మనకు ఒలింపిక్ పతకాలు ఎందుకు రావంటే..
అవలోకనం
పతకాలు గెలవకుండా భారతీయులను నిలువరిస్తున్నది బాహ్య ప్రపంచం కాదు. మన సంస్కృతే ఆ పని చేస్తోంది. సాంస్కృతికంగా మనలాంటివే అయిన మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కలుపుకుంటే మనం 160 కోట్ల ప్రజలం. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు. అయినా ప్రపంచ స్థాయిలో దాదాపుగా మనం ఎందుకూ కొరగాము. కేవలం మన సంఖ్య వల్లనైనా ఎట్టకేలకు కొన్ని పతకాలు రావడం మొదలైనా మనం సుదీర్ఘకాలంపాటూ అక్కడే ఉంటాం.
ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల ఘోర ప్రదర్శన గురించి చదువుతుంటే ఎవరికైనాగానీ క్రీడలలో మనం మరీ ఇంత అధ్వానమా అని అనిపించవచ్చు. దక్షిణ ఆసియా దేశాల్లోని ఒక దేశం ఇంత వరకు ఎన్నడూ పంపనంతటి పెద్ద ఒలింపిక్ బృందాన్ని మనం పంపడం గురించి మీడియా నెలల తరబడి కథనాలను వెలువరించింది. ఈసారి మనం మంచి ఫలితాలను సాధిస్తామనే ఆశతో ఉన్నట్టు అనిపించింది.
ఒక కుస్తీ వస్తాదుపై విధించిన డోపింగ్ నిషేధాన్ని ఎత్తివేయడం ఒక రోజున ప్రధాన వార్త అయింది. ఆ రోజు రాత్రి నేను హాజరుకావాల్సిన రెండు టీవీ కార్యక్రమాలు రద్దు కావడం వల్ల నాకా విషయం తెలిసింది.కాబట్టి మనం ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శనను చూపుతున్నామా? మన ప్రదర్శన ఇంత అధ్వానంగా ఉండ టానికి రెండు కారణాలున్నాయి.
ఒకటి సార్వత్రిక కారణమే. అది బాహ్య ప్రపంచంతో ముడిపడి ఉన్నది. అంటే క్రీడా సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహం, మద్దతు, తగు పోషకాహార స్థాయి, సాధారణ ప్రజారోగ్యం, మంచి తర్ఫీదు (కోచింగ్), శిక్షణ వంటివని నా భావన. ఇవి ఉంటే ఒక దేశం పతకాలను సాధించడం మొదలెడుతుంది. వీటిలోని చాలా విషయాలకు సంబంధించి మన దేశంలోని పరిస్థితులు మెరుగుపడుతున్నాయి, కాదనలేం. ఉదాహరణకు, సదుపాయాలు, తర్ఫీదు (క్రికెట్లో జరుగుతున్నట్టే వీటిలోనూ చాలా భాగం విదేశీయులకు ఔట్‌సోర్స్ చేస్తున్నారు). మనకున్న సదుపాయాలు పాశ్చాత్య దేశాలతో పోల్చదగినవేమీ కావు. అయినా పరిస్థితులు మెరుగుపడుతున్నాయనేది కాదనలేం.
మన దేశంలో చాలా మంది ప్రజలు పేదలు, వారికి తగినంత పోషకాహారం లభించడం లేదనేది నిజం. అయినా చాలా మందికి లభిస్తోందనేదీ వాస్తవమే. భారీ పరిమాణంలోని మధ్య తరగతి పోషకాహార అవసరాలన్నీ తీరుతున్నాయి. ఈ మధ్యతరగతి చాలా దేశాల జనాభాకు సమానమని తరచుగా వింటుంటాం. ఇక పతకాల విజేతలకు డబ్బు, ఉద్యోగాల రూపంలో ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ లభిస్తూనే ఉంది. కాబట్టి ఈ అంశాన్ని ఒక పరిధికి మించి తప్పు పట్టలేం.
క్రికెట్ కంటే అథ్లెటిక్స్ (వ్యాయామ క్రీడలు) తదితరాలకు మీడియా నుంచి చాలా తక్కువ మద్దతు లభిస్తున్నదనడం సరైనదే. కానీ అది చాలా దేశాల్లో కూడా ఉన్న వాస్తవమే. చరిత్రలోనే గొప్ప ఒలింపిక్ క్రీడాకారుడైన మైఖేల్ ఫెల్ప్స్‌ను న్యూయార్క్ వీధుల్లో ఎవరూ గుర్తుపట్టరు. అదే బేస్‌బాల్, బాస్కెట్ బాల్ స్టార్లనైతే జనం ముంచెత్తుతారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా సార్వత్రికంగా ఆవశ్యకమైన పరిస్థితులు మన దేశంలో కూడా ఉన్నాయి. అంటే మనం మరిన్ని పతకాలను గెలవాల్సి ఉన్నదని అర్థం.
ఇక స్థూలంగా రెండో కారణాన్ని చూద్దాం. ఇది బయటి ప్రపంచానికి సంబంధించిన ప్రత్యేక దృక్కోణం, శారీరక శ్రమ. నేను చెప్పేదాని అర్థం బోధపడటానికి నేనో రాజకీయ ఉదాహరణను చూపుతాను. అమెరికా మూడో అధ్యక్షుడైన థామస్ జెఫర్సన్ చాలావరకు ఉదయాన్నే బయటకు వెళ్లి తానే స్వయంగా తన బారోమీటర్‌తో వాతావరణంలోని పీడనం ఎంత ఉన్నదో కొలిచేవాడు. 43వ అధ్యక్షుడైన జార్జి డబ్ల్యూ బుష్‌కు కలుపు మొక్కలను ఏరేయడం, తన ఫామ్ హౌస్ ఆవరణలో మొలిచిన పిచ్చిమొక్కలను పీకిపారేసి శుభ్రం చేయడం అంటే ఇష్టం.
మన నేతల్లో ఎవరైనా అలాంటి పనులు చేయడాన్ని మనం ఊహిం చగలమా? లేదు. మనలో కొద్దిమందిమి మాత్రమే అలాంటి పనులను చేస్తుండటమే అందుకు కారణం. మనకు సేవకులున్నది కేవలం ఆర్థిక కారణాల వల్లనే కాదు. శారీరక శ్రమను చేయడం మనకు ఆకర్షణీయంగా అనిపించదు.
ఆ పని చేయడం సామాజిక స్థాయిని తక్కువగా చూపుతుంది. మన తోటను చూసుకుని, కారును కడిగిపెట్టేవారు ఎవరైనా దొరికేట్టయితే ఆ పనులను మనం చేయం. మనకు తోట ఉన్నందుకు సంతోషిస్తామే తప్ప. తోట పని చేయడాన్ని ఆస్వాదించలేం. ఇలాంటి సంస్కృతిలో, శారీరక శ్రమ చేసే జీవితం పట్ల తృణీకార భావం ఉన్నచోట... సదుపాయాలు ఎంత మంచిగా ఉన్నాగానీ ప్రపంచస్థాయి వ్యాయామ క్రీడాకారులను తయారుచేయడం సాధ్యం కాదు.
శారీరక శ్రమతో కూడిన పనిని చేయడంలో ఆనందాన్ని పొందడమే ఇక్కడ కీలకమైనది. భారతీయులు చేసే అలాంటి పనిలో అత్యధికం జిమ్‌లో చే సేదే. ఒక సోఫాను ఎత్తాలన్నా లేదా మరో చోటికి మార్చాలన్నా మరెవరో వచ్చి చేయాల్సిందే. తమ పనిని చేసిపెట్టమని అడగని కొందరు అమెరికన్ కోటీశ్వరులు నాకు తెలుసు. ఇంట్లోని తమ వ్యక్తిగత ప్రదేశంలోకి వేరెవరో ప్రవేశించడం వారికి ఇష్టం ఉండదు. శారీరక శ్రమతో కూడిన రోజువారీ పనులను చేయడంలో వారు ఆనందాన్ని పొందుతారు. మనం ఆ పని చేయం. అది కనిపించే వాస్తవం.
అలాంటి చోట యువతీయువకులు ఏకాగ్రదృష్టితో తమ శారీరక నైపుణ్యాలపైన కేంద్రీకరిస్తారని ఆశించలేం.పతకాలు గెలవకుండా భారతీయులను నిలువరిస్తున్నది బాహ్య ప్రపంచం కాదు. మన సంస్కృతే ఆ పని చేస్తోంది. సాంస్కృతికంగా మనలాంటి వారే అయిన మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కలుపుకుంటే మనం 160 కోట్ల ప్రజలం. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు. అయినా ప్రపంచ స్థాయిలో దాదాపుగా మనం ఎందుకూ కొరగాము.కేవలం మన సంఖ్య వల్లనైనా ఎట్టకేలకు కొన్ని పతకాలు రావడం మొదలైనా మనం సుదీర్ఘకాలంపాటూ అక్కడే ఉంటాం. బహుశా నౌకరు చేసిచ్చిన టీ తాగుతూ మనలో ఉన్న లోపం ఏమిటా అని చర్చిస్తాం.
వ్యాసకర్త: ఆకార్ పటేల్, కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com