జన సమీకరణ మరచిన కాంగ్రెస్
అవలోకనం
గుజరాత్‌లో కాంగ్రెస్ నిలకడగా 30 శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తూ వచ్చింది. గెలుపు, ఓటములకు మధ్య తేడాను తెచ్చే మూడు లేదా నాలుగు శాతం అదనపు ఓట్లను సంపాదించలేక పోతోంది. రెండేళ్లుగా రాష్ట్రంలో జరిగిన పెద్ద ఆందోళనలన్నీ బీజేపీ విధానాలు సృష్టించిన సమస్యలవల్ల జరిగినవే. వాటిలో ఏ ఒక్క దానిపై ప్రజలను సమీకరించి ఉన్నా కాంగ్రెస్ ఆ అదనపు ఓట్లను సాధించగలిగేదే. దాని ఈ అశక్తత వల్లనే బీజేపీ గుజరాత్‌లో నిశ్చింతగా ఉండగలుగుతోంది. బీజేపీ అజేయమైనది అనుకోవచ్చుగానీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అలాంటిది కాజాలదు.
రాష్ట్రం తర్వాత రాష్ట్రాన్ని బీజేపీ కైవసం చేసుకుంటూ పోతుంటే, అందుకు కాంగ్రెస్ ప్రతిస్పందన భయం, భీతావహం చెందడంగానే ఉంది. రాహుల్ గాంధీ కథనం ప్రకారం నాలుగు నెలల క్రితమే నితీశ్ కుమార్ ఫిరాయింపు గురించి వారికి ముందస్తు సమాచారం ఉంది. అయినా వారు ఎందుకిలా నిస్సహాయంగా ఉన్నారు? అర్థం చేసుకోవడం కష్టం. గోవా శాసనసభలో ఎక్కువ స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ మెరుగైన స్థితిలో ఉన్నా వేచి చూసింది. ప్రతిభ, శక్తి ఉండి, ఆకలితో ఉన్న బీజేపీ ప్రత్యర్థిగా ఉన్నా.. అలా వేచి చూస్తూ ఉండటం ఘోర తప్పిదం. గుజరాత్‌లో శంకర్‌సింహ్ వాఘేలా నిష్క్రమణతో కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. ఆరుగురు ఎమ్‌ఎల్‌ఏలు పార్టీని వీడటంతో రాజ్యసభకు అహ్మద్ పటేల్ ఎన్నిక అనుమానాస్పదంగా మారింది. మిగతా ఎమ్‌ఎల్‌ఏలు అందరినీ అనుమానించి, కర్ణాటకకు పంపడమే కాంగ్రెస్ ప్రతిస్పందన అయింది. ఆ పార్టీ ఇంకా అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం అదే. గుజరాతీల అభిప్రాయం ప్రకారమే బీజేపీ అత్యంత అధ్వానమైన పని తీరును కనబరచినది గుజరాత్‌లోనే. జనాదరణను కోల్పోవడం గురించి ఆందోళనపడవలసినది బీజేపీనే.
గత రెండేళ్ల కాలంలో, గుజరాత్‌లో లక్షలాదిగా ప్రజలు పాల్గొన్న పలు ఆందోళనలు జరిగాయి. హార్దిక్ పటేల్ నేతృత్వంలో రిజర్వేషన్ల కోసం పాటీదార్ల ఆందోళన సాగింది. దానికి ప్రతిగా అల్పేశ్ ఠాకూర్ నాయకత్వాన ఓబీసీ క్షత్రియుల ఆందోళన నడిచింది. ఉనా ఘటన తదుపరి జిగ్నేశ్ మెవానీ నేతృత్వంలో దళితుల తిరుగుబాటు జరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వజ్రాల వ్యాపారులు, జౌళి కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు, ప్రదర్శనలు నిర్వహించారు. జీఎస్‌టీ విధింపు తదుపరి లక్షలాదిగా వ్యాపారులు సూరత్‌లో ప్రదర్శనలు జరిపారు. ఈ సమస్యలన్నీ బీజేపీ విధానాల ప్రత్యక్ష ఫలితమే అయినా, ఈ ఆందోళనలన్నీ కాంగ్రెస్ నాయకత్వం వహించకుండా జరిగినవే. పైన పేర్కొన్న ముగ్గురిలాంటి యువ నాయకులను అవి ముందుకు తెచ్చాయి, లేదంటే నాయకులు లేకుండానే సాగాయి. రాజకీయ సమస్యలపై ప్రజలను ఎలా సమీకరించాలో కాంగ్రెస్ మరిచిపోయిందని ఇది తెలియజేస్తోంది. గాంధీ విజయవంతంగా నడిపిన పలు ఉద్యమాలు, బార్డోలీ సత్యాగ్రహం వంటివి గుజరాత్‌లో జరిగినవి కావడమే విచిత్రం.
గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ నిలకడగా 30 శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తూ వచ్చింది. అయితే, గెలుపు, ఓటములకు మధ్య తేడాను తెచ్చే ఆ అదనపు మూడు లేదా నాలుగు శాతం ఓట్లను అది సంపాదించలేకపోతోంది. ఈ సమస్యలలో ఏ ఒక్క దానిపై అది ప్రజలను తన చుట్టూ సమీకరించి ఉన్నా, ఆ అదనపు ఓట్లను సాధించగలిగేదే. ఈ ఆందోళనలన్నీ సాగుతున్నా ప్రజలను సమీకరించలేని కాంగ్రెస్ అశక్తత వల్లనే బీజేపీ గుజరాత్‌లో నిశ్చింతగా ఉండగలుగుతోంది. బీజేపీ అజేయమైనదని అనుకోవచ్చుగానీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఏ పార్టీ అలాంటిది కాజాలదు. కర్ణాటకలో బీజేపీ నిజానికి రక్షణ కాచుకునే స్థితిలో ఉంది. ఎత్తులు, పై ఎత్తులు వేయగల కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దేశీయ శైలిలోని తన రాజకీయ ఎత్తుగడలతో హిందుత్వ పార్టీ తలమునకలై ఉండేలా చేస్తున్నారు. బెంగళూరులో ఆయన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రయోగిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ హిందీని కోరుకుంటోంది కాబట్టి, ఆ అంశంపై బీజేపీ బలహీనమైన స్థితిలో ఉంది. స్థానిక బీజేపీ మౌనంగా ఉండటమో లేదా నష్టాన్ని చవి చూడటమో చేయక తప్పదు.
లింగాయతుల సమస్య మరొకటి. వారు తమ కులాన్ని హిందూ మతానికి వెలుపల ఉండే ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరుతున్నారు. లింగాయతులు కోరితే, వారి మత వేర్పాటు ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని సిద్ధరామయ్య ప్రతిపాదించారు. అమాయకంగా కనిపించే ఈ ప్రతిపాదన పెద్ద గందరగోళాన్ని రేపింది. లింగాయతులు బీజేపీకి గట్టి మద్దతుదార్లు కావడమే (పార్టీ నేత బీఎస్ యడ్యూరప్ప లింగాయతుడే) సమస్య. లింగాయతుల మత వేర్పాటువాదాన్ని బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ ఆమోదించవు. ఈ విషయంలో కూడా అది తిరిగి మౌనం వహించడమో లేదా నష్టపోవడమో చేయాల్సిందే. బీజేపీ చెప్పే జాతీయవాదంపై ఉన్న దృష్టి కేంద్రీకరణను సిద్ధరామయ్య, కర్ణాటకకు ప్రత్యేక పతాకం వంటి సమస్యలపైకి మరల్చారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు కలసి బీజేపీకి రాజకీయ సవాలును విసరడం సాధ్యమేనని ఇవన్నీ చెబుతున్నాయి.
మన దేశంలోని రాజకీయ పార్టీలు గడ్డు కాలంలో మద్దతుదార్లను ఎలా సమీకరించగలుగుతాయి? దేశంలోని అత్యంత సునిశిత బుద్ధిగల రాజకీయవేత్తల నుండి కాంగ్రెస్ ఆ పాఠం నేర్చుకోవాల్సి ఉంటుందేమో. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నేత్రి మాయావతి... తనను మాట్లాడనివ్వడం లేదని ఆరోపించి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె ఆగ్రహం నిజమో, కాదో గానీ ఆమె చేసిన పని మాత్రం ఉద్దేశపూర్వకంగా చేసినదే. అంటే, ఆమె క్షేత్రస్థాయికి పోయి, తాను కోల్పోయిన మద్దతును తిరిగి పునర్నిర్మించుకుంటారని అర్థం. మాయావతి విస్మరించిన దళిత గ్రూపుల వెంటబడి బీజేపీ... ఐక్య దళిత గుర్తింపును జాతులు, ఉపకులాలుగా ఛిన్నాభిన్నం చేసిందని స్థానిక రాజకీయాల పరిశీలకులు చెబుతారు. ఆమె పార్టీ యూపీలో 20 నుంచి 25 శాతం ఓట్లను సంపాదించుకుంటుంది. బహుముఖ పోటీకి దిగిన అన్ని పార్టీలూ ఆ ఓట్ల పరిధిలోనే ఉంటాయి. కాబట్టి ఆమె గెలవడానికి సహేతుకమైన అవకాశమే ఉంటుంది. కానీ కుల కూటము లను నిర్మించడంలో అమిత్‌షాకున్న అద్భుత శక్తిసామర్థ్యాలు బీజేపీకి అత్యధిక సంఖ్యలో ఓట్లను సంపాదించి పెట్టాయి. సమాజ్‌వాదీ పార్టీగానీ (అది 29 శాతం ఓట్ల వద్ద నిలిచిపోయింది) లేదా బీఎస్‌పీగానీ దానికి సమతూగలేకపోయాయి. ఈ పరిస్థితిని మార్చడానికి ఉన్న ఏకైక మార్గం ప్రజా సమీకరణే. ఆ విషయం మాయావతికి తెలుసు. కాంగ్రెస్, ఈ భీతావహ స్థితి గడచిపోయాక, గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆ పని చేయడం ఎలాగో ఆలోచించాలి.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
ఆకార్ పటేల్