మన విజయాలపై పరాజయాలదే పైచేయి? | why india not dominating in cricket world | Sakshi
Sakshi News home page

మన విజయాలపై పరాజయాలదే పైచేయి?

Published Sun, Nov 1 2015 2:37 PM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

మన విజయాలపై పరాజయాలదే పైచేయి?

మన విజయాలపై పరాజయాలదే పైచేయి?

అవలోకనం:
 
మనం ఏ విషయంలోనూ ప్రపంచస్థాయి నేతలం కాము. కాబట్టే క్రికెట్‌లో కూడా మనం ప్రపంచానికి నాయకత్వం వహించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. మనం ఎందుకింత చెత్తగా ఆడుతుంటాం అనే విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండానే కోట్లాది భారతీయులం క్రికెట్‌ను చూస్తూ ఆ క్రీడకు వందల కోట్ల రూపాయలను అప్పనంగా అందిస్తూ ఉంటాం. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రదర్శితమయ్యే భారతీయుల తీవ్ర జాతీయవాదం,  ఉత్సాహం మన జట్టు వాస్తవ ఆటతీరులో ప్రతిఫలించకపోవడమే అసలైన విషాదం.  
 
మనకాలపు అతి గొప్ప రహస్యాలలో ఇదీ ఒకటి అయి ఉండాలి: భారతీయులు క్రికెట్‌లో ఎందుకు ఆధిపత్యం చలాయించడంలేదు?
 అంటే నా ఉద్దేశం అడపాదడపా విజయాలు సాధించలేదని కాదు. మనం అలాంటి విజయాలు పొందుతున్నాం. కాని ఒకప్పుడు వెస్టిండీస్.. తర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం చలాయించినట్లుగా  మనం ఎందుకు క్రికెట్‌పై శాశ్వతంగా ఆధిపత్యం చలాయించలేకపోతున్నాం అన్నదే ప్రశ్న.


ఇంతవరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన క్రికెట్ బోర్డు భారత్‌దే. కాబట్టి మనకు తగిన వనరులు లేవన్నది ప్రశ్నే కాదు. క్రికెట్ లోని ప్రతి ఆర్థిక అంశంపైనా మనం ఎంతగా ఆధిపత్యం చలాయిస్తున్నామంటే, ఇతర దేశాల క్రికెట్ బోర్డులన్నీ ఇండియాకు వంత పాడే స్థాయికి దిగిపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత లాభదాయకమైన ఈవెంట్‌గా మారింది. కానీ భారత పలుకుబడి దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా మోటార్ సైకిళ్లనుంచి పాన్ మసాలా వరకు అమ్మకాలు సాగిస్తూ భారతీయ కంపెనీల ప్రకటనలే కనిపిస్తుం టాయి. అలాంటప్పుడు వాస్తవ క్రీడలో మనం ఎందుకు ఆధిపత్యం చలాయించ లేకపోతున్నాం?


 మనం గెలిచిన మ్యాచ్‌ల (124) కంటే మనం ఓడిపోయిన మ్యాచ్‌ల (157) సంఖ్యే ఎక్కువ. ఇది ఆశ్చర్యం గొలిపించదు. ఎందుకంటే మనం సొంత గడ్డపైనే బాగా ఆడతాం. మన స్లో వికెట్ పిచ్‌లపై రెండు సార్లు మనల్ని ఔట్ చే యడం ఇతర జట్లకు సాధ్యం కాదు. మరోవైపున మనం ఫాస్ట్ వికెట్ పిచ్‌లపై త్వరత్వరగా అవుట్ అయిపోతుంటాం. కాబట్టి అలాంటి చోట్ల గెలవడం కంటే ఓడిపోవడమే చాలా సులభంగా ఉంటుంది. అయితే ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్ని దేశాలతోనూ మనకు పరాజయ రికార్డే ఎందుకుంది?


 ఆస్ట్రేలియాపై మనం 24 టెస్టుల్లో గెలుపొందగా, 40 సార్లు ఓడిపోయాం. ఇంగ్లండ్‌పై 21 సార్లు గెలిస్తే, 43 సార్లు ఓడిపోయాం. వెస్టిండీస్‌పై 16 సార్లు గెలిస్తే 30 సార్లు ఓడిపోయాం. చివరకు పాకిస్తాన్‌పై కూడా మనం 9 సార్లు గెలిస్తే, 12 సార్లు ఓడిపోయాం. (పాకిస్తాన్‌తో మనం ఎక్కువ మ్యాచ్‌లు ఆడనందుకు మనల్ని మనం అభినందించుకోవాలి. ఎందుకంటే బలమైన ఉద్వేగాలతో కూడిన ప్రస్తుత వాతావరణంలో పరాజయాన్ని మనం అసలు సహించలేం). గత రెండు దశాబ్దాలకు పైబడి మాత్రమే క్రికెట్ ఆడుతూ వస్తున్న దక్షిణాఫ్రికాపై కూడా మనం 7 విజయాలను నమోదు చేయగా 13 సార్లు ఓటమిపాలయ్యాం.


 మొత్తంమీద మనం విజయాల రికార్డును అధికంగా నమోదు చేసిన టీమ్‌లు రెండే రెండు. ఒకటి శ్రీలంక (మనకు 16 విజయాలు, 7 ఓటములు) రెండు న్యూజిలాండ్ (మనకు 18 విజయాలు, 10 ఓటములు).
 ఇక వన్డే ఇంటర్నేషనల్ పోటీల్లో కూడా విషయాలు ఇంతకంటే ఏమంత భిన్నంగా లేవు. ఈ రంగంలో మరిన్ని గణాంకాలను మీ ముందుంచి విసిగించను, నిస్పృహకు గురిచేయను. నిష్పక్షపాతంగా మనం ఈ సంఖ్యల కేసి చూసినట్లయితే అవి ఒక వింత విషయాన్ని మనకు తెలియబరుస్తాయి. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రదర్శితమయ్యే భారతీయుల తీవ్ర జాతీయవాదం, శ్రద్ధ, ఉత్సాహాలు మన జట్టు వాస్తవ ఆటతీరులో ప్రతిఫలించవు. బాలీవుడ్ భాషలో చెప్పాలంటే మనం షారుక్ ఖాన్ గురించి ఆలోచిస్తూ షాహిద్ కపూర్ క్రికెట్‌ను ఆస్వాదిస్తూంటాం.


 ఇక్కడ ప్రశ్న ఏదంటే, భారతీయులు నిజంగా ఆసక్తి ప్రదర్శిస్తున్న ఏకైక ఆటలో మనం ఎందుకు ఆధిపత్యం చలాయించలేకపోతున్నాం? మన జనాభా 120 కోట్లు. మనలో చాలామంది ఏ ఇతర క్రీడనూ తిలకించరు, ఆడరు. ఆస్ట్రేలియా జనాభా రెండున్నర కోట్లకంటే తక్కువ. కాని వారు క్రికెట్‌ను తమ ఏకైక క్రీడగా ఎన్నడూ భావించరు. క్రికెట్ ప్రపంచాన్ని మొత్తంగా కలిపినా భారత జనాభాలో సగానికంటే మించదు. కాబట్టి తగినంత టాలెంట్ లేకపోవడం అనేది ప్రశ్నే కాదు. ఐపీఎల్ విస్తరణలో ఉన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి ఏమిటంటే టీమ్‌లను భ ర్తీ చేయడానికి స్థానిక టాలెంట్ తగినంతగా లేకపోవడమే. అందుకే కొంతమంది గుర్తింపు పొందిన స్థానిక ప్లేయర్లు అంత భారీ వేతనాలు తీసుకుంటున్నారు. ఇది అధిక డిమాండ్ కంటే సరఫరా కొరతనే సూచి స్తుంటుంది.


 కాని మనకున్న జనాభా సంఖ్యను చూసినట్లయితే, ఆస్ట్రేలియా జట్టు తరహా నాణ్యత కలిగిన 60 జట్లు మనకు ఉండాలి. కాని మనకు ఒక్కటంటే ఒక్క సరైన జట్టు లేదు. మన చరిత్రలోనే ఆస్ట్రేలియా జట్టు లాంటి ఒక్క జట్టును మనం చూడలేం. ఎందుకు?
 ఇది స్లో, ఫాస్ట్ పిచ్‌కు సంబంధించిన విషయం కాదు. అసలు విషయం అదే అయితే మనం ఫాస్ట్‌వికెట్లపై శిక్షణ ఎందుకు తీసుకోం? మన జట్లకు  సరైన విధంగా శిక్షణ ఇవ్వడానికి మన వద్ద కోరినంత డబ్బు ఉంది కూడా. అయినా మనం అలాంటి శిక్షణ ఎందుకు ఇప్పించడం లేదు? బహుశా శిక్షణ లేకపోవడం, సామగ్రి, సౌకర్యాలు లేకపోవడం నిజమైన సమస్య కాకపోవచ్చు.
 మీలో చాలామంది ఆలోచిస్తున్నట్లే, దీనికి జవాబు మరోచోట ఉంటుందని నేననుకుంటున్నాను. బహుశా ప్రగాఢవాంఛ, నైపుణ్యంపై ఇది ఆధారపడి ఉండవచ్చు. మనం ఏ విషయంలోనూ ప్రపంచస్థాయి నేతలం కాము. కాబట్టే క్రికెట్‌లో కూడా మనం ప్రపంచానికి నాయకత్వం వహించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు.


 వ్యక్తులుగా నైపుణ్యంపై మనం పెడుతున్న మదుపు చాలా తక్కువ. మైదానంలో ఉన్న మన క్రికెటర్లను... ఆస్ట్రేలియాతో, వెస్టిండీస్‌తో, ప్రత్యేకించి ప్రస్తుతం భారత్‌లో సందర్శిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లతో పోల్చి చూసినట్లయితే ఏదో తప్పు జరుగుతోందని, చాలా తేడాగా ఉందని మనకు తెలిసిపోతుంటుంది. ఒక పక్షం ఏమో (మన పక్షం కాదు) అథ్లెటిక్స్‌లాగా పని చేస్తుంటారు. భారత క్రికెటర్లు కాస్త ఉబ్బినట్లుగా, ఫిట్ కానట్లుగా కనిపిస్తుంటారు. కానీ వారు జాతీయ జట్టులోకి ప్రవేశిస్తుంటారు. అత్యంత నైపుణ్యం కంటే ‘ఫర్వాలేదు’ అనేదే మనకు చాలా ముఖ్యమైన  లక్షణంగా కనబడుతుంటుంది.


 క్రికెట్‌లో మనం ఆధిపత్యం చలాయించలేకపోవడం అనేది మన కాలపు అతి పెద్ద మిస్టరీల్లో ఒకటై ఉండాలని నేను ఈ వ్యాసం మొదట్లోనే రాశాను. అయితే అది మాత్రమే కాదు. మనం ఎందుకింత చెత్తగా ఆడుతుంటాం అనే విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండానే కోట్లాది భారతీయులం క్రి కెట్‌ను చూస్తూ ఆ క్రీడకు వందల కోట్ల రూపాయలను అప్పనంగా అందిస్తూ ఉంటాం.

http://img.sakshi.net/images/cms/2015-10/41445119145_625x300.jpg
 (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement