కొత్త అర్థం సంతరించుకున్న ‘జాతి వ్యతిరేకత’ | opinion on Breed Opposition in india by Akar Patel | Sakshi
Sakshi News home page

కొత్త అర్థం సంతరించుకున్న ‘జాతి వ్యతిరేకత’

Published Sun, Feb 28 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

బస్తర్ ఆదివాసీ మహిళలతో న్యాయసహాయ బృందం(ల్యాప్ టాప్ లతో)

బస్తర్ ఆదివాసీ మహిళలతో న్యాయసహాయ బృందం(ల్యాప్ టాప్ లతో)

అవలోకనం
ఢిల్లీలాగే బస్తర్‌లో కూడా ప్రభుత్వం దృష్టిలో జాతి వ్యతిరే కి ముద్ర కొత్త అర్థాన్ని సంతరించుకున్నట్టుంది. ఒకసారి మీపై ‘జాతి వ్యతిరేకి’ ముద్ర వేశారంటే, మీకిక రాజ్యాంగం ప్రకారం సంక్రమించే ప్రాథమిక హక్కులు ఏవీ ఉండవనే అనిపిస్తోంది. మీరిక ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీల్లేదు, హింసకు వ్యతిరేకంగా మీకు ఇక రక్షణ లభించదు, మీరు దూషణలకు గురైనా న్యాయం జరగదు.
 
 ఢిల్లీ నగరం అసమ్మతి వ్యక్తం చేసే హక్కు కోసం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాటం సాగుతున్న రణ రంగంగా మారిందని అనక తప్పదు. ఇంతకు ముందు, 2012 డిసెంబర్ 12 రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం జరిపి, హత్యగావించిన సందర్భంగానే ఇంత స్థాయి తిరుగుబాటు వెల్లువెత్తడం చూశాం. అయితే ఒక విశ్వవిద్యాలయంలో చేసిన నినాదాల గురించిన ఆగ్రహం ఈసారి చీలిపోయింది. అలాఅని ఈ సందర్భంగా ముందుకు వచ్చిన సమస్యలు తక్కువ ప్రాధాన్యంగలవేం కావు... మనం ఇంకా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును గౌర విస్తున్నామా? ఇతరుల హక్కుల పరిరక్షణ కోసం నిలిచే వారికి రక్షణ కల్పిస్తున్నామా?
 
ఢిల్లీకి 1,500 కిలో మీటర్ల దూరంలో ఉన్న బస్తర్‌లో కూడా ఇవే ప్రశ్నలు... మరింత కొట్టవచ్చినట్టుగా ముందుకు వస్తున్నాయి. రాజ్య నిర్బంధం అక్కడ మెల్లగా పెరుగుతున్న ఆగ్రహం నుంచి, పూర్తి స్థాయి విస్ఫోటనంగా   మారుతోంది. బస్తర్ కేంద్రంగా పనిచేస్తున్న కార్యకర్తలను, పాత్రికేయులను పోలీసులు పిలిచి ప్రశ్నించడం నిత్యకృత్యంగానూ, వృత్తిపరమైన ప్రమాదంగానూ మారింది. తప్పుడు అరెస్టులు కూడా నిజమైన ముప్పుగానే మారుతున్నాయి.

 స్థానిక పాత్రికేయుడు సంతోష్ యాదవ్ దాదాపు ఐదు నెలలుగా తప్పుడు అభియోగాలతో పెట్టిన కేసుల కింద నిర్బంధంలో ఉన్నాడు. ఈ ప్రాంతంలోని ఆదివాసుల దుస్థితిపై వార్తా కథనాలను వెలువరించినందుకుగానూ ఆయనను 2015 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. అంతకు ముందు కూడా పోలీసులు తరచుగా ఆయనను వేధింపులకు గురిచేశారు. ఒక సందర్భంలో బట్టలూడదీసి చావ బాదారు కూడా. ఆయన సహాయం చేయడం వల్ల చాలా మంది ఆదివాసులకు న్యాయ సహాయం లభించింది. కిక్కిరిసిన ఛత్తీస్‌గఢ్ జైళ్లలో వేలాదిమంది ఆది వాసులు నక్సలైట్లన్న ఆరోపణతో మగ్గుతున్నారు. ఖైదీలను ఉంచగలిగిన పూర్తి స్థాయిని బట్టి చూస్తే జాతీయ స్థాయిలో జైళ్లలోని ఖైదీలు సగటున 114%. కాగా ఆ రాష్ట్ర జైళ్లలోని ఖైదీలు సగటున 253% అని జగదల్‌పూర్ న్యాయ సహాయ బృందం (జగ్‌లాగ్) సమీకరించిన సమాచారం తెలుపుతోంది. ఇక కంకేర్ జైల్లో అది 428%.

 సంతోష్ యాదవ్ న్యాయవాది ఈశా ఖందెల్‌వాల్, తన సహ కార్యకర్త షాలినీ జిరాతో కలిసి జగదల్‌పూర్ న్యాయ సహాయ బృందంలో భాగంగా ఆదివాసీ గ్రామీణులకు ఏళ్లతరబడి న్యాయ సహాయం అందిస్తున్నారు. పోలీసులు వారిద్దరినీ హఠాత్తుగా ప్రశ్నించడానికి పిలిపించారు. దీంతో గతవారం, ఇంటి యజమాని ఆ ఇద్దరు న్యాయవాదులను ఇల్లు ఖాళీ చేయమన్నాడు. అలాగే మాలినీ సుబ్రహ్మణ్యంకు కూడా ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు అందాయి. బస్తర్‌లోనే నివసిస్తూ, అక్కడి మానవ హక్కుల ఉల్లంఘన గురించి నివేదిస్తున్న జాతీయ మీడియాకు చెందిన పాత్రికేయులు కొద్ది మందిలో ఆమె ఒకరు.

 ఈ కార్యకర్తలు, పాత్రికేయులు ఒకరి పనికి మరొకరు సహాయ పడుతుండే వారు. మాలినీ సుబ్రహ్మణ్యం మావోయిస్టుల మద్దతుదారని ఆరోపిస్తూ ఆమె ఇంటి ముందు రాష్ట్ర పోలీసులతో సంబంధాలున్న ‘సామాజిక్ ఏక్తా మంచ్’ అనే మావోయిస్టు వ్యతిరేక గ్రూపు సభ్యులు ప్రదర్శన జరిపారు. ఆమె వారిపై పెట్టిన కేసులో ఖందెల్‌వాల్ న్యాయవాదిగా ఉన్నారు. సంతోష్ యాదవ్‌ను చట్టవ్యతిరేక కార్యకాలాపాల (నివారణ) చట్టం, ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక పోలీసు భద్రతా చట్టం, తదితర చట్టాల కింద నిర్బంధించిన విషయాన్ని కూడా మాలినీ సుబ్రహ్మణ్యం జాతీయ మీడియాకు నివేదించారు. జగదల్‌పూర్ న్యాయ సహాయ బృందానికి చెందిన ఇద్దరు న్యాయవాదులతో పాటూ, మాలినీ సుబ్రహ్మణ్యం కూడా ఇప్పుడు బస్తర్‌కు వెలుపలే ఉన్నారు. యాదవ్ ఇంకా జైల్లోనే మగ్గుతున్నాడు.

 సోనీ సోరీ అనే ఆదివాసీ కార్యకర్తను పోలీసు కస్టడీలోనే అత్యాచారం జరిపి, ఏళ్ల తరబడి నిర్బంధించారు. చివరికి ఆమెను నిర్దోషిగా విడుదల చేసినా... ఆమెపై దాడి తప్పలేదు. ఫిబ్రవరి 20 రాత్రి ఆమెపై నల్లటి పదార్థాన్ని చల్లిన దుండగులు, బస్తర్‌లోని ఒక సీనియర్ అధికారికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆపకపోతే ఇక ఆమె కుమార్తెపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ‘మావోయిస్టు’ అని ఆరోపణకు గురైన హద్మా కశ్యప్‌ను ఫిబ్రవరి 3న పోలీసులు బూటకపు ఎదురు కాల్పుల్లో హతమార్చారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదే పోలీసు అధికా రికి వ్యతిరేకంగా ఆ ఎన్‌కౌంటర్‌పై ఫిర్యాదు చేసే విషయంలో సోనీ సోరీ ఆ కుటుంబానికి సహాయం చేస్తున్నారు.

 బస్తర్‌లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతున్నాయని పలు వార్తా నివేదికలు వెలువడిన తర్వాతే అక్కడి నుంచి పాత్రికేయులను, న్యాయ వాదులను బహిష్కరించడం, సోనీ సోరీపై దాడి జరగడం కాకతాళీయమే కావచ్చు. నవంబర్ నుంచి తమపై భద్రతా బలగాలు పలుమార్లు మూకుమ్మడి అత్యాచారాలు, లైంగిక దాడులు, హింసకు పాల్పడ్డాయని ఆదివాసీ గ్రామీణ మహిళలు పలు సందర్భాల్లో తెలిపారని బేలా భాటియా అనే పాత్రికేయురాలు తెలిపారు. ఆమె స్వయంగా వేధింపులకు గురయ్యారు కూడా. ఈ కేసులన్నిటి లోనూ పోలీసులు మొదట్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి నిరాకరించారు. అయితే కార్యకర్తలు పట్టువిడవకుండా అదేపనిగా ఒత్తిడి చేస్తూ రావడంతో అంగీకరించక తప్పలేదు.  

 ఛత్తీస్‌గఢ్ పోలీసులు పాత్రికేయులను మావోయిస్టు మద్దతుదార్లనడానికి సాధారణంగా వెనుకాడరు. ‘జాతి  వ్యతిరేకత’ కథనాన్ని ప్రయోగించడంలోనూ అంతే చురుగ్గా ఉంటారు. గత వారం, బస్తర్‌లోని బీబీసీ హిందీ పాత్రికేయులు ఒకరికి బెదిరింపులు రావడంతో తమ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లి పోయారు. ‘‘నీలాంటి జర్నలిస్టుతో కాలాన్ని వృథా చేసుకోవడంలో అర్థం లేదు. జాతీయవాద, దేశభక్త వర్గానికి చెందిన మీడియా నాకు మద్దతు తెలుపుతుంది, నేను వారితో సమయం వెచ్చించడం మంచిది’’ అని ఆ ప్రాంతంలోని అత్యంత సీనియర్ పోలీసు అధికారి, బస్తర్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆ బీబీసీ జర్నలిస్టుకు టెక్స్ట్ మెసేజ్ పంపారు.

ఢిల్లీలాగే బస్తర్‌లో కూడా ప్రభుత్వం దృష్టిలో ‘జాతి వ్యతిరే కి’ ముద్ర కొత్త అర్థాన్ని సంతరించుకున్నట్టుంది. ఒకసారి మీపై ‘జాతి వ్యతిరేకి’ ముద్ర వేశారంటే, మీకిక రాజ్యాంగం ప్రకారం సంక్రమించే ప్రాథమిక హక్కులు ఏవీ ఉండవనే అనిపిస్తోంది. మీరిక ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీల్లేదు, మీకిక హింసకు వ్యతిరేకంగా రక్షణ లభించదు, లేదా మీరు దూషణలకు గురైనా  న్యాయం జరగదు. మధ్య యుగాల యూరప్‌లో అసమ్మతి తెలిపినవాళ్లను మంత్రగాళ్లు ముద్ర వేసి సజీవ దహనం చేసేవారు. ఆ రోజుల్లోలాగే నేడు ఢిల్లీ, బస్తర్‌లలో మంటలు వెలిగిస్తే చాలు... వెంటనే తోసేయడానికి గుంపులు సిద్ధంగా ఉంటున్నాయి.


 -ఆకార్ పటేల్
వ్యాసకర్త : కాలమిస్టు, రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement