గొప్ప ఫలితాలు ఆశించొద్దు
జాతిహితం
మొదటి 50లోకి, 25లోకి, చివరకు 10లోకి ప్రవేశించకుండానే పతకాలు సాధ్యం కావు. కాబట్టి ఏ దేశమూ హఠాత్తుగా ప్రపంచ చాంపియన్లను తయారు చేసేయలేదు. 1988 సియోల్ నాటికి తొలి 25లో చోటు సాధించిన భారత క్రీడాకారులు ఒక్కరే. నేడు అలాంటి వారి సంఖ్య 100కు చేరింది. కనీసం 30 మంది మొదటి 10లో ఉంటున్నారు. మన హాకీ జట్టు, సైనా నెహ్వాల్ ఇప్పుడు తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. మనకున్న ప్రతిభాపాటవాల పునాదితో నాటకీయమైనదేమైనా జరగాలనుకోవడం ఆకాంక్ష మాత్రమే.
ఒలింపిక్ క్రీడల పట్ల మన అభిప్రాయాలు స్థూలంగా ఈ రెండిటిలో ఒక కోవకు చెందినవిగా ఉంటాయి. ఒకటి, సాధారణ అభిమానుల అభిప్రాయం. భారత క్రీడాకారులు ఎన్నో బలహీనతలు ఎదుర్కొంటూ కూడా తమ శాయ శక్తులా కృషిచేస్తున్నారని, వారు కొన్ని పతకాలనైనా గెలవగలిగితే అదే అద్భు తమనేది అత్యధిక సంఖ్యాకుల భావన. ఇక రెండో కోవకు చెందేవారిని శోభాడే క్లబ్ అనొచ్చు. వారి దృష్టిలో భారతీయులకు సంబంధించినంత వరకు ఒలింపిక్స్ అంటే ప్రజాధనంతో సాగించే విలాస యాత్ర లేదా వృథా వ్యయం. కాబట్టి మన డబ్బును, ఉద్వేగాలను కూడా వృథా చేసి కోరి అవ మానాన్ని కొనితెచ్చుకోవడం ఎందుకనేది వారి భావన. శోభా డే బహిరం గంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంపై ఆగ్రహం వెల్లువెత్తాక కూడా నేను ఈ రెండు అభిప్రాయాలు సరైనవేనని అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. అది చాలదన్నట్టు దీన్ని మరింత సంక్లిష్టం చేస్తూ ఈ రెండు అభిప్రాయాలు తప్పు అని కూడా నేనంటాను.
రెండూ ఎందుకు సరైనవో అర్థం చేసుకోవడం సులువే. ప్రపంచ క్రీడా రంగంలో ఘనతను సాధించాలని మనం సహజంగానే ఆశిస్తాం. అది లభిం చకపోవడంతో నిరుత్సాహానికి గురవుతాం. మనకున్న అవకాశాల గురించి ఎక్కువ ఆశావాదంతో ఉంటాం. మన వైఫల్యాలను మన్నిస్తాం. ఏదేమైనా సెంటిమెంటును తప్పు పట్టలేం. రెండూ ఎందుకు తప్పు? ప్రత్యేకించి ఇప్పటి అతి జాతీయవాద రోజుల్లో (స్వాతంత్య్రదినోత్సవ వారాన్ని దృష్టిలో పెట్టుకుని అనడం లేదు)... ప్రపంచాన్ని జయించే స్థాయికన్నా తక్కువ ఏదీ మనం అంగీకరించడానికి ఇష్టపడటం లేదు.
హఠాత్తుగా అగ్రస్థానం అందుకోలేం
ఆశావాదం, ఈసడింపులతో కూడిన ఈ రెండు రకాల ఆలోచనలూ విజ యాన్ని కేవలం పతకాల రూపంలో చూడటమే వాటిలోని లోపం.రియోలో ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడలు మొదటి రోజున నేను ఇది రాస్తున్నాను. ఈ ఒలింపిక్స్‌లో మనం ఇప్పటికీ గత బీజింగ్ క్రీడలంతగా రాణించడం లేదని తెలిసే ఇది రాస్తున్నాను. జరగరాదని ఆశిస్తున్నా, ప్రార్థిస్తున్నా కూడా... 118తో కూడిన అతి పెద్ద బృందాన్ని పంపిన మన దేశానికి ఒక్క పతకం లభించకపోవడం కూడా సాధ్యమే. ఒలింపిక్స్‌లో ఏ దేశమూ జీరో నుంచి హఠాత్తుగా హీరోగా మారిపోదు. 96 ఏళ్లుగా పాల్లొంటున్న మనం ఒక వ్యక్తి గత స్వర్ణం, ఐదు రజితాలు, తొమ్మిది కాంస్య పతకాల నుంచి ఈసారి ప్రారంభించాం. హఠాత్తుగా పెద్ద లక్ష్యాలను మన క్రీడాకారుల ముందు ఉంచజాలం. ఈ 12 వ్యక్తిగత పతకాలు కూడా 2004, 2008, 2012 మూడు ఒలింపిక్స్‌లో లభించినవి. అంతకు ఎనభై ఏళ్ల ముందు 1952 హెల్సింకీ క్రీడలలో ఒకే ఒక్క కాంస్యం కుస్తీ పోటీల్లో లభించింది.
అలాంటి స్థానం నుంచి నాటకీయంగా మొదటి 25 దేశాలలోనైనా స్థానం సంపాదించాలి (ఇంతవరకు మనం సాధించిన అత్యధిక స్థానం బీజింగ్స్ క్రీడలలోని 50). టెస్టు, వన్‌డే క్రికెట్‌లో మనం ఒకటి లేదా రెండో స్థానాల్లో ఉన్నాం కాబట్టి, మనది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి, భద్రతా మండలి శాశ్వత సభ్యత్వాన్ని కోరుతున్నాం కాబట్టి మనం ఆ పని చేయాలి. ఆర్థిక వృద్ధిలో చైనాను అధిగమించిపోయామనడం హాస్యాస్పదం. వాస్తవాన్ని సరిపోల్చి చూద్దాం. 25 ఏళ్లు అంతర్యుద్ధంతో క్షీణిం చినా శ్రీలంక తలసరి జీడీపీ మనకంటే 50 శాతం ఎక్కువ. దీన్ని బట్టి మన ఆర్థిక వృద్ధి పుంజుకుంటుంటే కాలక్రమేణా మనకు ముందున్నవారికి, మనకు మధ్య దూరం తగ్గిపోతుందని, క్రీడలలో మన ప్రతిభా ప్రదర్శన మిగతా వాటికంటే వేగంగా వృద్ధి చెందుతుందని భావించే ఆశావాద పార్శ్వాన్ని చూపుతుంది. అది ముందున్న వారికి మనకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గి స్తుందే తప్ప ప్రపంచ విజేతలను చేసేయదు. నిజజీవితంలో ఒలింపిక్ పత కాలను గెలవడం... సల్మాన్ ‘‘సుల్తాన్’’ ఖాన్ 30 ఏళ్ల వయసులో శిక్షణ పొందటం ఆరంభించి బంగారు పతకాలను గెలిచేసుకోవడంలా ఉండదు.
ఒక కుస్తీ వస్తాదు నిజానికి ఏళ్లతరబడి, దశాబ్దానికిపైగా ఒలింపిక్స్‌కు అర్హ తను సాధించడానికి శిక్షణ పొందాల్సి ఉంటుంది. నర్సింగ్ యాదవ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యాన్ని గెలుచుకుని చిట్టచివరకు ఒలిం పిక్స్‌కు అర్హ తను సాధించగలిగాడంటే అది ఎంత కఠోరమైనదో మీకు అవగాహన ఏర్పడుతుంది. గత ఒలింపిక్స్‌తో కనీసం ఆరవ స్థానాన్ని పొందడం వ్యాయామ క్రీడాకారుల అర్హతకు ప్రమాణంగా ఉంటుంది. హాకీలో సైతం ఖండాంతర్గత చాంపియన్‌షిప్‌లో నెగ్గడం సైతం కష్టమే. ఈసారి మన హాకీ జట్టు అలాగే అర్హతను సాధించింది. బీజింగ్‌లో మన జట్టు, రియోలో పాకిస్తాన్ జట్టు అలాగే అర్హతను సాధించలేకపోయాయి. రియోకి మనం 118 మంది క్రీడాకారుల బందాన్ని పంపగలగడమే మొత్తంగా భారత ప్రమాణాల రీత్యా మెరుగుదలను సూచిస్తుంది. సాంప్రదాయకంగా మనకు బలం ఉన్న హాకీ, కుస్తీ, బాక్సింగ్, షూటింగ్‌లలోనే కాదు ఆర్చరీలోనూ అన్నిటికీ మించి జిమ్నాస్టిక్స్‌లో సైతం మెరుగుదల సాధించాం. ఒక మహిళా జిమ్నాస్ట్ ఒలింపింక్స్‌కు అర్హతను సాధించడమే కాదు, ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. 25 ఏళ్ల వారిలో అధికులు తమ బొటన వేళ్లను అందుకోవడానికి తంటాలు పడే మన దేశంలో అది నిజంగానే గొప్ప విజయం.
మెరుగుదలను చూడాలి
‘‘ఆహ్వానం’’ పొందిన ఇద్దరు తప్ప మన ఈత క్రీడాకారులంతా అర్హతను సాధించినవారే. గతంలో లాగా ఇప్పుడు ట్రయల్స్‌లో దేశీ కోచ్‌లు క్రీడాకారుల టైమింగ్స్‌ను, ప్రదర్శనలను నిర్ణయించడం లేదు. ఇది మన క్రీడాకారుల అర్హతా మార్కులకు, అసలు రోజున ప్రదర్శనకు మధ్య కనబడే వ్యత్యాసం మనకు మరింత చేదుగా అనిపించేలా చేస్తుంది. ఈ క్రమాన్నంత టినీ ఇప్పుడు పటిష్టంగా నియంత్రిస్తున్నారు, క్రమబద్ధీకరిస్తున్నారు. డోపింగ్ విషయం కూడా చాలా కఠినంగా ఉంది. మొదటి 50లోకి, 25లోకి, చివరకు 10లోకి ప్రవేశించకుండానే పతకాలు సాధ్యంకావు. కాబట్టి ఏ దేశమూ హఠా త్తుగా ప్రపంచ చాంపియన్లను తయారు చేసేయలేదు. 1988 సియోల్ నాటికి తొలి 25లో చోటు సాధించిన భారత క్రీడాకారులు ఒక్కరే. నేడు అలాంటి వారి సంఖ్య 100కు చేరింది. కనీసం 30 మంది తమ విభాగాల్లో మొదటి 10లో ఉంటున్నారు. అద్భుత ప్రదర్శనతో తొలి 5లో ఉంటున్నవారూ ఉన్నారు. మన హాకీ జట్టు, సైనా నెహ్వాల్ ఇప్పుడు తొలి ఐదు స్థానాల్లోనే ఉన్నారు. అయినా పతకాలకు హామీ లేదు. మనకేమీ మైఖేల్ ఫెల్ప్స్ లేడు. అందుకు దిగులుపడదామా? మన టైమింగ్స్ ఇటీవల మెరుగుపడుతు న్నాయి. కానీ మన ఈత ఎంత నాసిగా ఉంటోందంటే... పలు విభాగాల్లో పురుషుల టైమింగ్స్, మహిళల టైమింగ్స్‌కంటే వెనుకబడి ఉంటున్నాయి, అది కూడా ప్రపంచస్థాయిలో కాదు ఆసియా స్థాయిలోనే.
మన దేశానికి ప్రపంచానికి మధ్య అంత పెద్ద అంతరం ఉండగా పతకాలు గెలవాలంటే రెండే మార్గాలున్నాయి. మేరీ కోమ్ లేదా సైనా నెహ్వాల్ వంటి అద్భుత క్రీడాకారులు ఆవిర్భవించడం. లేదా ఒక క్రీడా సంఘం లేదా నిబద్ధులైన కోచ్‌ల సహాయంతో సాంప్రదాయకమైన హాకీ లేదా లైట్ వెయిట్ కాంటాక్టు క్రీడలలో సుశీల్, విజేందర్, యోగేశ్వర్ వంటి వారికి శిక్షణనిచ్చి సంసిద్ధులను చేయడం. లేదా వ్యక్తిగతంగా శిక్షణపొందిన అభినవ్ బింద్రా లేదా సంస్థాగత శిక్షణ పొందిన రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ లవంటి స్వీయప్రేరితులు పతకాలు సాధించాలి. మనకున్న ప్రతిభా శక్తుల పునాదితో నాటకీయమైనదేమైనా జరగాలనుకోవడం ఆకాంక్ష మాత్రమే.
వాస్తవిక లక్ష్యాలతో ముందుకు సాగాలి
ఉపఖండంలోని జీవనశైలులు, శారీరక దారుఢ్యం, కార్బోహైడ్రేట్లు నిండిన ఆహారంతో తరాలు గడచినా సహజ క్రీడాకారులు తయారుకారు. ఇది ఒక క్రూర వాస్తవం. బంగ్లాదేశ్ క్రికెట్ శక్తిగా పెంపొందుతోంది. అయినా అది ఇంతవరకు ఒక్క ఒలింపిక్ పతకాన్ని అయినా ఎన్నడూ గెలుచుకోని అతిపెద్ద జనాభాగల దేశం. పాకిస్తాన్ నుంచి ఇద్దరు మాత్రమే అర్హతను సాధించారు. ఈ స్థాయి శారీరక దారుఢ్యం, వైఖరులతో భారత క్రీడాకారులు దక్షిణ ఆసియా స్థాయిలో మిగతావారి కంటే టైమింగ్స్, దూరాలు, పాయిం ట్లలో చాలా చాలా ముందుండటాన్ని చూసి ఇప్పుడు నవ్వుకోగలుగుతాం. ఒకప్పటిలాగా సాయుధ బలగాలు ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడలకు ప్రతిభను సమకూర్చకపోయినా మనం ఈ మాత్రం సాధించగలుగుతున్నాం.
క్రీడాపరమైన అద్భుత ప్రతిభను కనబరచడానికి, జనాభా పరిమాణా నికి సంబంధం లేదు. ఇది సంస్కృతి, సంప్రదాయం, ఆద ర్శ నమూనాలకు సంబంధించినది కూడా. భారత జనాభాలో 2 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న హరియాణా మనం సాధించిన ఒలింపిక్ పతకాల్లో మూడింట రెండు వంతులు గెలిచింది. నిరుపేదది, అతి చిన్నదైన మణిపూర్ జనాభా 30 లక్షలకు మించదు. ఆ రాష్ట్రం హాకీ, బాక్సింగ్, మహిళల వెయిట్‌లిఫ్టింగ్, ఆర్చరీ వంటి వైవిధ్యభరితమైన క్రీడల్లో ప్రపంచ స్థాయిలో విజయాలు సాధిస్తోంది. కేరళ కూడా ఒక సంప్రదాయకమైన క్రీడా శక్తి. కానీ హరి యాణాకు మూడు రెట్లు, కేరళకంటే రెండు రెట్లు, మణిపూర్ కంటే 20 రెట్లు జనాభా ఉన్న గుజరాత్ అర్హత పొందే క్రీడాకారులు ఒక్కరిని తయారు చేయ డానికి గింజుకుంటోంది.
అయినా రియోలో మనం కొన్ని పతకాలు సాధించాలని ఆశిద్దాం. ప్రార్థి ద్దాం. అయినా పతకాలు లభించకపోయినంత మాత్రాన అంతా కోల్పోయి నట్టేం కాదు. ప్రపంచంలోని తొలి 25 మందిలో ఉన్న వంద మందికిపైగా ఉండటమే గాక, వారి సంఖ్య పెరుగుతుందంటేనే మనం పురోగతి సాధి స్తున్నాం. గత ఆసియాడ్‌లో మనం 57 పతకాలు, 11 స్వర్ణాలు సాధించి గొప్ప దిగ్భ్రాంతికరమైన మెరుగుదలను సాధించాం. మన తదుపరి లక్ష్యం ఆసి యాడ్‌లో ఉత్తర కొరియా, థాయ్‌లాండ్, కజకిస్థాన్, ఇరాన్‌ల కంటే ముందు 4వ స్థానాన్ని సాధించడమే. అది మరింత వాస్తవికమైన- ఆశావహమైన - లక్ష్యం అవుతుంది.
వ్యాసకర్త: శేఖర్ గుప్తా
twitter@shekargupta