ఈ ‘ఆద్మీ’ కూడా ఆ తానులో ముక్కేనా?
ఆకార్ పటేల్
సంక్షోభ సమయంలోనూ ఎంతో హుందాగా వ్యవహరించిన యోగేంద్ర యాదవ్‌ను, ప్రశాంత భూషణ్‌లను కీలక కమిటీ నుంచి మొరటుగా తొలగించిన తీరు తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీసింది. అన్ని పార్టీల కంటే తామే పరిశుద్ధులమని చెప్పుకుంటున్న వారి ఔద్ధత్యానికి గండిపడింది.
మన ఇతర రాజకీయ పార్టీలలాగే సంకుచితం గానూ, వంచనాత్మకం గానూ వ్యవహరించిన ఆమ్ ఆద్మీ పార్టీ గత వా రం తన మద్దతుదారుల ను, కార్యకర్తలను నిరా శపర్చింది. ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీ వాల్ అనుకూల నాయకత్వం, కీలకమైన నిర్ణాయక కమిటీ నుంచి ఇద్దరు అత్యంత గౌరవనీయులైన సభ్యులను గతవారం తొలగించింది. ఉన్నత విద్యా వంతుడు యోగేంద్ర యాదవ్, న్యాయవాది ప్రశాం త భూషణ్‌లు అధికారం అందరికీ ప్రాప్తించాలనే సూత్రానికి ఆప్ కట్టుబడి ఉండాలంటూ అత్యంత బాధ్యతాయుతమైన రీతిలో కోరి కేజ్రీవాల్‌కు ఆగ్ర హం కలిగించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్య మంత్రిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా జోడు పదవుల్లో ఉన్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ సూత్రాన్ని ఇది ఉల్లంఘించింది. ఈ వివాదంపై మీడియాకు ఉప్పందింది. దీనిపై పార్టీ తీవ్ర ఒత్తిడికి గురయింది. మార్చి 2న కేజ్రీవాల్ ఈ సమస్యపై రెండుసార్లు ట్వీట్ చేశారు. ‘‘పార్టీలో జరుగుతున్న పరిణామాలతో నేను గాయపడ్డాను. ఢిల్లీ మాపై చూపినదానికి ఇది నమ్మక ద్రోహం. ఈ పెంటలో అడుగుపెట్టను. ఢిల్లీ పాలనపైనే కేంద్రీకరిస్తాను.
ప్రజలు ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీయబోను’’.
ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఎవరు ద్రోహం చేశారు? కేజ్రీవాల్ అభిప్రాయం ప్రకారం ఆప్ నిరంకుశ పార్టీగా మారకూడదంటూ ఎంతో హుం దాగా, నమ్రతతో డిమాండ్ చేసినవారే మరి.
ఈ వ్యవహారంలోకి తాను దిగబోనని కేజ్రీవాల్ ప్రకటిస్తూనే యాదవ్, భూషణ్‌లపై దాడికి తన సహచరులను పురికొల్పారు. వీరిలో మాజీ జర్నలి స్టు అశుతోష్, ఆశిష్ ఖేతన్ కూడా ఉన్నారు. ఆశిష్ అయితే ట్వీటర్‌లో తాను వాడిన భాష పట్ల కేజ్రీవా ల్ క్షమాపణ చెప్పినట్లుగా తన యజమాని తరపున వకాల్తా పుచ్చుకుని మరీ వార్తను మోసుకొచ్చాడు.
పరిణామాలు తీవ్రమవుతున్నప్పుడు కేజ్రీవాల్ మాత్రం పదిరోజుల విరామం పేరుతో ఢిల్లీకి దూర మయ్యారు. క్రమశిక్షణా రాహిత్యంపై నిర్ణయం తీసుకునే సమావేశంలో ఉండవలసిందిగా కేజ్రీవా ల్‌ను పార్టీ కోరింది కాని యాదవ్, భూషణ్‌ల పని పట్టే బాధ్యతను అతడు తన అనుంగు సహచరు లకు వదిలిపెట్టేశారు. నిజానికి ఈ జగడం నుంచి కేజ్రీవాల్ తనకుతానుగా దూరం జరిగారని వార్త వచ్చింది. అయితే, ఘటనల పరిణామ క్రమంలో అది నిజం కాదని తేలిపోయింది.
యాదవ్, భూషణ్‌లకు జరిగిన అన్యాయంపై ఆప్ సభ్యుడొకరు తీవ్రంగా స్పందించిన ఉదం తాన్ని ప్రచురించిన ఒక బ్లాగ్ కథనం, ఆ సమావేశం లో ఏం జరిగిందో స్పష్టంగా బయటపెట్టింది. తా ము లేకుండానే అత్యున్నత నిర్ణాయక కమిటీని కొత్తగా ఏర్పర్చుకోవచ్చని, ఈ కమిటీని ఇతరులతో విస్తరించుకోవచ్చనీ అభిశంసనకు గురైన ద్వయం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఒక ప్రతిపాదన చేసిందట. నిర్ణాయక కమిటీని మార్పు లు లేకుండా అలాగే కొనసాగించవచ్చనీ, దాంట్లో సభ్యులుగా ఉంటున్నప్పటికీ కమిటీ కార్యక్రమాలకు తాము పూర్తిగా దూరమవుతామని ఆ ఇద్దరూ మరొక ప్రతిపాదన కూడా చేశారట. ఇవి రెండూ కూడా హేతుబద్ధమైన రాజీలే.
అయితే కొనసాగుతున్న సభ కాస్త విరామం తీసుకుందనీ, ఆ సమయంలో కేజ్రీవాల్‌ను ఫోన్‌లో సంప్రదించారని వార్తలొచ్చాయి. దాని తర్వాతే ఓటింగ్ జరిగింది. ఆ ఇద్దరినీ స్వల్పతేడాతో కమిటీ నుంచి తొలగించారు. వారి గర్వభంగానికి ఇదే మార్గమని కేజ్రీవాల్ శిబిరం భారతీయ ైశైలిలో భావించింది కానీ వారు తప్పటడుగు వేశారు.
ఎందుకంటే ఆ ఇద్దరూ ఈ మొత్తం ఘటనలో అత్యంత హుందాతో వ్యవహరించారు. తమ ఆరో పణలను మీడియా ముందుకు తీసుకెళ్లడానికి వారు తిరస్కరించారు. దీంతో అందరి సానుభూతి వారికే దక్కింది. అయితే కేజ్రీవాల్‌కు నిజమైన సమస్య మరొక చోట పొంచుకుని ఉంది.
ఈ మొత్తం వ్యవహారం పార్టీకి అత్యంత విలు వైన సంపదను దెబ్బతీసింది. ఆ సంపద పార్టీ వలం టీర్లు. ఇతర రాజకీయ పార్టీల నుంచి ఈ పార్టీని వేరు చేస్తున్నది వీరే. వీరు ప్రధానంగా మధ్యతరగతి నుంచి వచ్చారు. తాము చూస్తున్న పరిణామాల పట్ల వీరు బాధపడ్డారు. వారి ఉద్వేగాలు బయట పడాలి. వారి ప్రతిస్పందనకు ట్వీటర్, ఫేస్‌బుక్ వంటివే సరైనవిగా ఉంటాయి.
కేజ్రీవాల్ బృందం తమ తప్పిదాన్ని గుర్తించ గానే వారు చివరకు నోరు మూసుకున్నారు. అశు తోష్, ఖేతన్ ఈ వ్యవహారంలో కొనసాగించిన దూ కుడు ట్వీట్లను నిలిపివేశారు. దీనికి నిస్సందేహంగా కేజ్రీవాల్ ఆదేశాలే కారణమై ఉంటాయి. ముఖ్య మంత్రి ఇప్పటివరకూ మౌనంగానే ఉన్నారు కానీ ఈ వ్యవహారంలో తాను ప్రయోగించిన మాటలను తానే దిగమింగుకుని, ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే ఈ సమస్యతో వ్యవహరించక తప్పదు.
ఆమ్‌ఆద్మీ పార్టీకి సంబంధించినంతవరకూ ఈ అహంకారపూరితమైన దాడితో నాకు ఎల్లప్పుడూ సమస్యే. ఇతర పార్టీలన్నీ అవినీతిమయమైనవనీ, సూత్రరహితమైనవనీ, తాము మాత్రమే పవిత్ర మైన వారిమనీ వారు నొక్కి చెప్పుకునేవారు. ఆ విశ్వసనీయతకు ఈ వారం గండిపడింది. పైగా తమ తొలి ఢిల్లీ ఎన్నికల నుంచి వారు ప్రచారం చేస్తూ వచ్చిన స్వరాజ్ భావన ప్రస్తుతం ఛిన్నాభిన్న మైపోతోంది. ఇరుగుపొరుగున ఉన్నవారికీ, భవం తుల్లో ఉన్నవారికీ కూడా అధికారం ప్రాప్తించాలనీ, ప్రభుత్వ డబ్బును ఎక్కడ, ఎలా ఖర్చుచేయాలనే విషయాన్ని సాధారణ పౌరులూ, ఓటర్లూ నిర్ణయిం చాలన్నదే స్వరాజ్య భావన. ఇప్పుడు ఆప్ స్వరా జ్యలో ‘స్వ’ (లేదా నేను) ఎవరు అన్నదే నాకు ఆశ్చ ర్యం కలిగిస్తోంది. ఎందుకంటే కేజ్రీవాల్, అతడి స్వయంపాలనే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది.
అందుకే యోగేంద్ర యాదవ్ గురించి కేజ్రీ వాల్ భయపడి ఉండాలి. ఆమ్ ఆద్మీ పార్టీలో అత్యం త ప్రముఖ వక్తల్లో ఒకరైన ఈయన కేజ్రీవాల్‌కి ఇబ్బంది కలిగించే పక్షంలో ఉన్నట్లు కనబడుతోంది. అత్యంత అవకాశవాది అయిన నా స్నేహితురాలు షాజియా ఇల్మీ చేసింది సరైందేనని ఈ ఘటన తేల్చి చెప్పింది. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరు తున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆప్ చాలా కోణాల్లో నిరంకుశంగా ఉండిందని, ఉంటోందనీ చెప్పారు. ఆరోజు ఆమె చెప్పిన ఈ మాటలను విని మేం ఒక్కసారిగా నవ్వేశాం. కానీ, ఆమె మాటలు తప్పని నేడు చెప్పగలిగేది ఎవరు?
(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
ఈమెయిల్:aakar.patel@icloud.com