శుభ్రత ఎక్కడుంటే మహిళలు అక్కడుంటారు. లేదా, మహిళలు ఎక్కడుంటే శుభ్రత అక్కడ ఉంటుంది. శుభ్రంగా ఉంచటం అన్నది మహిళల సహజ నైజం. మహిళలే కాదు, దైవత్వం కూడా శుభ్రత ఉన్న చోట కొలువై ఉంటుంది. ‘క్లీన్‌లీనెస్ ఈజ్ నెక్స్›్ట టు గాడ్‌లీనెస్’ అనే మాట వినే ఉంటారు.
ఇంటిని, సమాజాన్ని శుభ్రంగా ఉంచటంలో కీలక బాధ్యతను వహిస్తున్న మహిళలే ఇప్పుడు తాజాగా దైవకార్యం వంటి ‘స్వచ్ఛ గంగా’ ఉద్యమ ప్రచారాన్ని చేపట్టారు. గంగానదిని ప్రక్షాళన చేయవలసిన అవసరం గురించి, గంగా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించటం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటం కోసం మొత్తం 20 మంది మహిళలు గంగానదిపై నవంబర్ 4న రెండు తెప్పల్లో ర్యాలీగా బయల్దేరారు! ఉత్తరాఖండ్, తెహ్రీ ఘరేవాల్ జిల్లాలోని దేవప్రయాగ పట్టణం నుంచి మొదలైన ఈ ‘ఆల్ ఉమెన్ రివర్ ర్యాఫ్టింగ్’... మొత్తం 2,500 కి.మీ. దూరాన్ని 53 రోజుల పాటు ప్రయాణించి డిసెంబర్ 26న పశ్చిమబెంగాల్‌లోని గంగా సాగర్ వద్ద ముగుస్తుంది.
అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక సుదీర్ఘమైన రివర్ ర్యాఫ్టింగ్ దేశంలో జరగడం ఇదే మొదటిసారి. మరొక విశేషం కూడా ఉంది. వీళ్లంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) దళానికి చెందిన మహిళలు. బి.ఎస్.ఎఫ్. మహిళా విభాగం, ‘నమామి గంగే’ ప్రాజెక్టు కలిసి ఉమ్మడిగా ఈ రివర్ ర్యాఫ్టింగ్‌ను నిర్వహిస్తున్నాయి. ర్యాఫ్టింగ్ ప్రారంభానికి ముందు మహిళా శక్తికి, సాధికారతకు సంకేతంగా 11 మంది బాలికల పాదాలకు నమస్కరించి పూజలు జరిపారు. ఆ తర్వాత ‘తెప్పలు’ కదిలాయి. ఈ ప్రచారానికి బి.ఎస్.ఎఫ్. సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రియా మీనా నాయకత్వం వహిస్తున్నారు.
దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా జవాన్‌లలో 20 మందిని కఠిన ర్యాఫ్టింగ్ శిక్షణ తర్వాత ఇందుకోసం ఎంపిక చేశామని మీనా అన్నారు. ‘‘రెండు తెప్పలుగా సాగే ఈ బోటింగ్ యాత్రలో భాగంగా గంగా తీరం వెంబడి 43 పట్టణాలలో ఈ తరం యువతీ యువకులకు ‘పరిశుభ్రతకు, నిరంతరాయ ప్రవాహానికి’ అనువుగా గంగానదిని ప్రక్షాళన చేయాలన్న సందేశాన్ని అందిస్తాం’’ అని ఆమె తెలి΄ారు. మరొక విశేషం.. వీరితో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’ చేతులు కలపటం.
శుభ్రత దైవంతో సమానం అన్నప్పుడు, దైవ సమానంగా భారతీయులు కొలిచే గంగానదిని శుభ్రంగా ఉంచాలన్న సందేశంతో ప్రచారోద్యమం చేపట్టిన మహిళాశక్తి కూడా కొలవదగినదే. స్తుతించతగినదే. వారి మాట ఆలకించతగినదే.
Comments
Please login to add a commentAdd a comment