. మరి మోదీ విజయం సాధిస్తారా? సాధించలేరు. ఎందుకంటే సాంస్కృతిక మార్పు అనేది కేవలం చట్టం రూపంలో జరగదు. పైగా ఒకే ఒక రాత్రిలో అది సాధ్యం కాదు కూడా. ఆ మార్పు అంతర్గతంగానే రావాలి. గాంధీ దాన్ని అర్థం చేసుకున్నారు. మోదీ పట్ల భారతీయులకు చాలా సానుకూల ముద్ర ఉంది. ఆయన వ్యక్తిగత ఉదాహరణ ప్రత్యేకమైనది. ఈ విషయంపై తాను నిజంగానే తీవ్రంగా ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడే ఆయన కేంద్రీకరించాలి. గాంధీ జీవిత కాలంలో దీన్ని సాధించలేకపోయినట్లే, మోదీ జీవితకాలంలో ఈ మార్పు రాక పోవచ్చు. అయితే ఏదో ఒక కొత్త చట్టం కంటే ఆయన ప్రయత్నమే మరింత సమ ర్థవంతంగా ప్రభావం చూపగలదు.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com)